“శిలాఫలకం”గా రాసిన అక్షర కవిత్వం(పుస్తక సమీక్ష )- అలౌకిక
వీణా వాణీ దేవనపల్లి జూలపల్లి మండలం , పెద్దపల్లి జిల్లాకు చెందినా వీరు వృక్ష శాస్త్రంలో ఉన్నత విద్యనూ అభ్యసించి తెలంగాణా రాష్ట అటవీ శాఖలో మండలాధికారిగా పని చేసారు. ప్రస్తుతం డిప్యూటీషన్ మీద హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్నారు.
వీరు ‘నిక్వణ” 2018లో తొలి కవిత్వ సంపుటి ముద్రించారు. అంతర్జాల తొలి మహిళా పత్రిక అయిన “విహంగ “మాస పత్రికలో “అరణ్యం” పేరుతో శీర్షికను కూడా నిర్వహించారు. వీరు మరొక కవితా సంపుటి “శిలాఫలకం “
శిలాఫలకం కవితా సంపుటి లో మొత్తంగా 70 కవితలు ఉన్నాయి. ఇవి అన్నీ కూడా అడపాదడపా వివిధ పత్రికలో అచ్చు అయినవే.
కొంత కాలంగా రచయిత్రి రాసిన కవితలన్నీ ఒక చోటకి చేర్చే ప్రయత్నమే ఈ శిలాఫలకం.
ఈ సంపుటిలో మొదటి కవిత “ఆ పాట “ తో ప్రారంభమై కవిత్వం అనే కవితతో ముగుస్తుంది.
ఈ డబ్బై కవితల శీర్షికలే మనల్ని కవితలను చదివే చేస్తాయి.
రాజుకి కిరీటం లా సాహిత్య రచన ఏదైనా వాటి పేరే తలమానికంగా ఉండాలి. ఆ విషయంలో రచయిత్రి దృష్టి కోణాన్ని అభినందించి తీరాలి.
వృత్తి రీత్యా ఫారెస్ట్ అధికారిణి కావడం వలన రచయిత్రి రాసిన “చెట్టు “ కవిత చదువుతుంటే చెట్టు చూసిన కాలం కళ్ళ ముందు కదిలినట్లు అయ్యింది.
“తన పరుచుకున్న నీడ కింద
వాలిని కనురెప్పలు కార్చిన రక్త ధారలను
సుళ్లు తిరిగిన దుఃఖం జీరాలను
మౌనంగా చూసే ఉంటుంది.” అంటూ రాసిన ఈ పంక్తులలో గడిచిన కాలానికి చెట్టు సజీవ సాక్షిగా కనిపిస్తుంది.
మన జీవితంలో ఎదురై కష్ట సుఖాలు , లాభ నష్టాలను “దొండ పందిరి “ కవితలో దొండ పాదు ఎదుగుదల , కాయలు కాసేవరకు ఉండే పరిస్థితులతో పోల్చి వివరించడం విశేషం.
“ఎలా ఉన్నావు అడిగింది చెట్టు
నేను ఏడ్చాను
జూన్ చివరి వారపు వానకి
కొత్త ఆకులతో పచ్చని తావుగా మారింది “ అంటూ మనిషి కష్టం , సుఖం రెండు వస్తాయి అని అర్ధం అంతర్లీనంగా కనిపిస్తుంది .
రచయిత్రి రాసిన ప్రతి కవితలోనూ ప్రత్యక్షంగానో , పరోక్షంగానో లేదా ధ్వని అర్ధంలోనో చెట్లు , మొక్కలు, ప్రకృతి , అటవీ ప్రాంతం ఇవి అంతార్ధంగా దాగి ఉన్నట్లు మనకి ప్రస్పుటమవుతాయి.
ఇవే కాకుండా ఏక బిగువున చదివించే కవితలు “బడి పిల్లలు, వంచన తర్వాత, మళ్ళీ ఒకసారి, బోలుగిన్నె , నివాళి, సీరాచుక్కలు, కలుపు మొక్కలు, అలవాటు, భూమి, రాట్నం, వెన్నెముక, గుడ్డముక్క, లెక్క, కూలీతాత వంటి కవితలు వస్తు వైవిధ్యానికి నిదర్శనంగా కనిపిస్తాయి.
ప్రతి కవిత అంతర్మధనం గా తనితాను ప్రశ్నించుకునే విధంగా రాసిన కాని చదువరులను నిలదీసినట్లు , వారు చేయాల్సిన పనిని , కర్తవ్యాన్ని గుర్తు చేసినట్లు ఉన్నాయి ఈ కవితలు.
రచయిత్రి వీణా వాణి అటవీ శాఖాలో అధికారిణి కావడం వలన ప్రతి రోజు మొక్కలు , చెట్లు, అడవులు వాటి మధ్య జీవనం సాగడంతో చెట్లకి , మనిషి ఉన్న సంబంధం , వాటి ప్రాధాన్యత లో వస్తున్న మనుషుల ఆలోచన విధానం అన్ని రచయిత్రి కవితలలో తెలుస్తున్నాయి.
ఒక్క మాటలో చెప్పాలి అంటే మానవ ఘర్షణలు, ప్రకృతి ముఖ్యంగా చెట్లు వైవిధ్యతను తెలిపే కవితా సంపుటి శిలాఫలకం కవితా సంపుటి.
-అలౌకిక
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
నమస్తే అలౌకిక గారు. మీరు శిలాఫలకం మీద మీ విపుల స్పందన తెలపడం సంతోషంగా ఉంది. మీ ఆత్మీయ వాక్యాలకు, ఆదరణకు హృదయ పూర్వక ధన్యవాదాలు.