“సవతి తల్లి” (కథ) – డా.మజ్జి భారతి
“రవి మారుటితల్లి వచ్చిందట. ఇన్నాళ్లకు తీరికయింది కాబోలు. ఏమిటో విషయం? ఇన్నాళ్లూ వీడి ఆజాపాజా కనుక్కోలేదు. ఇంజినీరింగులో మంచిర్యాంకు తెచ్చుకోగానే గుర్తొచ్చాడు కాబోలు సవతికొడుకు.”
“చిన్నప్పుడైతే సేవచెయ్యాలి గాని, పెద్దవాడయ్యాడు కదా! ఆవిడ పిల్లలకి సేవ చెయ్యడానికి అవసరమయ్యాడు కాబోలు” “అవునూ! ఆవిడికి కవలపిల్లలు కదా! అమ్మాయి, అబ్బాయి”
“ఇన్ని సంవత్సరాలుగా రానిది, యిప్పుడే ముఖం పెట్టుకొనివచ్చిందో?”
ఇంటికెళుతుంటే త్రోవపొడువునా ఊర్లోవాళ్ళ మాటలు… కోపాన్ని పెంచుతున్నాయి రవిలో. ఆర్నెల్లకోమారు వచ్చినా తండ్రితో రవికి అనుబంధం తక్కువే. అయిదారేళ్ళగా ఈవిడ రానేలేదు. ఇప్పుడెందుకొచ్చిందో! ఆవిడ గుర్తుకొస్తుంటే కడుపులో మండిపోతుంది. యిన్ని సంవత్సరాలుగా తనను వదిలేసి…. కుతకుతలాడిపోతుంది రవి మనసు.
“కన్నా! ఎలావున్నావురా?” రవిని చూసి దగ్గరకు రాబోయిన ఆమె, రవికళ్ళలోని తీక్షణతను చూసి ఆగిపోయిందక్కడే.
“ప్రేమ వొలకబోసేస్తుంది” ఏమి జరగబోతుందో చూడడానికొచ్చిన యిరుగుపొరుగు అందరికీ వినిపించేంత చిన్నగా మాటాడుకుంటున్నారు. ఎంత పట్టించుకోకుండా వుందామన్నా రవి సవతితల్లి కమల ముఖం మ్లానమైపోయింది ఆ మాటతో.
“వచ్చిన పనేమిటో?” మొహమాటం లేకుండా అడిగేసారెవరో.
“జనార్ధన మాస్టరుగారితో మాట్లాడాను. మాస్టారులేరా?” ఇంతమంది చూపులూ గుచ్చుకుంటుంటే నోరు పెగుల్చుకొని అందామె. జనార్ధనమాస్టారు…. ఆ ఊరిలో ఎవరికి ఏ సలహా కావాలన్నా ఆయనదగ్గరికే వెళతారు.
విషయమేమిటో చెప్పు అనకుండా “ఒంట్లో బాగాలేక పిల్లలదగ్గరకు వెళ్లారు. ఇప్పుడప్పుడే రారు” అన్నారొకరు.
“బాబు యిన్నాళ్ళూ మాకు దూరంగా ఉన్నాడు. హైదరాబాదులో మంచి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇంటిదగ్గర వుండి చదువుకుంటాడని. బాబుని తీసుకెళ్దామని వచ్చాను. అమ్మకూడా పెద్దయిపోయింది. యింకా యెన్నాళ్లు చూసుకోగలదు?” రవి అమ్మమ్మ సావిత్రమ్మని ఆవిడ అమ్మా అనే సంబోధిస్తుంది.
“రవికిష్టమో! కాదో! మీరనుకోగానే సరిపోదుకదా!” అన్నాడు వూరికి పెద్దైన సోమయ్యతాత. “పెద్దవాళ్లు మీరందరూ చెబితే బాబు వింటాడు. ఈ వయసులో ఇంటిదగ్గర ఉండి చదువుకోవడం మంచిది” చాలా మర్యాదగా అందావిడ.
“వైజాగులో చదువుకుంటాను. నా ఫ్రెండ్సందరూ అక్కడే జాయినవుతారు. నేను హైదరాబాదు రాను” అనేసి లోపలికెళ్ళిపోయాడు రవి. ఎవరన్నా నచ్చచెప్పుతారేమోనని ఆశతో చూసిందామె అందరివైపూ. అందరూ ముఖం తిప్పుకున్నారు. “బాగా చెప్పాడు” అనేసారెవరో అందరికీ వినిపించేంత చిన్నగా.
“విన్నావు కదమ్మా! వాడికిష్టం లేకుండా ఎందుకులే?” అనేశాడు సోమయ్య తాత. నిరాశతో వెనుతిరిగిందామె. చనిపోయిన కూతురు శారదను తలుచుకొని కన్నీళ్లుపెట్టుకుంది సావిత్రమ్మ.
“తగుదునమ్మా అని వచ్చి నిన్నేడిపించింది. ఊరుకో”
“అయినా వాడి దురదృష్టం. నువ్వేమి చేస్తావులే”
“సవతికొడుకున్నాడని యిన్నాళ్ళూ గుర్తురాలేదు. ఇప్పుడు ప్రేమ పొంగిపోయింది”
“యిన్నాళ్ళూ వయసయిపోయిన దానివి, ఎలా చేసావన్న ఇంగితం లేదు. రేపు చదువైపోయాక లక్షలు సంపాదిస్తాడని ముందే వల వేస్తుంది”
“ఎంత చూసినా సవతితల్లి సవతితల్లే. దాని బదులు హాస్టలే మేలు” రకరకాల మాటలు. గదిలోవున్న రవికి వినిపిస్తూనే ఉన్నాయి. అమ్మ గుర్తుకొచ్చింది. వెక్కివెక్కి ఏడ్చేసాడు. ఇన్నాళ్లూ రానందుకు కాదు. ఇప్పుడొచ్చి తేనెతుట్టలా జ్ఞాపకాలను కదిపినందుకు ఆవిడమీద కోపం లావాలా పొంగిపోతుంది రవి మనసులో.
శారద చనిపోయిన తర్వాత ఒక సంవత్సరంపాటు ఉన్నాడు రవి వాళ్ళింట్లో. కమల బాగా చూడడం లేదని సావిత్రమ్మ వాళ్లవూరు తీసుకొచ్చింది రవిని. హైస్కూలు, ఇంటర్మీడియట్ ఇక్కడే చదివి ఇప్పుడు ఇంజనీరింగులోకి వస్తున్నాడు రవి.
*****
రవి ఇంజనీరింగు మూడో సంవత్సరం చదువుతుండగా సావిత్రమ్మ గుండెపోటుతో హఠాత్తుగా చనిపోయింది. దశదినకర్మలు దగ్గరుండి చూసుకున్న రవితండ్రి సుగుణాకర్, ఆ వారం రోజుల్లోనే వైజాగ్ ట్రాన్స్ఫర్ చేయించుకొని, రవిని హాస్టలునుండి ఇంటికి తీసుకువచ్చేస్తానని అందరి ముందూ చెప్పాడు. కమల వచ్చి అడిగినప్పుడు నానామాటలన్న అందరూ, సుగుణాకర్ ఎదుట మాత్రం మౌనం పాటించారు. ఆరకంగా రవి ఇప్పుడు ఇంటినుండి కాలేజీకి వెళ్తున్నాడు. కాని యింట్లో అప్పటిలాగే మౌనం పాటిస్తున్నాడు. సవతితమ్ముడు మురళికి రవి రావడం అస్సలు యిష్టంలేదు. వీలు దొరికినప్పుడల్లా ఆ విషయం వ్యక్తపరుస్తూనే ఉంటాడు. కమలతో తిట్లు కాస్తూనేవుంటాడు. “నిన్ను కాదని వెళ్ళాడు కదా! వాడిని మరలా యిక్కడికెందుకు తెచ్చారు” అని కమలతో పోట్లాడడం రవి వింటూనే ఉన్నాడు. వాడిప్పుడు ఆరో తరగతికొచ్చాడు. చెల్లి వసుధ మాత్రం రవితో మాట్లాడాలని ప్రయత్నిస్తుంటుంది, రవి బదులు చెప్పకపోయినా సరే.
*****
మంచంమీద బద్దకంగా కదులుతున్నాడు రవి. ఈరోజు అస్సలు లేవాలనిపించడం లేదు. ఈరోజేమిటో తెలిసి గదినుండి బయటకు రావాలనిపించడం లేదు. కాని, ఉదయం నుండి మూడు, నాలుగుసార్లు గదితలుపు తియ్యడం, ముయ్యడం తెలుస్తుంది. ఇన్నాళ్లూ లేనిది తాను లేచాడా లేదా అని ఎవరు చూస్తున్నారు? అయినా కళ్ళు తెరవాలనిపించడం లేదు. అమ్మ గుర్తుకొచ్చింది. ఇదే రోజు అమ్మ…. గుడికివెళుతూ, అదుపు తప్పి మీదికొస్తున్న స్కూటరునుండి తనను తప్పించి, ఆ స్కూటరు కిందేపడి అమ్మ, తనను ఒంటరిని చేసి ఈ లోకంనుండి నిష్క్రమించింది. అందుకే ఈరోజంటే తనకస్సలు ఇష్టం ఉండదు. ఎవరితోనూ మాట్లాడాలనిపించదు. గోడ గడియారంలో పెద్దముల్లు, చిన్నముల్లు కలవగానే ఏడుగంటలు కొట్టింది. కాలేజీకి వెళ్లాలి. ఇక తప్పదన్నట్లు లేచాడు రవి.
రవి ఎప్పుడు లేస్తాడా అని ఎదురుచూస్తున్న కమల “పుట్టినరోజు శుభాకాంక్షలు కన్నా” అంటూ లోపలికొచ్చింది.
ఆమాట వినగానే రవికి ఎంతకోపం వచ్చిందంటే ఈవిడకి కొంచెంకూడా మా అమ్మంటే ఏ మాత్రం సానుభూతి లేదా! ఈ రకంగా మాట్లాడుతుంది. ఛీ.. ఏమి మనిషి? అనిపించి, “ఈరోజు నా పుట్టినరోజు మాత్రమే కాదు. ఇంకా యేమిటో మీరు మర్చిపోయినట్లున్నారు” అన్నాడు తన మనసులోని కోపాన్ని మాటలద్వారా చూపిస్తూ.
“మర్చిపోలేదు కాబట్టే, నీకు గుర్తుచేస్తున్నాను’ అంటూ మీదకు చూసి ఆ లోకంలో ఉన్న మా అక్క “ఏమే! ఇన్నాళ్లకు నా కొడుకుని నీ దగ్గరికి పంపిస్తే వాడికి పుట్టినరోజు పండగ చెయ్యవా! నేనులేను కదా అని వాడిని వదిలేస్తావా? నాకులాగే నీ కొడుకుకి పుట్టినరోజు చేసుకునే అదృష్టం నీకు దూరమైతే….. ఏమనుకుంటున్నావో?” అని పైనుండి నాకు శాపం ఇస్తే? అందుకే చెప్తున్నాను. వెళ్లి తయారై రా. గుడికి వెళ్దాము” అంటూ బయటికెళ్ళింది కమల.
పదేళ్లయింది అమ్మ దూరమై. తన తొమ్మిదవ పుట్టినరోజు నాడు, తనను గుడికి తీసుకు వెళ్ళబోయి తానే దేవుని దగ్గరకు వెళ్ళిపోయింది. ఆరోజునుండి ఈరోజు వరకూ తాను పుట్టినరోజు చేసుకున్నది లేదు. మరలా ఈరోజు ఈమె… తన తండ్రి రెండవభార్య…. పిన్ని అని తనచేత కొన్నాళ్లు పిలిపించుకున్నామె…. నువ్వు పుట్టినరోజు చేసుకోకపోతే, మీ అమ్మలాగే నేనుకూడా దూరమైపోతే అని తనను ఒక రకమైన సందిగ్ధంలోకి నెట్టివేసింది.
స్నానంచేసి రాగానే మంచంమీద కొత్తబట్టలు. పదేళ్లుగా అలవాటు లేని కార్యక్రమం. అయిష్టంగానే ఆ బట్టలు కట్టుకొని బయటకు వచ్చాడు రవి. రవి బయటకు ఎప్పుడొస్తాడా అని ఎదురుచూస్తుందేమో కమల….. రవి బయటకు రాగానే పూజగదిలోకి తీసుకెళ్లింది.
పూజగదిలో రవితల్లి శారద నిలువెత్తు చిత్రపటం. ఎదురుగా నిలబడి చూస్తున్నట్లు…. ఈ ఇంటికి వచ్చి మూడునెలలైనా ఏరోజూ పూజగదిలోకి రాని రవి, మొదటిసారి అమ్మనంత దగ్గరగా చూస్తున్నాడు…. యీ ఇంట్లో ఎక్కడా అమ్మ ఫోటోలు కనిపించకపోతే అమ్మను పూర్తిగా మర్చిపోయారు వీళ్ళు అనుకున్నాడు తాను. కాని ఇలా పూజగదిలో పెట్టి అమ్మనొక దేవతలా చూసుకుంటున్నారు వీళ్ళని, తనకింతవరకు తెలియలేదు. అమ్మ చిత్రపటం ముందు అమ్మకిష్టమైన పెసరబూరెలు. ఆ బూరెలు ఎప్పుడు చేసినా “మీ అమ్మకివి చాలా ఇష్టం. యివుంటే చాలు అన్నంకూడా తినేదికాదు మీ అమ్మ” అని అమ్మమ్మ అనడం గుర్తుకొచ్చింది రవికి.
“ఇదిగో అక్కా! నీ కొడుకు. వాడు బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని ఆశీర్వదించు” అని దండం పెట్టుకొని రవిని పూజగదిలో విడిచి బయటకు వెళ్ళిపోయింది కమల.
చిత్రపటంలో నుండి తల్లి తనను చూస్తున్నట్టే అనిపిస్తుంది రవికి. “హ్యాపీ బర్త్ డే కన్నా!” అని చెప్తున్నట్టనిపించింది. అమ్మ చిరునవ్వుతో తనను చూస్తున్నట్లనిపిస్తుంది. అలా ఎంతసేపు కూర్చున్నాడో! కాలేజీకి వెళ్లాలంటూ గడియారం ఎనిమిదోగంట కొట్టింది. పూజగది నుండి బయటకు వచ్చిన రవికి తనకెంతో ఇష్టమైన గారెలు, బిర్యానీ…. భోజనపు బల్లమీద. అవి చూసిన రవికి మనసులో చాలా గిల్టీగా అనిపించింది. ఈమెను గురించా తాను మనసులో ఎన్నో రకాలుగా అనుకున్నాడిన్నాళ్లూ! తన ఇష్టాయిష్టాలు ఏవీ మర్చిపోలేదు పిన్ని. అన్నీ తనకిష్టమైనవే చేస్తుందని, మురళి పిన్నితో తగువు పెట్టుకోవడం కూడా చూస్తున్నాడు తాను.
రవికి తన చిన్నతనం గుర్తుకొచ్చింది. అమ్మ చనిపోయిన ఆరునెలలకేమో నాన్న ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మొదటిసారి ఆమె తమయింట్లో అడుగుపెట్టినది ఇప్పటికీ తనకి బాగా గుర్తుంది. ఆమె కళ్ళు ఎవరికోసమో వెతుకుతున్నాయి. ఒక మూలవున్న తననిచూసి ఆమెకళ్ళు మెరిసాయి. ఆ కళ్ళల్లోని మెరుపు ఇప్పటికీ తనకి గుర్తే.
తనను తీసుకొని పూజగదిలోకి వెళ్లి అక్కడ ఉన్న అమ్మఫోటో ముందు సాష్టాంగ దండప్రణామంచేసి “అక్కా! వీడే నా పెద్దకొడుకు. నేనేమైనా తప్పులు చేస్తే నన్ను దిద్దు” అని దండం పెట్టుకుంది. నిజానికి తనను అమ్మలా బాగా చూసుకునేది. తనకు పిన్నంటే చాలా ఇష్టముండేది. కానీ తానేమైనా అల్లరి చేసినప్పుడు పిన్ని దండించబోతే “సవతితల్లి కాబట్టి, పిల్లాడ్ని ఎలా చూస్తుందో! సొంతపిల్లల్నైతే అలాగే దండిస్తుందా?” అని చుట్టుపక్కలవాళ్ళ విమర్శలు…. తాను అన్నం సరిగ్గా తినకపోతే పిన్ని బాగా కోప్పడేది. అటువంటప్పుడు ఇరుగుపొరుగువాళ్లు “శారదైతే లాలించి తినిపించేది. సవతితల్లికి అవన్నీ పడతాయా! ఏదో మెహర్బానీ కోసం గాని…. పాపం వాడిని చూస్తే జాలేస్తుంది” అన్న వాళ్ళమాటలు తనలో అభద్రతాభావాన్ని పెంచాయేమో! దానికితోడు పెళ్లయిన సంవత్సరంలోనే పిన్నికి కవలపిల్లలు. మురళి, వసుధ… తనకన్నా పదేళ్లు చిన్నవాళ్లు. వాళ్లు పుట్టాక, తనను పట్టించుకోవడంలేదని కోపం… దుగ్ద… ఆ కోపంలో…. ఎవరూ చూడకుండా వాళ్ళని గిల్లడం, కొట్టడం చేసేవాడు. పిన్ని మందలించబోతే ఏడ్చి గోలచేసేవాడు. ఒకసారి అమ్మమ్మ వచ్చినప్పుడు, ఇదే విషయంలో పిన్ని తనను మందలించబోతే “తల్లిలేని పిల్లాడిని ఇలాగే చూస్తావా? అవునులే బాగా చూడడానికి వాడు నీ సొంతకొడుకా ఏమిటి?” అంటూ, వద్దని పిన్ని ఎంత బ్రతిమలాడినా వినకుండా వాళ్లవూరు తీసుకెళ్లిపోయింది అమ్మమ్మ తనను.
నాన్న ఎక్కువగా రాకపోయినా, పాపం పిన్ని ఇద్దరు చంటిపిల్లలను తీసుకొని తనను చూడడానికి వచ్చేది. “నువ్వు వాడికోసం రావడం సంతోషమే. కాని, నిన్ను చూసినప్పుడల్లా చనిపోయిన నా కూతురే గుర్తుకొస్తుంది నాకు” అమ్మమ్మ పిన్నితో ఈ మాటలనడం తనకు బాగా జ్ఞాపకం. ఆ మాటలకర్దం అప్పుడు తెలియలేదు తనకు. ఆ తర్వాత పిన్ని రావడం మానేసింది. పిన్ని తనను చూడడానికి రావడం లేదని కోపం. వచ్చి తనను తీసుకెళ్లలేదని కోపం. తనను మర్చిపోయిందని కోపం.
అందుకే పిన్ని తనను తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు, ముఖంమీదే రానని చెప్పేసాడు. పాపం పిన్ని ఎంత బాధపడిందో!
‘సవతితల్లి’ అనే పదం మనుషులను యెంతగా విడదీస్తుందో ఇప్పుడర్థమైంది రవికి. సవతితల్లి అని వాళ్లువీళ్లు అనడంతో, తనను బాగా చూసుకున్న పిన్నిమీద తన అభిప్రాయాలు మారిపోయినట్లే, ‘సవతిఅన్న’ అనే పదంతో మురళికి కూడా తన మీద ప్రతికూలభావాలు కలగడంలో ఆశ్చర్యమేముంది? పిన్ని మురళిని, వసుధను బాగా చూసుకుంటుందని, పదేళ్లవయసులో ఈర్ష్యాసూయలతో తానెంత బాధపడ్డాడో, ఇప్పుడు పిన్ని తనను బాగా చూసుకుంటుందని మురళి ఈర్ష్యపడడంలో ఆశ్చర్యమేమీలేదు. మురళి, మరొక రవి కాకుండా ఉండాలంటే అది తన చేతిలోనే ఉంది. అమ్మకు మాటిచ్చినట్టు పిన్ని తనని పెద్దకొడుకులాగే చూసుకుంటుంది. మరి తనూ పెద్దకొడుకులాగే ఉండాలి కదా! అమ్మవైపు చూశాడు. అమ్మ నవ్వుతూ చూసింది.
“అమ్మా! సాయంత్రం గుడికి వెళ్దాం నలుగురం” అన్నాడు బయటకొచ్చి కమలతో. కలగంటున్నానా అని ఆశ్చర్యంగా చూసిన కమల నిజమేనని గ్రహించి ఆనందంతో కౌగిలించుకుంది రవిని.
“మా అమ్మని కౌగిలించుకోవద్దు నువ్వు. నీనుండి మా అమ్మ ఎంత బాధపడిందో తెలుసా?” అని రవిని కొట్టడం మొదలుపెట్టాడు మురళి.
“సారీ, సారీ…. ఇకనుండి మీ అమ్మకాదు, మనఅమ్మ” అంటూ తనను కొడుతున్న మురళిని కూడా దగ్గరకు తీసుకున్నాడు రవి.
“హాయ్ ఇకనుండి నాకు అచ్చంగా ఇద్దరన్నలు” వీళ్ళ ముగ్గురిచుట్టూ తిరుగుతూ, చప్పట్లుకొడుతూ అంది వసుధ.
– డా.మజ్జి భారతి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
“సవతి తల్లి” (కథ) – డా.మజ్జి భారతి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>