అనిశెట్టి నృత్యమూకాభినయం ‘రిక్షావాలా'(సాహిత్య వ్యాసం)-డా.వి.ఎన్.మంగాదేవి
“యో యం స్వభావో లోకస్య సుఖ దుఃఖ సమన్విత:!
సోంగొద్యభినయో పేతో నాట్య మిత్య భి ధీయతే”
సుఖ దు:ఖాలతో కూడి ఉన్న లోక స్వభావాన్ని చతుర్విధ అభినయాలతో ప్రదర్శిచడమే నాట్యం లేక నాటక ప్రదర్శన మవుతుంది.
ఆధునిక తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలను సృష్టించిన అనిశెట్టి నాటక ప్రక్రియ పైన ప్రత్యేక దృష్టిని సారించారు. కేవలం నాటకాలనే కాక వినూత్న ప్రయోగాలను కూడా చేసారు. వారు చేసిన ఒక వినూత్న సృష్టే ‘రిక్షావాలా’ నృ త్య మూకాభినయం.
నృత్యరూపకం – మూకాభినయం కలిపి ఈ నృత్య మూకాభినయం అనే ప్రయోగం చేసారు అనిశెట్టి.
” భావాశ్రయంతు నృత్యంస్వాత్ ” అనగా భావముతో కూడినది నృత్యం. లక్ష్య,లక్షణ
సద్భావనలతో కూడిన గీతమందు చరణమునకు, చరణమునకు మధ్య నుండు శబ్ధము లేక స్వరము లేక వాద్య సంగీతము భావయుక్తమైనదై తే అది నృత్యం.
నృత్య రూపకం అంటే “నేపధ్యమున ప్రయుక్తములగు జంత్ర – గాత్రముల కనుకూలమైన నృత్యములు కలదై, వాచికాభినయ రహిత మైన రూపకము. ఫ్రాన్స్ దేశపు 14వ లూయీ చక్రవర్తి కాలములో ఈ నృత్య రూపకం రూపక మర్యాదను పొందింది. తరువాత కాలములో ఈ నృత్య రూపకాలలో ఆహార్యపు ప్రాధాన్యత తగ్గి, భావ ప్రాధాన్యత పెరిగింది. ఆధునిక కాలంలో రష్యాలో వీటికి ఆదరణ పెరిగింది.
సంస్కృతంలో గీతగోవిందం, కృష్ణలీలా తరంగిణి వంటి నృత్య ప్రధాన గేయ కావ్యాలు, భామా కలాపం యక్షగానాలు మొదలైన తరగని నిధి నిక్షేపా లు వున్నప్పటికి తెలుగు సాహిత్యంలో శ్రీతల్లావజ్జల శివశంకర స్వామివారి ‘వర పరీక్ష’ అనే విషాదాంత రూపకం మొదటి నృత్యరూపకం.
ఇక మూకాభినయం అంటే “వాచికాభినయరహితమై కేవలం అంగ విక్షేపాలతో, దృష్టి ముఖ రాగాదులతో, స్వగత- పరగత భావములను ప్రదర్శించెడి ఆంగాకాభినయము దీనినే పాంటోమైమ్ అంటారు. ఈ మూకాభినయంలో మేకప్, కాస్టూమ్స్, లైటింగ్, సెట్ డిజైనింగ్, ప్రకృతి చిత్ర దృశ్య కరణలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది.
ఈ మూకాభినయ లక్షణాలను, నృత్య రూపకంతో సమ్మిళితం చేసి ఆధునిక తెలుగు సాహిత్యంలో ‘రిక్షావాలా’ పేరుతో నృత్య మూకాభినయాన్ని సృష్టి ౦చారు అనిశెట్టి సుబ్బారావు గారు. నృత్య దర్శకులు డి. వేణుగోపాల్ ఈ రిక్షావాల కి నృత్యం సమకూర్చారు. గాత్రాన్ని బి. గోపాల్ అందించారు. ఫిబ్రవరి 19
55 నుండి దక్షిణ భారతదేశంలో పలు చోట్ల ప్రదర్శింపబడింది
‘రిక్షావాలా’ జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు సమాజానికి అందించిన ఘనత అనిశెట్టి
వారిది.
ఈ నృత్య మూకాభినయ ప్రదర్శన చూసే ప్రేక్షకుల హృదమాలు కరుణ రస సిద్ధి పొంది, రిక్షా వాని జీవితాన్ని మార్చడానికి మార్క్స్ సిద్ధాంత ఆలోచనతో ఒక అడుగు ముందుకు వేస్తారు. అనిశెట్టి ఆకాంక్ష సమ సమాజ నిర్మాణం అయితే ఈ కరుణ రసాత్మకమైన నృత్య మూకాభినయం చూసే ప్రేక్షకులలో మానవత్వం జాగృతమయి అనిశెట్టి ఆకాంక్ష వైపు ఒక అడుగు వేస్తారు.
‘రిక్షావాలా’లో నృత్య రూపక లక్షణాలలైన నృత్యం, సంగీతం, మూకాభిన యం లక్షణాలైన వాచిక రహిత మూకాభినయం ప్రధానంగా వుండడమే కాక అవసరమైన చిత్ర దృశ్యీకరణ, తగిన వేషధారణకు ప్రాధాన్యత యివ్వబడింది. మూకాభినయం అవడం చేత ప్రేక్షకులకు భాషా సమస్య రాకపోవడం వలన దక్షిణ భారతదేశం అంతటా ప్రదర్శనల ద్వారా ప్రేక్షకులకు అందించగలిగారు.
ఈ ‘రిక్షావాలా’ నేపధ్యంలో వ్యాఖ్యాత “పాడిపంటల భాగ్య సీమలో, రత్నగర్భ భారతదేశంలో గంగ ప్రవహించి పునీతం చేసిన ఈ దేశంలో అంతా ఆనందిస్తున్న వారు కారు……….”
తోటి మానవుల చీత్కారాలకు తలొగ్గి, జీవిత శకటాన్ని లాగేందుకు ఈ శకటాన్ని లాగుతూ,విశ్రాంతి ఎరుగని ఆస్థి పంజరం. దరిద్ర జీవుల ప్రతి బింబం .‘రిక్షావాలా అని రిక్షావాలా జీవితాన్నిప్రేక్షకుల హృదయాలపై ముద్ర వేస్తూ పరి చయం చేయడంతో ప్రారంభమవుతుంది.
ఈ నృత్య మూకాభినయం. ” ఓహా రిక్షావాలా, ఓ రిక్షావాలా
చర చర చర పోవేలా
ఉదయవేళ జాగేలా!”
అనే ‘నాంది’లో అనిశెట్టి వారు రిక్షావాలాని పొద్దునే ఆలస్యం లేకుండా జీవన చక్రాన్ని, రిక్షా చక్రంతో పోలుస్తూ వేగంగా కదలమని స్ఫూర్తిని అందిస్తాడు. రూపకానికి ‘నాం ది’ ప్రధానమయినది. తరువాత నర్తకుడు ప్రవేశిస్తాడు. ‘నడూ నడూ నడూ నడూ నడూ నడూ నడుపవోయి” అనే ఈ పాటలోకి తొంగి చూస్తే ఒక సకారాత్మక సందే శం రిక్షావాలకు అందించారు. జీవితంలో ముందుకు నడవమని, రేపటి గురించి తీపి కలలు కంటూ నడవమని చెప్తాడు. తరువాత మధ్యాహ్న సమయంలో రిక్షాను చెట్టు క్రింద నిలిపి రిక్షా వాలా తన గత జీవితాన్ని నెమరు వేసుకుంటాడు . ఇక్కడ అనిశెట్టి వారు కవి నిర్వచనానికి పాత్ర నటించాలి అంటారు. ఇప్పటి దాకా పాటతో పాటే డాన్స్ వున్నది. ఇక్కడ మధ్యాహ్న సమయం అని చెప్పడంతో మూకాభినయం చేయించా రు. ఇక్కడ పాత్ర చేత సగటు మానవుడు పల్లెలో బ్రతకలేక బస్తీకి చేరుతున్నాడు. తన ‘గతిలేక వెతికావు, బస్తీకి తెరువు బ్రతుకుని బాగు చేసుకోవాలని అనే విషయాన్ని అందించారు అనిశెట్టి. కానీ అతను చేరిన మహా నగరం కూడా ఘోరమైన శోకసాగర మే అంటాడు. మూకాభినయం ముగిసిన వెంటనే వ్యాఖ్యాత
“ఏకాంత బాధ ఏలరా – ఇంత చింత ఏలరా
నడూ నడూ చూచి నడూ!”
అంటూ అంతులేని సాగరమైన మహానగరంలోని విశేషాలన్నీ చెపుతూ, చూసి నడుస్తూ బ్రతుకు బండిని లాగమంటాడు.
రిక్షావాడు ఒక బ్రిడ్జ్ మీదకు లాగలేక ఎక్కి దిగబోయి పక్క కాలులోకి పడబోయి తమాయించుకున్నప్పుడు
“ఏయే ఆపరా రిక్షా! హు నీ ముఖానికి డబ్బులు కూడానా?…..
ఇక్కడ రిక్షావాలా చేతకాని దుస్థితిని వర్ణిస్తాడు. జనులు అతన్ని జంతువుల కంటే హీనంగా ఎలా ఈసడించుకుంటారో కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడు.
“ఇది నగరం కాదోయీ
ఇది దుస్సహ నరకమోయీ” అంటాడు.
అదే నగరంలో కూడా నరకమే వున్నదని చెపుతాడు. ఇలా అనిశెట్టి గారు రిక్షా వాలాలో ఒక ద్వైధీ భావాన్ని చూపిస్తాడు. దేశంలో ఉన్న ఊరులో ఆకలి కరువు పెట్టే బాధ భరించలేక బస్తీకి బతుకు తెరువు కోసం వచ్చాడని తెలుస్తుంది.
నగరం ప్రళయ కాల సాగరమై వూగినా క్షణం క్షణం చావునే చవి చూసే ఓ రిక్షా వాలా ఇక ఇంటి దారి పట్టమంటాడు. “బ్రతికినా, చచ్చినా లేదులే విలువ ” అంటూనే ఈ ప్రపంచం నిన్ను ఎంత వచించినా “క్రింద పడకోయి తల వంచ బో కోయీ” ఆత్మ ధైర్యాన్ని నూరి పోస్తాడు అనిశెట్టి.
“ఈ దుష్ట లోకమే మారులే? మారులే! ఈ నాటి కష్టమే తీరులే….” అని లోక మే మారుతుందని ధైర్యం చెపుతాడు. అంతే కాకుండా చివరిగా ఒక ఆశాజ్యోతి వెలిగిస్తాడు.
“బ్రతుకు ప్రాంగణాన నింక
పచ్చ తోరణాలోయీ
చల్లగ యీ జగమంతా
వర్ధిల్లును లే అన్నా! ఓ అన్నా, ఓ అన్నా, ఓ అన్నా అంటూ
ముగిస్తాడు.
‘రిక్షావాలా’ను ప్రభోదాత్మకమైన, సందేశాత్మకమైన కథా వస్తువుతో, దేశ, కాల, సాంఘిక, రాజకీయ పరిస్థితుల కనుగుణంగా, నూతన, విలక్షణమైన సన్నివేశా లతో సృష్టించి ‘కళ’ మానవ జీవన వికాసానికి దోహద పడుతుంది అనే విషయాన్ని
అక్షర సత్యంగా నిరూపించారు.
ఆధార గ్రంథాలు:-
- నాట్యశాస్త్రము-భరతముని – డా॥పోణంగి శ్రీరామఅప్పారావు
- నాట్యశాస్త్రము-ఆధునిక నాటక శాస్త్రము – ఎన్. ఎస్. కామేశ్వరరావు
- నాట్యశాస్త్ర దర్పణము – డి. వేణుగోపాల్
- అనిశెట్టి సాహిత్యానుశీలనం – డా|| పి.వి. సుబ్బారావు
- మూకాభినయ కళా ప్రదర్శనలో మేకప్, కాస్టూమ్స్, లైటింగ్, సెట్ డిజైనింగ్ల
ఆవశ్యకత, విశిష్టత : ప్రాముఖ్యత వ్యాసం – జి. శేఖరబాబు; వాజ్ఞయి, 2010.
-డా. వి.యన్. మంగాదేవి తెలుగు శాఖాధ్యక్షులు
మారీస్ స్టెల్లా కళాశాల(అటానమస్)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
అనిశెట్టి నృత్యమూకాభినయం ‘రిక్షావాలా'(సాహిత్య వ్యాసం)-డా.వి.ఎన్.మంగాదేవి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>