మీమాంస (కవిత) గిరి ప్రసాద్ చెలమల్లు
రాలుతున్న కన్నీటి చుక్క వెనుక
దాగి ఉన్న కల్లోల మేఘాలెన్నో!
గూడు కట్టుకున్న యుద్ధ మేఘాలెన్నో!
కిటికీ ఆవల
రెక్కల ఈవల
మధ్యలో ఊచలు
చూపు లో చత్వారం లేదు
కమ్ముకున్న చీకటి లో ఓ వెలుగు రేఖ కై నిరీక్షణ
ఎన్ని కలత నిద్రల్లో
ఎన్ని సార్లు పలవరించావో
హృదయ ఘోషలెన్నో
నాలుగు గోడలను బద్దలు కొట్టలేకపోయాయో!
ఒంటరి గా ఎదుర్కొన్న ఒడిదుడుకులను
ఎలా అధిగమించావో
ధైర్యానిచ్చిన గుండెకే తెలుసు
ఎదురుగా అద్దం
మనసు ముక్కలై మోములో
ప్రజ్వరిల్లుతున్న అగ్ని కీలలను చూపెట్టలేక
భళ్లున తునాతునకలు
నెలవంక సైతం కొడవలై
నిన్ను వేటు వేయాలని చూస్తే
నక్షత్రాల వెలుగులో కొత్త దార్లు వెతుక్కున్నావో
ఎన్ని రాత్రుళ్ళు
తెలియకుండానే కను కొసల నుండి జారిన
చుక్కలతో ముద్దైన దిండు మొర పెట్టుకుంటే
నీ లాగే తనూ అని ఓదార్చావో
మూలం తెలుసు
విచక్షణ కోల్పోలేదు
సమయస్ఫూర్తికి కొదవ లేదు
అయినా ఉచ్చులోంచి బయటపడలేని స్థితి!
వైఫల్యాలు సహజం
అధిగమించడమే లక్ష్యంగా పడాలి అడుగులు!!
– గిరి ప్రసాద్ చెలమల్లు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
—————-
Comments
మీమాంస (కవిత) గిరి ప్రసాద్ చెలమల్లు — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>