అరణ్యం 2 -శాక – దేవనపల్లి వీణావాణి
రాత్రి భారీగా కురిసిన వర్షానికి పొద్దునకల్లా పైమట్టి కొట్టుకుపోయి చిన్నకాలువలు కట్టింది. నేనున్న చోటు పాత ఒకేగది, చిన్నవంటగది,అంతకన్నా చిన్నహాలుతోఉన్న డాబా. ఇంతకుముందు బీటుఅధికారి వసతిగృహంగా ఉండేది. పాడైపోయింది. ఇంకేఅధికారిక వసతిగృహం లేనందున అదే నావిడదదైంది. అన్నీ పాతవే. ఒక గ్యాస్ స్టవ్, రెండు మూడు గిన్నెలు , కొంచం అంటే నా ఒక్కదానికే సరిపడే వంట సామానుతో వచ్చాను. రాత్రి వర్షానికి కరంటు వస్తూ పోతూ ఉంది. కరెంటు పోయినప్పుడు ఫాన్ శబ్దం ఆగిపోతే బయటనుంచి భయంకరమైన శబ్దం. అది కప్పలు, కీచురాళ్ళది. విడదిలో తలుపులు సరిగ్గా లేవు. వెనకాల తలుపు ఏదో నాసిరకం కార్డ్ బోర్డుతో చేశారు. తేమకు ఉబ్బి పూర్తిగా పట్టలేదు. తలుపుకి , గడపకి మధ్య ఖాళీ ఉంది. పాములు, తేళ్ళు వచ్చే ప్రమాదం ఉంది. విడది వెనుక అంతా అడవే. గోనె పట్టాతో ఆ ఖాళీని మూసాను కానీ పూర్తిగా తలుపు మూయలేకపోయాను. వంటగదిలో ఉన్న కిటికీ జాలీకూడా ఓ మూల చిరిగిపోయింది. రోజూ ఎలుకలు వస్తున్నాయని చున్నీ పాతది చూసి ప్రస్తుతానికి చూద్దాం అన్నట్టు కట్టాను.ముందుఉన్న తలుపు పరిస్థితి కూడా అంతే. నా వద్ద బ్యాటరీ లైట్ ఉంది.దాని సహాయంతో పొద్దున వండుకున్నదే తిన్నాను. చీకటిలో, భయంకరమైన రొదలో నేనొక్కదాన్నే ఉన్నాను. మొత్తంచీకటే, చిమ్మచీకటి. ఎడతెరిపిలేని వాన. దూరంగా ఏటూరునాగారం అంతా తడిసి ముద్దై ఉండవచ్చు. మా కార్యాలయానికి ఆవల తాడ్వాయివరకు ఇల్లు లేవు, మరోపక్క నాగారం వరకూ రెండు మూడు కిలోమీటర్ల వరకు జనసంచారం ఉండదు.అనుకోనిదేదైనా జరిగితే సెల్‌ఫోన్, ముందరఉన్న చెక్‌పోస్టు సిబ్బంది మాత్రం అందుబాటులో ఉంటారు. ఈ భారీవానకు మొక్కలన్నీ బతుకుతాయి. ఎండలకు అల్లాడిన జీవాలన్నీ సేద తీరుతాయి. నాకుకూడా అన్నాళ్ళ ఎండలని ఒక్కరోజు చలి వాతావరణం మరపించినట్టు అనిపించింది.
చుట్టూ ఉన్న నిశ్శబ్దంలో వాన శబ్దం, కప్పల అరుపులతో దద్దరిల్లిపోతుంది. పైన గూడు ఉన్నట్టే కానీ నేనున్నది అడవికి ఏమీ తక్కువ కాదు. తడిమరకలు కనిపిస్తున్నగోడ, సగం మూసిన తలుపూ,కిటికీ, భయంకరంగా శబ్దం ! బాటరీ లైట్ తీస్తే ఇంకేమీ కనిపించదు. ఇంట్లోకి పాములు దూరేందుకు కావాలిసినన్ని సందులు ఉన్నాయి. తలుపు గోనెపట్టాతో బిగించినా ఈ సందులమీద అనుమానమైతే ఉంది. పాతడ్రస్ తప్ప మరో గుడ్డలేదు. ఉన్నదాన్నే చించి అనుమానం ఉన్న ప్రతీ సందులో గుడ్డముక్క దూర్చి పెట్టాను. ఈపని, చీకటిలో ఏదీ కనిపించి అవకాశం లేదు మనమే జాగ్రత్తగా ఉండాలనే లోలోపలి ప్రభోదానికి కార్యానువాదం.
ఇంతకుముందు చెట్లమధ్య చీకటిలో చాలాసార్లు ఉన్నాను,కానీ ఒంటరిగాలేను.ఈరోజు ఒంటరిగా అడవిలో ఉన్నట్టు అనిపించింది.భయం వేయలేదుకానీ అసౌకర్యంగా ఉందనిపించింది. ఈ రాత్రి గడిచి పోతేగానీ ఏమీ చేయలేము. బాటరీ లైటు చదువుకోవడానికి సరిపోదు. సెల్ఫోన్లో కాలాన్ని హరిస్తే ఛార్జింగ్ అయిపోయి యే సమాచారమూ తెలియకుండా పోతుంది. ఇదో సందర్భం అంతే. బయటనుంచి యేఒత్తిడి లేకుండా ఏదీ చేయలేనట్టే తప్పనిసరైతే తప్ప నిమిషం ఆగి ఆలోచించేలా లేదు. ఉన్నచోట కూర్చొని ముందుకుచూసినా వెనక్కిచూసినా ఒకేలాంటి చీకటి. ఆమాటకొస్తే భూమికూడా అంతే ఎక్కడివారు అక్కడ తాము నిలబడి ఉన్నామని తమ పైన ఆకాశం ఉందనీ అనుకుంటారు , కానీ విశ్వం లో మనం యేవైపు ఉన్నామో మనకు ఎలా తెలుస్తుంది! కిందకో,పైకొ.ఇదీ అలాంటిదే. బాటరీలైటు తక్కువ చేసి విశ్రాంతిలోకి వెళ్లడమే మిగిలింది.
ప్రస్తుతం నావద్ద కొన్ని పురాణాలు, విదేశీయులు రాసిన మరికొన్ని ఇంగ్లీషు పుస్తకాలు ఉన్నాయి. జార్జ్ పి అండర్సన్ , ఏనుగులమీద రాసిన Thirteen Years among the wild beasts of India, రేచల్ కార్సన్ రాసిన Silent Spring చాలా ప్రసిద్దిపొందిన పుస్తకాలు. విలియంకెరీ అనువదించిన రామాయణం కూడా ఉంది. ఏటూరునాగరంలో ఏనుగులు లేవు. ఏనుగులు ఇక్కడ లేకపోవడానికి బహుశా ఇక్కడ కేవలం టేకువృక్షాలతో నిండిన అడవి ఉండడం కారణం కావచ్చు. గోదావరి తీరప్రాంతాల్లో పులులు ఎక్కువగా కనిపిస్తాయి, కానీ ఏనుగులు కనిపించవు. కృష్ణ,కావేరీతీరాల్లోమాత్రం పులులతోపాటు ఏనుగులూ విరివిగా కనిపిస్తాయి. జార్జ్ పి అండర్సన్ ఏనుగుల రారాజుగా పిలవబడ్డాడు. అతనుకూడా కుక్కలను తనవేటలో భాగస్వామ్యం చేసుకున్నాడు.ఆయన పుస్తకం చదవడం ఇంకా మొదలుపెట్టలేదు. నిన్నరాత్రికి విలియం కారీ అనువదించిన రామాయణం సగంలో ఉన్నాను. ఈ రోజురాత్రికి ఇంకొంత పూర్తిచేయగలనని అనుకున్నాను కానీ చేయలేను.
తెలుగులో సిపిబ్రౌన్ లాగానే అనేకమంది విదేశీయులు శాస్త్రసాంకేతిక రంగాలలో ఎనలేని సేవచేశారు. వృక్ష శాస్త్రంలో అయితే జాతులవర్గీకరణలో బెంథామ్ అండ్ హూకర్,సర్వే ఆఫ్ ఇండియాకోసం భారత భూభాగపు సర్వే మ్యాపులు రూపొందించడంలో జేమ్స్ రెన్నెల్ అలాగే అటవీజాతులవివరాల్లో ఇండియన్ ట్రీస్ పేరుతో డైట్రిచ్ బ్రాండిస్ వంటివారు చేసిన కృషి చాలావిశేషమైందనీ ఒప్పుకొని తీరవల్సిందే. నూటాయాభై ఏళ్లక్రితంఉన్న పరిమితపరిస్థితుల్లో వారిప్రధాన బాధ్యతలనుంచి విడిగాపనిపెట్టుకొని ఈపనుల్ని చేసిపెట్టారు.అందులో ఆసక్తికలిగించిన కొన్నిపుస్తకాలు సేకరించి తెచ్చుకున్నాను. విలియం కెరీ అనువదించిన రామాయణం అలాటి సేకరణనే.
ఏటూరునాగరంనుంచి గోదావరి పైవైపు ఆదిలాబాద్,కిందకు ఖమ్మంఅంతా మహాటేకువృక్షాలు ఉండేవి. టేకు అన్న పేరు పోర్చుగీస్ టెకానుంచి టేకుగామారింది. అసలుపేరు ద్వారదారు అంటే దర్వాజాలకు వాడుకునే కలప అనిఅర్థం. ప్రపంచంలోనే జీవించిఉన్న పెద్దటేకుచెట్టు కేరళలో పెరంబికుళం టైగర్ రిజర్వ్‌లో రికార్డు చేశారు. భారతప్రభుత్వం ఆచెట్టును మహావృక్షమని ప్రకటించింది. సంరక్షణచర్యలు తీసుకోవాలని సూచించింది. దానివయసు 115ఏళ్లు! కేరళలో ఆచెట్టును కన్నెమర అంటారు. ఏటూరునాగారం అడవిలోకూడా పెద్దటేకుచెట్టు ఎక్కడఉందో కనిపెట్టి దానికి ప్రత్యేకగుర్తింపు తెస్తే బాగుండునని అనిపించింది. టేకుకలపసేకరణలో బ్రిటిష్ వారికన్న స్వతంత్రంతర్వాతనే ఎక్కువ నరికివేతలు జరిగి ఉంటాయని నా నమ్మకం. ఎందుకంటే అన్నీ అక్రమనరుకుల్లే, వీటికి లెక్కలుకూడా లేవు.కాబట్టి పాతచెట్టు దొరకడం కష్టంకావచ్చు. ఒకప్పుడు విత్తనం సేకరించడానికి ప్లస్ ట్రీస్ అని ఎర్ర రంగుగుర్తు పెట్టి బలిష్టమైన చెట్లను విత్తనంకోసం కాపాడేవారు. ఇప్పుడు వాటినికూడా కాపాడుకోలేకపోయాము. ఈ వానాకాలం అట్లాంటి చెట్లను వెతకడం వీలుకాకపోవచ్చు గానీ తర్వాత ఋతువుల్లో కొంత సులభమే. కొన్నిటికి రాత్రి ఒక్కటే చీకటికాదు ముందుదారి కనపడకపోతేకూడా చీకటే. చుట్టూచీకటిఉన్నా ఎంతో కొంత ప్రయత్నం అయితే చేయాలి.
ఒకప్పుడు ప్రభుత్వమే పెద్దచెట్లను నరికి అవసరాలకు వాడుకునేది, డిపోలో అమ్మకానికి పెట్టేది. ప్రభుత్వ కార్యాలయాల్లో, బడుల్లో బెంచీలు,కుర్చీలు ఇతర ఫర్నీచర్ ప్రభుత్వకలప కార్ఖానాలోనే ,వివిధ శాఖలనుంచి వచ్చిన ఆర్డర్లను బట్టి తయారుచేసి సరఫరా చేసేవారు. మన తెలంగాణలో నిర్మల్‌లో అలాంటి కార్కాన ఉండేది. ఇప్పుడు నేను ఉన్న విడదిలోని పాత టేబల్ ఆ కార్కానలో తయారైందే. కొంచం పోలిష్ చేస్తే సరిపోతుంది. ఫారెస్ట్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ భవనం,డెహ్రాడూన్‌లో గొప్పకట్టడం. విశాలమైనస్థలంలో అద్భుతమైన ఇంజనీరింగ్ పనితనంతో కళ్ళను కట్టిపడేసేంత సుందరమైనది. అక్కడ ఇంకొన్ని భవనాలు కూడా ఉంటాయి. స్వతంత్రం పూర్వం నుంచి అటవీశిక్షణకేంద్రాలుగా ఉన్నాయి. అక్కడి ప్రదర్శనశాలలో నరికిన పెద్దటేకుచెట్టు ప్రదర్శనకు ఉంచారు. అలాటివే నరికిన పెద్ద టేకుదుంగను వరంగల్ సర్కిల్ ఆఫీస్‌లోనూ, పసరా గెస్టుహౌస్లోనూ ప్రదర్శనకు పెట్టారు. ఫారెస్టు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భవనానికి వెళ్ళే పెద్దరోడ్డుకు బ్రాండిస్ రోడ్డు అని పేరు. ఎల్లప్పుడూ మూసి ఉంటుంది. స్నాతకోత్సవాలవంటి పెద్ద పెద్ద కార్యక్రమాలప్పుడు మాత్రమే దాన్నితెరుస్తారు. బ్రాండిస్ ను భారతదేశానికి శాస్త్రీయఅటవీవిధానం పరిచయం చేసినవాడిగా అటవీశాస్త్ర పిత(Father of Indian Forestry)గా గుర్తిస్తారు. అదీగాక ప్రపంచంలోనే ఫాదర్ ఆఫ్ ట్రాపికల్ ఫారెస్ట్రి గా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. ట్రాపికల్ ఫారెస్ట్రి అంటే ఉష్ణమండలఅడవుల అధ్యయనం అన్నమాట. ఆయన ప్లాంట్ కెమిస్ట్రీలో డాక్టోరేట్ తీసుకున్నాడు. అస్ట్రానమి, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రంవంటి వాటిలలో ఆసక్తి పెంచుకొని విస్తృత అధ్యయనం చేశాడు. భారతదేశానికి రాకముందు ప్రసిద్ద బాన్ విశ్వ విద్యాలయంలో గౌరవ ఉపన్యాసకుడిగా ఉన్నాడు. ఇండియన్ ట్రీస్ అన్నది ఈయన విలువైన సేవ. అలాగే భారతదేశంలో అటవీశాఖ ప్రగతి గురించి, ప్రస్థానం గురించి, విభిన్న జాతుల గురించి పుస్తకాలు రాశాడు. ఆయన జర్మన్ వాడు. ఆధునిక అటవీశాస్త్ర విధానం జర్మనీవల్లనే పేరుపొందింది. జర్మనీనుంచి ఈస్ట్ ఇండియా కంపనీద్వారా మనదేశానికి వచ్చాడు. భారతదేశంలో ఆయన ప్రస్థానం 1855నుంచి1883వరకు అంటే ఈస్ట్ ఇండియా కంపనీ పాలనలోనూ బ్రిటిష్ పరిపాలనలోనూ పనిచేశాడు.మొట్టమొదటి అటవీచట్టం ఈయన ఆధ్వర్యంలోనే వచ్చింది, అలాగే అటవీనిర్వహణాప్రణాళికలు, ఇతర అటవీ సంబంధిత పరిపాలనాఅంశాలలో ఆయన పాత్ర ఉంది.
బ్రాండిస్ రాసిన ఇండియన్ ట్రీస్ దాదాపు అన్ని వృక్షజాతుల్ని పేర్కొంటుంది. ఆయన కోరుకున్నట్టుగా ఆ పుస్తకాన్ని(1906) ప్రచురించాకనే మరణించాడు(1907). అది ఆయన జీవితకాలపు కృషి అన్నమాట. ఇదే కాక ఫారెస్ట్ ఫ్లోర ఆఫ్ ఇండియా, ది ఫారెస్ట్ ఫ్లోర ఆఫ్ నార్త్ వెస్ట్ అండ్ సెంట్రల్ ఇండియా వంటి పుస్తకాలు ప్రచురించాడు.
బ్రాండిస్ భారతదేశానికి రావడానికి ఆయన భార్య కారణం. ఆమె పేరు రాచల్ మార్ష్ మన్.ఎస్ ఎస్ నెగి తన పుస్తకం సర్ డైట్రిచ్ బ్రాండిస్ లో రాచెల్ మార్ష్ మన్ , డి డి జాషువా మార్ష్ మన్ యొక్క ఏకైక కుమార్తె అని రాశాడు, కానీ కాదు. డి డి జాషువా మార్ష్ మన్ కు మరో కుమార్తె కూడా ఉంది. ఆమె పేరు హన్నాషెఫర్డ్ , ఆమె సర్ హెన్రీ హ్యావ్లాక్ భార్య. డి డి జాషువా మార్ష్ మన్ కొడుకు జాన్ క్లార్క్ మార్ష్ మన్, తన బావగారైన సర్ హెన్రీ హ్యావ్లాక్ మీద Memoirs, Major General Sir Henry Havlock అని 1860లో పుస్తకం వేశాడు. అందులో ఈ విషయాన్ని పేర్కొంటూ 1829 ఫిబ్రవరి 9 న వారి వివాహం జరిగిందని (Pg 32)రాశాడు.
బ్రాండిస్ కుటుంబంగురించి ఇంత ఆసక్తి అవసరంలేదు కానీ కలిగింది. ఎందుకంటే వారి కుంటుంబీకులతో భారతదేశ చరిత్రకు ఉన్న సంభంధం అలాంటిది. భారతదేశపు సుసంపన్నమైన వనరులు ఎన్ని శతాబ్ధాలుగా ఎంతమందిని ఆకర్షించలేదని ! ఈదేశీయుల పోరాటం ఒక్కనాటిది కాదు, longest genocide in the human history అన్నది అసత్యం కాదు ! బ్రాండిస్ జీవితానికి సంబంధించిన లోలోతులకు వెళ్ళినా కొద్దీ ఎంతోమంది తారస పడ్డారు. చాలా పుస్తకాలు సేకరించవల్సి వచ్చింది. బడిలో చరిత్ర పుస్తకాలలోలేని విలువైన(చెప్పని) విషయాలు ఎదురుపడ్డాయి. ఇప్పుడు మనకు మిగిలింది కొంతలోకొంత మంచి ఏంటంటే శాస్త్రీయ అధ్యయన సంభంధ అంశాల్లో వారు మిగిల్చివెళ్ళిన కృషి, దేశీయులందరిలో మనమంతా ఒక దేశంగా మనగలిగి ఉండాలన్న తపనను రగల్చడం.
అప్పట్లో సీరాంపూర్ త్రయం (The Serampur Trio) అని పేరు తెచ్చుకున్న ముగ్గురు వ్యక్తులు విలియం కారీ, విలియం వార్డ్ ఇంకా జాషువా మార్ష్ మన్ పశ్చిమ బెంగాల్‌లోని సీరాంపూర్ కేంద్రంగా మిషనరీ కార్యక్రమాలలో చురుగ్గా పనిచేసారు. అప్పట్లో సీరాంపూర్ డానిష్ కాలనీగా ఉండేది. బ్రిటిష్వారికన్నా ముందు డానీష్ ఈస్ట్ ఇండియా కంపనీ పాలన ఉండేది. వీరిలో విలియ కారీ (1761-1834) మనదేశంలో మొట్టమొదటి బాప్టిస్ట్ మిషనరీని సీరాంపూర్ మిషన్ పేరుతో మొదలుపెట్టి బైబిల్ని వివిద దేశీభాషలలొకి అనువదించాడు. రామాయణాన్ని ఇంగ్లీష్ లోకి అనువదించాడు. విలియ కారీ డానిష్ కంపనీ తరఫున పనిచేశాడు. భారతదేశానికి వచ్చాక దేశీ భాషలను పట్టుబట్టి నేర్చుకున్నాడు.ఇంకా విశేషంగా తెలుగు వ్యాకరణాన్ని నేర్చుకోవడమే కాకుండా ఎ గ్రామర్ ఆఫ్ ది తెలింగ లాంగ్వేజ్ (1814) అనే పుస్తకం వేశాడు. భారతదేశ వృక్ష శాస్త్ర పితమహుడని పేరుపడ్డ విలియం రాక్స్ బర్గ్ తో కలిసి Flora indica, or Descriptions of Indian Plants (1832) అనే పేరుతో భారతీయ వృక్షజాతుల వివరాలు తెలిపే పుస్తకం వేశాడు. మనదేశంలో విదేశీయుల చేత స్థాపించబడిన మొట్టమొదటి విశ్వవిద్యాలయం సీరాంపూర్ కాలేజీ విలియం కారీ ద్వారానే జరిగింది. ఒకవైపు మత ప్రచారం, బైబిల్ అనువాదాలు, ఇంకోవైపు అప్పటికి జనాలలో పేరున్న రాజా రామ్మోహన్ రాయ్ వంటివారితో సంభందాలు కలిగి స్థానిక ప్రజలలో క్రైస్థవమత సానుకూలతను సాధించడంలో నిమగ్నమయ్యాడు. సీరాంపూర్ పేపర్ మిల్ ను(1812) స్థాపించింది కూడా ఇతనే, అదే భారతదేశంలోని మొదటి పేపర్ మిల్లు.
సీరాంపూర్ త్రయంలో రెండవ వ్యక్తి జాషువా మార్ష్ మన్(1768-1837). మిషనరీ వ్యాపకాలలో ఉన్నాడు, భార్యతో కలిసి బోర్డింగ్ స్కూల్ తెరిచాడు. సీరాంపూర్ కాలేజీ స్థాపనలో, విలియం వార్డ్తో కలిసి ప్రింటింగ్ ప్రెస్ నిర్వహించడంలోనూ ఉన్నాడు. ఇతనికి ఉన్న పన్నెండు మంది పిల్లలలో పెద్దవాడు జాన్ క్లార్క్ మార్ష్ మన్ , విలియం వార్ద్ స్థాపించిన ప్రింటింగ్ ప్రెస్ తో చాలా అనుభందం కలిగి ఉన్నాడు. మనం ఇప్పుడు చెప్పుకుంటున్న హెన్రీ హ్యావ్లాక్, డైట్రిచ్ బ్రాండిస్ లకు మన భాషలో బావమరిది అన్నమాట. ఇతను తండ్రితో కలిసి బెంగాలీలో దిగ్దర్శన్ అనే మాస పత్రికనూ, సమాచార్ దర్పన్ అనే వార పత్రికను ప్రారంభిచాడు. తన బావగారైన హెన్రీ హ్యావ్లాక్ మీద Memoirs, Major General Sir Henry Havlock అనే పుస్తకాన్ని వేశాడని ముందు చెప్పాను. ఇతను The history of India, from the earliest period to the close of Lord Dalhousie’s Administration అనే పుస్తకాన్ని ,ఇంకా అనేక పుస్తకాలను వేశాడు.
సీరాంపూర్ త్రయంలో మూడవవ్యక్తి విలియంవార్డ్(1769-1823). మనదేశంలో మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ స్థాపించింది ఇతనే. వార్డ్ ఆధ్వర్యంలో సీరాంపూర్ ప్రెస్ అనేక పుస్తకాలను ప్రచురించింది. పైన చెప్పిన పుస్తకాలలో దాదాపు అన్నీ సీరాంపూర్ ప్రెస్‌నుంచి ప్రచురితమైనవే. ఇతనుకూడా మిషనరీపనుల్లో నిమగ్నమై అనేక పుస్తకాలను ప్రచురించాడు. హిందువుల మత,ఆచారాలమీద పుస్తకంవేశాడు. దేశంలోని మొట్టమొదటి బాప్తిష్టు కృష్ణపాల్ గురించి అతను కులవ్యవస్థను అధిగమించాడని ప్రస్తావిస్తూ అదే పేరుమీద పుస్తకంవేశాడు. భారతీయుల మతమార్పిడికి కులాన్ని వాడుకోవచ్చుననే భావన కల్పించిందీ ఇతనే. ఇట్లా సీరాంపూర్ త్రయం మిషనరీ కార్యకలాపాలకోసం విస్తృతంగా పనిచేశారు, కొత్తవ్యవస్థలని నిర్మించారు. వీరికి దేశంలోఉన్న ప్రధాన రాజకీయ నాయకులతోనూ బ్రిటిష్ నాయకత్వంతోనూ వివిధదేశాల కంపనీ కార్య నిర్వాహకులతోనూ సంబంధాలు ఉండేవి. అలాగ హెన్రీ హ్యావ్లాక్ తో కూడా సంబంధం ఉంది.
హెన్రీ హ్యావ్లాక్ ఎవరోకాదు మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో(1857) నానా సాహెబ్ చేతికి చిక్కిన కాన్పూర్ను తిరిగి స్వాదీనంచేసుకున్న బ్రిటిష్ మేజర్ జనరల్.అదే యేడు నవంబర్‌లో మరణిస్తాడు. ఇతనికి సీరాంపూర్ మిషనరీవల్ల పరిచయం, జాన్ క్లార్క్ మార్ష్‌మన్ చెల్లెలితో వివాహంవల్ల బంధుత్వం ఏర్పడ్డాయి. తన బావమరిదైన జాన్ క్లార్క్ మార్ష్‌మన్, హెన్రీ హ్యావ్లాక్ కాన్పూర్ విజయంగురించి ఏం రాసి ఉంటాడో అని Memoirs, Major General Sir Henry Havlock ను సేకరించాను. తన బావగారైన హెన్రీ హ్యావ్లాక్ వివరాలు, రాసిన ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలతోకలిపి నాలుగు వందల అరవై రెండు పేజీల పుస్తకం రాశాడు! అందులో సగానికిసగం ఒక్క1857సంవత్సరం సంఘటనలతోనే ఉంటుంది. హెన్రీ హ్యావ్లాక్ బర్మా,ఆఫ్గన్ యుద్దాలలో పాల్గొని ఈస్ట్ ఇండియా అధికారాన్ని పెంచేందుకు పనిచేసాడు. ఆ అనుభవాలే కాన్పూర్ ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇతన్ని నియమించడానికి కారణం.
బ్రిటిష్ ప్రభుత్వం 1824-26లో బర్మా స్వాధీనంకోసంచేసిన యుద్దంలో హెన్రీ హ్యావ్లాక్ పాత్ర ఏమిటో చెప్పడంతోనే ఈ పుస్తకం ప్రారంభం అవుతుంది. అయితే 1824లోజరిగిన భారతీయుల మొదటి సిపాయి తిరుగుబాటుగురించిన ప్రస్థావన రాకుండా ముగించాడు రచయిత. కేవలం రెండుచోట్ల దీనిగురించి ప్రస్థావిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం 1824లో జరిగిన సిపాయి తిరుగుబాటును మొగ్గలోనే త్రుంచివేసిందనికానీ ప్రస్తుతం 1857 తిరుగుబాటు మొత్తం ఆర్మీఅంతటా వ్యాపిస్తోందనీ ఒక చోట, మరోచోట 47పదాతిదళం బర్మావెళ్ళడానికి నిరాకరిస్తే ఎడ్వర్డ్ పగేట్ అణచివేశాడనీ పేర్కొంటాడు. నిజానికి భారతదేశ ప్రథమ స్వతంత్ర సంగ్రామం 1824 సిపాయి తిరుగుబాటుతోనే మొదలైందని చెప్పాలి. 47వ పదాతిదళం బారక్పూర్ (పశ్చిమ బెంగాల్)నుంచి బర్మావెళ్ళి బ్రిటిష్ వారి తరఫున యుద్దంచేయాలన్న బ్రిటీష్ సంకల్పానికి వ్యతిరేకంగా సముద్రం దాటడం పట్ల కాలాపానీవంటి స్థానికఆచారాలను అధిగమించడం తాము చేయలేమని భావించిన సిపాయిలు తిరుగుబాటు చేశారు. బిందీ తివారీ నాయకుడుగా బ్రిటీష్ ఆజ్ఞలను తిరస్కరించారు. అయితే ఇది దారుణంగా అణిచివేయబడింది. తిరుగుబాటు చేసిన సిపాయిలు దాదాపు రెండువందలమందిని కాల్చిచంపారు, బిందీతివారీని ఉరితీసి మర్రిచెట్టుకు కుళ్లిపోయేదాక వేలాడదీశారు. తమ స్వాభిమానాన్ని కాపాడుకోవడానికిచేసిన ఈ సిపాయి తిరగుబాటును 1857సిపాయి తిరుగుబాటుకు డ్రస్ రీహార్సల్ గా పేర్కొంటారు.అయితే ఈ పుస్తకం అంతా హెన్రీ హ్యావ్లాక్ భావాలు, విజయాలుచెప్తూ భారతీయల స్వాభిమానాన్ని ప్రకటించిన అంశాలు రాకుండా చూశాడు. బిందీతివారీ గురించే కాదు ఒక్కచోటకూడా ఝాన్సీగురించిగానీ,రాణి లక్ష్మీబాయిగురించిగానీ, బ్రిటిష్ పాలసీగురించిగానీ ప్రస్థావన రాకుండా జాగ్రత్తపడ్డాడు. వివిధలేఖల్లోని భాగాలను యథాతథంగా దించాడు. ప్లాసీయుద్దంతర్వాత భారతభూభాగంమీద సార్వభౌమత్వం సాధిచడానికి సిపాయి తిరుగుబాటు ఒక అద్భుతమైన సంఘటన అనీ, ఆసియామీద యూరోప్ ఆధిపత్యాన్ని స్థిరపరచిందనీ రాశాడు. పంజాబ్‌లో సిక్కుల తిరుగుబాటును అణిచివేసి అప్పటివరకు పంజాబ్ అధీనంలోఉన్న కాశ్మీర్‌ను గులాబ్ సింగ్ అధీనంలోకి తెచ్చిన ఒప్పంద విశేషాలు రాసే క్రమంలో సిక్కు సర్దార్లను పేర్కొన్న వివరాలు హేయమైనవి. సిక్కు సర్దార్ రాజా లాల్ సింగ్ స్పోటకపు మచ్చలని ఎగతాళి చేస్తూ ఇంగ్లాండులో ఇలాంటి వారిని వికారమైన కుక్క అంటామని, మరో సర్దార్ రంజుర్ సింగ్ గాడిదలా ఉంటాడని హావ్యాలాక్ రాసిన లేఖల్లోని వ్యాఖ్యలను పుస్తకంలో ప్రచురించడానికి ఏమాత్రం సంకోచించలేదని అర్థం చేసుకోవచ్చు.భారతీయలవంటి పాక్షిక నాగరికులను పరిపాలించడంలో నాగరికులైన మనకు అంటే యూరోపియన్లకు ఈ శ్రమ తప్పదని పేర్కొంటాడు రచయిత.
కాన్పూర్ స్వాదీనం గురించి Memoirs, Major General Sir Henry Havlockలో ఒక్క 1857 గురించే 250 పేజీలు కేటాయించిన రచయిత, జాన్ క్లార్క్ మార్ష్‌మన్ తన The history of India, from the earliest period to the close of Lord Dalhousie’s Administration లో ఏం రాసి ఉంటాడని దాన్నీ సేకరించి వెనక్కీ ముందుకు తరచి తరచి చూశాను. ఈ పుస్తకంలోనూ మాటవరసకైనా ఒక్కచోటకూడా ఝాన్సీరాణి లక్ష్మీబాయి అన్నపేరు పేర్కొనబడలేదు! ఆయన ఝాన్సీరాణి గురించి చెప్పవలసిన సంధర్భంలో “Three years afterwards, on the outbreak of the mutiny and the extinction of British authority in the north-west, the ranee took a fearful revenge for her disappointment, and put to death every European man, woman, and child she could seize” అన్నమాటతో ముగించాడు. మిషనరీల ఉద్ధేశ్యాలు, పరాయిపాలననుంచి ఇంతకన్నా గొప్పగాఏమీ ఊహించలేము కానీ ఇటువంటి భావజాలాన్ని బాహాటంగానే ప్రకటించినా సరే వీరితోనే ఆత్మీయసభను నిర్వహించిన రాజారాం మోహన్‌రాయ్ వంటివారు వారి అనుచరులు చరిత్రను మరుగుపరచిన, తప్పుదోవ పట్టించిన అంశాలను ఉపేక్షించడాన్నిమాత్రం సహించలేము. ఇంకా చూస్తే కాన్పూర్ స్వాదీనం అయ్యాక అదేయేడు హెన్రీ హ్యావ్లాక్ మరణించాడు, అతని జ్ఞాపకార్థం లక్నోలో సమాధి వెలసింది, లండన్ లో ట్రాఫల్గార్ కూడలిలో (Trafalgar Square) విగ్రహం నెలకొల్పబడింది. అండమాన్ దీవుల్లో ఒకదానికి హ్యావ్లాక్ ద్వీపమని పేరు పెట్టబడింది. విచిత్రంగా భారత ప్రభుతకన్నా ప్రజలే బిందీతివారీకి గుడికట్టి, తమ పిల్లలకు ఝాన్సీ అని పేరు పెట్టుకొని ఎక్కువగుర్తు పెట్టుకున్నారు. కొంతలో కొంత నయంగా అండమాన్ దీవుల్లో హవలాక్ ద్వీపానికి స్వదేశీ ద్వీపం అని పేరు ఈ మధ్యనే మార్చారు. ఆశ్చర్యకరంగా నానా సాహెబ్ వివరాలు ఇప్పటికీ స్పష్టంగా పరిశోధించబడలేదు.
డేట్రిచ్ బ్రాండిస్ మనదేశానికి రావడానికి ముందు, వచ్చిన రెండేళ్లలో దేశంలోని పరిస్థితి ఇది. హెన్రీ హ్యావ్లాక్ తరచూ అనారోగ్యానికి గురయ్యేవాడు, అతను విశాంతికోసం ఇంగ్లాండు వెళ్ళేవాడు.అక్కడ బ్రాండిస్, హెన్రీ హ్యావ్లాక్ ఇరు కుటుంబాలకున్న పరిచయాలద్వారా కుటుంబసంభంధంగామారింది. బ్రాండిస్ భార్య అయిన రేచెల్ మార్ష్‌మన్ తన అన్నగారైన జాన్ క్లార్క్ మార్ష్మన్కు లేఖరాస్తూ బ్రాండిస్కి తగిన ఉద్యోగం కలకత్తా చుట్టుపక్కల చూడాలని కోరుతుంది. దీనికోసం మార్ష్‌మన్, హెన్రీ హ్యావ్లాక్ సహాయంతో అప్పటి గవర్నర్ జెనెరల్ లార్డ్ డల్ హౌసీ సిఫారసు లేఖను సంపాదిస్తాడు. వీరి ప్రయత్నాల మూలంగా బ్రాండిస్కి పెగులోసూపరింటెండెట్ ఆఫ్ ఫారెస్ట్స్ గా ఉద్యోగం లభిస్తుంది. అప్పట్లో రైల్వే లైన్లు , టెలిగ్రాఫ్ లైన్ల విస్తరణకు అటవీవనరుల వినియోగంలో సరైన విధానం ఉండాలని భావించిన వారిలో మార్ష్‌మన్ కూడా ఉన్నాడు. ఉద్యోగం ఖాయమయ్యాక బ్రాండిస్ నవంబర్ 1855లో కలకత్తాకు బయలుదేరి సీరాంపూర్లోని తన మామగారింట్లో పక్షంరోజులుండి సీరాంపూర్ త్రయంచేసిన పనులను తెలుసుకుంటాడు.లార్డ్ డల్హౌసీ ని కలుస్తాడు, అతనితో మూడు సూత్రాల ప్రణాళికను చర్చిస్తాడు. అందులో ఒకటి, ఉన్న అడవులకు నష్టం కలగకుండా గరిష్ట కలప దిగుమతిని సాధించడం.
పెగు,బర్మా అంటే ప్రస్తుత మయన్మార్‌లోని ఓడరేవు పట్టణం, అనాదిగా టేకుకలప వ్యాపారానికి ప్రసిద్ది చెందింది. ఈ ఓడరేవునుంచి బియ్యం,కలప ఎగుమతి జరిగేది. ఓడలనిర్మాణం జరగడమేకాక కలపనాణ్యతలో ఉన్నత ప్రమాణాలు ఉండడంచేత విస్తృతంగా ఎగుమతయ్యేది. యూరోప్‌లో పెరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధికి సరుకుల రవాణాకు అటు సముద్ర రవాణాకు కావాసిన ఓడల నిర్మాణానికి, ఇటు భూభాగం మీద రవాణామార్గాల అభివృద్ధికి కలపే ముడిసరకు. దానిమీద ఆధిపత్యం సంపాదించాలంటేముందు అక్కడ అధికారం సంపాదించాలి. కనుక మొదటి ఆంగ్లో బర్మా యుద్దం జరగడానికిఉన్న కారణాల్లో అది ముఖ్యమైందయ్యింది. మొదటి బర్మా యుద్దం (1824-26 ) తర్వాత బ్రిటిష్ పాలన ఏర్పడింది. 1829లో ప్రవేశపెట్టబడిన లీజుపద్దతుల్లో (Laissez-Faire practices) స్థానిక ప్రభువుల ఆధిపత్యం తగ్గించబడింది. బర్మాలోని కలపవ్యాపారం స్థానిక ప్రభువులనుంచి వలసపాలకుల చేతికి వెళ్ళింది. బర్మాలోని అన్నిఅడవులు బ్రిటిష్ అధీనంలోకి తేబడ్డాయి. లీజుపద్దతి పద్దతులవల్ల విలువైన అటవీవనరులు తరిగిపోతున్నాయని వీటిని రక్షించుకోవాల్సిన అవసరంఉందని భావించిన అటవీ అధికారులు గవర్నర్ జనరల్ కు లేఖలు రాశారు. ఈ లీజు పద్దతి బ్రాండిస్ ఉద్యోగంలో చేరేదాక అంటే 1856దాకా కొనసాగింది. బ్రాండిస్ 1856 లో సూపరింటెండ్ గా చేరాక పాతికెళ్లకు సరిపోయేలాగా (1856-81) ప్రణాళిక వేసి అమలు చేశాడు. అలాగా ఫారెస్ట్ సర్వీస్ కార్యక్రమాలు బ్రిటిష్ భారతంలో మొదలయ్యాయి.
అప్పటి బర్మాలో టేకుచెట్టు రాజవృక్షంగా ఉండేది, 1853లోనే రిజర్వడ్ వృక్షంగా ప్రకటించబడింది. అంటే సరియైన ప్రభుత్వ అనుమతులులేకుండా టేకుచెట్టును కొట్టివేయరాదని అర్థం. బ్రాండిస్ టేకుచెట్లను నరికేందుకు నియమాలను రూపొందించాడు. అప్పట్లో స్థానికగిరిజనతెగలు పోడు చేసేవారు,దీనికోసం నరికే చెట్లసంఖ్యను యాభైకి కుదించాడు. నియమాలను ఉల్లంఘించినవారికి శిక్షలుకూడా సూచించాడు.పర్వత సానువుల్లో ఇక్కడి గిరిజనులు చేసే పోడు వ్యవసాయం వివిధ రూపలలో ఉండేది అన్నిటికీ కలిపి టాంగ్యా అనేపేరుతో పిలిచాడు. ఇది స్థానికులకు అటవీశాఖపట్ల వ్యతిరేకతను కలిగించింది. అప్పటివరకు స్థానికప్రభువులచేతిలో ఉన్న కలపవ్యాపారం పూర్తిగా బ్రిటిష్ అధీనంలోకి వచ్చింది. శాస్త్రీయఅటవీవిధానంపేరుతో చిన్నచిన్న కూపులుగా (కమతాలు)గా విభజించి కలపనుసేకరించి వ్యాపారాన్ని పెంచుకోవడం జరిగింది. ఈ విషయాలన్నీ The Politics of Teak Management in Colonial Burma అనే పరిశోధకగ్రంథంలో నాటి బర్మాలో టేకుకలపసేకరణలోని రాజకీయ నేపథ్యాన్నిగురించి వివరంగా చర్చించబడ్డాయి.
బ్రాండిస్, పెగులో సూపరింటెండెంట్‌గా పదవీకాలం 1862లో ముగిసేనాటికి అటవీవనరుల నిర్వహణలో నిపుణుల అవసరాన్ని గుర్తించాడు. 1862-64 వరకు అటవీ సంరక్షణ అధికారి (Conservator of Forests on special duty )గా పనిచేసి 1864లో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫోరెస్ట్స్ గా నియమితుడయ్యాడు. బ్రాండిస్ దేశవ్యాప్త పర్యటనలు, బ్రిటిష్ అధికారుల ప్రోత్సాహంతో చాలాపేరు తెచ్చుకున్నాడు. అప్పటికి తన అనుభవంలోకి వచ్చిన విషయాలను దేశంలోని వివిధ అటవీప్రాంతాలకు విస్తరించాడు. ఆపై నిలంబుర్ టేకు, అవద్ లోని సాలవృక్షాలు, మధ్యప్రదేశ్‌లోని టేకు,సాల వృక్షాలు , హిమాలయాల్లోని బుషేర్ లోని దేవదారువృక్షాలు బ్రిటిష్ అధికారిక విస్తరణలో నరికివేయబడ్డాయి. ఇందాక చెప్పుకున్న మహాటేకువృక్షం కేరళలోని నిలంబుర్ అటవీప్రాంతంలో దట్టమైన సహజటేకువృక్షాలు నరికివేశాక చేపట్టిన ప్లాంటేషన్ లోనిదే. బ్రాండిస్ రూపొందించినవిధానంలో ముందు అటవీభూభాగాన్ని ప్రభుత్వపరిధిలోకితేవడం, కూపులుగా(coup) విభజించడం,అందులో ఉన్న చెట్లను తరగతులవారీగా విభజించడం, ఆయా జాతులలో దిగుబడి అంచనాలకోసం ఈల్డ్ టేబల్స్(దిగుబడి పట్టిక) రూపొందించడం యే తరగతి చెట్లు ఒక్కో ఏడు నరకం వల్ల ఎంత దిగుబడి సాధించవచ్చునో ముందే నిర్ణయించి అంత మొత్తం చెట్లను నరికి కావాల్సిన చోటికి తరలించడం,ఖాళీ అయిన స్థలంలొ మళ్ళీ ప్లాంటేషన్లు చేపట్టడం వంటివి ఒక క్రమంలో జరిగే పనులు. ఆయన రూపొందించిన ఈ పనులన్నీ నిర్వహించడానికి అటవీశాఖకు సిబ్బంది ఉండాలనీ, స్థానిక నాయకత్వంనుంచి అడ్డంకులురాకుండా చట్టమూ ఉండాలని భావించాడు. ఆ ఆలోచనల్లోంచి పుట్టినవే ఇంపీరియల్ ఫారెస్ట్ సర్వీస్, ఇంపీరియల్ ఫారెస్ట్ ఆక్ట్. అలా 1865,ఫిబ్రవరి 24 న The Government Forest Act -1865 అమలులోకి వచ్చింది. అలాగే అదే ఏడు యూరోప్ వెళ్ళి బ్రిటీషర్లను, ఫ్రాన్స్ లోనైనా జర్మనీలోనైనా రెండున్నరేళ్ల అటవీశిక్షణ పూర్తిచేసేలా ప్రణాళికా రూపొందించాడు. ఈ ప్రణాళికలో భాగంగానే ఏడుగురు శిక్షణార్థులతో 1867 నుంచి ఇంపీరియల్ ఫారెస్ట్ సర్వీస్ మొదలయ్యింది. ఫారెస్ట్ రేంజర్ ఉద్యోగంకూడా బ్రాండిస్ ఆలోచనల్లోంచి పుట్టిందే. అడవులను రక్షించడానికి , ఇతర కార్యక్రమాల నిర్వహణకు స్థానిక యువతకుతగిన శిక్షణనిచ్చి 50 -200 రూపాయాల జీతానికి సర్వీసులోకి తీసుకోవాలని సూచించడంతో ఆ ఉద్యోగం ఉనికిలోకి వచ్చింది. బ్రాండిస్ 1855 నుంచి 1883 వరకు అంటే ఇరవై ఎనమిది ఏళ్లు మనదేశంలో ఉన్నాడు. మధ్యలో 1871-74 వరకు యూరోప్‌లో ఉన్నాడు. తిరిగి వచ్చాక 1878 లో ప్రభుత్వం ఇండియన్ ఫారెస్ట్ ఆక్ట్ -1878 పేరుతో మరో చట్టాన్ని ప్రకటించింది. 1879లో డెహ్రాడూన్‌లో ఫారెస్ట్ కాలేజీని అటవీ శిక్షణ కోసం స్థాపించింది.
బ్రాండిస్, హైదరాబాద్ సంస్థానాన్నికూడా సందర్శించాడు.ఇక్కడ బ్రిటిష్ ప్రభత్వం రూపొందించిన నియమాలు బ్రిటిష్ రెసిడెంట్ ఆధ్వర్యంలో 1871 నుంచి అమలు చేయబడ్డాయి. ఫిబ్రవరీ 20,1877నుంచి మార్చి19,1877వరకు హైదరాబాదు సంస్థానంలోఉండి రక్షితఅడవులను ప్రకటించవలసిన అంశాన్ని సూచించాడు. (ఎస్ ఎస్ నేగి-సర్ డైటరీచ్ బ్రాండిస్ ). అంతేకాదు ప్రతీ జిల్లాలోనూ జిల్లా అటవీ అధికారి ఉండి అటవీ సంబంధ విషయాల్లో అటవీ సంరక్షణ అధికారికి , మిగిలిన విషయాల్లో డిప్యూటీ కమిషనర్ కు బాధ్యత వహించాలని సూచించాడు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ఇదే పద్దతిని తిరిగి ప్రవేశపెట్టింది. అయితే డిప్యూటీ కమిషనర్ కు బదులుగా ప్రస్తుతం జిల్లా కలెక్టర్ కి బాధ్యత వహించవలసి ఉంటుంది.
బ్రాండిస్ ఇదంతా చేయడం బాగానే కనిపిస్తుంది కానీ విలువైన భారత అటవీ వనరులు శాస్త్రీయ నిర్వహణ పేరుతో నరికివేయబడ్డాయి. దీని ఉద్ధేశ్యం బ్రిటీష్ ప్రయోజనాలు తప్ప మరేమీ కాదు. ఇంతకుముందు చెప్పుకున్న అంశాలేకాక 1857నాటి సిపాయితిరుగుబాటువల్ల జరిగిన ఖర్చునుకూడా మనదేశంనుంచే రాబట్టాలన్న అంశమూ ఉంది. నిస్సంకోచంగా ఇది దోపిడీనే. మన వనరులను, మన దేశంలో, మనవాళ్ళ అధీనంనుంచి తప్పించి మనవాళ్ళచేతనే జరిపించిన దోపిడి. ఇంకా అటవీవనరుల తరలింపుకోసం కొత్తగా అటవీగ్రామాలు ఏర్పాటుచేయబడ్డాయి. అటవీనియమాలకు వ్యతిరేకంగా అనేక గిరిజన తిరుగుబాట్లు జరిగాయి. అడవిమీద ఆధారపడి బతికే వర్గాల జీవితం సంకటంలో పడింది. కొత్తగా అడవులనుంచి కలపసేకరణద్వారా ఆదాయం పొందవచ్చునన్న మార్గం వెలికితీయబడింది. ఎందరో యూరోపియన్లు ఈకలప వ్యాపారంద్వారా లాభపడ్డారు. ఇవ్వన్నీ లండన్‌కు ఫిర్యాదు చేయబడినా ఆనాటి పరిస్థితుల్లో బ్రాండిస్ ని చూసీచూడనట్టు వదిలేశారు. ప్రస్తుత్తం ప్రఖ్యాత గోడావర్మన్ కేసు తర్వాత యే ఇతర అవసరాలకు అటవీభూభాగంగా ప్రకటించబడిన ప్రాంతంనుంచి కలపను సేకరించడం నిషేదించడం జరిగింది. ఇదీ బ్రాండిస్ కథ.
సీరాంపూర్ త్రయం అయినా హెన్రీ హ్యావ్లాక్ అయినా బ్రాండిస్ అయినా వారి వారి లక్ష్యాలకు అనుగుణంగా నిరంతరం పనిచేశారు. వారు రాసిపెట్టిన వివరాల్లో మనదేశీయుల వీరగాథలురాకుండా జాగ్రత్తపడ్డారు. భారతదేశవనరులదోపిడీ చేస్తూనే అనాగరీకులని చెప్పడానికి,ప్రచురించడానికి వెనుకాడలేదు. స్థానికప్రభువులు కులీనవర్గాలు వీరికన్నా తక్కువ చేయలేదు, 1857లో బహదూర్ షా దిల్లీని చేజిక్కించుకుంటే ఆయన్ని బ్రిటిష్ నాయకత్వం అరెస్టు చేసే సభలో హైదరాబాదు నిజామ్ కి ఆహ్వానం అందింది, దానికి జవాబుఇస్తూ ఇది చాలాసంతోషం కలిగించే విషయం అనితెలియజేశాడు అలాగే హైదరాబాదులో తిరగుబాటు చెలరేగకుండా జాగ్రత్త పడ్డాడు నిజాం. సంస్థానంలోని గిరిజన నాయకుడు గోండు రాంజీని, అతనితో పాటు ఉన్న మరో వెయ్యిమందిని మర్రిచెట్టుకు ఉరివేశారు. అయితే బర్మామాత్రం మూడు సార్లు బ్రిటిష్ వారితో తలపడింది. చుట్టూ నదులు, పర్వతాలు, దట్టమైన అడవులు, అభేద్య మైన పరిస్థితుల్లో తమకున్న పరిమిత వనరులతో పోరాడింది. ఆలెక్కన బర్మా ప్రజలే ఆత్మాభిమానంతో ఉన్నారనిపిస్తుంది.
బర్మాకొండ సాణువులతో, చిక్కని టేకు వనాలతో,లోయలు,నదులతో సుందర ప్రాంతం. బుద్దుని మార్గంలో నడిచిన ధ్యానభూమి.విలువైన అటవీవనరులతో అలరారే దేశం. విష్ణుపురాణంలో పేర్కొన్న సప్తద్వీపాలలో మనదేశం జంబూద్వీపంగా చెప్పబడుతోంది. నేరేడుపండు పేరుమీద జంబూద్వీపం అంటారని అందరికీ తెలిసేఉంటుంది. విష్ణుపురాణమే కాకుండా వరాహ పురాణం, బ్రహ్మాండ పురాణం, మహాభారతంలోనూ నాటి భౌగోళిక విశేషాలు చెప్పబడ్డాయి. విష్ణు పురాణం చెప్పిన మిగిలిన ఆరుద్వీపాలలో శాకద్వీపమూ ఒకటి. సంస్కృతంలో శాకవృక్షంఅంటే టేకుచెట్టు. శాకవృక్షాలతోనిండి ఉంటుంది కనుక ఆ ద్వీపానికి శాక ద్వీపం అనే పేరు పెట్టబడింది. ఇంకా ఈ ద్వీపంలోని మహాశాక వృక్షంమీద అంటే పెద్ద టేకుచెట్టుమీద శ్రీ మహా విష్ణువు కొలువై ఉంటాడనీ చెప్తుంది. ఆ మహా శాకవృక్షం ఉన్న భూభాగం బర్మా కావచ్చునా అన్న ఊహ ఒకటి వచ్చి అందుబాటులో ఉన్న సమాచారం పోల్చి చూస్తే ఎవరూ సరిగా చెప్పినట్టు అనిపించక మరిన్ని పోలికలు వెతికవల్సి వచ్చింది. విష్ణుపురాణం ద్వీపాలగురించే కాకుండా సప్తనదులు, సప్తపర్వతాలవంటివి కూడా పేర్కొంటుంది. టేకుచెట్టు పుట్టిందికూడా బర్మా, జావా, భారతదేశంలోనే. బర్మా ఇంకా జావా అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. బర్మా కు జవాకు ఇప్పుడు దాదాపు మూడువేల కిలోమీటర్లు అయితే చాలా కాలం క్రితం ఈ రెండూ కలిసి ఉండే అవకాశం ఉంది. అయితే నావద్దఉన్న వివరాలు శాకద్వీపం బర్మా కావచ్చునన్న నా ఊహా నిర్దారణకు సరిపోవు. కాకపోతే వృక్ష,జంతు జాతుల పెరుగుదల అనేక భౌగోళిక అంశాలను పరిష్కరించడంలో ఇదివరకే సహాయపడిన అంశం, ముందు ముందు పురాతన భౌగోళిక చరిత్ర నిర్మాణానికి తప్పక ఉపయోగపడుతుందని మాత్రం చెప్పగలను.
ఈ చీకటిరాత్రి ఇన్ని సంగతులను గుదిగుచ్చి అందించింది. ఈమాత్రం ఖాళీలేకపోతే లోతుపాతులుచూసే సమయమూ చిక్కదు. అసౌకర్యమైన పరిస్థితిలో నిద్రపట్టక మధ్యరాత్రికి ముందరితలుపుకున్న చువ్వలలోంచి చూస్తే ఆకాశం అంతా చీకటే. దట్టమైన ఛీకటి. ఆకాశం ఉన్నఫలంగా ఎప్పుడు శూన్యం కాలేదు, మన భావన అంతే. కొంత సమయం క్రితం అక్కడ ఎగురుతున్న పక్షుల్ని చూశాను, కొన్ని విచ్చుకుంటున్న కిరణాలను చూశాను, మరి కొంతక్రితం గాలి ముద్దగా మారి సన్నని చిరుజల్లు కురిపించే నల్లని మేఘాలను చూశాను. ఆకాశంలోని మార్పు నిజమైన మార్పు కాదు, అది తన ప్రేమని, కోపాన్ని మరికొన్ని ప్రకృతి ధాతువులతో కలిపి ప్రకటించుకున్నదే తప్ప అది ఎప్పుడూ నేరుగా శూన్యం కాలేదు. ఈ వాన మబ్బులు లేకపోతే అక్కడ చుక్కలుండేవి. మిణుకు మిణుకుమంటూ మాలో మరో లోకాలున్నాయని చెప్పకనే చెప్పేవి. ఎన్నెన్ని లోకాలు ఎక్కడెక్కడా ఉన్నా ఈ క్షణం ఇక్కడ నీలిగ్రహంమీద జీవించి ఉండడమే గొప్ప విషయం, ముందున్న వాటిని పోల్చుకోగలగడం ఇంకా గొప్పవిషయం. మరోగ్రహం మీద జీవం ఎలాఉన్నా, పచ్చని చెట్టు ఉందో లేదో తెలియలేదు. మహా వృక్షాల నీడ వారికున్నదో లేదో తెలియదు. చెట్టూ,నీడా మనకుంది. ఉన్న చెట్లను నీడ నిచ్చేంతగా ఎదగనివ్వడం కూడా మన చేతుల్లోనే ఉంచబడింది, గడిచిన ఉదయంలోలాగా ముందు మొక్కనాటడంతోనే అది మొదలౌతుంది.
-దేవనపల్లి వీణావాణి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
అరణ్యం 2 -శాక – దేవనపల్లి వీణావాణి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>