నింగికేగిన వేగుచుక్క(స్మృతి వ్యాసం ) – తిరునగరి దేవకిదేవి

1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఓ 11 ఏళ్ల రెండు జడల అమ్మాయి ముద్దుగా మాట్లాడడంతో నాకు చాలా ముచ్చటేసింది. ఆ అమ్మాయే రజిత. అది మా మొదటి పరిచయం. రజిత మాతో పాటు మేము చేస్తున్న తెలంగాణ ఉద్యమంలోని పీకే టింగ్లు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు మొదలైన అన్ని కార్యక్రమాలలో పాల్గొనేది. ఉద్యమ కాలంలోనే పదవ తరగతి పరీక్షలను బహిష్కరించాలని ఉద్యమం పిలుపునిచ్చింది. చాలామంది ఆ పిలుపుకు సహరించినప్పటికీ కొందరు రాష్ట్ర విభజన వ్యతిరేకులు స్వార్ధపరులు తమ పిల్లలను పరీక్షలు రాయడానికి వాళ్ల వాళ్ల కేంద్రాలకు పంపించినారు. ఉద్యమకారులమైన మేము మెరుపు దాడిగా ఆ పరీక్షా కేంద్రాలకు చొచ్చుకొని పోయి వాళ్లు రాస్తున్న పేపర్లను చింపి మరో కేంద్రానికి బయలుదేరినం. మా ఈ ప్రయత్నం కాజీపేటలో పెద్ద ప్రహరీ పోలీస్ సెక్యూరిటీతో ఉన్న ఫాతిమా హైస్కూల్లో విఫలమైంది.
ఆ సన్నివేశంలో రజిత కూడా ఉండటం నాకు చాలా జ్ఞాపకం. రజితతో పాటు వాళ్ళ చెల్లెలు రేణుక కూడా ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొనేది. మరో ఐదు సంవత్సరాల తర్వాత అంటే 1974లో పి ఓ డబ్ల్యు వ్యవస్థాపక సభ్యులైన కె. లలిత, గీత రామస్వామి, రుక్మిణి లు ఇచ్చిన పిలుపుమేరకు హనుమకొండ నయీమ్ నగర్ లోని పబ్లిక్ గార్డెన్ లో వేలాది మందితో ఒక పెద్ద సభ జరిగింది. ఆ సభలో కూడా రజిత ఎంతో ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా తన అభిప్రాయాలను పిఓడబ్ల్యు ఆవశ్యకతను వివరించింది. ఈ సభ తర్వాత వరంగల్లోని పిఓడబ్ల్యూ సభ్యులమైన మేము అట్లూరి రంగారావు గారి ఇంట్లో కొన్ని చర్చలను జరుపుకునే వాళ్ళం. ఆ చర్చల్లో రజిత కూడా ఉత్సాహంగా పాల్గొనేది. 1975లో నా పీజీ పూర్తయి వికారాబాద్ లోని అనంత పద్మనాభ డిగ్రీ కళాశాలలో ఉద్యోగం రావడంతో నేను హనుమకొండ నుండేకాదు పి ఓ డబ్ల్యు సభ్యులతో కూడా దూరమైన. కానీ ఓరుగల్లు లో ఉంటున్న రజితను అక్కడి వాతావరణం ఆమె మనస్తత్వం అనేక ఉద్యమాలతో మమేకం చేసింది. కాత్యాయని విద్మహే, జ్యోతి రాణి కొనసాగిస్తున్న జనాభ్యుదయన సంస్థలో పనిచేసింది.
అట్టడుగు వర్గాల క్షేమాన్ని కోరుకునే రజిత న్యాయ పోరాట కమిటీలో కూడా చురుకుగా పని చేసింది. నా ఉద్యోగ బాధ్యతలు కుటుంబ బాధ్యతలు, సహచరుడి సామాజిక కార్యక్రమాలు కొంతవరకు నన్ను సామాజిక కార్యక్రమాల నుండి సాహితీ కార్యక్రమాలనుండి దూరం చేసినై. ఈ పలు కారణాలవల్ల రజిత కు తాత్కాలికంగా నేను దూరమైన. తిరిగి గుజరాత్ గేయం పుస్తకావిష్కరణ సభ సందర్భంగా సుందరయ్య విజ్ఞాన్ భవన్లో అంటే 2002 లో మేం కలుసుకున్నాం. అప్పటికి రజిత తెలంగాణలో ఓ పెద్ద రచయిత్రిగా ఎదిగింది. అప్పటికే ఆమె కలం నుండి అనేక కవితా సంపుటాలు, హైకూలు నానీలు దీర్ఘ కవితలు, కథలు వెలువడుతున్నై. ఆమె స్వంత రచనలతో పాటు సామాజిక పరిస్థితులను అనుసరించి అనేక పుస్తకాలకు ఎంతోమంది రచయితలను కూడగట్టుకొని శ్రమించి సంపాదకత్వం వహించింది.
కొత్త కొత్త రచయితలకు కవులకు ఆమె ఒక స్ఫూర్తి. ఒక ఉత్సాహం ఒక ధైర్యం. భూమిక బహుళ కొలిమి వంటి పత్రికలలో సంపాదక వర్గ సభ్యురాలు. నవచేతన చేపట్టిన తెలంగాణ రచయితల కథా సంకలనానికి, అమృత లత చేపట్టిన కథలే వెతలై సంకలనానికి ఎంతో శ్రద్ధ తీసుకొని తెలంగాణ రచయిత్రులకు దారి దీపమైంది. మలితరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న కాలంలోనే జిగర్, ఉద్విగ్న కవితా సంకలనాలను తీసుకొచ్చింది.
కరోనాకాలంలో ఆమె ఆధ్వర్యంలోనే మేమంతా కలిసి కరోనా కథలు అనే పుస్తక సంకలనాన్ని తీసుకొచ్చినం. ఇప్పుడు సమాజానికి ఏదో సహకరించాలి తోడ్పడాలి అనే తపన కలిగిన రజిత రెండు సంవత్సరాల క్రితం ఇదంతా వ్యవస్థపై ఎంతో మందితో చర్చించి కూడగట్టుకొని కథలు నవలలు అనుభవాలు ఆధారంగా ఓ సంకలనాన్ని తీసుకొచ్చింది. ఆ సంకలనం నిజంగా మాకు ఎంతో విలువైన సమాచారాన్ని ఇచ్చింది.
తెలంగాణ ప్రాంత అస్తిత్వంకై ఆరాటపడి ఉద్యమంలో పనిచేసిన రజితే మనోభావాలు నచ్చిన ప్రాంతేతరులతో కూడా మిత్రత్వంతో ఉండటమే కాకుండా అక్కడి సామాజిక కార్యక్రమాల్లో కూడా ఎంతో నిబధ్ధతతో పాల్గొనేది. ప్రేమ తత్వంతో స్నేహాన్ని కొనసాగించేది. ఈమధ్యే జూలైలో విశాఖపట్నంలో అనారోగ్యంతో చనిపోయిన లక్ష్మీకాంతమ్మ గారు చనిపోవడంతో అంతిమయాత్రలో, సంస్మరణ సభలో పాల్గొన్న రజిత ఎంతో మనోవేదనకు గురైంది. జనం ఆమెకు లక్ష్మీకాంతమ్మ అనుయాయి అనే కితాబును కూడా ఇచ్చిన్రు..
తిరుపతి విశ్వవిద్యాలయంలో అనిశెట్టి రజిత రచనలపై ఓ విద్యార్థి పరిశోధనకు పూనుకోవడం మరో అపురూపమైన సందర్భం.
మనలో మనంగా ప్రారంభమై 16 సంవత్సరాలుగా కొనసాగుతున్న ప్రజాస్వామ్య రచయిత్రుల వేదికలో ఆమెది చాలా కీలకమైన పాత్ర. ప్రజాస్వామిక రచయితల వేదిక జాతీయ అధ్యక్షురాలు గానే ఊపిరి విడిచింది. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక వ్యవస్థాపక సభ్యురాలు ఒకరైన కాత్యాయని విద్మహే ఇంటినుండే ఆమె అంతిమయాత్ర కొనసాగడం మరో విశేషం.
కేవలం సాహిత్యంతో సమాజాన్ని చైతన్య పరచడమే కాకుండా అనాధ వ్యక్తులకు అనాధ శరణాలయాలకు ఎన్నో దానధర్మాలు చేసేది. కొంతమంది అనాధల చదువు బాధ్యతను తీసుకున్నట్టుగా కూడా గుర్తు.
మానవతా దృక్పథంతో ఎంతోమందికి సహాయపడిన రజిత ప్రకృతి ప్రేమికురాలు కూడా. తన రోజువారి వంటను చేసుకోవడానికి బద్దకించే రజిత స్వయానా కుక్కని పెంచుకోవడమే కాకుండా వీధి కుక్కల ఆకలి తీర్చడానికి తపనపడేది. ఆ కుక్కలు చనిపోయిన సందర్భంగా వాటి సమాధి కార్యక్రమాన్ని కూడా గౌరవప్రదంగా బాధతో జరిపేది.
సీనియర్ రచయితలను వారి కుటుంబ సభ్యులను గౌరవించడం ఆమె వ్యక్తిత్వంలో మరో భాగం. యశోద రెడ్డి గారు చనిపోయేంతవరకు ఓ కూతురుగా కొనసాగింది. హైదరాబాద్ కు వచ్చిన ప్రతిసారి ముదిగంటి సుజాత రెడ్డి గారిని, దాశరథి రంగాచార్య గారి సతీమణిని కలవడం ఆమెకు ఆనవాయితీ. ఈనెల 18న కూడా శారదా శ్రీనివాసన్ గారి బర్త్ డే ను ఆమెని నివసిస్తున్న సాకేత్ నిలయంలో జరపాలని కుతూహల పడ్డది. పెద్దవాళ్లు కనుమరుగవుతారేమో అనే ఆలోచనతో వాళ్లను తరచుగా కలిసే ప్రయత్నం చేసే రజిత తానే కనుమరుగైపోయింది.
ఓపాట, ఓ రచయిత, ఓ కథకురాలు, ఓ దినజన బాంధవి, ప్రకృతి ప్రేమికురాలు, ఓ ధిక్కార స్వరం
పుటుక నీది
చావు నీది
బతుకంతా దేశానిది అని కాళోజి చెప్పినట్టు నింగిలో వేగుచుక్కగా వెళ్ళిపోయింది. అయినా అవయదానం చేసి వైద్య విద్యార్థులకు పాఠం చెబుతూ, నేత్రదానంతో తాను కోరుకున్న సమాజం కోసం నిరీక్షిస్తూ రజిత మనతోనే ఉంది అన్న ఆశతో నివాళులర్పిస్తూ ………
-తిరునగరి దేవకిదేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
నింగికేగిన వేగుచుక్క(స్మృతి వ్యాసం ) – తిరునగరి దేవకిదేవి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>