అరణ్యం 2 – బంగారుపోగులు – దేవనపల్లి వీణావాణి
పగలు పెరిగే కాలం వచ్చేసింది. సూర్యుడు మకారరాశిలోకి ప్రవేశించి వారం దాటింది. రెపరేపలాడే జాతీయజెండాకు వందనం సమర్పించి ఆ వేడుకకు హాజరైన అందరినీ పలుకరించి వచ్చేవేళకి మధ్యాహ్నం దాటింది. రెండునెళ్లక్రితం జరిగిన రోడ్డు ప్రమాదం ,తదనంతరం తప్పనిసరియై తీసుకున్న విశ్రాంతి సమయం తర్వాత కార్యాలయానికి తిరగిరావడం ఇప్పుడే కుదిరింది. కారులో వస్తుండగా వెనుకనుంచి వస్తున్న లారీ ఢీకొట్టిన ప్రమాదం అది.ఎవరికీ ఏమీ అవలేదుకానీ కాళ్ళు మడుచుకుపోయాయి.మళ్ళీ కుదుటపడి యధావిధి విధుల్లోకి చేరడానికి ఇంతసమయం పట్టింది. జెండాపండుగ చిన్ననాటినుంచి ఇష్టమైన పండుగ. బతుకమ్మ తర్వాత అంతగా లీనమైన సంబురం. రాత్రి గోరింటాకు పెట్టుకొని, రిబ్బన్లు, యూనీఫార్మ్ తెల్లగా ఉతుక్కొని పొద్దుపొద్దుననే బడిలోకి వెళ్ళి వరసలుకట్టి నిలబడి జనగనమన అధినాయక జయహే అని పాడుకున్నప్పుడు కలిగిన పులకరింత ఎంత మధురమైనదని. సారే జహాసే అచ్ఛా గీతమూ అంతే , ఆ బాండ్ మోగిందంటే చాలు ఎక్కడలేని ఉద్విగ్నత, ఉత్సాహం. ఇప్పుడుకూడా అంతే. ప్రభుత్వానికి సేవకులుగా ఉంటూ జెండాపండుగ చేసుకోవడమూ జెండాని గౌరవప్రదంగా ఎగరవేయడమూ నామటుకు గొప్పఅవకాశంగా భావిస్తాను. అది చేజారిపోకూడదనే సెలవును జెండా పండుగకు కుదిరేలాగా సరిచేసుకున్నాను. మహానుభావులు యే అద్వితీయ భావాలతో రాసి ఉంటారోగానీ కొన్ని గీతాలకున్న మహత్తు మన నరనరాల్లో ప్రసరిస్తూ స్పూర్తినిస్తూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా స్వాతంత్ర్య సముపార్జనలో సంఘీభావాన్ని తెలపడానికి, సంఘటితం కావడానికి సాహిత్యం, గీతాల రూపంలో ప్రభావితం చేసింది.వ్యక్తికి స్వీయ అభిరుచులకు ఆవల మనం, మనది అన్న భావాన్ని హృదయానికి దగ్గరగా తీసుకురాగలిగిన తమశక్తిని ఆయాగీతాలు చూపించాయి. వింటున్న ప్రతిసారీ వాటిశక్తిని ప్రకటిస్తుంటాయి,ప్రజ్వరింపజేస్తుంటాయి.
ఈ రెండుమూడునెలలంతా నీటి సంరక్షణ విధానాలమీదనే పనిచేయవల్సి ఉంటుంది. అలాగే సివిల్ వర్క్స్ ఏమైనా ఉంటే అవి ఈకాలంలో పూర్తి చేసుకోవాలి. సాధరణంగా అన్ని అటవీప్రాంతాలను ఇన్స్పెక్షన్ చేసే వీలుండదు. కారణాలు ప్రధానంగా రెండు. ఒకటి భూభాగంయొక్క నిర్మితి వల్ల, రెండవది చిక్కగా అల్లుకుపోయిన అడవివల్ల. ఏటూరునాగారంలో మరీనూ. ఎనిమిదివందల చదరపు కిలోమీటర్ల వైశాల్యం అంటే చాలా విశాలమైన అడవి. చిన్నచిన్న కొండలు, వాగువంకలు ఇప్పటికీ ఎవరూ వెల్లజాలని చిక్కని అడవులు. వీటిని క్రమం తప్పకుండా పరిశీలించవలెనంటే ఉండవలసిన కనీసదారుల్ని ఈ కాలంలోనే ఏర్పాటుచేస్తారు. అంటే ఇదివరకే ఉన్నదారుల్ని సరిచేయడం, లేకపోతే కొత్తవాటిని ఏర్పాటు చేయడంవంటివి. ఎండాకాలంలో కాస్త తేమతగ్గి, గడ్డిజాతులన్నీ ఎండిపోయి లోపలికి వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. వానాకాలం వచ్చేలోగా పూర్తిచేస్తారు. సర్వే చేసుకోవడం, పనులు చేసుకోవడంలో అందరూ నిమగ్నమై ఉన్నారు. ఈ మధ్యకాలంలో పర్యావరణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలో జిల్లా అధికారులు విజయం సాధించారు. ముఖ్యంగా విద్యార్థులకోసం నిర్వహించిన పర్యావరణ అవగాహన కార్యక్రమాలు మంచిపేరు తెచ్చాయి. అయితే దీనికొరకు విద్యార్థులను దగ్గరలో వున్న అటవీప్రాంతాల్లోకి తీసుకువెళ్లారు. ఇలాగా పర్యావరణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి అనుకూలంగా రోడ్డుకు దగ్గరగా ఉన్న కొన్ని అటవీప్రాంతాలకు సులువుగా వెళ్లేందుకుకూడా ఇదివరకే ఉన్న దారుల్ని మంచిగా చేయడం కూడా ఈ పనుల్లో భాగంగా చేయడానికి సంకల్పించాము.
పస్రాలోని డోలమైన్స్ చూడడం మాత్రం వీలుకాలేదు. అయితే తాడ్వాయి విభాగానికిచెందిన అడవుల్ని చూసే అవకాశం లభించింది. ఏరుమద్ది,నల్లమద్ది చెట్లు ఎక్కువగాఉండే ఏటూరునగరం ప్రాంతంలో అటవీ ఆధారిత కుటీర పరిశ్రమలు ఏవీ కుదురుకోలేదు. తెలంగాణలో ఆదిలాబాద్, మహాదేవపూర్,చెన్నూర్ లాంటి ప్రాంతాల్లో దసలిపట్టు పరిశ్రమ అటవీ ఆధారిత కుటీరపరిశ్రమగా స్థిరపడింది. దసలిపట్టుకూడా పట్టుపురుగులనుంచి ఉత్పత్తి అయ్యేదే. మనకు బాగా తెలిసిన మల్బరీపట్టు పురుగులు మల్బరీచెట్ల ఆకులను తిని పట్టుగూళ్లను అల్లుతాయి. అయితే దసలిపట్టులో ఏరుమద్ది, నల్లమద్ది ఆకుల్ని తినిగూళ్ళు అల్లుతాయి. వాటినుంచి తీసిన పట్టు దసలిపట్టు. ఈపట్టును తయారుచేయడం పురాతనకాలంనుంచీ ఉంది. నిజాంకాలంలో రాజాదరణ పొంది ఆనక ప్రజాదరణా పొందింది. పదేళ్ళక్రితం మహాదేవపూర్‌లో ప్రభుత్వం తరఫున పట్టుపరిశ్రమశాఖ నిర్వహిస్తున్న పట్టుఅభివృద్ధి కార్యాలయాలన్ని సందర్శించాను. అక్కడ పట్టుపురుగుల గుడ్లను అందిస్తారు. దీన్ని విత్తనం అనే అంటారు. రైతులు ఆ గుడ్లనుంచి పట్టుపురుగులు పుట్టాక వాటిని అడవిలో మద్దిచెట్లమీద జాగ్రత్తగా విడుస్తారు. అవి ఆచెట్ల ఆకులు తిని మండలం రోజుల తర్వాత గూళ్లను అల్లడం మొదలు పెడతాయి. రైతులు గూళ్లను సేకరించి పట్టు అభివృద్ధి కేంద్రానికి తెచ్చి అమ్ముకుంటారు.అక్కడ వీటిని వేలం వేసి అమ్ముతారు. కొందరు సేకరించుకొన్నవి వారే శుద్ధిచేసి చీరలను, పట్టుగుడ్డను, శాలువాలవంటివి తయారుచేస్తారు. నా సందర్శనలో భాగంగా నేనో మగ్గంనేసే కుటుంబాన్ని కలుసుకున్నాను. వారి వద్ద ఒకచీరను, శాలువాను కొన్నాను. వారి వివరాలను తెలుసుకున్నాను. వారి మాటల్లో ఆ కుటుంబంలో పట్టుతో బట్టనేసె చివరి తరం వారిదేనని , పిల్లలు ఎవరూ ఆ పని నేర్చుకోలేదని చెప్పారు.
దసలిపట్టు తయారీలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మద్దిచెట్లగురించే. ఆచెట్లు లేకపోతే ఆపట్టు లేదు! మల్బరీ పట్టులాగా ఆ పురుగులు చంద్రికలలో పెరగవు. అడవిలో చెట్లఆకుల్ని తిని పెరుగుతాయి. మల్బరీపట్టుపురుగు పూర్తిగా సాధుకీటకంగా మారిపోయింది, అంటే అది పెంపకానికి అలవాటుపడింది. దసలి పట్టుపురుగు ఇంకా అడవితో ముడిపడిఉంది, అక్కడే పెరుగుతుంది. నేను కలుసుకున్న పట్టురైతులు చెప్పినది ఏమిటంటే లార్వాలను చెట్లమీదకు వదిలాక వాటిని పక్షులు తినకుండా ఉదయంనుంచి సాయంకాలందాకా పక్షులను చెట్లమీదికి రాకుండా రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉండడం, దానికోసం తెల్లవారగట్ల నాలుగింటికే బయలుదేరి అడవికి వెళ్ళడం, శబ్ధాలు చేయడం, జెండాలు వంటివికట్టడం తిరిగి పక్షులు గూళ్లకు వెళ్ళేసమయందాకా కాపు కాయడం కష్టంగా మారిందని. ఎంత శ్రమ ఉంది చూడండి. అడవిలో చెట్టుమీద పురుగుల్ని తినకుండా పక్షుల్ని ఆపడం ఎంత కష్టం., అందునా యే ఒక్కచెట్టో కాదు, యే ఒక్కపక్షీ కాదు. రైతులు దీనికోసం సాధ్యమైనంతమేర ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇది అంత సులువైన పనికాదు, లార్వాలను వదలడం, వాటిని కాపాడడం, సేకరించడం పెద్దపనే. ఇంకా అడవి జంతువులనుంచి క్రిమికీటకాలనుంచి తమను తాము రక్షించుకుంటూ చేయవలసిన పని. అదీ అటవీ అధికారుల అనుమతితోనే అడవిలోకి వెళ్ళవలసి ఉంటుంది. కొన్నిసార్లు ఇది పట్టురైతులకు, అటవీ అధికారులకు మధ్య సమన్వయ అవసరాన్ని గుర్తుచేస్తుంది. అస్సాంలో మూగాపట్టు కూడా అటవీవృక్షాల మీద ఆధారపడిన పట్టే, అయితే ఆయా వృక్షజాతుల్ని విడిగా పెంచికూడా పట్టును ఉత్పత్తి చేస్తూన్నారు. మూగాపట్టు దసలిపట్టుతో పోలిస్తే విలువైంది, ఆ పట్టుకున్న బంగారువర్ణం దానికా విలువను ఇచ్చింది. మూగా పట్టుతో పోలిస్తే దసలిపట్టుకున్న ప్రాచుర్యం తక్కువ. బహుశా దీనినికూడా మామూలు మల్బరీపట్టుగా టస్సర్ పట్టుగా సంభోదించడం కారణం కావచ్చు. పూర్తిగా సాధుకీటకంగా మారిన మల్బరీపట్టు పురుగుకు, ఇంకా అడవితో అనుబంధం కలిగిఉన్న దసలిపట్టుపురుగుకు, దాని పట్టు ఉత్పత్తిలోని సంక్లిష్టతను వివరంగా తెలియజేస్తే సరైన గిట్టుబాటు ధర దొరుకుతుందని నాకనిపించింది. నాకొచ్చిన మరో సందేహం అవే చెట్లు ఏటూరునాగరంలోనూ, అదే గోదావరి తీరంలోనూ ఉన్నప్పటకీ ఇక్కడ ఎందుకు పట్టుసాగునో లేక కనీసం స్థానికంగా అటువంటి పరిస్థితులు లేవో అని. నాకర్థమైనంతవరకు ఇక్కడ ప్రస్తుతం ఉన్నమద్దిచెట్లసంఖ్య గతంలో ఎన్నడూ ఉండి ఉండలేదు. ఈప్రాంతం ఎప్పటినుంచో దట్టమైన టేకువనాలకు పేరు గడించింది గనుక ఇక్కడ సహజంగా దసలిపట్టుపురుగులు పెరిగే అవకాశమూ లేదు. ఆయా వృక్షజాతుల విస్తరణ కాలక్రమాన్ని నిర్ణయించడంలో, నిర్దారించడంలో మానవసమాజాల అభివృద్ధి, వికాసం, జీవనశైలివంటివి ప్రభావితం చేయగలవని ఈ అంశం నిరూపిస్తుంది. మరింత లోతైన పరిశోధన చేయడంవల్ల భవిష్యత్ అవకాశాలు, మానవఅభివృద్ధి కార్యక్రమాలకే పరిమితంకాకుండా అడవులమీద ఆధారపడిన ప్రత్యక్ష, పరోక్ష పరిశ్రమలు వాటి విలువ, మనదేశానికే ప్రత్యేకమైన ప్రకృతివనరులు జోడించే అదనపు వాణిజ్యవిలువలను పెంపొందించుకునే ప్రణాళికలను రచించుకోవచ్చు. అట్లా చూస్తే ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి ప్రకృతి వనరుల అమరిక ఉండకపోవచ్చు, దీన్ని ప్రస్తుతం ఉన్న విశ్వవిఫణిలో ఆవిష్కరించుకోవచ్చునని ఊహ.
మహదేవ్పూర్ పట్టు కేంద్ర సందర్శన తర్వాత చాన్నాళ్ళు ఆ విషయం మర్చిపోయినప్పటికీ ఒక ఎక్సిబిషన్లో అహింసాపట్టు పేరుతో వెలసిన స్టాల్ మళ్ళా పట్టు గురించి ఆలోచించేలా చేసింది. పట్టు ఒక ప్రోటీన్ పోగు, పట్టుపురుగు లాలాజలస్రావం. తనను మార్చుకోవడంకోసం గుడ్డునుంచి వచ్చిన పిల్లపురుగు బాగా ఆకుల్ని తిని, పెరిగి తనచుట్టూ ఈ ప్రోటీన్ స్రావంతో గూడును అల్లుకుంటుంది. అందులో తనను తాను బంధించుకొని రెక్కలు తొడుక్కుటుంది. అందుకు ఏ తపస్సు చేస్తుందోగానీ అంతకుముందు రూపానికి పోలికలేలేకుండా రెక్కలు తెచ్చుకొని తనగూటిని ఛేదించుకొని బయటపడుతుంది. బయటపడ్డాక మళ్ళా తన తోడును వెతుక్కొని సంతతిని వృద్ధిచేసి తనువు చాలిస్తుంది. అయితే పట్టు తయారుచేసేటప్పుడు గూటినుంచి పూర్తిగా శలభం బయటకు రాకముందే వేడినీటిలో వేసి దారాన్ని వడుకుతారు. ఎందుకంటే గూటిని పగలకొట్టుకొని శలభం బయటకువస్తే దారం తెగిపోతుంది. వడకడానికి వీలుకాదు. అందుకనే వేడినీటిలో పట్టుగూళ్ళను ఉడికించి అవిచ్ఛిన్న దారపుపోగుల్ని పేని బట్టను నెయ్యడానికి అనుకూలంగా చేస్తారు. పట్టుకాయల్ని అదే గూళ్లను వేడినీటిలో ఉడికించడం చూడలేము. గూళ్లల్లో సుప్తావస్థలో ఉన్న పట్టుపురుగు వేడినీటిని తాళలేక హాహాకారాలు చేస్తూ ఎగిరి ఎగిరి అర్థనాదాలు చేస్తుంటుంది. తన దుఃఖపుకేకలు బయటకు వినపడకుండా తాను అల్లుకున్న పట్టుపోగులే అడ్డుపడతాయి కావచ్చు. ఒకసారి ఆ దృశ్యం చూస్తే పట్టుబట్టమీదున్న వ్యామోహం పటాపంచలౌతుంది. శతాబ్ధాలుగా పట్టుబట్టను తయారుచేయడానికి ఇంతకన్నా మార్గంలేకపోయింది. ఒక్కచీరనేయడానికి మూడువేలకు పైగా పట్టుగూళ్ళు హననం అవుతాయని లెక్క.
పట్టు మన జేవితంతో పెనవేసుకున్న బంగారు పోగు. అది ఇచ్చే ఆహార్యపు సౌఖ్యం,విలాసం, హుందా మరేదీ ఇవ్వలేదు. పట్టుపురుగు ముందు నిలబడిన రోజు, ఆరాత్రి తన హృదయం చెప్పిన మాటల్ని రూమీ కవిత్వం చేస్తూ అది ఆకాశాల్ని వడుకుతుందని, జనులకు వెచ్చదనాన్ని ఇచ్చేంత ప్రేమను నేస్తుందని రాశాడు( The Silk worm Poem by Rumi). ఎన్ని ఏళ్లు గడిచినా పట్టులాస్యం అలానే ఉందిగానీ పట్టుపురుగు ప్రాణంపోకుండా పట్టువడకడం మాత్రం పట్టుబడలేదు. ఒకనాటి ఈ దేశ ప్రథమమహిళ శ్రీమతి జానకీ వెంకట్రామన్ ఇదే ప్రశ్న అడిగారు. శ్రీమతి జానకీ వెంకట్రామన్ విశిష్టమైన వ్యక్తిత్వం కలవారు. వారు స్త్రీ స్వేచ్చా సమానత్వం కోసం కృషిచేసినవారు, జంతు ప్రేమికురాలు, రచయిత. వారు ప్రఖ్యాత తమిళ కథారచయిత జయమోహన్ రాసిన కాడు నవలను The Forest పేరుతో ఇంగ్లీష్‌లోకి అనువదించారు. ఆ పుస్తకం ఎంతో గొప్పపుస్తకం అని చదివాను కానీ అది నాకు దొరకలేదు. వారు అంతటి సున్నిత మనస్కులు, మానవీయతను కలిగినవారు కనుకనే పట్టుచీరలోని అందంకన్నా దాని తయారీలోని హింసను అధిగమించాలని కోరుకున్నారు. పట్టుపరిశ్రమ శాఖలో పనిచేసే కుసుమరాజయ్య అదే ప్రశ్నకు జవాబును కనుక్కొవాలని సంకల్పించి తన జీతం డబ్బులని మిగుల్చుకొని తాను ఊహించిన విధంగా ఒకపద్దతిని కనిపెట్టాడు. కుసుమరాజయ్యకు వారి శాఖలోని అనుభవాలూ దీనికి దోహదం చేశాయి. మొత్తానికి 1992లో ఆయనపట్టుపురుగును చంపకుండా పట్టుతీసే పద్దతిని వెలుగులోకి తెచ్చాడు. ఇన్నాళ్ళూ ప్రపంచం పట్టించుకోని ఒకానొక విషాద విరాగంనుంచి, బయటపడలేని హృదయఘోషనుంచి ఊపిరి పీల్చుకొనేలా మన తెలుగువాడు దాన్ని సాధించారు. తాను రూపొందించిన పద్దతికి వాణిజ్య హక్కునూ అదే పేటెంట్నూ పొందారు. తాను రూపొందించిన పద్దతికి తన గాంధేయ భావాలకు అనుగుణంగా అహింసా పట్టు అని పేరు పెట్టారు. అహింసాపట్టు ఇప్పుడు అందరికీ అందుబాటులోనే ఉంది. భవిష్యత్తులో మరింత సులువుగా జీవహింస లేకుండా పట్టు ఉత్పత్తి సాధ్యమయ్యే రోజులున్నాయి. రూమీ రాసినట్టు రెక్కలు ఎగరవేసి సహస్రపాదాలతో ప్రపంచాన్ని చుట్టివేయగల పట్టుపురుగొకటి ప్రపంచాన్ని చూస్తుంది. ఆ కల నిజమౌతుంది.
ఏటూరునాగారంలో స్థానికుల ప్రధాన ఆదాయవనరు వ్యవసాయమే. బయట ప్రపంచంతో సంబంధాలు దాదాపు అవసరంలేనంతగా తమతో తాము ముడిపడి ఉన్నారు. కొన్ని వ్యవసాయ ఆధారిత కుటుంబాలు మైదానప్రాంతాలకువచ్చి మిర్చిపంటను పండించడం జరుగుతుంది. మిగిలినదంతా వర్షాధారానికి ఏదో ఒకటి పండించడమే. దగ్గరలో కమలాపూర్ పేపర్ మిల్లు ఉంది. అక్కడపనిచేయడానికి వచ్చి కూడా స్థిరపడినవారు ఉన్నారు. విధులకు కొంతకాలం దూరంగా ఉండడంవల్ల చుట్టుపక్కలఉన్న వాటిని పరిశీలించే అవకాశం తగ్గింది. రెండు నెలలకాలం సెలవుపై వెళ్ళడంతో జరగవల్సిన పనుల్లో కొంత అనిశ్చితి ఏర్పడింది. అయితే సిబ్బంది కొరత ఉన్న శాఖలలో, పెరిగిన పని ఒత్తిడిలో సెలవు పొందడమూ సులువు కాదు, ఇవ్వడమూ సులువు కాదు. మంజూరు అయ్యేదాకా వెళ్ళలేము. అనుమతిలేనిదే తిరిగి విధుల్లో చేరలేము. అనివార్య జాప్యమూ ఎదురవుతుంది. నామటుకు ఎవరైనా సెలవు అడిగితే కొన్ని వివరాలు అడిగి మంజూరుచేయడం అలవాటైంది. వారి అర్జీ చూసినప్పుడు శ్రీయుతులు శ్యామాచరణులు ప్రత్యక్షమై “భగవతి బాబూ మీ కింద పనిచేసే ఉద్యోగి పట్ల మీరు మరీ కఠినంగా ఉన్నారు”అని భగవతీ చరణ్ ఘోష్ తో అన్న మాటలే గుర్తుకువచ్చేవి. భగవతీచరణ్ ఘోష్ , ప్రఖ్యాత యోగి పరమహంస యోగానందగారి తండ్రిగారు. ఆయన ఆనాటి రైల్వే డిపార్ట్మెంట్ లో పెద్ద అధికారి. తనవద్ద పనిచేసే అవినాష్ అనే ఉద్యోగి కాశీ వెళ్ళి తమ గురువుగారు శ్యామాచరణులను దర్శించడానికి వారం రోజులు సెలవు అడుగుతాడు. పని మీద దృష్టి పెట్టమని సూచించి సెలవు తిరస్కరిస్తాడు భగవతీ చరణ్ ఘోష్. అదే వారం అవినాష్, భగవతి చరణ్ ఘోష్ తమ స్వస్థలాలకు వెళ్తుండగా శ్యామాచరణులు మెరుపులా దృశ్యమానమై ఆ మాట అని అదృశ్యామవుతారు. దానితో ఆశ్చర్యపోయిన భగవతీ చరణ్ అవినాష్ తో పాటు కాశీ వెళ్ళి శ్యామాచరణులను దర్శించి తమకు దృశ్యమానమైన వారు, గురువుగారు ఒకరేనని గుర్తించి అపారమైన భక్తితో వారిని సేవిస్తారు. వారి కుమారుడే పరమహంస యోగానంద గారు,విశ్వ విఖ్యాత ఆధ్యాత్మిక పుస్తకం యోగి ఆత్మకథను రాశారు. దానిలో వ్రాసిన విషయమే ఇది.నేను బాగా ప్రభావితం అయిన పుస్తకాలలో అది ఒకటి. ఈ మాట ఎలాగ మనసులో ఇమిడిపోయిందో తెలియదుగానీ ఎవరైనా ఏదైనా విషయం ప్రస్తావిస్తూ సంప్రదిస్తే అప్రయత్నంగా “మరీ అంత కఠినం అవసరం లేదేమో”అని ఒక లోస్వరం వినిపించేది. మన వ్యక్తిత్వం పొడ ఎంతో కొంత లేకుండా పనిచేయలేమోమో అనిపించేది. కొన్నిసార్లు నా ఈ స్వభావం నాకు ఎక్కడలేని తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఇబ్బందిపడ్డ ప్రతిసారీ కాస్త కఠినంగా ఉండాలని అనుకోవడం ఆనక సరేలే అనుకోవడం, బాగా ఉరిమి కురిసిన మేఘంలాగా మెత్తబడి పోవడం, తంటాలు పడడం ఇదీ సర్వీసులో భాగమేనేమో.
వట్టికోట ఆళ్వారుస్వామి తెలంగాణ తొలితరం రచయిత, ఉధ్యమకారులు, సాహితీవేత్త రామప్పరభస అనే కథ రాశారు. రామప్ప నడివయస్కుడు, రాజకీయాలపట్ల అవగాహణ ఉంది. ఊర్లో పదవతరగతి ఫలితాలు వస్తే ఉన్నఫళంగా వార్తాపత్రిక ధరపెంచితే తన స్వంత డబ్బులతో ఉన్న పత్రికలన్నీ కొని అందరికీ పంచుతాడు, ఒక డిస్ప్లే బోర్డుకూడా ఏర్పాటు చేస్తాడు. అయితే అది అతని ఉద్ధేశ్యంలో అందిరికీ రోజులాగే అందుబాటులో ఉన్న ధరలోనే అందించడానికి చేసిన ప్రయత్నం. బస్సు ఎక్కితే ఎక్కీ,దిగే వాళ్ళ లగేజీలు అందిస్తూ సహాయం చేస్తూ ఉంటాడు. అది కండక్టర్‌కి మిగిలిన వాళ్ళకు చిరాకు తెప్పిస్తుంటుంది. అలాగే ఏదో పనిమీదవెళ్తూ దారి మధ్యలో దిగి అదివరకు సారాకొట్టుగా ఉన్న పాకను ప్రభుత్వం పాఠశాలగా మార్చితే అక్కడికి వెళ్ళి చదువు చెప్పలేక పంతుళ్ళు, వెళ్లలేక,వెళ్ళినా నిరుత్సాహంతో ఉన్న విద్యార్థులను ఉద్దరించే ఉద్ధేశ్యంతో ప్రసంగం చేస్తాడు. ఇవన్నీ తనకు సంభంధంలేకున్నా తాను ఊహించుకున్నఆదర్శాలకోసం చేస్తాడు. అతన్ని ప్రవర్తన ఇచ్చే సందేశం ఏమిటని ఆలోచిస్తే మనంచేసేది ఎంత మంచిఉద్దేశ్యంతోనైనా ఎవరికి సమస్య ఉందో వారే చేయవలసినవని తోస్తుంది. మనకున్న ఆలోచనలకన్నాప్రపంచంలోని అన్ని చరరాశులు విభిన్నకోణాల్లో ముందే ఉన్నాయని వాటిని అంచనా వేయకుండా నిర్ణయాలు తీసుకుంటే మన పనులుకూడా రామప్ప పనులలాగే ఉంటాయని అర్థం అయింది, అలాంటివే సెలవులు, ఎదుటివాళ్ళని నమ్మడాలు, దెబ్బతినడాలు. ఏదైతేనేం ఏదైనా ఒకటి జరిగిందంటే అది మనల్ని ఇంతకు ముందున్న స్థితినుంచి ఎంతో కొంత ఉద్దరించే పోతుంది. అది అవసరం కూడా. కాకపోతే ఉద్దరింపబడే సమయంలో సంఘర్షణ ఎదుర్కుంటాం చూడు అదే అదే మనల్ని కుదిపేసే సత్యం.
ఏటూరునాగారంలో చిన్న చిన్న నీటి పాయలకు కొదువలేదని చెప్పాను. అయినా సరే నీటి కొరత ఉన్న ప్రాంతాలూ ఉన్నాయి. చాలామటుకు వర్షాకాలానికి మొదలై ఎండాకాలానికి ముగిసేవే కావడం కారణం. అయితే కొన్ని చోట్లమాత్రం సహజంగా ఎగిసివచ్చే ఆర్టిసియన్ బావులూ ఉన్నాయి. బుగ్గబావులని అంటారు తెలుగులో. అంటే నీటి ఊట దానికదే పైకి ఎగదన్నుకు వస్తుందన్నమాట. గిరిజన అభివృద్ధి శాఖ, భూగర్భ నీటివనరుల శాఖ రెవెన్యూభూముల్లో నీటి సంరక్షణ పనులు, ప్రత్యేకంగా వ్యక్తిగతంగా రైతులకు మేలు చేసే విధంగా సబ్సిడీ ఇచ్చి వ్యవసాయంకోసం బావులు తవ్వుకోవడానికి సహాయం చేస్తుంటాయి. అలా తవ్విన కొన్నిబావులు బుగ్గబావులయ్యాయి. వాటినుంచి నిరంతరం నీరు పారుతుంటుంది. భూమి పొరల్లోని నీటిపీడనం పైకి ఎగదన్ని అలా అవుతుంది. మొన్న కొండాయి వెళ్తున్నప్పుడు చూశాను. అడవిలో ఎక్కడైనా ఇలాంటి ఊటలుండే అవకాశాలున్నాయి. ఎండాకాలంలో వాటిని గుర్తించి కొంచం తవ్వగానే నీటి చెలమలు తయారవుతాయి. నీటి చెలమలు తవ్వడంకూడా ఈకాలం పనే. వన్యప్రాణులకోసం నీటిని అందుబాటులో ఉంచడం కోసం చెలమలు తీస్తారు. అయితే బావులు తవ్వడం ఉండదు కానీ కొత్తగా సోలార్ బోరుబావులు ఏర్పాటుచేయడం ఉంది. సోలార్ బోరుబావులు ఏర్పాటు చేయడమూ ఈ కాలం పనే. ఇవే కాకుండా రాక్ ఫిల్డ్ డామ్స్ అని చిన్న చిన్న రాతికట్టలు వేసి నీటి ఉధృతికి మట్టి కొట్టుకుపోకుండా చేసే పనులూ ఉంటాయి. అడవిలో పని అంటే అడవి అభివృద్ధికి దోహదపడే అన్నింటిని కలుపుకొని పోవడం. సీజన్న్ను బట్టి అటవీఅధికారి పాత్ర మారిపోతుంది. వానాకాలం వ్యవసాయదారుడుగా, ఎండాకాలం సివిల్ ఇంజనీరులాగా పనిచేస్తుంటాడు. మిగిలిన కాలమంతా కావలికారుడు! ఈమధ్య హరితహారం వల్ల గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులుకూడా నర్సరీలు, ప్లాంటేషన్ల పని నేర్చుకొని అటవీశాఖతో పోటీ పడుతున్నారు.
ప్రభుత్వం ఈ ఏడాది పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. అడవులులేని చోట ప్రజలకు అడవులవంటి అనుభూతిని కలిగించడం, పార్కులలాగానో, వ్యాహ్యాళికోసమూ, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత తెలియజేయడం లక్ష్యాలుగా వీటిని ప్రారంభించారు. అయితే దానిని యథాతథంగా రాష్ట్రమంతా అమలుచేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. చిక్కెక్కడ వచ్చిందంటే చాలా గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలకు కావలసిన కనీస పదెకరాల రెవెన్యూభూమి ఒకేచోట అందుబాటులో లేదు. అటువంటి సంధర్భాలలో అటవీ భూమిలో వాటిని ఏర్పాటుచేయాలని సూచించారు.ఈ నిర్ణయం క్షేత్రస్థాయిలోరెండు శాఖలమధ్య విభేధాలకు అవకాశం ఇచ్చింది. ముఖ్యంగా ఏటూరునాగారం అభయారణ్యంలో సమస్య తీవ్రమైంది. పల్లె ప్రకృతి వనాల ఆవశ్యకత అడవి పొడలేని గ్రామాలకు తప్పనిసరి చేసి కనీసం ఐదు కిలోమీటర్ల దూరంలో సహజ అటవీ ప్రాంతం ఉన్న గ్రామాలను మినహాయిస్తే బాగుండెదని నాకనిపించింది. చిక్కని అడవులుండే ఈ ప్రాంతంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం, దానికోసం శాఖలమధ్య సమన్వయంకోసం ఘర్షణ వాతావరణం ఏర్పడడం అవసరం లేదేమో అనిపించింది. కన్నాయిగూడెం వెళ్తున్నప్పుడు అడవిని ఆనుకునే ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతివనంలో అప్పటికే ఉన్న కొన్ని చెట్లను తొలగించి మందార మొక్కలూ మరికొన్ని పూలమొక్కలూ వేశారు. ఆలోచనలు మంచివైనా ఒక్కోసారి కొత్త సమస్యలను, గందరగోళాన్ని సృష్టిస్తాయి. ఎలాగోలా అందరినీ కలుపుకొని అనుకున్న లక్ష్యాలనైతే సాధించాము.
హరితహారంవల్ల ప్రతి గ్రామంలోనూ నర్సరీలు పెంచుకోవడం వర్షాలురాగానే మొక్కలునాటడం ప్రజల్లోకి బాగా వెళ్ళింది. యే గ్రామానికి వెళ్ళినా దారులవెంట నాటిన మొక్కలు కనిపిస్తాయి. వచ్చే వానాకాలానికి కావలసిన మొక్కలను పెంచడం, దానికి తగిన శిక్షణ నివ్వడంకూడా ఇప్పటి నుంచే మొదలవుతుంది. వీటినిర్వహణ, తగిన ప్రణాళికలు వేయడం, సమావేశాలు నిర్వహించడంవంటివి గ్రామీణఅభివృధ్ది సంస్థ, పంచాయితీ రాజ్ శాఖల సమన్వయంతో నిర్వహించవలసి ఉంటుంది. అటవీశాఖ దీనికి నోడల్ ఏజెన్సీగా ఉంది కనుక ఇక ఇప్పటినుంచి ప్లాంటేషన్లు పూర్తయ్యేదాకా పనే ఉంటుంది. మొత్తం ఏడాదిలో ఎక్కువ పనిభారం ఉండేది సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలలు. శిశిర, హేమంతాలు కొద్దిగా ఉపశమనం, అదీ అన్ని అడవులలో కాదు. ఏటూరునాగారంలో పులి ఆనవాళ్ళు దొరికినవి కనుక ఇక్కడ నిరంతరం నిఘాలోనే ఉండాలి. ఇన్ని ఊపరి సలపని పనుల్లో మునిగి ఉన్నవేళ తమ వేళ్ళతో రాధామనోహరులని మనోహరంగా చిత్రించే కళాకారులు అహోబిలం ప్రభాకర్ గారు తమ వ్యక్తిగత పనులనిమిత్తం వెళ్తూ ఏటూరునాగారం రానున్నామని కబురుచేశారు. వారు రాధా మనోహరుల చిత్రానికి పేరుమోశారు. విభిన్న తరహాల్లో గీసిన ఆ చిత్రాలు ఎన్ని భావాలనో పలికిస్తాయి. వారి రాధామనోహరుల మధుర ప్రేమాభినివేశాలలో మనమూ తేలిపోతాం. ఆ చిత్రాలు చూసిన కొత్తల్లో నీలరాగం పేరుతో కొన్ని కవితలు రాశానంటే అది ఆ చిత్రంలోని భావనలు తప్ప మరొకటి కాదు. వారు నా మొదటి కవితా సంకలనం నిక్వణ లో బొమ్మలు వేశారు. అవి నిజంగా చిత్రకవితలు.
అహోబిలం ప్రభాకర్ గారికి ఏటూరునాగారం కలపడిపో చూపించి, అక్కడనుంచి తాడ్వాయిలోని పర్యావరణ విద్యామందిరానికి వెళ్ళాము. వారు అక్కడికక్కడే రహదారిమీద కూర్చొన్న ఒక స్త్రీ బొమ్మ వేసి మన అధికారులకు కానుక చేశారు. ఇవే విద్యామందిరంలో అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. అటవీశాఖ కార్యక్రమాలు కొన్ని తెలుసుకొని సంతోషించారు. అనేకవిధాలుగా మైదానమందిరాల శిల్పాలలో దర్శనమిచ్చే రాయగజకేసరి, గోండుల, కోయల ఇంటిగోడలపై ఉండడం గురించి మాట్లాడుకున్నప్పుడు కొంతకాలమైనా గిరిజనులతో కలిసి నివసిస్తేగానీ వారి అసలు కళాకౌశలాన్ని కనుగొనడం, వాటి అంతరార్థం బోధపడబోదని అన్నారు. భవిష్యత్తులో అందుకు ప్రణాళిక వేసుకోవలసి ఉందని అనుకున్నాం. రాయగజకేసరి అంటే ఏనుగును లంఘించే సింహం. ఆ శిల్పం స్థంభాలుగానో, విడిగానో అనేకచోట్ల కనిపిస్తుంది. అయితే గిరిజనులు శిల్పాలకన్నా కొయ్యలుగానో, బట్టమీదనో, గోడలమీదనో అదే చిత్రాన్ని వేయడం కొన్ని చోట్ల చూశాను. ఏటూరునాగారంలో అలాంటి చిత్రాలు కనబడలేదు. అయితే దానికి సంబంధించిన వివరాలను ఆయా గిరిజనులనుంచే వినవలసి ఉంటుంది. అప్పుడే అది సరైన సమాచారం ఇవ్వగలుగుతుంది. అడవికివచ్చిన అనుకోని అతిధిని సాగనంపి నీలరాగంలోని పాత కవితలు కొన్ని చదువుకున్నాను. మరో రెండు రాసుకున్నాను. నీలరాగం అంటే ప్రేమాస్పదమని అర్థం. రాత్రిముగిసిన వేళని నీలరాగంగా మార్చివేసే చంద్రుడు, జయదేవుని అష్టపదుల శ్రీ కృష్ణుడి వలెనే ఎన్ని జీవరాసులకో ప్రేమాస్పదుడౌతాడు. అందులో, ఆ నీలావరణపు లోగిలిలో మనం బతకనిస్తే బంగారుపోగులను స్రవించిన పట్టుపురుగూ ఉంటుంది, మనం ఇచ్చే నూలుపోగును అందుకోవడానికి చంద్రుడూ సిద్ధంగా ఉంటాడు.
-దేవనపల్లి వీణావాణి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
అరణ్యం 2 – బంగారుపోగులు – దేవనపల్లి వీణావాణి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>