పిట్ట కొంచెం కూత ఘనం స్మృతి వ్యాసం ) – వి. శాంతి ప్రబోధ

సాహిత్యం, ఉద్యమం, స్త్రీ వాదం, అన్యాయం అసమానతలపై నిరసన వ్యక్తం చేసే స్వభావం, బడుగు బలహీనుల పట్ల గాఢమైన దృక్పథం కలిస్తే అనిశెట్టి రజిత వ్యక్తిత్వం. అంతేకాదు, ఆమె స్నేహం తోటి వాళ్ళ మధ్య బంధాలు పెంచేది గా ఉంటుంది.
అనిశెట్టి రజిత తో నా పరిచయానికి స్నేహానికి పదిహేనేళ్ల వయసు. అవి ప్రరవే గా మార్క్ ముందు మనలో మనం గా ఉన్న రోజులు. దళిత స్త్రీ లోనై వచ్చిన సాహిత్యం పై కాకతీయ విశ్వ విద్యాలయం వరంగల్ లో మనలో మనం ఒక సదస్సు నిర్వహించింది. అప్పటికి నాకు రచయిత్రులతో వారి సంఘాలతో ఎటువంటి పరిచయం లేదు.
సాహితీ వాతావరణానికి దూరంగా ఉన్న నన్ను మనలో మనం తరఫున డా.కాత్యాయనీ విద్మహే సదస్సు కు ఆహ్వానించారు. డా. గీతాంజలి నేను రాసిన జోగిని నవలపై పత్ర సమర్పణ చేస్తున్నారని చెప్పారు. ఆ సందర్భంలో గీతాంజలి, అనిశెట్టి రజిత ఫోన్ లో మాట్లాడారు. జోగిని నవలపై సమీక్ష వ్యాసం రాశానని అనిశెట్టి రజిత చెప్పారు.
సదస్సు మొదటి రోజు నాకు వెళ్ళటం కుదరక రెండవ రోజు వెళ్ళాను. మొదటి రోజు నా నవలపై గీతాంజలి ప్రెజెంటేషన్ అయిపోయింది. అక్కడ ఉన్న రచయిత్రలంతా నాకు కొత్తే రత్నమాల అక్క తప్ప. అదిగో అప్పుడే అందరూ ఎంతో స్నేహంగా పలకరిస్తూ ఉంటే స్వాభావికంగా ఉన్న బిడియం తో నేను. అలా అందరితో పాటు అనిశెట్టి రజితను కూడా చూశాను. మాట్లాడాను.
అయితే, రజిత గురించి హేమలతాలవణం గారి నోట కొద్దిగా విన్నాను. ఆవిడ ఒకసారి వరంగల్ జైల్లో ఉన్న ఖైదీలను కలవడానికి వెళ్లినప్పుడు గుర్రం జాషువా కూతురు గా హేమలత గారిని పలుకరించినట్లు చెప్పారు. ఆ పరిచయం తోనే 2005లో అనుకుంటా జాషువా ఫౌండేషన్ మీటింగ్ కి రజిత ను ఆహ్వానించారు. చలాకీగా తిరుగుతూ పరిచయస్తులను పలుకరిస్తూ కెమెరా తో ఫొటోలు తీసిన రజితను చూశాను. కానీ పరిచయం లేదు. మొదటి పరిచయం 2009లో జరిగిన మనలో మనం సదస్సు సందర్భంగానే.
2010లో అమృతలతగారు ‘గాయాలే గేయాలై’ కవిత్వ సంకలనం తీసుకొస్తున్న సందర్భంగా సంపాదక వర్గంలో ఉన్న అనిశెట్టి రజిత ఆర్మూరు వచ్చారు. అక్కడికి 60 కిమీ దూరంలో ఉన్న నన్ను కలవడానికి అమృతలత గారితో కలిసి మా ఊరు రావడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అది ఆమె స్నేహశీలత.
ఆ తర్వాత ప్రరవే లో నేను కూడా సభ్యురాలిని కావడం, రాజమండ్రి లో జరిగిన ప్రరవే మీటింగ్ లో నేను కూడా పాల్గొన్నప్పటి నుండీ ఆ స్నేహం బలపడింది.
తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రరవే కూడా రెండు శాఖలుగా విడిపోయింది. అప్పుడు తెలంగాణా శాఖకు నేను అధ్యక్షురాలిగా, రజిత కార్యదర్శిగా బాధ్యతల్లో ఉన్నాం. ఆ సమయంలో తెలంగాణ శాఖ తరపున వర్ని, నిజామాబాద్ జిల్లాలో “కవిత్వం -పాట” పై ఒక వర్క్ షాప్ నిర్వహించాం. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్స్ గా కొందరి పేర్లు పరిశీలిస్తున్నప్పుడు ప్రాంతీయ అస్తిత్వ కారణంగా కొందరి పేర్లను నిర్ద్వంద్వంగా వ్యతిరేకించింది రజిత. అదే విధంగా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కూడా అనేక సార్లు మిగతా సభ్యులతో విభేదించడం, తన నిరసన వ్యక్తం చేయడం జరిగేది. ఎక్కడా రాజీపడే వ్యక్తిత్వం కాదు ఆమెది.
తోటి రచయితలు, ఉద్యమకారులతో అనిశెట్టి రజిత సంబంధాలు దీర్ఘకాలిక మైనవి. కలంయోధురాలిగా నాకు తెలిసిన రజిత జీవితం ప్రజాపక్షం అని కోవిడ్ సమయంలో అర్థమైంది. తన ముందున్న సమాజంలోని బాధితుల బాధల్లో తనను తాను చూసుకుని ఎంపతీతో వ్వవహరించేదని, వారి కోసం నిలబడి బాధితుల గొంతుకగా నిలబడేదని, న్యాయం జరిగే వరకూ వ్యవస్థతో తలపడేదని రజిత అంతిమ యాత్రలో పాల్గొన్న సందర్భంగా తెలిసింది. ‘మేం బయటి ప్రపంచానికి చెప్పుకోలేనివి నీకు చెప్పుకున్నాం. మాకు అండగా ఉండి ధైర్యం నింపావు. నడిపించాను. ఇక మేమెవరికి మా బాధలు చెప్పుకోవాలని వారు రోదిస్తున్నప్పుడు రజిత కొత్తగా పరిచయమైంది. రజితలోని ధిక్కార స్వరమే ఆమెను బడుగు జీవుల చైతన్య కార్యకర్తగా, ఉద్యమకారిణిగా మలిచాయేమో!
దళిత, బహుజన దృష్టి కోణంలో సామాజిక ప్రాంతీయ అసమానతలను ఎదిరిస్తూ, ప్రజలను మూసధోరణుల్లోకి నెట్టేసే అవకాశవాద, వ్యాపార దృక్పథాలను వ్యతిరేకించే రచయిత అనిశెట్టి.
స్త్రీ వాదిగా, బహుజన వాదిగా, తెలంగాణ వాదిగా, సామాజిక సమానత్వం కోసం, స్త్రీ విముక్తి కోసం సాహిత్యాన్ని సాధనంగా వాడుకున్నారని రజిత.
పైకి ఎంతో సాదాసీదా కనిపించే రజితలోని సామాజిక స్పృహ, చైతన్యం, ధీరత్వం, స్నేహశీలి, పేదసాదల పట్ల సంఘీభావం ఆమెను అసాధారణ వ్యక్తిగా నిలిపాయి. తెలంగాణ ఉద్యమంలో, స్త్రీ వాదం లో రజిత రచనలు చైతన్యాన్ని రగిల్చాయి. ఆమె ధిక్కార స్వరం, మానవతా దృక్పథం తెలుగు సాహిత్యంలో అమరత్వం పొందాయి.
-వి. శాంతి ప్రబోధ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
పిట్ట కొంచెం కూత ఘనం స్మృతి వ్యాసం ) – వి. శాంతి ప్రబోధ — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>