“కసి”(కథ) – డా.మజ్జి భారతి
“వంటమనిషి కొడుకువి. నువ్వు మాతో సమానంగా కూర్చోవడమా! వెళ్లి వెనక సీట్లో కూర్చో”, అని తరగతి గదిలో తన స్థానాన్ని మార్చారు. “ఒరే! ఈరోజు యేమి తెచ్చుకున్నావురా?” అని ఒకరంటే “ఎవరింటి మెనూనో ఈరోజు…” అనొకరు. అన్యాపదేశంగా ఎవరింట్లోనో మిగిలిపోయింది తాను తెచ్చుకుంటున్నానని. “ఒరేయ్ వీడి స్టేటసుకు ఈ స్కూల్లో చదవడం అవసరమంటారా?” అని ఒకడంటే, “కష్టపడి వాళ్ళమ్మ పనిచేస్తుంటే, తగుదునమ్మా అని వీడు ఏసీల్లో కూర్చొని చదువడానికొచ్చాడు. నేనైతే చస్తే అలా చెయ్యను. మా ఇంటికి దగ్గరలో వున్న ఏ దుంపల బడిలోనో చేరిపోతానని” వొకడు… అదేదో గొప్ప హాస్యంలా పగలబడి నవ్వులు. అమ్మ స్కూలుకు వచ్చి హెచ్ఎం సారుని కలిసిన నుండి తన తోటి విద్యార్థుల వేధింపులు.
ఇవన్నీ అమ్మకు చెప్పుకోలేక, అలాగని వాళ్ళంటూ వుంటే, భరించి వూరుకోలేక అమ్మ మీద కోపమొచ్చేది, తననీ స్కూల్లో ఎందుకు చేర్పించిందని? పుస్తకం పట్టుకుంటే వాళ్ళన్నమాటలే గుర్తుకొచ్చి చదవాలనిపించడం లేదు. పాత స్కూలుకే వెళ్లిపోతే… అక్కడందరూ తనలాంటి వాళ్లే. స్కూల్ ఫస్ట్ వస్తానని తననందరూ గొప్పగా చూస్తారక్కడ. మరిక్కడో?
తెలివైన వాడినని, బాగా చదువుకుంటానని, ఈ స్కూల్లో చదువుకుంటే తన భవిష్యత్తు చాలా బాగుంటుందని, అమ్మ పనిచేసే ఒక యింటామె, హెచ్ఎం సారుతో మాట్లాడి యీ స్కూల్లో సీటు యిప్పించింది. తన మార్కులు చూసి తనతో బాగానే ఉండేవారు ముందు. అమ్మ వంటమనిషని తెలిసాక మొదలైంది తన మీద సెటైర్లు వెయ్యడం.
ఇప్పుడు తనకొస్తున్న మార్కులు చూసి హెడ్ మాస్టర్ గారు కూడా హెచ్చరిస్తున్నారు. కాని తానేమి చేసేది? స్కూల్లో చదవనివ్వడం లేదు. యింటికెళ్లి చదవబోతే, పనులు చేసి అలసిపోయి వచ్చిన అమ్మను చూసి చదవ బుద్ధి కావడం లేదు. అమ్మ యింత కష్టపడుతుంటే తనా స్కూల్లో… ఫీజులో రాయితీ ఇచ్చినా, అంతంత ఫీజులు కట్టి చదవడం అవసరమా అనిపిస్తుంది. దానికితోడు ఈమధ్య వాళ్ళ పనులన్నీ తను చేత చేయించడం మొదలుపెట్టారు. కాదంటే… క్రికెట్ బాలుతో కొట్టడం… నడుస్తుంటే కాలడ్డం పెట్టి పడేలా చెయ్యడం… స్కూలు విడిచి పెట్టాక కూడా తనను వాళ్ళు విడిచిపెట్టడం లేదు. టీచర్లకు చెప్పుకుంటే, మా మీద కంప్లైంట్ చేస్తావా అని మరింత ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు. ఏమి చెయ్యాలో పాలుపోవడం లేదు వెంకట్ కు.
***
యువ శాస్త్రవేత్త అవార్డు తీసుకున్న పూర్వవిద్యార్థి విజయ్ ను స్కూలుకి ఆహ్వానించారు. ఇంతవరకూ ఎవరికీ ఇంటర్వ్యూలు కూడా యివ్వని విజయ్ ముందుగా తమ స్కూలుకే వస్తున్నాడంటేనే అర్థమవుతుందందరికీ, తాను చదువుకున్న స్కూలుకి విజయ్ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడనేది. యువ శాస్త్రవేత్త చదువుకున్న స్కూల్లోనే తామూ చదువుకుంటున్నందుకు, తమలోని భావి శాస్త్రవేత్తలను ఊహించుకుంటూ, ఆ స్కూలు విద్యార్థులెంతో గర్వపడుతున్నారు. విజయ్ చెప్పబోయే సూచనలు, సలహాల కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు,
రానే వచ్చిందా రోజు. సన్మాన కార్యక్రమాలు అయిపోయాక, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడానికి స్టేజి మీద అతను… ఎలా చదివితే ర్యాంకులు వస్తాయోనని, అతని చెప్పబోయే సూచనల కోసం ఉత్కంఠగా విద్యార్థులంతా…
వాళ్ల ముఖాల్లోని ఉత్కంఠను చూసి నవ్వుకుంటూ, “నేను చెప్పబోయే మాటల కోసం మీరందరూ యెంతగానో ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. ఎలా చదివితే యువ శాస్త్రవేత్త అవార్డువరకు నేను రాగలిగానా అన్న మీ కుతూహలాన్ని నేనర్థం చేసుకోగలను. అది తెలుసుకునే ముందు బండ్లు వోడలవ్వడం, ఓడలు బండ్లవ్వడమన్న మాట యెప్పుడైనా విన్నారా? జీవితంలో యేదీ శాశ్వతం కాదు, అటుదిటు మారవచ్చనే అర్థంలో ఆ మాటను వాడుతారు. అంటే రోలర్ కోస్టర్ లాగ. ఎలా చదివితే ఈ స్థాయికి చేరుకున్నానో తెలుసు కోవాలనుకుంటున్నారు కదా! చెప్తాను.
కసి… కసితో చదివాను నేను. నన్ను యేడిపించిన వాళ్ల మీద కసి. నన్ను పేదరికంలో పుట్టించిన భగవంతుడు మీద కసి. స్తోమతను మించి నన్ను పెద్ద స్కూల్లో చదివించాలని తాపత్రయపడుతున్న మా అమ్మ మీద కసి. నా అసహాయత మీద దాడి చేస్తున్న వాళ్ల మీద కసి. ఆ కసిని తీర్చుకోవడానికి చదువు తప్ప వేరే మార్గం కనిపించలేదు నాకు. అందుకే యిప్పుడు నేనిలా మీ అందరి ముందు…”
“పదిహేనేళ్ల క్రితం… “నిన్నింతగా అవమానించిన వాళ్ల మీద కసి ఎలా తీర్చుకోవాలనుకుంటున్నావు? ఒక పని చెయ్యి. భవిష్యత్తులో వాళ్లు నీ ఎదురుగా చేతులు కట్టుకునేలా చెయ్యి. నీ మనసులో ఉన్న కసినంతా చదవడంలో చూపించు. అప్పుడే నువ్వనుకున్నది సాధించగలవు” అని నాకు ఒకరిచ్చిన సలహా నా జీవితాన్ని ఎలా మార్చిందో చూస్తున్నారు కదా!”
ఆ మాటలు వింటున్న కొంతమంది కళ్ళల్లో కనిపించిన కసి… భయపెట్టింది చాలామందిని.
తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ “నా సలహా ఒక్కటే. మీ మనసు బాగుంటే ఆ సంతోషంతో చదవండి. మనసు బాగోలేకపోతే, దానిని మర్చిపోవడానికి యింకా బాగా చదవండి. నలుగురి ముందూ తల యెత్తుకునేలా చేసేది చదువొక్కటే. అది ఉంటే అన్నీ సాధించినట్టే. ఆ చదువే లేనినాడు మన స్థితిగతులు, ఆస్తిపాస్తులు, తాత తండ్రుల పేరుప్రతిష్టలు… యివేవీ మనలను రక్షించలేవు. చదువుకునేటప్పుడు యెవరినైతే యేడిపించామో, వాళ్ళ దగ్గరే వుద్యోగాలకోసం చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి వస్తే…” అంటూ ఆగాడు విజయ్. ఆ మాటలు వింటున్న ఎంతోమంది కళ్ళల్లో భయం…
“మనను అవమానించినవాళ్ళను, పిలిచి మనమే వుద్యోగాలు యివ్వగలిగితే యెలా ఉంటుంది? మనము అవమానించిన వాళ్ళ దగ్గరే వుద్యోగాలు చెయ్యవలసి వస్తే మనకెలా వుంటుంది? ఈ రెండు విషయాలూ జ్ఞాపకం పెట్టుకుంటే, చదువు తప్ప యే విషయమూ మనను పక్కదారి పట్టించదు. అప్పుడే మనమెందులోనైనా రాణించగలం. ఏదైనా సాధించగలం.”
“ఇంకొక్క విషయం… మనమేమి చేసినా ఒక రెండు కళ్ళు మాత్రం మననే గమనిస్తూ వుంటాయన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు” అంటూ హెడ్మాస్టర్ వైపు చూసి చిరునవ్వు నవ్వాడు విజయ్, బాగానే చెప్పానా అన్నట్టు.
వారం రోజుల కిందట… ” సన్మానాలవీ, నీకిష్టముండవని తెలుసు. కాని, చదువుకున్నప్పుడు ఈ స్కూల్లో నీ అనుభవాన్ని, యిప్పటి విద్యార్థులతో పంచుకుంటే ఎంతోమందిని బాగు చేసిన వాడివవుతావు” అన్న హెడ్మాస్టరుగారి మాటల వలన కదా తనిక్కడకు వచ్చింది. బీద గొప్ప తారతమ్యాలు ఎప్పటికీ చెరిగిపోవా? హెడ్మాస్టర్ గారి ఉద్దేశం నెరవేరుతుందా! లేదా! నిట్టూర్చాడు విజయ్.
***
రెండు రోజుల తర్వాత… సీసీటీవీ ఫుటేజ్ లు పరిశీలిస్తున్న హెడ్మాస్టరుగారి కళ్ళల్లో ఆనందం. తన ఉద్దేశం నెరవేరిందన్న ఆనందం. ఆ ఫుటేజ్ లో తాము తెచ్చిన దానిని వెంకట్ తో పంచుకుంటున్న ఆ నలుగురు.
నేటి వెంకట్ లో, రేపటి విజయ్ ని చూస్తున్నారు హెడ్మాస్టర్ గారు.
– డా.మజ్జి భారతి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
“కసి”(కథ) – డా.మజ్జి భారతి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>