ఏముండదు లే!(కవిత ) – గిరిప్రసాద్ చెలమల్లు
ఆమె పుట్టిన చోట
ఆమె కేం మిగలదు!
పితృస్వామ్య ఛీత్కారం తప్ప
కొన్ని మూతి విరుపులు
కొన్ని కాకతాళీయ పొగడ్తలు
అవీ ఆమెకేం ఒరగ నీయవు
పుట్టుక ఒక్కటే
తారతమ్యాలు వేరు
సామాజికార్థిక కట్టుబాట్ల చెరలో
తనకి తెలియకుండానే తనని బందీని చేసేసారు!
అడుగులు పడుతున్న కొద్దీ
తప్పటడుగులేననే తీర్మానాల నడుమ
ఆమె ఎదుగుదల!
మూడు ముళ్ళేయించేస్తే
తరిమేద్దామనే తపన లోలోన
బైటేమో బాధ్యత ముసుగు!
పెళ్ళితో కొత్త మనుషుల మధ్య బతుకుతున్నా
అంతర్లీనంగా మనసు పుట్టినింటి లో
కానరాని శోకాలెన్నో తీరే చోటనే భ్రమలో ఆమె !
ఏ ఇల్లైనా అదే వ్యవస్థని తెల్సుకునే లోపు ముగింపు!
ఏదో ఆశ మిణుకుమిణుకు మంటుంటే
లోలోన ఏదో అలజడి
ఐనా ఆమె కీ ఆ ఇంటికీ దూరం పెరుగుతుందంతే!
ఆమె నేరం చేయలేదు
ఆమె కళ్ళు ఆ ఇంటి వైపు యాదృచ్ఛికంగా
ఆమె చుట్టూ ఓ కంచె నిర్మాణం
ఆమె ఆ ఇంటికి దూరమే ఏనాడైనా!
చావైనా రేవైనా మెట్టినిల్లే శాశ్వతమని తేల్చే సంఘం!
ఒకటా రెండా
బతికినన్నాళ్ళు ఆంక్షలే!
ఆర్థిక స్వాతంత్ర్యం నిరాకరించబడ్డ ఏ నేలైనా
ఆమెకి పరాయే!
ఆమె పిడికిలి బిగిస్తే గుట్టు
తెరిస్తే లోగుట్టు బట్టబయలు
పితృ స్వామ్య పాతర తథ్యం!
– గిరి ప్రసాద్ చెలమల్లు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
చాలా చక్కగా చెప్పారు… గిరి ప్రసాద్ గారు.
నిజమే….
ఆమె పిడికిలి బిగిస్తే గుట్టు
తెరిస్తే లోగుట్టు బట్టబయలు
పితృ స్వామ్య పాతర తథ్యం
పై వాక్యాలు అక్షర సత్యాలు…
సూపర్.
Thank you madam