తెలతెలవారుతోంది.. (కవిత)-ముక్కమల్ల ధరిత్రీ దేవి
తలుపు తీసింది…
తూర్పున సూర్యోదయం
పలకరించింది చిరునవ్వుతో…
ముంగిలి ఊడ్చింది…
కల్లాపి జల్లింది…
ప్రకృతి మాత పరవశించింది..
ముత్యాల ముగ్గు పెట్టింది…
మహాలక్ష్మి గడపలో అడుగు పెట్టింది…
దేవుని ముందు దీపం వెలిగించింది..
గంటలు మ్రోగాయి..
పనులు మొదలయ్యాయి..
గోడమీద గడియారం ముల్లు
సాగుతూ ఉంది….
తోడుగా పరుగులు తీస్తూ ఆమె…!!
అందర్నీ సిద్ధపరిచి సాగనంపింది…
ఎవరు? ఎవరామె !?
అలా అలా ఉదయం..మధ్యాహ్నం..
సాయంత్రం…గడిచిపోయాయి…
రాత్రీ గడిచింది..తెల్లారింది..
మళ్లీ మొదలు..అవే పనులు !!
ఇదీ..గృహిణి దినచర్య..!!
పనులకు కొదవలేదు..
క్షణం తీరిక ఉండదు!
” ఏం చేస్తావు నువ్వు?” అనడిగితే…
ఏమీ చేయనంటుంది..!
“గడప దాటి పని చేస్తేనే ఉద్యోగమా!?”
అనదు..ఆ తలపే రాదు…
సంపాదన నోచుకోని..
పదవీ విరమణ ఎరుగని
జీవితకాల ఉద్యోగమది !!
ధర చెల్లించలేము…
అది అమూల్యం !
అలసట దరిజేరినా..
చిరునవ్వుతో తరిమేస్తుంది
విసుగొచ్చినా…
ఓపిక కొని తెచ్చుకుంటుంది..
స్వార్థ చింతన..స్వీయ రక్షణ…
తలవని తరుణి..!!
ఆమెయే గృహిణి !!
గృహాన్ని స్వర్గసీమగా మార్చి
అలవోకగా నడిపే మంత్రిణి…
తనకు మారుగా దైవం
ఇలకు పంపిన దైవ స్వరూపిణి !
ఆమె..ప్రతి ఇంటా తిరుగాడే ఆ ఇంటి దీపం..
అనునిత్యం నడయాడే వెన్నెల కెరటం…!!
–ముక్కమల్ల ధరిత్రీ దేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
తెలతెలవారుతోంది.. (కవిత)-ముక్కమల్ల ధరిత్రీ దేవి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>