తోటి రాజకీయఖైదీలకు ఇసుక లో హిందీ అక్షరాలు నేర్పిన దుర్గాబాయ్ తల్లి -శ్రీమతి బెన్నూరి కృష్ణవెణమ్మ(వ్యాసం)- గబ్బిట దుర్గాప్రసాద్
రాజ మండ్రిలో కందుకూరి వీరేశలింగం పంతులుగారి కుడిభుజం ,తొలి తెలుగు పోలీస్ సూపరింటే౦డింట్ అయిన శ్రీ గుమ్మడిదల మనోహరం పంతులుగారు ,శ్రీమతి లక్ష్మీ బాయమ్మ దంపతులకు పోణ౦గిపల్లి లో 1896లో కృష్ణ వేణమ్మజన్మించారు .ఈమెకు ఇద్దరు సోదరులు .
కృష్ణ వేణమ్మ గారు చిన్నప్పుడే వీణ నేర్చారు .సాహిత్యం లోనూ మంచి ప్రావీణ్యం సాధించారు . వీరికి కాకినాడ వాస్తవ్యులు శ్రీ బెన్నూరి రామారావు గారితో వివాహమై౦ది ,ఇద్దరూ సంఘజీవులె.ఈ దంపతులకు దుర్గాబాయి, నారాయణ రావు జన్మించారు .గృహిణిగా తన బాధ్యతలు నిర్వహిస్తూ ఇరుగు పొరుగు స్త్రీలకూ కుట్లు అల్లికలు నేర్పుతూ ,కావ్యాలు నేరుస్తూ వారికి నేర్పుతూ పాటలూ పద్యాలు పాడుతూ పాడించే వారు .
కూతురు దుర్గాబాయి 12 ఏళ్ల వయసులో మామూలు బడి చదువు మానేసి హిందీ కుట్లు అల్లికలు ,నూలు వడకటం చేతిపనులునేర్పే స్కూలు స్థాపిస్తానంటే తల్లి కృష్ణ వేణమ్మపూర్తిగా సహకరించారు .విద్యా విజ్ఞాన తృష్ణ అధికం గా ఉన్న తల్లి కూతురు పెట్టిన బడిలోనే విద్యార్ధిని గా చేరి,హిందీ చదివి పరీక్షలకు కట్టి పాసయ్యారు .1930 ఉప్పు సత్యాగ్రహం లో భర్త రామారావు చనిపోయారు .ఆర్ధిక సమస్యలు పేచీలు చిక్కులూ ఎన్నో కలిగినా గుండె దిటవు చేసుకొని దేశ సేవ చేస్తూ ఖాదీ అమ్మటం ,హిందీ నేర్పటం మానలేదు .
1932లో సత్యాగ్రహం లో పాల్గొని అరెస్ట్ అయి ,ఆరు నెలలు జైలు శిక్ష కు గురై ,సి క్లాస్ ఖైదీగా రాయవెల్లూరు కు పంపబడ్డారు .జైలులో కూడా తోటి రాజకీయ ఖైదీలకు హిందీ నేర్పాలని సంకల్పించుకొని పలకలు బలపాలు లేక పోవటం వల్ల జైలుఆవరణలో గుట్టలుగా ఉన్న ఇసుక తలా కాస్తా తెప్పించి వరండాలో పోయించి ,పూర్వం వీధి బడుల్లో లాగా ఇసుకలోనే హిందీ అక్షరాలు దిద్దించి ఖైదీలందరికి హిందీలో మంచి ప్రవేశం వచ్చేట్లు శ్రద్ధ వహించారు .ఈ వింత బడి కథ .తెలుసుకొన్న దేశోద్ధారక శ్రీ కాశీ నాథుని నాగేశ్వర రావు గారు వెంటనే ఖైదీలందరికి సరిపడా పలకలు బలపాలు ,పుస్తకాలు సూదులు దారాలు సరఫరా చేసి ప్రోత్సహించారు .జైలులో యే గొడవా లేకుండా ఖైదీలు ప్రశాంతంగా చదువు కొంటున్నందుకు జైలు అధికారులు సంతోషించి అడ్డు చెప్పలేదు .
ఎ,బి క్లాసు ఖైదీలకు సాయంత్రం భోజనాలు కాగానే ఒక సారి ఆవరణలో షికారు చేయటానికి అనుమతించేవారు. ఆ వెసులు బాటు సి క్లాస్ వారికి లేదు .ఆఖైదీలు సి క్లాస్ ఖైదీల వార్డుము౦దునుంచి వెడుతూ చిన్న చిన్న పొట్లాలు ,,మూటలు జారవిడిచే వారు .వాటిలో కొబ్బరి పచ్చడో ,కందిపచ్చడో ఉండేవి వాటిని జాగ్రత్తగా దాచి మర్నాడు తలా గోలీ కాయంత చేసి అందరికీ పంచుకోనేవారు .అదే వారి పాలిటి అమృతం అనిపించేది సిక్లాస్ ఖైదీలకు .మిగిలన రెండు క్లాస్ ఖైదీలకు స్వేచ్చ తప్ప అన్నీ అనుభవించేవారు .సి క్లాస్ వారికి అన్నీ కొరతే .
మూడు నెలల తర్వాత కృష్ణ వేణమ్మ గారిని మరి కొందరితో కలిపి కన్ననూరు జైలుకు మార్చారు .ఇక్కడ ఆమె తన కార్యకలాపాలను మరింత విస్తృత పరచారు .ఇక్కడ రాజకీయ ఖైదీలతో పాటు సాధారణ ఖైదీలకు కూడా హిందీ నేర్పారు .నూలు వడికించారు .కుట్లు అల్లికలు నేర్పారు .కొ౦తమంది చేత హిందీ పరీక్షలకు కట్టించి ఉత్తీర్ణులయేట్లు కృషి చేశారు .1934లో కుమారుని చదువు నిమిత్తం రాజమండ్రి వెళ్లారు .ఆర్ధిక చిక్కులు చాలా ఎదుర్కొన్నా స్థిర చిత్తం తొ ఎదిర్చి నిలబడ్డారు .నేషనల్ గరల్స్ స్కూల్ లో హిందీ టీచర్ గా చేరి ,తన కుటుంబాన్ని సమర్ధవంతంగా నడుపుతూ పిల్లలిద్దరినీ ఉన్నత స్థాయికి తెచ్చారు .
ఇంట్లోనే కాక ప్రక్క ఊళ్ళల్లో కూడా హిందీ క్లాసులు నడిపారు .1937లో కొడుకు ఉద్యోగకారణంగా మద్రాస్ చేరారు .మైలాపూర్ లో ఉంటూ హిందీ ,తెలుగు బోధించారు .అద్దెకు ఉంటున్న ఇ౦టిముందున్న ఇసుక కుప్పల్లొ ఆడుకొనే చిన్న పిల్లలను చేరదీసి కధలు చెబుతూ పాటలు ,పద్యాలు నేర్పుతూ పిల్లల్ని ఉత్సాహ పరచేవారు .పిల్లలంతా ఆమెను ‘’అమ్మమ్మా ‘’అంటూ ఆప్యాయంగా పిలిచేవారు .అసలు పెరుమరుగునపడి ‘’అమ్మమ్మ’’ గానే గుర్తుండిపోయారు .వీళ్ళ తోనే బాలానందం ‘’ రేడియో కార్య క్రమాలు చేయించేవారు .పిల్లలతో పాటు తల్లులు కూడా వీరింటికి వచ్చేవారు .వారికి ఆమె హిందీ పాఠాలు బోధించేవారు .
1938లో మద్రాస్ లో’’ ఆంధ్ర మహిళా సభ ‘’ ఏర్పడిన దగ్గర నుంచి అక్కడ తెలుగు హిందీ బోధించేవారు .కృష్ణ వేణమ్మ గారు లేకపోతె ఆంధ్రమహిళా సభ ఉండేది కాదు .అయినా ఆమె అక్కడ ఒక్క ఫోటో లో కూడా లేకపోవటం విశేషం ఆశ్చర్యం కూడా .ఏవేదిక మీదా ఉండేది కాదు .ఏ గంభీర ఉపన్యాసాలు ఇవ్వలేదామే .పనే దైవంగా భావించి కృషి చేశారు .ఆమె మాట వేద వాక్కు గా భావించి ఎందఱో సేవాతత్పరులు ,కార్యకర్తలు తయారై సభకు వెన్ను దన్నుగా నిలిచారు .7-5-1965 న,సేవాశీలి ,భారతస్వాతంత్రోద్యమ కార్యకర్త శ్రీమతి బెన్నూరు కృష్ణ వేణమ్మగారు పూలతోటలో పూలమొక్కల మధ్య తిరుగుతూ,భక్తి రంజని వింటూ సునాయాసంగా అకస్మాత్తుగా 69వ ఏట మరణించారు .
-గబ్బిట దుర్గాప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
తోటి రాజకీయఖైదీలకు ఇసుక లో హిందీ అక్షరాలు నేర్పిన దుర్గాబాయ్ తల్లి -శ్రీమతి బెన్నూరి కృష్ణవెణమ్మ(వ్యాసం)- గబ్బిట దుర్గాప్రసాద్ — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>