విషాదం వద్దు.. వెలుగులు కావాలి…(కథ)- ముక్కమల్ల ధరిత్రీ దేవి
” ఛీ ఛీ.. ఈ పనోళ్ళని నమ్ముకుంటే ఇంతే సంగతులు.. “
విసుక్కుంటూ, ఇక తప్పదురా దేవుడా అనుకుని చీపురుపుచ్చుకొని, గేటు దాటి ఊడవడం మొదలెట్టింది వసంత. చుట్టుపక్కల ఇళ్ళు, ఎదురిల్లు, పక్కిల్లు అప్పటికే నీటుగా ముగ్గుతో సహా దర్శనమిచ్చాయి. తన ఇంటి ముందు మాత్రం నిన్న సాయంత్రం నుండీ అర్ధరాత్రి దాకా కాల్చిపడేసిన టపాకాయల అవశేషాలన్నీ పోగుబడి ఉన్నాయి. కోపం నషాళానికంటింది వసంతకు. భూచక్రాలు,విష్ణుచక్రాలు, కాకరపువ్వొత్తులు, ఆటంబాంబులు అన్నీ పేల్చింది వాళ్ళు.. కేరింతలు కొట్టింది వాళ్లు… పోనీలే పిల్లలు అనుకుంటే.. ఈ పెద్దవాళ్ల బుద్ధి ఏమైంది! ఆ కాల్చిన వాటి తాలూకు చెత్తకాగితాలు, బూడిద అంతా వాళ్ళ ఇళ్ళ ముందువి మాత్రం ఊడ్చి ఎత్తేసుకున్నారు. గాలివాటుకు కొట్టుకొచ్చిన చెత్తాచెదారం అంతా తన ఇంటి ముందు బాహాటంగా పరుచుకునిఉంది. ఒక్కసారిగా పోట్లాడాలన్నంత కోపం ముంచుకొచ్చింది గానీ.. బలవంతాన తమాయించుకుని సణుక్కుంటూ ఊడవడం మొదలెట్టింది.
“ఖర్మ! ఈరోజే ఈ పనావిడ అదునుచూసుకుని ఎగనామం పెట్టేసింది. ఎలా ఊహిస్తారో ఏంటో…! బాగా పనిబడ్డ రోజే డుమ్మా కొడతారు..వీళ్ళ తెలివి తగలడా…” లోలోపలే అయినా బాగా తిట్టుకుంటూ బరబరా ఊడ్చేయసాగింది వసంత.
చెప్పాలంటే వసంతకు దీపావళి అంటే ఇష్టమే. ప్రమిదల్లో దీపాలు వెలిగించి, బయట గోడ మీద వరుసగా పేర్చడం, అవి అలా అలా గాలికి ఊగుతూ వెలుగుతుంటే కన్నార్పకుండా చూడటం ఆమెకు చాలా ఇష్టంగా ఉండేది. కాకర వత్తులు కూడా ఇష్టంగానే కాల్చేది. ఎటొచ్చి టపాకాయల శబ్దం అంటేనే పడదు. చెవులు మూసుకుని లోపలికి వెళ్లి కూర్చునేది.
” ఏంటే వసంతా, పనామె రాలేదా..? “
ఇంటి ముందు ఆగిన బైకు దిగివస్తూ అడిగింది పరమేశ్వరి. ఆమె కొడుకు ప్రదీప్ బైకు ఓ వారగా పెట్టి, తల్లితోపాటు వచ్చాడు.
“ఆ, పిన్నీ రండి రండి..”
ఆహ్వానిస్తూ చీపురు ఓ పక్క పెట్టేసింది వసంత. లోపల మాత్రం విసుగు అణుచుకుంటూ
“అబ్బ!వీళ్ళూ ఇప్పుడే రావాలా..!” అనుకుంటూ,
“… అవును పిన్నీ, ఇంతసేపూ చూసి ఇప్పుడే మొదలెట్టా..”
చీపురు మళ్లీ పుచ్చుకొని, ఊడ్చిన చెత్తను గబగబా ఓ వారకు కుప్పగా చేసి, వాళ్లతో పాటు లోపలికి దారితీసింది వసంత. ఆ చెత్తను గమనించిన పరమేశ్వరి,
” ఇక్కడా ఇదే తంతా..! మాకూ ఇదే సమస్య అనుకో.. నా అదృష్టం బాగుండి ఈరోజు మా పనావిడ వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈరోజు ఇలా వచ్చేవాళ్ళమే కాదనుకో.. “
బ్యాగ్ లో నుండి పెళ్లి కార్డు తీస్తూ సోఫాలో కూర్చుంటూ అంది పరమేశ్వరి.
” సుష్మ పెళ్లి.. తెలుసు కదా, ఎక్కువ టైం లేదు, అందర్నీ పిలవాలి,అందుకే పండగ అయినా ఈరోజు వచ్చాము వసంతా.. “
అని చెప్తుండగా, లోపల నుండి వసంత భర్త శ్రీకర్ వచ్చి ఆ ఇద్దరినీ పలకరించాడు.
” పిన్నీ, చిన్నాన్న బాగున్నాడా. “
ఇద్దరికీ కాఫీలు అందిస్తూ అడిగింది వసంత.
” మొన్నటిదాకా బాగానే ఉన్నాడమ్మా వసంతా. నిన్నటి నుండీ ఇదిగో ఈ టపాకాయల వాసన పీల్చి పీల్చి అనుకుంటా, ఒకటే దగ్గు,జలుబు.. దాంతో బాడీపెయిన్స్.. అందుకే ఇదిగో ప్రదీప్ ను పిలుచుకొని వచ్చా.. “
” అబ్బా! ఎక్కడ చూసినా ఇదే కంప్లైంట్.! ఏమిటో, దీపావళి కాదు గానీ..ఈ వాతావరణ కాలుష్యం భరించడం చాలా కష్టంగా ఉంటోంది బాబూ.. కాకర వత్తుల వరకూ ఓకే గానీ..చెవులు చిల్లులు పడేలా ఆ టపాకాయలు, లక్ష్మీ బాంబులు.. ఆ శబ్దానికి చెవుడు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.. “
ప్రదీప్ ను చూస్తూ అంది వసంత.
” అవునక్కా నిజమే, కానీ ఏం చేయగలం? “
“ప్రతీ సంవత్సరం బాణసంచా తయారు చేసే ఫ్యాక్టరీల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా, ఎందరో ప్రాణాలు కోల్పోతున్నా..తగు చర్యలు తీసుకోవడం గానీ.. ఇలా కాలుష్యం పెంచే మందు సామాగ్రి తయారీ నిలిపివేయడంగానీ చేయడం లేదు. ఫలితంగా ఇలా ఆరోగ్యాలు ఫణంగా పెట్టాల్సి వస్తోంది.. “
శ్రీకర్ అందుకుని అన్నాడు.
” చిన్నపిల్లలు.. వాళ్ల సరదాలు వాళ్ళవి. వాళ్లని ఏమీ అనలేం. మూడు నాలుగు రోజులు భరించాలి తప్పదు అనుకుంటాం.. కానీ.. “
వసంత మాటల్ని మధ్యలోనే అందుకుని,
“.. అక్కా, మొన్న మా ఇంటి దగ్గర ఏమైందో తెలుసా.. బాణాలు కాలుస్తూ ఓ అబ్బాయి వేసిన టపాకాయ ఎదురింటి ముందు నిలుచున్న ఓ పాప మీద పడింది. ఆ పాప వేసుకున్న ప్యాంటుకు నిప్పు అంటుకుని కాలడం మొదలైంది. విప్పడానికి కూడా వీలులేక ఆ పిల్ల ఒకటే గగ్గోలు..,! హడావుడిగా ఎత్తుకుని అందరూ హాస్పిటల్ కు పరిగెత్తారు.”
” చూశారా ఎంత ప్రమాదమో! ఆ గాయం మానడానికి ఆ పాపకు ఎన్ని రోజులు పడుతుందో కదా..! పండగ అంటే ఆహ్లాదంగా గడిచిపోవాలి గానీ ఇలా బాధాకరంగా ఉంటే ఎలా..?” నొచ్చుకుంటూ అంది వసంత.
“ఏది ఏమైనా జాగ్రత్త చాలా అవసరం..బాబోయ్..! నిప్పుతో చెలగాడాలాడ్డం కూడదు మరి…!”
పరమేశ్వరి వారికి వత్తాసు పలుకుతూ,
” అయినా పిన్నీ, మా ఇంటి చుట్టుపక్కల పిల్లలు భలే అల్లరి వెధవలు. ఎవరికీ ఏమాత్రం భయపడరు..ఇదిగో ఇలాంటి రోజుల్లో మరీ పెచ్చరిల్లిపోతుంటారు.. “
” ఈ కాలం పిల్లలు అంతా అలాగే ఉంటున్నారులే వసంతా, మగ పిల్లలైతే మరీనూ..! అయినా నీకు ఇంకా పిల్లలు లేరు కాబట్టి అలా అంటున్నావు.. పుట్టాక చూద్దాంలే మరి.. “
ఓరగా చూస్తూ నవ్వుతూ అనేసింది పరమేశ్వరి .
వసంత పెళ్ళై సంవత్సరం దాటుతోంది. ఆ మాటకు,
” భయమేస్తుంది పిన్నీ, పిల్లల్ని తలుచుకుంటేనే..”
శ్రీకర్ వైపు చూస్తూ అంది వసంత. శ్రీకర్ నవ్వేశాడు.
” సరే వసంతా, రెండు రోజులు ముందే మీ ఇద్దరూ రావాలి మరి.. వెళ్ళొస్తాం శ్రీకర్.. “
ఇద్దరూ లేచారు సెలవు పుచ్చుకుంటూ. వాళ్లను సాగనంపటానికి గేటు దాకా వచ్చారు వసంతా, శ్రీకర్. ప్రదీప్ బైకు వైపు వెళ్ళాడు. పరమేశ్వరి మెట్లు దిగి నిలబడింది. సరిగ్గా అదే టైంలో ఎదురింటి అబ్బాయి..పద్నాలుగేళ్ళు ఉంటాయి… వేసిన లక్ష్మీబాంబు వచ్చి పరమేశ్వరి కాళ్ల దగ్గర పడిపోయి డాంమ్మని అని పెద్ద శబ్దంతో పేలింది. ఆ హఠాత్పరిణామానికి మ్రాన్పడిపోయి చెవులు మూసుకుంటూ దబ్బున కింద పడిపోయిందావిడ.
వసంత, శ్రీకర్, ప్రదీప్ ఒక్కసారిగా పరుగున వచ్చేశారు. చుట్టుపక్కలవాళ్ళు ఓ ఐదారు మంది వచ్చి మూగారు.. ఆ శబ్దానికి, అదీ కాళ్ళ ముందే పేలడంతో..ఆ షాక్ కు గురైన పరమేశ్వరి తేరుకోవడానికి కాస్త టైం పట్టింది. మెల్లిగా లేవనెత్తి ఆమెను ఓ పక్కగా కూర్చుండబెట్టారు. అక్కడ చేరిన వాళ్ళంతా నొచ్చుకుంటూ, ఆ పిల్లాణ్ణి తిట్టడం మొదలెట్టారు. చుట్టుపక్కల చూసుకోకుండా అలా విసిరేయడమేమిటి.. అంటూ వాడికి క్లాసు పీకడం కూడా మొదలైంది. పరమేశ్వరి మెల్లిగా కోలుకొని, పరవాలేదంటూ ప్రదీప్ తో పాటు బైక్ వద్దకు వెళ్ళింది. వసంత ఊపిరి పీల్చుకుంది, ఏ అనర్ధం జరగనందుకు. శుభమా అంటూ పెళ్లికి పిలవడానికి వచ్చిన వాళ్ళు ఏ విషాదాన్నో మూటగట్టుకుని పోనందుకు ఒకింత స్థిమితపడింది కూడా. మొత్తానికి దీపాల పండుగ వెలుగులు తెస్తే బాగుంటుంది కానీ, విషాదాన్ని ఎవరికీ మిగల్చరాదు అనుకుంటూ శ్రీకర్ తో పాటు లోనికి కదిలింది.
అలా వెళ్తున్న ఆమెలో అంతసేపూ మరిచిన పనులన్నీ చటుక్కున మదిలో మెదిలాయి ఒక్కసారిగా.ఇల్లు ఊడ్చుకోవడం,తుడుచుకోవడం, అంట్లగిన్నెలు తోముకోవడం..ఇంకా టిఫిన్లు, భోజనాలు.. ప్రిపరేషన్లు.. బాపురే..! అన్నీ ఒకదాని వెంట ఒకటి గుర్తొచ్చి గిర్రున తల తిరిగింది ఒక్కక్షణం. అయినా తప్పేదేముంది అనుకుంటూ.. అనాలోచితంగా వెనుదిరిగింది. అక్కడ !! ఇందాక బయట ఊడ్చి కుప్పగా పోసిన చెత్తాచెదారం, టపాకాయల అవశేషాలు గాలికి చెదిరిపోయి, ముందర అంతా పరుచుకొని మా సంగతేంటంటూ నిలదీస్తూ వెక్కిరించాయి. అంతే !! నీరసం కమ్మేసి, శోష వచ్చినట్లయి గేటు పట్టుకుని నిలబడిపోయింది వసంత.
– ముక్కమల్ల ధరిత్రీ దేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
విషాదం వద్దు.. వెలుగులు కావాలి…(కథ)- ముక్కమల్ల ధరిత్రీ దేవి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>