జ్ఞాపకం 94 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి
ఎప్పుడైనా ఆమెకు ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు అడవులు, పంటపొలాలు, వర్షంలో తడుస్తూ హాయిగా తలలూపే గడ్డిపూలు, ఆకుపచ్చ రంగు దుప్పటి కప్పినట్లుండే కొండలు తప్ప ఇంకేం కన్పించేవి కావు. కన్పించినా ఆమె మనసు వాటిని చూసేది కాదు. ఇప్పుడు కొత్తగా, చిత్రంగా ఆమెకు తెలియకుండానే ఆమె కళ్లు ఊరు దాటాక కన్పించే స్మశానం మీద నిలుస్తున్నాయి. అక్కడ వుండే అన్ని సమాధుల్ని కవర్ చేసుకుంటూ వెళ్తున్నాయి.
ఒకప్పుడు ఆమెకి తెలిసింది వాళ్ల పొలంలో వుండే తాతయ్య నానమ్మల సమాధులు మాత్రమే. ఇలా ప్రతి ఊరి చివరన ఓ స్మశానం వుంటుందని, అందులో చాలా సమాధులు వుంటాయని అనుకోలేదు. అనుకోవటం కాదు బస్ లో, ట్రైన్ లో వెళ్తున్నప్పుడు కన్పిస్తాయి కాని ప్రత్యేకించి వాటివైపు చూసేది కాదు. ఇప్పుడెందుకు చూస్తోంది? ఎంత వద్దనుకున్నా ఆమె కళ్లు వాటినే చూస్తున్నాయి. అప్పుడప్పుడు తను చదివే పుస్తకాల్లో స్మశానవైరాగ్యం అని వుంటుంది. బహుశా జయంత్ దగ్గర కోరుకున్న ప్రేమాభిమానాలు లభించక తన మనసుకి వైరాగ్యపు ఛాయలు అంటుకున్నాయా? లేకుంటే ఎందుకు తన మనసు స్మశానం కన్పించినప్పుడు అంత ఆసక్తిగా గమనిస్తోంది? సృష్టిలో ప్రతి అందం ఏదో ఒకవిధంగా మనసుని స్పందింపజేయటం ప్రకృతి ధర్మం అంటారు. అంటే తను స్మశానంలో అందాన్ని చూస్తోందా? ఆనందాన్ని వెతుక్కుంటోందా? అసలేం జరుగుతోంది తన మనసులో?
అప్పుడే ఒకరిద్దరు అభిమానులు ఆమెను చూసి గుర్తుపట్టారు. సంతోషంగా వచ్చి ఆమెకి ఎదురుగా కూర్చున్నారు. చాలాసేపు ఆమె రాసిన నవలల గురించి మాట్లాడారు. సంలేఖ కూడా వాళ్లతో చాలా హుషారుగా మాట్లాడింది.
స్టేషన్ రాగానే వాళ్లతో ప్రేమగా “నేను ఇక్కడ దిగాలి” అని చెప్పి ట్రైన్లోంచి దిగింది సంలేఖ.
సంలేఖ దిగింది ఆదిపురి కాదు.
స్టేషన్ లోంచి బయటకొచ్చి ఆటో ఎక్కింది. ఆమె చెప్పినట్లే ఆటోవాడు ఆటోను గనుల వైపు పోనిచ్చాడు.
“అమ్మా! ఆటో గనుల వరకు వెళ్లదు. ఇక్కడ దిగి నడుచుకుంటూ వెళ్లాలి” అన్నాడు ఆటోవాడు.
“గనుల్లో పనిచేసేవాళ్లు ఎక్కడ వుంటారో నీకు తెలుసా?” అని ఆటో అతన్ని అడిగింది.
”గనులకి దగ్గర్లోనే ఒక చిన్న కాలనీలో వుంటారు. నేను వుండేది కూడా అక్కడే!” అన్నాడు.
“అక్కడే వుంటావా? అయితే నీకు తిలక్ తెలుసా?” అని అడిగింది సంలేఖ ఆతృతగా.
“తెలుసమ్మా! తిలక్ తో మీకేం పని?” అన్నాడు ఆటో అతను.
“తిలక్ మా అన్నయ్య. ఫోన్ చేస్తే కలవడం లేదు. ఇంటి అడ్రస్ ఎప్పుడూ అడగలేదు. ఇప్పుడు నేనిలా వస్తానని అనుకోలేదు. అందుకే ముందుగా మా అన్నయ్యతో నేను చెప్పలేదు. చెప్పివుంటే స్టేషన్ దగ్గరకి వచ్చేవాడు” అంది.
ఆమెను చూస్తుంటే తిలక్ చెల్లెలంటే ఆటో అతనికి నమ్మబుద్దికావటం లేదు. తిలక్ వేషభాషలెక్కడ! అతని మాట తీరెక్కడ! కడిగిన ముత్యంలా, దేవతను చూసినట్లు అనిపించే ఈమె ఎక్కడ? ఇలా కూడా వుంటారా? అని మనసులో అనుకున్నాడు. వెంటనే ఎందుకుండరు. తన సర్వీసులో గొప్పగొప్పవాళ్ల బంధువుల్లో నిరుపేదలుగా వున్నవాళ్లను, అజ్ఞానులుగా వున్నవాళ్లను ఎందర్ని చూడలేదు అని మళ్లీ తనకు తనే జవాబు చెప్పుకున్నాడు.
“ఇప్పుడు మీరు తిలక్ ఇంటికి వెళ్తారామ్మా?” అడిగాడు వినయంగా.
“అవును. వెళ్లాలి. ఎందుకలా అడుగుతున్నావ్?” అంది అర్ధంకాక.
“నాకు తెలిసి మీరెప్పుడూ రాలేదు కదా! అందుకే అడిగాను. తిలక్ ది మా పక్క ఇల్లే!” అన్నాడు.
“సరే! తీసికెళ్లు. అన్నయ్య ఇప్పుడు ఇంట్లోనే వుంటాడా?” ఆసక్తిగా అడిగింది.
ఆమె ఆసక్తిని గమనించి “ఎందుకైనా మంచిది మీరిక్కడ దిగండమ్మా! అదిగో అక్కడో టీస్టాల్ వుంది చూశారా! అక్కడ నిలబడి టీ తాగుతున్నవాళ్లంతా మహిళా సంఘాలకి చెందిన ఆడవాళ్లు. వాళ్లతో కలిసి మీరు కూడా టీ తాగుతూ వుండండి. ఈ లోపల నేను వెళ్లి తిలక్ ని తీసుకొస్తాను” అన్నాడు.
– అంగులూరి అంజనీదేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
జ్ఞాపకం 94 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>