జ్ఞాపకం – 100 – అంగులూరి అంజనీదేవి
మధ్యాహ్నం అన్నం తిన్న తరువాత…
విరామ సమయంలో పొలంలో పనిచేసే ఆడవాళ్లు కొందరు ఆమెకి దగ్గరగా వచ్చి కూర్చుంటారు. రాఘవరాయుడుతో ఎంత ఆత్మీయంగా మాట్లాడతారో సంలేఖతో కూడా అలాగే మాట్లాడుతుంటారు.
“నువ్వొచ్చాక ఈ చుట్టూ పరిసరాలకే కళ వచ్చిందమ్మా!” అంటుంటారు.
సంలేఖ వాళ్ల చేతుల్ని తన చేతిలోకి తీసుకొని ప్రేమగా స్పర్శిస్తుంది. .
“ఆ మట్టిచేతుల్లో మణులుంటాయి. మహాగ్రంథాలుంటాయి. గొప్పగొప్ప కావ్యాలు వుంటాయి. కథలుంటాయి. కన్నీళ్లు వుంటాయి. ఆ చేతులు అన్నం పెడతాయి. అక్కున చేర్చుకుంటాయి. వాటికి ఏదీ పరాయిది కాదు. తడారిపోతున్న మానవ స్పర్శను తడార అందిస్తాయి” అని తండ్రి చెప్పేవాడు. అది నిజంగా నిజమని ఇప్పుడు తెలుస్తోంది.
ఇక్కడికి రాకుండా హైదరాబాదులో జయంత్ దగ్గరే వుండి వుంటే ఇలాంటి అనుభవాలేవీ దొరికేవి కావు. అదే ప్రపంచం అనుకునేది. అక్కడ తనకి ఎలా అన్పించినా అదే కరక్ట్ అనుకునేది. పెళ్లయ్యాక కొంతమంది అమ్మాయిల జీవితాలు వాళ్ల చేతుల్లో వుండవు అత్తల చేతుల్లో, ఆడపడుచుల చేతుల్లో, భర్త, మామగారి చేతుల్లో వుంటాయి. వాళ్లకి నచ్చినట్లు వాళ్లు మలుచుకుంటూ వుంటారు. ఎందుకొచ్చిన బాధ అనుకునే అమ్మాయిలైతే అలాగే వుండి పోతుంటారు. వ్యక్తిత్వం వున్నవాళ్లంతే ఎదురు తిరిగి బయటపడుతుంటారు. మరిప్పుడు తనెవరు? తనకి వ్యక్తిత్వం వున్నట్లా? లేనట్లా? అని ఆమెను ఆమె ప్రశ్నించుకుంటుంటే ఆమె కూర్చున్న ఆ మూడుసెంట్ల పొలంలోనే విరబూసిన మందారం కన్పించింది.
అది ఆమెకు ఎదురుగా పుప్పొళ్లను జల్లుకుంటూ, కేసరాలు సవరించుకుంటూ గాలికి కదులుతూ గమ్మత్తుగా వుంది. ఆమె చూస్తుండగానే ఆ పువ్వుపై ఒక తుమ్మెద వచ్చి వాలింది. దాన్ని చూస్తుంటే “మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే మదనములకు’ అన్న పోతనగారి పద్యం స్ఫురణకు వచ్చింది. ఈ విరబూసిన మందారం, ఈ ప్రకృతి శోభ, ఈ మట్టివాసన మొన్నటివరకు తను తిరిగిన కాంక్రీటు అరణ్యంలో ఎక్కడుంది?
భరద్వాజ మాష్టారు అటువైపు వెళ్తూ సంలేఖను చూసి ఆగాడు. “ఏమ్మా లేఖా! ఇంకా ఇంటికెళ్లలేదా? ఇటువైపు వెళ్తున్నప్పుడు నువ్వు రాసుకుంటూ కన్పించావ్! అందుకే కదిలించకుండా వెళ్లాను” అన్నాడు.
“రండి! మాష్టారు! కూర్చోండి!” అంటూ ఆయనకి ఆమె కూర్చున్న గట్టుమీదనే కూర్చోమన్నట్లు స్థలం చూపించింది.
ఆయన కూర్చున్నాడు. భరద్వాజ మాష్టారు పక్కన కూర్చుని చాలా కాలమైంది. ఆ అవకాశం ఇప్పుడు వచ్చినందుకు ఆనందంగా అన్పించి “ఇక్కడ చాలా బావుంది మాష్టారు! అందుకే రోజూ ఇక్కడికి వచ్చి కూర్చుని రాసుకుంటున్నాను” అంది.
“మనసు ఎక్కడ బాగుంటే అదే మనకు పవిత్ర స్థలం. ఆ స్థలంలో వున్నంత సేపు తల్లి గర్భంలో వున్నట్లే అన్పిస్తుంది. నేను ఈ ఊరివాడిని కాకపోయినా నాకు ఇక్కడ అలాగే అన్పిస్తుంది” అన్నాడు.
ఆయన అలా అంటుంటే బాధగా వుంది.
“ఈ ఊరివాడిని కాను అని ఇంకెప్పుడూ అనకండి మాష్టారూ! ఒక పక్షికూడా తను కూర్చున్నంత సేపు ఆ చెట్టును తన చెట్టే అనుకుంటుంది. మనంకూడా అంతే! మనం ఎక్కడ వుంటే అదే మన ఊరు” అంది.
“మంచిమాట చెప్పావమ్మా!” మెచ్చుకున్నాడు.
“ఈ గట్టుమీద చెట్టు వున్నప్పుడు నీడ వుండేది మాష్టారూ! ఇప్పుడది లేకపోవడం వల్ల ఇక్కడికి వచ్చి అన్నాలు తినేవాళ్లకి, సేదతీరేవాళ్లకి ఎండతాకిడి తప్పటంలేదు” అంది.
“మీ పొలం కొన్నవాళ్లు ఈమధ్యనే ఆ చెట్టును కొట్టేశారు లేఖా!”
“ఎందుకు మాష్టారు?”
“ఆ చెట్టునీడ పడినంత మేరకు పంట సరిగా ఉండటం లేదట. అందుకే కొట్టేశారు” అన్నాడు.
“ఓ అలాగా! ఎన్నో ఏళ్లుగా వున్న చెట్టు అది” అంది నొచ్చుకుంటూ.
“ఇప్పుడైనా అలాంటి నీడకి లోటువుండుదు లేఖా!”
“ఎలా మాష్టారు?”
“మీ నాన్నగారు మీ తాతయ్యకి కట్టించాలని ఆగిపోయిన సమాధి లాంటిది మీ అన్నయ్యలు మీ నాన్నగారికి కట్టిస్తే సరిపోతుంది. సమాధిపై శ్లాబ్ వేస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఆ నీడలో కూర్చుంటారు. అప్పుడెలాగూ మీ నాన్నగారు కట్టించలేకపోయారు. కనీసం ఇప్పుడలా మీ నాన్నగారికైనా కట్టించండి!” అన్నాడు.
“ఆ ఆశలేదు మాష్టారు! మా ఇద్దరన్నయ్యలను అడిగాను. తిలక్ అన్నయ్యకి అప్పులున్నాయట. రాజారాం అన్నయ్యకి ఏదో లక్ష్యం వుందట. డబ్బులు లేవన్నారు” అంది.
ఆయన ఆలోచనగా చూశాడు. రాఘవరాయుడి కుటుంబం పట్ల మొదటినుండి ఆయనకు ఆత్మీయభావం వుంది. చనువు వుంది. ప్రేమ వుంది. అందుకే అన్నాడు “నువ్వు కట్టించవచ్చు కదమ్మా!” అని. ఆశ్చర్యంగా చూసింది సంలేఖ.
“ఎందుకమ్మా అంత ఆశ్చర్యపోతావ్! ‘మా నాన్నేమైనా సమరయోధుడా! సంఘసంస్కర్త నా! దేశనాయకుడా! కన్యాశుల్కం రాసిన గురజాడనా!’ అనా? వాళ్లెవరూ కాదమ్మా ఆయన నీకు తండ్రి. ఆ ఒక్క అర్హత చాలు” అన్నాడు.
చేతివేళ్లవైపు చూస్తూ ఆలోచిస్తోంది సంలేఖ.
“ఆడపిల్లను. ఇలాంటివి నాకెందుకు అని ఆలోచిస్తున్నావా?” అన్నాడు.
-అంగులూరి అంజనీదేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
జ్ఞాపకం – 100 – అంగులూరి అంజనీదేవి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>