సింగర కొండ(కథ) – పి.రాజ్య లక్ష్మి ,
సింగర కొండ తిర్నాల జనంతో కిటకిట లాడుతా ఉంది.కాలు తీసి కాలు వేయాలంటే కనాకష్టంగా ఉంది .ఇంత మందిలో సుశీలక్కను ఎక్కడని వెతకాలి.
పొద్దుపొద్దున్నే పోను చేసి తిర్నాలకు పోతున్నాను .స్వామికి మొక్కుకొనీ నా దారి నేను చూసుకుంటా .ఇక నేను ఈ బతుకు ఈదలేను. చిన్నదాన్ని కాస్త కనిపెట్టుకో అని పోను స్విచ్ ఆఫ్ చేసింది.
అద్దంకి కి దగ్గర సింగర కొండ.పెద్ద చెరువు పక్కనే గుడి.ప్రతి ఏడు తిర్నాల జరుగుతుంది.అక్కడి ఆంజనేయ స్వామికి మహిమలు ఉన్నాయని అందరికి చాలా నమ్మకం . మా ఊరి చుట్టుపక్కల అందరికి ఆ స్వామి అంటే చానా గురి.ఏ కష్టమొచ్చినా ఆ స్వామికి మొక్కులు మొక్కు కుంటారు.ఎవరు ఇక్కడ ఉన్నా తిర్నాలకు ఎవరి ఊళ్లకు వాళ్ళు వచ్చి .పొంగళ్ళు పెట్టి ,గుండ్లు గియించుకొని వేటనో,కోడిని కోసి ఖుషి చేసుకానీ పోతారు.
ఈ సారి నాకు నెలసరి రావటాన పోలేదు.నాయనోల్లకి సూతకం వచ్చిందని వాళ్ళు పోలేదు.మేము ఎవ్వరం లేము కదా అని, ఏదో పనికి మాలిన ఆలోచన చేసినట్లు ఉంది
నాకా ఏమి చేయాలో పోలుపోవటం లేదు.ఈయనేమో పొద్దుగాలే పని ఉందని బయటకు పోయిండు.ఇక ఈ రాత్రికి గాని ఇంటికి చేరడు.విషయం అతనికి చెప్పినా మీవోళ్ళ గురించి నాకు చెప్పామాక.నువ్వే ఏదో ఒకటి చేసుకో అంటాడు.
నాయనోల్లకి ఫోను చేసి విషయం చెప్పాను
అది అలానే వాగుతాదిలే, అదేమీ చేసుకోదులే .మాకు రావటానికి కుదరదు. వాళ్ళు మన దాయాదులు కదా గుడ్డలు పెట్టి నీళ్ళు తాగి రావాలి .నువ్వేమి కంగారు పడమాక. పిల్లకు బాగాలేదు కదా.మొక్కు తీర్చుకొని వస్తాదిలే అన్నారు.
కానీ దాని మాటలను బట్టి ఏదన్నా చేసుకుంటుందని అనిపిస్తుంది.రాత్రి నుండి మైలలో గడ్డలు పడుతున్నాయి రోజుకు నాలుగు సార్లు బట్ట మార్చవలసి వస్తుంది .నీరసం పైగా కడుపులో నొప్పి..దీనికి తోడు ఇది పెద్ద బాంబు పేల్చింది.ఏమిచేయను.
కాసిని టి నీళ్ళు గొంతులో పోసుకొని ఇద్దరి పిల్లకాయలను లేవగొట్టి విషయం చెప్పి బయలు దేరిన .
ఇక్కడ చూస్తే దాన్ని ఎక్కడని వెతకాలి. గుడి కాడికి పొదామనుకుంటే పోగుడదాయే.బయటజేరి స్వామి కాడికి వచ్చి నందుకు ఆ స్వామికి దూరంగా నిలబడి తప్పయి పోయింది అని దండం పెట్టుకొని తల చుట్టూ కళ్ళు చేసుకొని దానికోసం వెతుకు తున్నా.
పాపం దానికి చానా కష్టాలే.చిన్నప్పుడు చానా బాగుండేది.నాయనకు మేము అడ పిల్లలం ముగ్గురం, ఇద్దరు మగ పిల్లకాయలు. సుశీలక్క పెద్దది .నేను అందరి కన్న చిన్నదాన్ని.నాయన బెల్డారి మెస్రీ.మాకందరికీ పెద్ద చదువులు చెప్పించక పోయిన పెళ్ళిళ్ళు చేసి ఎవరి బతుకు వాళ్ళను బతక మన్నాడు.
నేను అయిదవ తరగతి చదివే రోజుల్లో మా పక్క ఊరి లో ఉండే సుబ్బయ్య మామ వాళ్ళు తిర్నాలకు వచ్చినప్పుడు సుశీలక్క ను చూశారు.వాళ్ళు పాతికేళ్ల కిందట హైదరాబాదు కు పోయి అక్కడే ఉండిపోయారు.నాయన వాళ్ళు ,వాళ్ళు బాగా ఉన్నోళ్లు అని ఆనేవాడు.
వాళ్ళు నేరుగా ఇంటికి వచ్చారు. వాళ్ళను వాకిట్లో చూసిన అమ్మ నా చేత పక్కింట్లో నుండి నాలుగు కుర్చీలు తెప్పించి వేయించి, చేతిలో డబ్బులు పెట్టి పాలు తీసుకొని రమ్మని పురమాయించింది.
నేను వచ్చేటప్పటికి సుశీలక్కకు పెళ్లి సంబంధం కుదిరి పోయింది.పది రోజుల్లో సింగర కొండ లో పెళ్లి అనుకున్నారు.
అక్క పెళ్లి కావటం మూడు నిద్రలు కాగానే కాపురానికి పోయింది.
అలా పోవటం అయిదు నెలల కడుపుతో వచ్చి నెల లోపు అడ బిడ్డను ఎత్తుకొని పోయింది.చంకలో పిల్ల కడుపులో బిడ్డతో రెండవ కాన్పుకు వచ్చింది.మళ్ళీ ఆడపిల్ల పుట్టింది .ఇక మా వాళ్ళ ఆనందం అంతాఇంతా కాదు.అన్ని మంచిగా నడుస్తుండగా బావ సిగరెట్లు,మందు తాగి తాగి గుట్కాలు తిని తిని కాన్సర్ తో పోయాడు.అక్క వాటాగా నాలుగు లక్షలు ఇచ్చి పుట్టింటికి పంపారు.
నాయనకు అక్కను ఇంట్లో పెట్టుకోవటం ఇష్టం లేక ఎదురుగా దొరికిన రెండు గదుల రేకుల ఇల్లు కొని,అక్కడే ఉండమని చెప్పాడు.
మొగుడు పోయినది,వయస్సులో ఉంది ఇంట్లో ఉంటే మిగతా వాళ్లకు పెళ్ళిళ్ళు కావద్దా.రేపు కోడళ్ళు అది ఎట్ట కలిసి ఉంటారు అని అమ్మా,నాయనా అనుకోవటం నా చెవిన పడింది.పెళ్లి అయితే కూతురు పరాయిది అవుతదా అని అన్పించింది .పాతికేళ్లకే దాని బతుకు బుగ్గిపాలు అయిందని ఎవ్వరికీ ఇంత బాధ లేదు.
ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా తెరచాటు వ్యక్తిగా అన్ని తానై అందరికీ అండగా ఉండేది.ఊళ్ళో బట్టల కొట్లో పనికి పోతూ రెండు బర్రెలను పెట్టుకొని పైసా పైసా కూడబెట్టేది .
దాని దిగులంతా పెద్దకూతురు.దానికి వయస్సుకు తగ్గ పెరుగుదల లేదు.పొట్టిగా లావుగా ఉన్న పని విషయంలో ఇద్దరి పని చేస్తుంది.బడికి పోతే అందరూ ఎగతాళి చేస్తున్నారని మొండికేసి చదువు మానేసింది.దానికి కుట్టు మిషను కొని పని నేర్పించింది.చుట్టూ పక్కల మా వొళ్ళు అందరూ కుట్టించు కుంటారు.మా బజారులో మా కులపోళ్ళగడప వంద దాకా ఉంటది.
అక్కకు చేదోడుగా వాదోడుగా ఉండి అందరికీ తలలో నాలుక లాగా ఉంటుంది..ఎన్ని సంభంధాలు చూసిన కుదరటం లేదు
చిన్నది పది గట్టెక్కటమే కనాకస్టం అయి ఇక చదవను అని కరాకరాకండిగా చెప్పింది.అదేంటో గాని మా వాళ్లకు ఎవరికి చదువులు అబ్బలేదు.నేను చదువు కుందమంటే నాయన చదువుకున్న మొగుడిని నేను తీసుకొని రాలేను పదో క్లాసు చాలని పెండ్లి చేశాడు..
చిన్నది పెట్రోలు బంకులో పనికి పోతూ ఇళ్లకు పోయి పాలుపోసి వస్తుండేది. రేకుల ఇల్లును రెండు అంతస్తుల ఇల్లు ,పిల్లల మెడలకు,చేతులకు కాస్త బంగారం ,వడ్డీకి డబ్బులు తిప్పుతూ నలుగురిలో మంచిగా బతుకు లాగుత ఉంది.
ముగ్గురి సంపాదనతో కుదురుగా బండి నడుస్తుంది.
పాలు పోయటానికి పోయిన పిల్ల మళ్ళీ ఇంటికి రాలేదు.తీసుకొని పోయిన పిల్లాడు మోజు తీరగానే దాన్ని వొదిలి ఎక్కడికో చెక్కేశాడు.పిల్ల ఇంటికి చేరింది..పిల్లను చూసి అక్క కాళికాదేవి అవతారం ఎత్తింది.
అందరం పోయి అక్కను శాంత బరిచి నీ అదృష్టం బాగుంది పిల్ల ఒక్కతే వచ్చినందుకు సంతోష పడు,అదే కడుపులో బిడ్డతోగాని లేదా సంకలో బిడ్డతోగాని వస్తే నీకు చుక్కలు కనపడేవి.ఇప్పటికయినా ముంచుకు పోయింది లేదు ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేస్తే అన్ని చేసుకున్నవాడే చూసుకుంటాడని సలహాలు .
పెద్దదానికి ఇక పెళ్లి కాదని రూఢి చేసుకున్నారు.చిన్నదానికి సంభందాలు చూడగా చూడగా భార్యను వదిలేసిన భర్త దొరికాడు.సింగర కొండ లో పెళ్లి చేసి బెంగళూరు కాపురానికి పంపారు.ఆ పిల్లాడు అక్కడ హోటల్ నడుపుతున్నాడు.పిల్లాడు ఫరవాలేదు అని పిల్ల రోజూ పోను చేస్తుంది.
**********
అజయ్ దూరపు బంధువు, అల్లుడు వరస అవుతాడు, ఊరు వొదిలి హైదరాబాదు పోయి బాగానే సంపాదించారు .ప్రతి ఏడు తిర్నాలకు వచ్చి పోతున్నారు .వాడి అక్క ఈ మధ్యనే మా ఇంటికి పక్కనే బాడుగకు చేరింది.వాళ్ళ అక్కకాడికి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి పోతుంటారు.
వాడి అక్క కూతురు ఒణిలపండగకు వచ్చినప్పుడు నలుగురు కలిసిన నప్పుడు మాటల మధ్యలో
ఏందిరా నీ విడాకుల సంగతి ఎంత వరకు వచ్చింది అంటే
ఏమి చెప్పను అది విడాకులు ఇవ్వను కాపురానికి రాను అంటది కానీ వేరే వాడితో కాపరం చేస్తుంది.
అదేమీ సోద్యంరా బాబు.
మగాడిని కదా విడాకులు లేకుండా పెళ్లి చేసుకోలేను .విడాకులు ఇస్తే నేను ఇంకో పెళ్లి చేసుకొని నేను ఎక్కడ సుఖపడి పోతనో అని అందరికీ చెబుతుంది.
కోర్టుకు వేసావు కదా ఎంతవరకు వచ్చింది.
ఆ ఏముంది తిరిగి తిరిగి కాళ్ళు అరగటమే. పెద్దల పంచాయతీ చేసుకోమని లాయర్ అంటున్నాడు.అదేమో ఇద్దరు ఆడపిల్లలు కదా చెరి అయిదు లక్షలు ఇస్తే కాగితాల మీద సంతకం అంటుంది.ఉన్న రెండు ఎకరాలలో నా భాగం అమ్మకానికి పెట్టా .అది రాగానే వది లించుకుంట.
ఎట్టాగు మనలో మాట దానిపాటికి అది సుఖంగా బాగానే ఉంది.నేనే నాలుగేళ్ల బట్టి ఒంటరోడిని .ఇంటికి రాగానే కాసిని వేడి నీళ్ళు పెట్టి ఇంత ఉడకేసి పెట్టె మనిషి కావాలి .
సుశీలక్క పెద్ద బిడ్డను చేసుకుంటే దానికి బాగా పని పాట వచ్చు ఇల్లు చక్కదిద్దుకుంటాది.
ఆ మాట అనగానే దానికి మగ తోడు దొరికితే చాలు నేను పోయిన దానికి ఒక తోడు వుంటాడని సుశీలక్క సంబర పడింది..
నాయన మటుకు ఒరేయ్ ముందు నీ పెళ్ళాం సంగతి వగడెంచుకొనిరా.తరువాత చూద్దాం పిల్లను నీకే ఇస్తామని మాట ఇచ్చాడు.
ఆ పిల్లగాడు అడపా దడపా వచ్చిపోతున్నడు.
చిన్నదానికి బాగాలేదని అక్క దాని దగ్గరకు పోయి వచ్చేటప్పటికి ఇంట్లో పెద్ద పిల్ల కనపడ లేదు.
అజయ్ అమ్మానాన్నలను పిలిచి నిలదీశారు.
మీ పిల్లకు ఏమీ కాదు .ఇద్దరు ఇష్టపడ్డారు వయస్సులో ఉన్నారు.చేతిలోకి డబ్బులు పడగానే దాన్ని పిలిచి వదిలించు కుంటాము. పిల్లకు ఏమి అన్యాయం చేయము.దిగులు పడకండి మీ పిల్ల మా కోడలే అని చేతిలో చేతులు వేసి చెప్పారు.
అప్పటిదాకా పిల్ల మా దగ్గరే ఉంటుంది అంటే అదేమో రానని మొండి కేసింది.అక్క పుట్టెడు దుఃఖంతో రోజులు వేళ్ళ దిస్తుంది .
అర్నెల్లకు పంచాయతీ జరిగి , కులపోళ్ళ దగ్గర కాగితాలు రాయించుకొని స్వామి కాడ దానికి తాళి కట్టటం అయింది.అప్పటికి దానికి నాలుగవ నెల తిరుగు ప్రయాణమయ్యారు.అక్కకు సంబరమే సంబరం.కడుపుతో ఉన్న పిల్ల కదా అని పిండివంటలు చేసి వొడినింపి సార పంపింది.
వాళ్ళను పంపి అలసిపోయి అలా నడుం వల్చిందోలేదో అడ్డ రోడ్డు కాడ టిప్పరు కొట్టింది ఇద్దరు బతకటం కష్టమని వార్త అందుకని కుప్పకూలిపోయింది.
అయిదు లక్షలు హారతి అయిన తరువాత గుంటూరులో హాస్పటల్ లో వారం తరువాత పిల్లగాడు చనిపోయాడు.ఆ అబ్బాయి తరపు వాళ్ళు ఒక్క పైసా పెట్టలేదు.పిల్ల బతుకు తో కింద మీద అవుతుంది.ఆర్నెల్లు అయినా పిల్లలో మార్పు లేదు.ఎవరిని గుర్తు పట్టలేదు.మెలుకువ వస్తే బావ బావ అని కలవరిస్తుంది.ఇక డాక్టర్లు ఇంటికి తీసుకొని పొండి,మెదడులో రక్తం గడ్డకట్టింది,ఎప్పుడు మామూలు మనిషి అవుతుందో ఎదురు చూడటమే అన్నారు
ఇల్లు తప్ప అన్ని హారతి అయ్యాయి..చిన్న అల్లుడు కూతురిని పుట్టింటికి పంపాడు.అక్కకు తోడుగా వచ్చిందని అనుకున్నాము.వారం తరువాత చిన్నది అసలు విషయం బయట పెట్టింది.
లేచిపోయిన దాన్ని చేసుకుంది ఎలాగూ పెద్దదానికి పెళ్లి కాదు, ఉన్న ఆస్తి నాదే కదా అనుకుంటే ఉన్నది మొత్తం పోయింది.ఇక మిగిలింది ఇల్లు అదీ పోకముందే మనకు రాసి ఇమ్మను లేదంటే పెద్ద దానితో నువ్వు అక్కడే చావు అని చెప్పి పంపాడు.
అది విన్న అందరకి నోటి మాటరాలేదు.ఒక రోజూ పొద్దున్నే పదిమంది పెద్దోళ్లను వేసుకొని వచ్చాడు.వాళ్లేమి పెద్ద మనుషులో గాని ఇల్లు రాసిఇవ్వనదే పిల్ల కాపురానికి రాదని తేల్చారు.
చివరికి ఇల్లు రాసి ఇచ్చిన వెంటనే అమ్మకానికి పెట్టి డబ్బులు తీసుకుని రమ్మని పెళ్ళాన్ని వదిలి వెళ్ళాడు.
తిని తినక పైసా పైసా కూడబెట్టిన ఆస్తి గద్దలా ఇద్దరు అల్లుళ్ళు తన్నుకు పోయారు.ఇప్పుడు అది పెద్దది రోడ్డు పాలు అయ్యారు.
అందరూ మాటలు చెప్పెటోల్లే దాన్ని ఎవరు ఆదుకున్నోల్లు లేరు .దాని భారం మొయ్య టానికి మేము కొడుకుల మీద బతుకుతున్నాం కొడుకులు ఒప్పుకోరు దాన్ని పెట్టుకుంటే అని అంటాడు నాయన.
ఉన్న ఇల్లు పోయింది.పిల్లను కనిపెట్టుకొని ఉండాలి.పనికి పోవటానిక అవ్వదు.దానికి వచ్చే వితంతు పెన్షన్ తప్పితే ఏ ఆధారము లేదు.ఆ పెన్షన్ కూడా డాక్రా గ్రూపు లోనుకు కట్టాలి.
ఒకసారి డాక్రా గ్రూపు మీటింగ్ కు పోయి వచ్చే పాటికి ఇల్లంతా చిందర వందర చేసింది. పాస్ ,లెట్రిన్ కూర్చొని ఒంటికి పూసుకుంది.దానికి మతి లేక ఏమి చేసేది తెలియ కుండ ఉంది.దాన్ని ఎప్పుడు కనిపెట్టుకొని ఉండాలి .అది బతికినా అవిటి బతుకే.అక్క ఉన్నంత వరకు ఎలాగో బతికుంచు కుంటుంది.ఆ తరువాత దాన్ని ఎవరు చూస్తారు.అందుకే ఏదో ఆలోచన ఉండే నాకు చెప్పింది.
చాలా సార్లు నా దగ్గర ఉండవే అంటే నువ్వు అంటే సొంత చెల్లివి .నీ మొగుడు పరాయి వాడు ఎన్నాళ్ళు భరిస్తారు అనేది.నీ కాపరం,నీ పిల్లలు కాక మళ్ళీ మేము ఇద్దరం నీకు భారం అవుతాము. నేను దానికి భరసో కోసం మాట వరసకు ఉండమని అన్ననే గాని అది చెప్పినట్లు అతను మటుకు ఎందుకు ఒప్పుకుంటాడు.
సాయంత్రం అయినా దాని జాడ తెలియ లేదు.రాత్రికి దాన్ని వెతకటం కష్టం జనాలు ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతారు.తాగి డాన్సులు ,చిందులు వేసుకుంటు ఎవరి గోలలో వాళ్ళు ఉంటారు.
పొద్దున తాగిన టి నీళ్ళే ఏమి తినక పోవటాన కళ్ళు తిరుగు తున్నాయి.తోపుడు బండి మీద నాలుగు పునుగులు తిని కూల్ డ్రింక్ కడుపులో పడగానే ప్రాణం కుదుట పడింది.ఒకటే మైల అవుతుంది.దేముడు కాడికి రాకూడదు,కానీ రాక తప్పలేదు.లోపల గుడిలోకి పోలేదు గాని గుళ్ళోకి పోయేటోల్లను తాకుతా ఉన్నా,అది కూడా పాపమే అని తెలుసు.బట్ట మార్చటానికి కుదరక పోయే రెండు కాళ్ళ మధ్యలో రాసుకుని మంట పుడుతా ఉంది.ఒళ్లంతా తిక్క తిక్కగా ఉంది.నిలబడ లేకపోతున్న.
ఒక్కదాన్ని ఏమిచేయాలో తెలియక అద్దంకి పోయి నాయనోల్లకు ఉన్న విషయం చెప్పా.దినం ముక్కలు తిని మందు కొట్టి వచ్చి మంచాలకు అతుక్కున్నరు.నేను చెప్పిన విషయాలకు మత్తు దిగి దాన్ని చానా శాపనార్థాలు పెట్టుకుంటు ఛీ ఇంటికి పెద్దదే గాని దానితో ఎప్పుడు సుఖ పడింది లేదు, ఎప్పుడు కష్టాలే అని చిరాకు పడుతూ ఇప్పుడు ఏమన్నా జేసుకొని మన నెత్తిమీదకు ఏమి తెస్తుందో అనుకుంటూ అందరూ తలా ఒక దిక్కు బయలు దేరారు వెతకటానికి.
అదీగాక ఈ మధ్య పిల్ల రాత్రి పూట నిద్ర పోదు.మధ్య రాతిరి లేచి పెద్ద పెద్దగా అరుస్తుంది.చుట్టుపక్కలోల్లు గొడవకు దిగుతున్నారు.అందరూ దాన్ని ఎక్కడన్నా హోములో వేయమని ఒకటే పోరు.అప్పటికి ఒంగోలు కు పోయి హోములు చూసి వచ్చాము.పెద్ద పిల్ల చేర్చుకోమని అన్నారు.మా బతుకులే అంతంత మాత్రమే.మాకందరికీ తెలిసింది అద్దంకి,ఒంగోలు .పుట్టిన కాడ నుండి ఎక్కడికి పోలేదు.ఒక్కసారి మటుకు తిరుపతి పోయాము.మాకేమన్న చదువులు సట్టుబండలా ఇలాంటి విషయాలు తెలియ టానికి. ఎక్కడ దీన్ని చేర్చాలో తెలవలేదు.
ఈ మధ్య దాని మాటల్లో బతికి ఏమి చేయాలి అనే మాటలు వినపడెవి .మంచిగా ఉంటే అందరూ బాగానే పలకరిస్తారు, తేడా కొడితే అందరూ తలా ఒక మాట అనేవాళ్ళే అని ఓపోయేది.మగ దిక్కు లేని ఒంటరి బతుకయింది.మొగుడు ఉంటే కాస్త తోడుగా మంచి సబ్రా చేప్పుకొను ఉండేది.ఎంత బలగం ఉంటే ఏమి, ఎవరి బతుకులు వాళ్ళవి.కాకపోతే ఎదురుగా నాలుగు మాటలు చెప్పే వాళ్ళే గాని భారం మోయలేరు నేను ఈ భారం మోయలేక పోతున్నాను అని కష్టమంతా నాతోనే వెళ్ళబోసుకునేది.
నీరసం ఎక్కువ అనిపించి అమ్మను అడిగి ఒక ముద్ద అన్నం తిని పడుకున్న. నాకు తెలియ కుండా టపాటపా నాలుగు కన్నీటి బోట్లు రాలుతుండగా ఎదురుగా అది ఉండిన ఇల్లు మసక మసకగా కనుబడుతుండగా ఆ సింగర కొండ స్వామి ఏమి చేస్తాడో, అంతా ఆయన దయ .అది ఇంటికి వస్తే స్వామికి ఆకు పూజ చేయిస్తానని,వంద కొబ్బరి కాయలు కొడతనని మొక్కులు మొక్కు కుంటుండగ కళ్ళు మూతలు పడ్డాయి.
– పి.రాజ్య లక్ష్మి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
సింగర కొండ(కథ) – పి.రాజ్య లక్ష్మి , — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>