సమాజం చెక్కిన శిల్పం(కథ )- యలమర్తి అనురాధ

మబ్బులు క్రమ్మిన ఆకాశం ఏ నిముషానయినా వర్షం జల్లులతో భూదేవిని అబిషేకించవచ్చు అన్నట్లుంది.చల్లని గాలితెమ్మెరలు ఆత్మీయంగా పలుకరించి వెళుతున్నాయి.ఎక్కడో దగ్గరలో కుంభవృష్టి కురిసిన సూచనలు కనిపిస్తున్నాయి అనుకున్నంతలోనే చినుకులు ప్రారంభమయ్యాయి.ఆహ్లాదం ఎక్కువై ఈ వాతావరణానికి ఊయలలూగాలనిపిస్తున్న తరుణం.కాసేపు వచ్చిందో లేదో చటుక్కున ఎవరో పిలిచినట్లు మాయమయింది వాన.కానీ మట్టి పరిమళం మనసును తాకుతోంది ‘యమున’కు.
అందానికే ముద్దొచ్చే అందం ఆమెది.ఏ శిల్పో మలచిన శిల్పం ఒకసారి చైతన్యం తెచ్చుకుందా అన్న వైనంలో అక్కడ కూర్చునివుంది.
కాని ఆమె అంతరంగం మాత్రం ఘోషపెడుతుంది నేను శిల్పాన్ని కాదు రాయినని. అపుడపుడూ జన్మకో శివరాత్రిలా ఇలా రాగాలు పలుకుతాయి.
రాయి శిల్పం అవుతుంది కానీ శిల్పం రాయి అవ్వటమేమిటి..?
ఈ లోకంలో ఎన్ని అసహజాలు సహజత్వాన్ని నింపుకోవటంలేదు?ఇదీ అంతే !
సమద్రం లోతు చూడాలంటే అందులోకి దిగాల్సిందే. అలాగే ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే ఆమె జీవితంలోకి తొంగి చూడాల్సిందే !
యమున ఒకపుడు గలగల పారే సెలయేరే!
కాలు క్రిందపెడితే ఎక్కడ కందిపోతుందో అన్నంత అపురూపంగా చూసుకున్నారు రామచంద్రరాజు.
గణపవరం లో ఆయనో మోతుబరి.
మరో పిల్లాడు పుట్టగానే ఇద్దరు చాలనుకున్నారు.’మానస్ ‘ కన్నా యమున అంటేనే ఆయనకు ఇష్టం ఎక్కవగా ఉండేది.ఎందుకంటే యమున పుట్టిన రోజునుంచే ఆయన దశ మారింది.అప్పటివరకు మామూలుగా ఉన్న ఆయన ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.అందుకే నీది నాదీ ఒకేరోజు పుట్టినరోజు అని సంబరాలు జరిపేవారు.ఆ రోజు ఊరు వారందరికి భోజనాలు పెట్టేవారు.ఆడింది ఆటగా పాడింది పాటగా అల్లారుముద్దుగా పెరిగింది.ఆమె పాదాలక్రింద తన అరచేతులుంచి నడిపించేంత ప్రేమ ఆయనది.ఒకపుడు కౌలు చేసుకునే వ్యక్తిని 24 ఎకరాలకు ఆసామిని చేసింది యమున అదృష్టమేనని ఆయన ప్రగాఢ విశ్వాసం.అందుకే రోజురోజుకు ఆమెపై మక్కువ పెంచుకుంటూ వచ్చారు.ఒక్కసారి యమునకు పెళ్ళిచేసి అత్తారింటికి పంపగలనా అని తనపై తనకే సందేహం వస్తుండేది.ఆఁ ! అంతగా అయితే ఇల్లరికం తెచ్చుకుంటాను అని మనసుకు సర్దిచెపుకునేవారు.
తల్లి ‘వెంగమాంబ’ మాత్రం ఆడపిల్ల అత్తారింటికెళితేనే అందం,అప్పుడపుడు తెచ్చుకుని అచ్చట్లూముచ్చట్లూ జరుపుకోవచ్చని అతని ఆలోచనలకు అడ్డుపుల్ల వేస్తూ ఉండేది.
అలా అపశకునం పలుకకే అమ్మా!అని విసుక్కునేవాడు.అదీ చాలా అరుదుగా.మనసులో మాత్రం అలా చెయ్యకు భగవంతుడా అని మొరపెట్టుకునేవాడు.కానీ ఏది మనిషి చేతిలో ఉండదు.అంతా భగవంతుని లీల.
ఒకసారి ‘పాలకొల్లు’ వెళ్లి వస్తుండగా బస్సులోంచి దిగుతుంటే కాలు జారింది.చటుక్కున వచ్చి పట్టుకున్నాడు ఒక యువకుడు తనను పడిపోకుండా.పట్టుకున్న అతను ఎవరా అని తల ఎత్తాను.ఎదురుగ ఉన్న అతన్ని చూడగానే హృదయం ఉప్పొంగింది.తెలియని ఆరాధన అతన్ని చూస్తేనే కలుగుతోంది.తన చిట్టితల్లికి ఇతనే భర్త అవుతాడేమో అనికూడా అనిపించింది ఆ క్షణంలో. కాసేపు కూర్చోని వెళుదురుగాని అని తనే దగ్గరుండి నడిపించి తీసుకెళ్ళి అక్కడున్న బెంచీమీద కూర్చోపెట్టాడు.
నువ్వు వెళ్ళు నాయనా బస్సు వెళ్ళిపోతుంది అంటున్నా వినిపించుకోలేదు.”ఫరవాలేదులేండి .మీరు పెద్దవారు,ఇలాంటి సమయంలో ఎవరో ఒకరు ఉంటే మంచిది.నేను తరువాత బస్సుకి వెళతాను” అని చెప్పి బడ్డీకొట్టులో సోడా తీసుకుని వచ్చి తాగించాడు వద్దని వారిస్తున్నా.
కూల్ డ్రింక్ తెచ్చే వాడినే.అవి మంచిది కాదు ఆరోగ్యానికి అంటున్నారు కదండీ.అందుకే
ఇది తీసుకువచ్చాను.లోపల ఏదన్నా ఉన్నా కడిగి పారేస్తుంది”.
ఎవరో తెలియని వ్యక్తిపైన అతడు చూపిస్తున్న అభిమానానికి ముచ్చటవేసింది.
“ఏ ఊరు వెళ్ళాలని బయలుదేరావు బాబూ?”
“గణపవరం అండీ.అక్కడ మా బంధువుల ఇంటిలో పెళ్ళి”
“అవునా మా ఊరు అదే !నేను అక్కడినుంచే వస్తున్నాను”.
” చాలా రోజులకు వస్తున్నావని,రెండు మూడు రోజులు ఉండాలని మా చుట్టాలు గొడవచేస్తే తప్పక బయలుదేరాను.”
“ఎవరు మీ బంధువులు?”
“గోవిందరాజుగారు మా బాబాయి”
అతని కళ్ళు వింతగా మెరిసాయి.అతనిది తన కులమేనని అర్ధమవ్వటంతో,పెళ్ళయ్యిందా లేదా..అడిగితే ఏమనుకుంటాడో అని తర్జన భర్జన పడుతుంటే.. బాబాయికి బాగా దగ్గరవారికి ఓ అమ్మాయి ఉందని,ఆ అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంటుంది,చూసి నచ్చితే మాట్లాడుకోవచ్చని అంటే మా నాన్నగారు నన్ను పంపారు.”
అయితే గోవిందరాజు చెప్పిన పిల్ల నా కూతురు యమునే ఏమో! ఎంత యాదృచ్చికంగా కలిసాం.
“పిల్ల తండ్రి పేరు ఏంటి ? “
“రామచంద్రరాజు గారంటండీ”
“ఓ!సరే బాబు.ఈ రోజు నా పని చూసుకుని రేపు ఊరికి వచ్చేస్తాను.అప్పుడు మనం కలుసుకుందాం. తప్పక మా ఇంటికి వద్దువు గాని “
“అలాగేనండీ”అన్నాడతను
ఆయన బస్టాండు దాటి బయటకు వెళ్ళేదాకా ఆయన దగ్గరే ఉండి లోపలకి వెళ్ళాడు.
అతని వినయం ఆయనకు ఎంతో నచ్చింది.నచ్చితే ఏమిటి?యమున అతనికి నచ్చాలి కదా!ఆ(!అసలు యమున నచ్చలేదనే వాళ్ళు అసలు ఉంటారా? దానికి కారణం నేనే కదా అని గర్వంగా మీసం మెలేసుకున్నారు.అసలు పని ఆపేసుకుని అతనితో వెళ్ళిపోదామా అన్నంత ఆత్రంగా ఉంది లోలోపల ఆయనకు.అయినా ఇదీ ఒకందుకు మంచిదే.వీళ్ళ మంచిచెడ్డలు కనుక్కోవటానికి వీలు చిక్కింది.ఇపుడే ఆ పని కూడా కానిచ్చేస్తే సరిపోతుంది అని మనసుకి సర్ది చెప్పుకున్నారు.
అనుకున్నట్లే అన్నీ తెలుసుకున్నారు కూడా.
రెండంతస్తుల భవనం,మంచి వ్యాపారం, ఇద్దరే మగపిల్లలు,ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిల్లు అయిపోయాయి ,ఇతను రెండవవాడు.
ఆయన నేల మీద నడుస్తున్నాడే కాని ఆనందంలో ఆకాశంలో ఎగురుతున్నట్టే ఉంది.ఎందుకింత సంతోషమో ఆయనకే తెలియటంలేదు.
అన్నీ అనుకోకుండా జరిగినట్టే జరిగిపోయాయి.
మంచి సంబంధం ఇల్లరికం అని అడిగి పోగొట్టుకోవటం ఎందుకు అని అతని మనసుకే అనిపించటంతో ఆ ఊసే ఎత్తలేదు.
అదీ గాకా రేపు నీ కొడుకు అలా వెళ్శిపోతే నీ గతి ఏమిటి అన్న ప్రశ్న పలుసార్లు అతన్ని వేదించటంతో ఆయన ఆ నిర్ణయానికి తలొగ్గారు.
కట్నకానుకలు బాగా ముట్టచెప్పి యమునను ‘కృష్ణకాంత్’ చేతిలో పెట్టేసారు.
యమునకు కృష్ణకాంత్ దగ్గర ఉంటే తన తండ్రి దగ్గర ఉన్నట్లే అనిపించేది.అది తండ్రిమీద సగం బెంగను తగ్గించింది.
యమున ససేమిరా రానంది.నాన్నకు కూడా ఈ విషయం చెప్పొద్దని బ్రతిమాలుకుంది అమ్మమ్మను.
“అలాగే “అని వెళ్ళిపోయింది ఆవిడ.
సరిగ్గా ఇది జరిగిన ఒక సంవత్సరానికే తండ్రిని కోల్పోయింది యమున.
ఆయన శవం దగ్గర కుర్చుని తల్లి ఏడుస్తూ అంటున్న మాటలు ఆమెను మరింత గుండెకోతకు గురిచేసాయి.
‘నీ మీద బెంగతో ఇంత తొందరగా వెళ్ళిపోయారే మీ నాన్న’ అంటున్న ఆమె మాటలు నిశ్చేష్టురాలని చేసాయి యమునను.
తన విషయం తండ్రికి తెలిసిపోయిందా ?
అదే తండ్రిని తననుంచి దూరం చేసిందా ? అని కుమిలిపోవటం తప్ప ఏమి చెయలేని పరిస్తితి.
అందుకే అయిదో నెలలో తనని తీసుకు వెల్దామని వచ్చి ఉంటారు, అలా అయినా తనని బాగా చూసుకోవచ్చు అనుకుని ఉంటారు.
కాని ఇక్కడ అత్తయ్యా మామయ్యా దానికి నిరాకరించారు.
తొమ్మిదవ నెలలో తీసుకెళ్ళమన్నారు.తను అటు వెళ్ళగానే ఈయనను దుబాయ్ పంపించారు.పిల్లాడికి మూడోనెల వచ్చేదాకా తను ఒంటరిగా ఉండవలసివచ్చింది.
కానుపు అయ్యేటపుడు ఏ భార్య అయినా తన భర్త పక్కన ఉండాలని కోరుకుంటుంది, ఆ అదృష్టం కూడా తనకు దక్కలేదు.
అంతేనా ! పిల్లాడితో తను కాపురానికి వస్తే ఇంట్లోంచి తరిమేసారు.
ఇల్లు పెద్దబ్బాయి ఒక్కడికే రాసేసారు.
అది ఆయన స్వార్జితం అవ్వటంతో మామగారిని ఏమి అనలేక బయటకు వచ్చేసారు.
బావగారి టాలెంట్,తమ తెలివి తక్కువతనానికి నవ్వువచ్చింది.గంజినీళ్ళు తాగి బతికారు.
“నిన్ను మీ నాన్నలా చూసుకుంటా ” అన్న భర్త ప్రేమ ముందు ఏదైనా బలాదూరే అనుకుంది.
అత్త గంటసేపు తనమీద చాడీలు చెప్పినా విని, తన దగ్గర మంచిగా నవ్వుతు మాట్లాడే అతన్ని చూస్తే ఉన్నతంగా అనిపించేది.ఇంకొకళ్ళైతే తిడతారు ,కొడతారు.ఆ మాటలు చెవికి ఎక్కించుకుంటారు.కాని ఇతను అంతకు రెట్టింపు ప్రేమను ఇస్తాడు. ఆ ప్రేమకు ఈ జన్మ చాలదేమో అనిపిస్తుంది.ఇంకా ఇంకా కావాలనే కోరిక.
తాము వ్యాపారంలో దెబ్బతిన్నపుడు అతన్ని వదిలేసి వచ్చేయమ్మా, విడాకులు ఇప్పించి మరో అతనితో పెళ్ళి చేస్తానని నాన్న అడిగారు.సీతమ్మ ,అనసూయ ,అహల్యలను చదివి పెరిగాను.అయినా తన భర్త మంచివాడు.సీతమ్మ కంటే ఎక్కువ కష్టాలు ఏం పడటం లేదుగా తను. ఈ జన్మకు ఒకరితోనే జీవితం.తనను వదిలి రానని ఆనాడు ఖచ్చితంగ చెప్పేసింది.అయినా అతన్ని వదిలేసి వస్తే నాన్న పరువు ఏమవుతుంది అని కూడా ఆలోచించింది.ఆ ఊర్లో ఆయన తల ఎత్తుకుని బ్రతకగలడా ?
మళ్ళీ ఏదో చెప్పబోతున్న తండ్రితో నా భర్త బంగారం నాన్న!నువ్వేం బెంగ పెట్టుకోకు.డబ్బు ఉన్నవాళ్ళంతా సుఖంగా ఉంటున్నారా?అదిలేకపోయినా మేం బాగుంటున్నాం ,మా ఇద్దరికి మా ప్రేమ చాలు ,నాకు దూరంగ ఉన్నపుడు కూడా ప్రతిక్షణం నన్నే తలచుకునేవారట ఈయన.నాకు ఇంతకన్నా ఏం కావాలి అని నాన్నను పంపించేసింది.
నిజం చెప్పాలంటే ఈ కష్టాలు భరించలేక చచ్చిపోవాలనిపించింది,కానీ అతని మీద ప్రేమ ఆ పని చెయ్యనియ్యలేదు.రేపు ఇంకా బాగుంటుందేమో?అపుడు మనం ఉండలేకపోతాంగా అనిపించి మానేసింది.
నా జీవితం కూడా నీ జీవితంలానే ఉంది సీతమ్మా అని తను లేని రోజులు గడిపేసింది.నీకు నీ రాముడు లేడు ,నాకు నా కృష్ణుడు లేడు అనుకుంది.
నిన్ను అనుమానంతో పంపారు.నన్ను గౌరవంతో పంపారు. అదే మన ఇద్దరికి తేడా అని మనసుకి సర్దిచెప్పుకుంది కాన్పుకి వెళ్ళినపుడు కూడా.
అందరూ వారిని వెలేసినట్లు దూరం జరిగినపుడు కూడా మేమెవ్వరికి లేము మాకు ఎవ్వరు లేరు అనుకున్నారే కాని ఎవరినీ తప్పు పట్టలేదు.
వాచ్ మేన్ కంటే హీనంగా రేకులషెడ్ లో జీవనం గడిపినపుడు కూడా బాధపడలేదు.ఒకరికోసం ఒకరిలా బతికారు.
ప్రేమ ,అభిమానం ,సంతోషమే అసలైన సంపదలా బ్రతికాం.ఈర్ష్య అసూయ లేకుంటే చాలు,ప్రేమతో దేన్నయినా జయించగలం అనుకున్నారు అలాగే బ్రతికారు.
నాకు నువ్వు నీకు నేను అన్న నాన్న ఆమె మీద దిగులుతో మరణించినా ఆ బాధను దిగమ్రింగుకున్నారు.ఇపుడు ఒకరికి పెట్టే స్థాయిలోకి ఎదిగారు.తమ్ముడు మానస్ అండ కొండంత ఉండేది వారికి.అయినా ఆ రోజు కష్టాలు వచ్చినపుడు చచ్చిపోయుంటే ఈ సుఖం ఈ జీవితం ఉండేది కాదు కదా అనుకుంటుంది యమున.
ఈ రోజు తను ఇంత ఆనందంగా బ్రతుకుతుందంటే అదంతా తను చదువుకున్న పుస్తకాలు,అందులోని సారాంసమే అని బలంగా నమ్ముతుంది.
రామాయణం ఎలా బ్రతకాలో చూపించింది.భగవద్గీత ఎట్లా ఉండాలో చూపించింది అంటుంది.నలుగురిలో నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడే యమునకు ఇన్ని కష్టాలున్నాయంటే ఎవరైన నమ్ముతారా?
ప్రేమ దక్కలేదని యాసిడ్స్ పోసుకునే ఈ రోజుల్లో యమున ఆ ప్రేమనే ఆధారంగా చేసుకుని జీవితాన్ని సఫలీకృతం చేసుకుంది.
కానీ ఆమె హృదయం మాత్రం ఈ సమాజం,అందులో వ్యక్తుల మనస్తత్వాలు,వారి మాటలు విని రాయిలా తయారయ్యానంటుంది.
ఆమె అభిప్రాయం నిజమే కదూ..!
-యలమర్తి అనూరాధ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
సమాజం చెక్కిన శిల్పం(కథ )- యలమర్తి అనురాధ — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>