జ్ఞాపకం 95 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి
“ఇక్కడెందుకు? నేను అన్నయ్య దగ్గరే టీ తాగుతాను. ముందు నన్ను తీసికెళ్లు” అంది సంలేఖ.
“వద్దమ్మా! అది మీరు రాదగిన ఇల్లు కాదు. తిలక్ ఒక అమ్మాయిని తెచ్చి ఇంట్లో వుంచుకున్నాడు. పెళ్లి చేసుకోమంటే చేసుకోడు. వాళ్ల అన్నయ్య వచ్చి చెల్లెల్ని తీసుకుపోలేక, ఇక్కడే వుంచి వెళ్లలేక గొడవపడి పోతుంటాడు. ఎప్పుడొచ్చి గోలచేస్తాడో తెలియదు. మాకు అదంతా అలవాటైపోయింది. మాకు మీకూ తేడా లేదమ్మా!” అన్నాడు సంలేఖ వైపు చాలా గౌరవంగా చూస్తూ.
అతని మాటల్లో నిజం వుంది. నిజాయితీ వుంది.
“సరే! వెళ్లి తీసుకురా!” అంది ఆటోలోంచి దిగుతూ.
ఆమె బ్యాగ్ ను అతనే తీసికెళ్లి టీస్టాల్ పక్కన మర్రిచెట్టు కింద వున్న సిమెంట్ బెంచిమీద పెట్టాడు.
“ఇక్కడ కూర్చోండమ్మా!” అని చెప్పి అతను వెళ్లాడు.
అతను తిలక్ ని వెంటబెట్టుకొని వచ్చేంతవరకు ఆ సిమెంట్ బెంచీ పైనే కూర్చుని వుంది సంలేఖ..
తిలక్ సంలేఖను దూరం నుండి చూసి నమ్మలేకపోయాడు.
ఆమె కూర్చున్న చోటుకి వెళ్లి “నువ్వెందుకొచ్చావే! బావ ఏడి?” అన్నాడు తిలక్.
తిలక్ వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనంగా చూసింది.
పక్కనే వున్న మహిళా సంఘాల గ్రూపు వాళ్లు టీ తాగి అక్కడే వున్న బ్యాంక్ లోకి వెళ్తున్నారు. అక్కడ గోలగోలగా వుందే కాని అది గోల కాదు వాళ్లు మాట్లాడుకోవటం. కాకుల అరుపులు విన్పించి ఆటో అతను పైకి చూశాడు.
“అమ్మా! మీరు కొంచెం పక్కకి జరిగి కూర్చోండి! పైన కాకులు వున్నాయి” అన్నాడు.
సంలేఖ అతను చెప్పినట్లే లేచి ప్లేస్ మార్చి కూర్చుంది.
ఆటో అతను వెంటనే తిలక్ వైపు తిరిగి “తిలక్! చెల్లెల్ని నా ఆటోలో తీసికెళ్లి ఇక్కడ ఏదైనా హోటల్లో భోజనం పెట్టిద్దాం!” అన్నాడు.
వెంటనే “వద్దయ్యా! నేను ఆదిపురి వెళతాను. మా అన్నయ్యతో ఓ పది నిముషాలు మాట్లాడే పని వుంది” అంది.
తిలక్ కి అర్థంకాక నాతో ఏం మాటలే నీకు అన్నట్లు సంలేఖ వైపు చూశాడు. తర్వాత ఏమనుకున్నాడో ఏమో ఆటో అతనివైపు తిరిగి “సరే! నువ్వెళ్లు భయ్యా!” అని అన్నాడు.
ఆటో అతను అప్పటికే తన ఆటో దగ్గర నిలబడి వున్న మనుషుల్ని ఆటోలో ఎక్కించుకొని వెళ్లిపోయాడు.
తిలక్ సంలేఖ పక్కన కూర్చుని “ఏం మాట్లాడాలని వచ్చావో చెప్పు?” అన్నాడు.
“ఏం లేదన్నయ్యా! నాన్న చనిపోయి చాలా రోజులైంది. సమాధి కట్టించాలి కదా! దాని విషయమే నీతో మాట్లాడాలని వచ్చాను. నీ ఫోన్ కి ఎప్పుడు చేసినా స్నిగల్స్ అందవు. లేదంటే స్విచ్చాఫ్ లో వుంటుంది” అంది.
ఆ మాటలు వినగానే పిచ్చిచూపులు, బిత్తరచూపులు చూశాడు తిలక్.
“నువ్వు బాగానే వున్నావా? లేక నీ మెదడు కేమైనా దెబ్బలాంటిది తగిలిందా?” అన్నాడు.
“నాన్నకి సమాధి కట్టించాలన్నది గుర్తుచెయ్యటం మెదడుకి దెబ్బ తగలడమా? ఎందుకలా ఆలోచిస్తున్నావు చిన్నన్నయ్యా?” అంది సంలేఖ.
“ఏమో లేఖా! నీ మాటలు వింటుంటే నా మెదడు మొద్దు బారేలా వుంది. నీక్కూడా ఒకప్పుడు నాన్నకి పట్టిన పిచ్చే పట్టినట్లుంది. కానియ్! ఏం చేద్దాం. ఎవరి పిచ్చి వాళ్లకి ఆనందం కదా” అన్నాడు. అతనింకేం మాట్లాడలేదు.
“మాట్లాడకుండా వుండటం కాదు. నాన్నకి ఇప్పుడు సమాధి కట్టించాలి. అది నువ్వే కట్టించాలి” అంది.
“నేనా?”
“నువ్వు కాక ఇంకెవరు?”
“నాతో గొడవ పెట్టుకోటానికి వచ్చావా?”
“గొడవ కాదు. ఆ పని అయిపోవాలిప్పుడు”
– అంగులూరి అంజనీదేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`
Comments
జ్ఞాపకం 95 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>