ఎర్ర మల్లెలు ఒక వన్ సైడ్ స్టోరీ.-శృంగవరపు రచన
2020 నుండి తెలుగు సాహిత్యంలో ఏ మాత్రం సంకోచించకుండా తమ చుట్టూ ఉన్న సమస్యలను, ఎవరూ చర్చించడానికి ఇష్టపడటానికి ఉన్న అంశాల గురించి గట్టిగా ప్రశ్నిస్తూ రాస్తున్న కథలు, నవలలు వస్తూ ఉన్నాయి. ఈ తరం రచయితల్లో ఆ తెగువ, సమకాలీన సమాజ చిత్రణ పట్ల ఉన్న స్పష్టత, భాషా శైలి విషయంలో చేస్తున్న ప్రయోగాలు అన్నీ అభినందనీయమే. అలాగే ఈ తరానికి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ రచయితలు తమ రచనలను ఎక్కువ మందికి చేర్చగల మాధ్యమాలు ఎన్నో ఉండటం. మొదటి రచనతోనే తమకంటూ ఒక ప్రత్యేక ముద్రను ఏర్పరచుకుంటున్న రచయితల తరమిది. ఈ కోవకు చెందిన రచనే ‘ఎర్ర మల్లెలు’; రచయిత్రి రోజారమణి దాసరి. మారిటల్ రేప్ గురించి రాసిన నవల ఇది. మొదటి రచనలోనే రచయిత్రి చూపిన ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. మొదటి రచనగా ఇది గొప్ప ప్రయత్నమే అయినా, ఇది కేవలం కల్పన ఆధారిత నవల కాదు కనుక, కొంత వాస్తవ గాథ కూడా ఇమిడి ఉన్న జీవితం కూడా కనుక, స్త్రీ వైవాహిక జీవితంలో ఉన్న లైంగిక దాడి గురించి చెప్పే కథ కనుక ఈ నవల గురించి కొంచెం ఎక్కువే మాట్లాడుకోవాలి.
కథలో దియా, హేమంత్ భార్యాభర్తలు. దియా ఒక ఆర్ట్ వర్క్ షాప్ నడుపుతూ ఉంటుంది. ఆమె భర్త హేమంత్. దియా దగ్గర పని చేసే అమ్మాయి తార. మన కమర్షియల్ కథలకు ఒక ఫార్ములా ఉంటుంది. కథలో ఒక అన్యాయం లేదా నిస్పృహ ఉన్నప్పుడు దాని దగ్గరలో ఆశ, భరోసా కూడా ఉండేలా పాత్రల ఏర్పాటు చేయడం. ఈ రెండు భిన్న పాత్రలు కలవడం, నిరాశతో ఉన్న పాత్రకు నమ్మకం కలిగించేలా ఈ రెండో పాత్ర ఉండటం. ఇది కల్పిత కథలకు అయితే నప్పే ఫార్ములా. కానీ కొంత వ్యథను కలబోసుకునే కథల్లో మాత్రం ఇది కృతకంగానే ఉంటుంది. ఈ ‘ఎర్ర మల్లెలు’ నవలలో బాధలో ఉన్న పాత్ర దియా అయితే, సంతోషంతో ఉన్న పాత్ర తార. హేమంత్ అనే పాత్ర భార్యను లైంగికంగా వేధించడంలో మాత్రమే కనిపించే పాత్ర. అంతకుమించి అతని మీద చర్చించడానికి ఏ ఆస్కారం ఇవ్వలేదు రచయిత్రి. అతనొక విలన్ అంతే. అతని పై ఒక విచారణ లేదు. అతని జీవితం గురించి తెలిసే అవకాశం పాఠకులకు లేకుండా పోయింది. అతనొక దుర్మార్గుడు కనుక చూస్తూ ఉండడం తప్ప మరేం చెయ్యలేమనే నిరాశను కలిగించేలా ఉంది కథ. ఒకవైపే చూస్తున్న భావన తప్ప రెండు జీవితాల సంపూర్ణ చిత్రణ ఈ నవలలో లేదు.
ప్రపంచ సాహిత్యంలో వివాహానంతర లైంగిక హింస, దోపిడి గురించి స్త్రీలను భావోద్వేగాల పరంగా తమకు అనుకూలంగా మానిప్యూలెట్ చేయడం; సెక్స్ ని ఒక అధికార ఆయుధంగా పరిగణించడం గురించి ఇప్పటికే అనేక నవలలు వచ్చాయి. మార్గరేట్ అట్వుడ్ ‘హ్యాండ్ మెయిడ్ టెయిల్’, పాలిన్ రేగే ‘ద స్టోరీ ఆఫ్ వో’, అలెగ్జాండర్ మెక్ కాల్ స్మిత్ ‘టియర్స్ ఆఫ్ జిరాఫీ’, అభి డేర్ ‘ద గార్ల్ విత్ లౌడింగ్ వాయిస్’ నవలల్లో కూడా స్త్రీల మీద జరిగే లైంగిక దాడి ఒక అంశంగా ఉంది. పైకి మామూలు కథల్లా అనిపించే ఈ నవలల్లో స్త్రీని లొంగదీసుకోవడానికి, పవర్ ప్లే కోసమో ఇంకా అనేకానేక కారణాల వల్లనూ ఉన్న మనస్తత్వ కథలు పొరలు పొరలుగా విప్పుకుంటాయి. తెలుగులో గీతాంజలి గారి రచనలు కూడా సమకాలీన స్త్రీల గాథలను గట్టిగా చెప్పేవే. నవలల్లో పాఠకులకు ఇటువంటి సున్నిత విషయాలను ముఖ్యంగా స్త్రీల కథల గురించి కూడా ‘స్త్రీ-పురుషుల’ భేదం లేకుండా అందరూ లోతుగా అర్థం చేసుకోగలిగేలా రాస్తున్న రచయిత వివినమూర్తి గారు. ఎక్కడ ఆవేశపడాలో, ఎప్పుడు ఆలోచించాలో, ఏ అంశం మీద ఏ తీరులో ధిక్కారాన్ని ప్రకటించాలో చెప్పి చెప్పకుండా చెప్పే సాహితీ సృజన వివినమూర్తిగారిది. ఈ రచనల్లో పాత్రలు కథ చెప్పినా, మిగిలిన పాత్రల ధ్వని కూడా కొంత వినిపిస్తూనే ఉంటుంది. దీని వల్ల పాఠకులే అర్థం చేసుకుని సహానుభూతి పెంచుకునే అవకాశం ఉంటుంది. ఆ సహానుభూతి పొందే అవకాశం లేనప్పుడూ పాఠకులు కన్విన్స్ అవ్వడం కష్టం. ఆ కన్విన్సింగ్ ఫ్యాక్టర్ ఆ సమస్య తీవ్రతను ఏ ఒకరి వైపో తీసుకోకుండా బాధితులు, నిందితుల వైపు నుండి కూడా పాఠకులకు అర్థమయ్యే ఘటనలు రచనలో ఉండేలా రచయిత రాయగలిగితేనే ఎస్టాబ్లిష్ అవుతుంది. అది ‘ఎర్ర మల్లెలు’ నవలలో ఇద్దరి వైపు నుండి కాకుండా ఏకపక్షంగా ఉండటం వల్ల అంశం తీవ్రత పలుచబడింది.ఈ సహానుభూతి లేకపోతే సంభవించే ఇంకో ప్రమాదం ఏమిటంటే; తెలియకుండానే రచయిత బలవంతంగా ‘వీరు బాధితులు. వీరు చేసేది, భవిష్యత్తులో చేయబోతున్నది వారు బాధల ఫలితమే కనుక మీరు వారు బాధ పడటాన్ని ఇష్టపడకపోతే తప్పకుండా వారి ప్రతిచర్యలను హర్షించాల్సిందే’ అనే పరోక్ష సూచన చేసినట్టు ఉండటం.
వివాహం చేసుకున్నాడంటేనే ఒక మగవాడికి ఎంతోకొంత సమాజం అంటే కాస్తో కూస్తో గౌరవం ఉన్నట్టే. అటువంటి వివాహ బంధంలో అతను భార్యతో లైంగికంగా సంతోషంగా ఉండగల అవకాశం ఉండి కూడా ఆమెను బాధ పెడుతున్నాడంటే నిజంగానే అది తీవ్రమైన అంశం. అందులోనూ హేమంత్ చదువుకున్నవాడు, ఉద్యోగంలో ఉన్నవాడు. అత్తమామలతో మంచిగా నటించగలిగేవాడు. భార్య వర్క్ షాప్ పెట్టుకున్నా ఏమి అననివాడే. అలాగే దియా ఒక స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి కూడా. ఈ జనరేషన్ జంట వీరు. ఈ జంటకు మధ్య ఈ ‘మారిటల్ రేప్’ అన్న దాన్నీ ఎస్టాబ్లిష్ చేయాలంటే చాలా కష్టం. కథంతా దియానే చెప్తూ ఉండటం వల్లానూ, తార కూడా కేవలం ఆమె కోణంలో ఆమెను సమర్థిస్తూ ఉండటమూ, భార్యను ఆమె ఆర్ట్ షాప్ లో రేప్ చేయడం కొందరు బాధితుల జీవితాల్లో ఉన్నా కృత్రిమంగా రాసిన తీరు అసలు సమస్య పై పాఠకుల దృష్టిని పేలవంగా చేస్తుంది.
అలాగే నిజానికి ఒక మనిషిలో ఒక రకమైన హింసాపూర్వక ప్రవృత్తి ఉందంటే దానికి అనేక మూలాలు, కారణాలు ఉంటాయి. ఆ మూలాలను, కారణాలను చెప్పగలిగే వాతావరణం కనుక నవలలో లేకపోతే ఆ నవల కేవలం ‘బ్లేమ్ గేమ్’ గా మారిపోతుంది. ఈ నవల హేమంత్ ని నిందించడానికి మాత్రమే రాసిన కథలా అనిపిస్తుంది. ఇద్దరి వైపు కథ లేకపోవడం వల్లా హేమంత్ కథను ఒకటి రెండు సన్నివేశాల్లో అది కూడా కేవలం చెడ్డవాడు అని చెప్పడానికే రాయడం వల్ల ఇది పూర్తిగా ఒక వైపు విన్న కథలానే అనిపిస్తుంది. అలాగే దియా వర్క్ షాప్ పెట్టాలన్న ఆలోచన బలపడిన ఘటన కూడా బలంగా లేదు. హేమంత్ -దియా ల మధ్య కోపమో, ద్వేషమో, అసహ్యమో, ప్రేమో ఉన్న ఎమోషనల్ వాతావరణం ఈ నవలలో లేదు. ఉన్నదల్లా సెక్స్ కోసం అతను చేసే హింస మాత్రమే. ‘ఎమోషనల్ గ్యాప్’ మొదటి నుండే ఉన్నా, దాన్ని నవల చివరకు వచ్చేసరికి కూడా భర్తీ చేయకపోవడం, ఒక నాటకీయ ముగింపు ఇవ్వడం, కొంత హేమంత్ ‘ఇంపోటెంట్ స్వభావం’ వల్ల మాత్రమే అతని హింసా కారణంగా చెప్పడం కూడా కన్విన్సింగ్ గా లేవు.
మొత్తం మీద మొదటి రచనగా ఈ నవల మంచి ప్రయత్నమే. ‘ఎర్ర మల్లెలు’ శీర్షిక కూడా నవలా ఇతివృత్తాన్ని ప్రతిబింబించేదే. అలాగే కొన్ని చోట్ల దియా బాధను చెప్పిన తీరు కూడా బావుంది. నిజానికి ఈ ‘ఎర్రమల్లెలు’ ఇంత గంభీరమైన సమస్య కాకుండా ఏ కల్పిత గాథో అయితే ఇది తప్పక గొప్ప నవలే అయ్యేది. ముఖ్యంగా తారకు ,ఆమె బావకి మధ్య భౌతిక దూరం ఉన్నా ఒక సున్నితమైన, మనసుకి ఆహ్లాదాన్ని కలిగించే స్వచ్చమైన ప్రేమను, స్త్రీ కోరుకునే వైవాహిక సంతోషాన్ని ఈ ఇద్దరి అనుబంధం ద్వారా చక్కటి యాసతో బాగా రాశారు. అలాగే స్త్రీకి వివాహమైతే భర్తతో ఇష్టం లేని సెక్స్ ను వద్దనుకుంటే సమాజంలో, కుటుంబంలోనూ ఆమెను అస్సలు అర్థం చేసుకొని తీరును, అలాగే స్త్రీ శృంగార సమయంలో కోరుకునే సున్నితమైన రొమాన్స్ గురించి కూడా చక్కగా రాశారు. భాష-భావం గొప్పగా ఉన్న నవల ఇది. కానీ లోతైన సమస్య కావడం వల్ల ఈ నవలా కాన్వాస్ చాలా కోణాల్లో కుదించబడినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా హేమంత్ జీవిత చిత్రణ, హేమంత్ -దియాల మధ్య కుటుంబ జీవితంలో ఉన్న సహజ భావోద్వేగాలు, నవల మొత్తం దాదాపుగా సంభాషణ శైలిలోనే సాగిపోవడం వల్ల గంభీరమైన అంశం కొంత సినిమాటిక్ గా మారిన భావన కలుగుతుంది. కథను చెప్పే తీరులో కొంత విస్తృతి, మనిషి లోపలి మనిషిని చూపించడంలో కొంత పరిణతి, పాఠకులకే పాత్రలపై ఒక అభిప్రాయానికి వచ్చే వాతావరణం ఉంటే ఇంకా బాగుండేది.
-శృంగవరపు రచన
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
ఎర్ర మల్లెలు ఒక వన్ సైడ్ స్టోరీ.-శృంగవరపు రచన — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>