ఓ వలస జీవి (కవిత ) పాలేటి శ్రావణ్ కుమార్
కుటుంబమెక్కడుందోయ్ ఓ వలస జీవి
నీ కుటుంబమెక్కడుందోయ్
బియ్యపు మెతుకు దూరమై,
రొట్టె పెంకులకి ఎదురుచూస్తివా
గొంగడి మరచి వచ్చి,
చలితో సోపతి చేసి ముచ్చటిస్తివా
సరియైన నిద్రలేక
మేలుకువలో తలిస్తివా కుటుంబం ఎట్లున్నదని
లేక తీరిక లేదనుకుంటివా
కుటుంబమెక్కడుందోయ్ ఓ వలస జీవి
నీ కుటుంబమెక్కడుందోయ్
ఉత్తరాల కాలం కాదని తెలుసు
చరవాణి ముచ్చట్లు ఎంత తెలుపగలవు
నీ మదిలో దాగిన ప్రేమ
మస్తకమున మెదిలే ఆలోచన
రెండింటిని అతలాకుతలం చేసే సరిచాలని జీతం
కుటుంబమెక్కడుందోయ్ ఓ వలస జీవి
నీ కుటుంబమెక్కడుందోయ్
కొసరి కొసరి ఆహారమోయి
క్రియ పూర్తయ్యేసరికి రేయి
వీపువాల్చ సమయం లేదోయి
సూరీడు నిత్య కర్తవ్య జీవి
నీకు సమయమివ్వడవోయి
తలుస్తున్నవా లేదా ఓ వలస జీవి
నీ కుటుంబమెట్లున్నదని
వదిలి వచ్చిన ఇల్లు
దున్ని వదిలిన భూమి
ఆడి పాడిన వీధి
పాడి పశువుల ఆకలి
తల్లిదండ్రుల ప్రేమ కౌగిలి
మరిచావేమో
తలచుకో వలస జీవి
ఎట్ల ఉన్నదో నీ కుటుంబం
ఎక్కడున్నదో నీ కుటుంబం
ఎట్ల ఉన్నది ఓ వలస జీవి
నీ కుటుంబం ఎట్ల ఉన్నదోయి….
– పాలేటి శ్రావణ్ కుమార్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
ఓ వలస జీవి (కవిత ) పాలేటి శ్రావణ్ కుమార్ — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>