ఏకాకి వలపోత! (కవిత )- -బాలాజీ పోతుల

ఒంటరి పక్షుల్లెక్క జంటై గట్టెక్కితే,
ఆరోజు సాయంత్రానికి,
నెత్తి మీద కట్టెలయి బయల్దేరద్దుము
మోరీలని సాపు చేసిన ఆ చేతులే,
పచ్చి కట్టె మోపులని కట్టిన ఆ చేతులే
ఈరోజు లేకుంటయినయ్!
కాళ్ళకి సెప్పులు లేని రోజులల్ల గూడా,
గట్టెక్కి దిగిన ఆ కాళ్ళే,
ఇయ్యాల తొక్కితే ఇరిగే ఎండు తొగరి కట్టె లయినయంటే,
తెలవకుంటనే నా కంట్ల నుంచి,
మా ఊరి మల్లన్నాగు పారినట్టయింది.
ఎన్ని జెప్పుకున్నా,
ఎంత ఏడ్సినా,
నా వలపోత ఆగునా?
నా సుశీల తిరిగొద్దునా?
అయిషిల ఎండకు ఎండొచ్చి,
ఇంట్ల దీపం పెట్టేది
అవ్వగారింటికి పురుడుకు పోతే,
నన్నిడిచిపోయినందుకు కంట నీరు పెట్టుకుంది
“నీ మొగునికేం చాతనైతదే మోరీలు తీసుడు తప్ప”
అని చిన్నక్క ఎక్కిరిస్తే,
నేనచ్చి సముదాయించిందాక బుక్కెడు బువ్వ నోట్ల పెట్టకపోయింది.
మా యవ్వ అర్ధాంతరంగా పోయిందని,
పోని దుఃఖంల నేనుంటే,
మందపువ్వసొంటి మొకంతోని,
నా గడపల అడుగుపెట్టి,
బంతిపువ్వసొంటి తోటబెంచిన నువ్వియ్యాల లేవంటే,
మన బిడ్డ పురిట్లనే పొయ్యిందంటే,
బొందలు తొవ్వి తవ్వి మా అయ్య,
ఆ బొందల్నే పడి సచ్చినట్టే,
తట్టుకోలేని నా గుండె –
నా మెడనే దూలంగజేసి
నా ఊపిరిని కాస్తా ఊదేసినట్టయింది!
-బాలాజీ పోతుల
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Thank you ❤️