జ్ఞాపకం 90 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి
“అర్థమవుతోంది నీ గొంతులో విన్పిస్తున్న సంతోషాన్ని వింటుంటే నువ్వెంత గర్వ పడుతున్నావో” అంది సంలేఖ.
“దిలీప్ కి బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు వచ్చినరోజు మీ ఫాదర్ పోవడం వల్ల నువ్వు రాలేదు కానీ ఆ రోజు అతన్ని అభినందించనివాళ్లు లేరు. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలైన పేపర్లకి ఇలాంటి పాత్రికేయుల అవసరం ఎంతో వుందని గొప్పగా ప్రశంసించారు” అంది హస్విత.
“నిజమే హస్వితా! దిలీప్ అంతటి అర్హతను సంపాయించుకున్నాడు. దానికి నీ ప్రోత్సాహం, నీ సహకారం కూడా వుంది. అతను బయట అంత బాగా రాణిస్తున్నాడంటే ఇంట్లో నువ్వు అతన్ని అంత ప్రశాంతంగా వుంచుతున్నావు. భార్య సహకారం లేకుండా ఏ భర్తా ఎక్స్ పోజ్ కాలేడు. అలాగే భార్యకూడా! ఈ విషయంలో ముందు నిన్ను అభినందించాలి”
“థాంక్యూ” అంది హస్విత.
”హస్వితా! నీలో ఇంత మార్పును చూస్తానని ఒకప్పుడు నేను అనుకోలేదు. నువ్వు నా కళ్లముందే చాలా ఎదిగావు. ఎంత ఎదిగావు అంటే దిలీప్ పత్రికా రంగంలో ఒక జర్నలిస్ట్ గా గొప్ప పేరు తెచ్చుకుంటుంటే చూసి సంతోషపడుతున్నావే కాని అసూయపడనంతగా ఎదిగావు” అంది.
“అసూయ వల్ల ఏమొస్తుంది? నిత్యం ఆత్మ క్షోభించటం తప్ప. అదిగో! మా అత్తగారు, మామగారు దేనికో గొడవ పడుతున్నారు” అంది.
“గొడవా !ఎందుకు?” కంగారుగా అడిగింది సంలేఖ.
“అంత కంగారు పడాల్సినదేమీ లేదులే లేఖా! అసలు వాళ్ల గొడవలో కారణాలు వుండవు. సమస్యలు వుండవు. వాళ్లకి అలా వుంటేనే టైంపాస్ అవుతుంది. మొదటి నుండి వాళ్లు అంతేనట. నన్ను మాత్రం బాగా చూసుకుంటారు. పోటీలుపడి మరీ బాగా చూసుకుంటారు” అంది.
”ఈ విషయం లో యు ఆర్ లక్కీ” అంది సంలేఖ.
వాళ్లిద్దరు చాలాసేపు అలా మాట్లాడుకుంటూనే వున్నారు. హస్వితతో మాట్లాడాక మనసు కొంత తేలికపడినట్లైంది సంలేఖకి.
********
ఇంటినిండా మనుషులు వున్నా ఒక్కరు కూడా మనస్పూర్తిగా ఆమెతో మాట్లాడటం లేదు. ఈమధ్యన పుస్తకాలు కూడా చదవాలనిపించటం లేదు. ఏదైనా రాద్దామంటే జయంత్ మాటలు గుర్తొచ్చి ఆ కుర్చీలో కూర్చుని రాయలేకపోతోంది. భూమిలోంచి పైకి పొడుచుకొని వస్తున్న లేలేత మొక్కల్ని చిదిమేసినట్లు ఆమెలోంచి తన్నుకొస్తున్న ఆలోచనలను పేపర్ మీద పెట్టలేక హింసపడుతోంది.
సంలేఖ ఆడపడుచు రజిత వచ్చి నాలుగురోజులైంది. వచ్చినప్పటినుండి సంలేఖతో మాట్లాడటం లేదు. పైగా ఫోన్ చేసి తన స్నేహితురాళ్లను ఇద్దర్ని ఇంటికి రప్పించుకుంది. వాళ్లకి ఒకటే మర్యాదలు. ఒకటే హడావుడి.
శ్రీలతమ్మ రజిత ఏంచేస్తున్నా చిన్నమాట కూడా అనదు. ఎన్నిరోజులు వున్నా అత్తగారింటికి వెళ్లమని చెప్పదు. ఎప్పుడో విసుగు పుట్టినప్పుడు తప్ప.
రజిత తన స్నేహితురాళ్లని కూర్చోబెట్టి “మీ ఇద్దరు నాకో సహాయం చెయ్యాలి” అని అడిగింది.
“సహాయమా? నువ్వు అడగాలే కానీ ఏమైనా చేస్తాం!” అన్నారు వాళ్లు.
“మా వదిన్ని ర్యాగింగ్ చెయ్యాలి” అంది.
ఉలిక్కిపడ్డారు.
“మీ వదిన్ని ర్యాగింగా!” అన్నారు.
“ఏం! చెయ్యలేరా! కాలేజీలో చేసేవాళ్లంగా! యిప్పుడేంటి తెల్లమొహాలు వేశారు ర్యాగింగ్ అనగానే?” అంది.
వాళ్లిద్దరిలో ఒక అమ్మాయి “చెయ్యొచ్చు. కానీ మీ వదిన వాళ్ల ఫాదర్ పోయిన దిగులుతో వుంది. ఇప్పుడొద్దు” అంది జాలిగా.
“అవునా! నువ్వో పెద్ద జాలి ముత్యానివిలే! ఎప్పుడూ ఎవరినీ బాధ పెట్టనట్లే మాట్లాడుతున్నావ్. నువ్వు చేసే ర్యాగింగ్ కి పది రోజులు పట్టేది కోలుకోవాలంటే. అప్పుడే మరచిపోయావా?” అంది రజిత.
“అప్పుడేదో తెలిసీ తెలియని వయసు. అయినా నేనలా చేస్తున్నానని తెలిసి మా నానమ్మ నన్ను బాగా కోప్పడేది. ప్రశాంతంగా వున్న సరస్సులో రాయిని వెయ్యొద్దని, పనిలేకుండా ఆకును గిల్లోద్దని, అనవసరంగా కాలితో నేలను తన్నొ ద్దని, ఇంకా ఏవేవో చెప్పేది. నేనే వినేదాన్ని కాదు. ఇప్పుడు నాకు కొంత జ్ఞానం వచ్చింది. మానసికంగా హింసించే మాటలు ఎవరినీ మాట్లాడొద్దనుకున్నాను” అంది.
రజిత సీరియస్ గా ”మరి వుంటావా! ఇంటికెళ్తావా?” అంది.
– అంగులూరి అంజనీదేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
జ్ఞాపకం 90 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>