నా కథ- ( చలో హైదరాబాద్) 11- డా.బోంద్యాలు బానోత్(భరత్)

అష్ట కష్టాలు పడీ, ఏటూరు నాగారంలో గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష రాసి, హన్మాకొండాలోని, మా ‘ఎస్టీ’ హాస్టల్ కు చేరుకున్నాం. మరుసటి రోజు నుండి యదావిధిగా , రోజు బడికి వెళ్తున్నాను. ఒక రోజు సాయంత్రం 5 గంటలకు, ఇద్దరు వ్యక్తులు, సంకకు రెడ్ కలర్, సంక సంచి వేసుకోని, కాళ్ళకు పారాగన్ స్లీపర్స్ వేసుకోని, మా హాస్టల్ కు వచ్చారు. వాళ్ళను చూసి మా హాస్టల్ పిల్లలందరూ తమ తమ రూమూల్లో నుండి బయటకు వచ్చి వాళ్ళ చుట్టూ గుమ్మిగూడారు. “మితృలారా..! అందరూ నిశ్శబ్దంగా కూర్చో వలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన మితృడు కా. కొమరయ్య , ఒక పాట పాడుతాడు. అందరూ శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాను. ‘ దేశమును ప్రెమించమంటే ఓరన్న దేశ సంపద మెక్కుతుండే..’, అంటూ పాట పాడిండు. ఇప్పుడు ఇంకో అన్నా మాట్లాడడం మొదలు పెట్టాడు, ‘ మితృలారా, ఈ రోజు మేమిక్కడికి రావడానకి కారణం, పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్నా వైఖరి. మితృలారా గత రెండు సంవత్సరాల నుండి, హాస్టల్ పిల్లల మెస్ చార్జీలు పెంచాలని, కాస్మెటిక్ చార్జీలు పెంచాలని, బట్టలు, ప్లేట్లు, గ్లాసులు, ట్రంక్ పెట్టేలు ఇవ్వాలని, హాస్టల్లకు పక్కా భవనాలు నిర్మించాలని.. డిమాండ్ చేస్తూ, మన ‘ఎస్ ఎఫ్ ఐ’ , హాస్టల్లా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తోంది. ఐతే, మితృలారా! హాస్టల్ సమస్యల సాధన కోసం ఆగస్టు 5-1991న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము..” అంటూ తన ఉపన్యాసం ముగించాడు.
“మితృలారా ఇంకో విషయం ఏమిటంటే, ఆగస్టు 5-1991న, తొందరగా లేచీ తయ్యారై, హాస్టల్ నుండి బయలుదేరి, సరీగ్గా 10గం. కాజీపేట రైల్వేస్టేషన్ లో ఉండాలని, మనకు రెండో నెంబర్ ప్లాట్ ఫామ్ మీద ‘క్రిష్ణా ఎక్స్ప్రెస్’ రైలు ఆగుతుంది. అందరూ జాగ్రత్తగా ఆ రైలెక్కాలె. మేమందరం అక్కడే వుంటాము. తెల్ల రంగు జెండాలు పట్టుకుని ఉంటాము,వాటిపైన ‘ఎస్ ఎఫ్ ఐ’ అని రాసి ఉంటుంది. వాటిని గుర్తుపట్టీ, మా వద్దకొచ్చినా సరిపోతుంది. ఈ హాస్టల్ కీ ఇంచార్జీగా, ‘భరత్ నాయక్(బొంద్యాలు బానొత్)’ ఉంటాడు. మీరందరూ ఈ ‘భరత్ నాయక్’ తో కలిసి రావలసిందిగా కోరుతూ, ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను.” అని చెప్పీ, వాళ్ళు వెళ్ళిపోయారు.
వాళ్ళు చెప్పిన విధంగానే ఆగస్టు 5- 1991న తొందరగా లేచీ తయ్యారై హాస్టల్ నుండి బయలుదేరి నడుచుకుంటూ హన్మకొండా బస్టేషన్ కు వెళ్ళీ, లోకల్ బస్సెక్కీ కాజీపేట రైల్వేస్టేషన్ కు చేరుకున్నాము. అక్కడ, ఇద్దరు వ్యక్తులు తమ చేతిలో తెల్ల రంగు జెండాలు పట్టుకుని నిలబడి ఉన్నారు.ఆ తెల్ల రంగు జెండాలపై ఎర్ర రంగుతో ‘ఎస్ ఎఫ్ ఐ’ అని రాసున్నది. దానితో పాటు ఆ తెల్లని జెండాపై ‘చుక్కా’ గుర్తు కూడా ఉన్నది. మేము గొల్లపల్లి హాస్టల్ నుండి 10 మంది వచ్చినమనీ చెప్పగా, ఆయన తన డైరీలో రాసుకున్నాడు. అదే సమయంలో రైల్వే స్టేషన్ నుండీ, ప్రకటన “ప్రయాణికులు దయచేసి వినండీ, తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్ళే ‘క్రీష్ణా’ ఎక్స్ప్రెస్, మరి కొద్ది నిమిషాల్లో, రెండవ ప్లాట్ ఫారం పైకీ రానున్నదీ,… యాత్రీయ గణ్ కృపయ ధ్యాదేన్..” అంటూ అనౌన్స్ మెంట్ వచ్చిందీ. ఆ అనౌన్స్ మెంట్ వినీ, అందరూ రెండోవ ప్లాట్ ఫారం వైపుకు పరుగెత్తారు. ఇంతలోనే రైలొచ్చింది. ఎక్కడివారు అక్కడే, ఆయా బోగీల్లోకి ఎక్యారు. ఇంతలోనే, రైలు కదిలింది.
రైలు కదిలిన అరగంట తర్వాత, పది మంది గుమ్మిగూడి, కంజర కొడుతూ, పాటలు పాడుతూ, ఫడ్ క్యాంపెయిన్ చేసుకొంటు.. పోతున్నాం. నాకు రైలెక్కడం, అదే మొదటిసారి. నాతో, నా ఫ్రెండ్ రవీందర్ కూడా ఉన్నాడు. ఎటు పోయినా మేమిద్దరం కలిసే పోయేవాళ్ళం. మేమిద్దరం కూడా ఆ క్యాంపెయిన్ చేసే వాళ్ళ వెనకాల తిరుగుతున్నాము. రైలు జనగాం స్టేషన్ దాటి ఆలేరు స్టేషన్ వద్దా పది నిమిషాలు ఆగింది. ఆ గ్యాప్ లో , బాలసముద్రం ఎస్టీ హాస్టల్ కు చెందిన ఒక విద్యార్థి కిందికి దిగాడు. అప్పటిదాకా నిల్చున్న రైలు, సడెన్గా కదిలింది. కదిలి వేగం పుంజుకుంటోండగా, ఆ అబ్బాయి ఎక్కపోయి, కాలు జారి రైల్ కిందా పడీ చనిపోయాడు. ఆ విషయం తెలిసిన తర్వాత, చాలా బాధేసింది. అప్పటికే రైలు వేగం పుంజుకుంది. ఈ సమాచారం ను, ‘ఎస్ ఎఫ్ ఐ’ నాయకులు ఆ చనిపోయిన విద్యార్థి తల్లిదండ్రులకు అందచేశారని, సమాచారం.
హైదరాబాద్ మాకందరికీ కొత్తే. హైదరాబాద్ సిటీని చూస్తున్నాము, అనే ఆనందానికి హద్దులు లేవు. ‘ఎస్ ఎఫ్ ఐ’ నాయకులు, మమ్ములను సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి తీసుకుని వచ్చారు. అక్కడ నుండి నేను మరియు రవీందర్, మేమిద్దరం, ధైర్యం చేసి మెల్లగా తప్పీంచుకోని, బస్సెక్కినం. కండక్టర్ వచ్చీ ‘ టికెట్ ఎక్కడికి ఇవ్వాలి?’ అని అడుగగా ‘ హైదరాబాద్ సిటీలోని హుసెన్ సాగర్, బిర్లామందిర్, చార్మినార్.. ఇవన్నీ చూడాలి ‘ అని అనగా, ‘అలాగైతే మీరు డే పాస్ తీసుకోవాలి’ అని అన్నాడు బస్ కండక్టర్. మేమిద్దరం చెరీ ఐదు రూపాయలు ఇచ్చి, డే పాస్ తీసుకుని, రోజంతా తిరిగి, హైదరాబాద్ లోని ముఖ్యమైన ప్రదేశాలు చూశాము. ‘డబుల్ డెక్కర్’ బస్సుల్లో ప్రయాణించాము. రాత్రి అయింది. మళ్ళీ ఆ ‘ఎస్ ఎఫ్ ఐ’ నాయకులను కలిసే పరీస్థితి లేదు. ఆ రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో, పడుకోని, పొద్దుగాల తెల్లారుతుండంగా, వరంగల్ వైపు వెళ్ళే రైలెక్కి, కాజీపేటలో దిగీ హన్మకొండాలో గొల్లపల్లి హాస్టల్ కు వెళ్ళాము.
మళ్ళీ, తెల్లారి నుండి ఎదావిధిగా బడికి వెళ్ళడం, చదువుకోవడం చేస్తున్నాము. ఇంతలోనే, ‘ఏటూరు నాగారం’ నుండి , నాకు గురుకుల పాఠశాలలో ప్రవేశానికి, సీటొచ్చినట్లూ కాల్లేటర్ వచ్చింది. కాని నా స్నేహితుడు ‘రవీందర్’ కు కాల్లేటర్ రాలేదు. నాకు బాధేసింది. ‘ఆయనకు కూడా సీటొచ్చి వుంటే, ఇద్దరం కలిసి చదువుకొనే వాళ్ళం’, అని అనిపించింది. చెప్పాలంటే నిజానికి నాకంటే ఆయనే బాగ చదువుతాడు. ఏదేమైనా ధైర్యం చేసి, అన్నీ సదురుకోని, రవీందర్ రాసిన ప్రవేశ పరీక్ష ‘హాల్ టికెట్ నెంబర్’ తీసుకోని, ‘ఏటూరు నాగారం’ ‘ఎస్టీ గురుకుల పాఠశాల’ లో ప్రవేశం పొందడానికి, బయలుదేరాను. పోయి, ప్రిన్సీపాల్ కీ ఈ లేటర్ చూపించాను, వెంటనే నన్నూ జాయిన్ చేసుకున్నాడు. దానితో నా మిత్రుడు ‘రవిందర్’ పరీక్ష రాసిన హాల్ టికెట్ చూపించి,’ సార్, ఈ రవీందర్ కీ కాల్ లేటర్ రాలేదు. ఇయన పరీక్ష చాల బాగా రాశాడు. ఎక్కడో మిస్సైవుంటుంది. దీని గురించి తెలుసుకోండి సార్. అయనా నాకు చాలా మంచి మిత్రుడు.
అతనికీ కూడా సీటోస్తే, మేమిద్దరం కలిసి మంచిగా చదువు కుంటాము.’ అని చెప్పీ, ఆ ప్రిన్సీపాల్ ను ఈ విషయం పై ఆలోచింప చేశాను. అప్పుడు ‘ఆ ప్రిన్సీపాల్ తప్పుకుండా చూస్తామని, రేపు- ఎల్లుండి వరుకు, అందరూ వచ్చి జాయినౌతారు. ఒక వేళ ఈ ‘హాల్ టికెట్ నెంబర్ ‘ పైన వేరేవరైనా జాయిన్ అవుతుంటే, వాళ్ళను దొరకబట్టీ, ఆ కాల్ లేటర్ ను స్వాధీనం చేసుకుని, రవీందర్ పేరుమీద ఇంకో కాల్ సెంటర్ ఇష్యూ చేస్తాను.’ అని ధైర్యం చెప్పాడు. ఆయన చెప్పిన విధంగానే, మూడో రోజున ఈ హాల్ టికెట్ నెంబర్ పైన వేరే అబ్బాయి జాయిన్ అవుతుంటే, దొరకబట్టీ, దానిమీద ‘రవీందర్’ పేరు రాసి, అతనినీ తీసుకొని రమ్మని, ప్రిన్సిపాల్ నన్ను పంపించాడు.
నాకు చాలా సంతోషం వేసింది. ఆ కాల్ లెటర్ తీసుకొని, వెంటనే బయలుదేరి ‘రవీందర్’ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి పోయేసరికి వాళ్ళ ఇంటి వెనకాల రాళ్ళ చెలకలో నాగలి దున్నుతూ కనిపించాడు ‘రవీందర్’. నేను అతని దగ్గరికి వెళ్ళాను. విషయం వివరించి చెప్పాను. చాలా సంతోష పడ్డాడు. తెల్లారి పొద్దుగాల మేమిద్దరం బయలుదేరి ‘ఏటూరు నాగారం’ ఎస్టీ గురుకుల పాఠశాలకు చేరుకున్నాము. సాయంత్రం సమయం నాలుగౌతుంది. ప్రిన్సీపాల్ వద్దకు వెళ్ళాము. సార్ నన్ను మెచ్చుకున్నాడు.’రవీందర్ ‘ ను ఎనిమిదోవ తరగతిలో జాయిన్ చేసుకున్నాడు. మళ్ళీ మేమిద్దరం కలిసి గురుకుల పాఠశాలలో చదువ సాగాము.
— డా.బోంద్యాలు బానోత్(భరత్)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
నా కథ- ( చలో హైదరాబాద్) 11- డా.బోంద్యాలు బానోత్(భరత్) — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>