సంపాదకీయం – అరసి శ్రీ
ముందుగా అందరికీ నూతన ఆంగ్లసంవత్సర శుభాకాంక్షలు.
ఎదురైనా సవాళ్లను పాఠాలుగా మార్చుకుని ముందుకు సాగడమే సగటు మనిషికి ఉండాల్సిన తొలి లక్షణం.
మన “విహంగ”లో భాగమైన రచయిత్రులకు , రచయితలకు , పాఠకులకు విహంగ 15వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
ఏ ప్రయాణమైనా ఒక్క అడుగుతో , ఒక్క ఆలోచనతోనే మొదలవుతుంది. కానీ ఆ అడుగు , ఆ ఆలోచన ఎంత బలంగా ముందుకు సాగితే అది ముందు తరాల వారికి మార్గదర్శకంగాను , చరిత్రలో తనకంతు ఒక స్థానాన్ని సంపాదించుకోవడం జరుగుతుంది. ఈ మాటలకి నిదర్శనమే “విహంగ” పత్రిక ప్రయాణం.
నవంబర్ 11, 2011 న హేమలత పుట్ల వేసిన తొలి అడుగు నేటికి పదిహేనేళ్ల వసంతాలు దాటి పదహారు వసంతాల వైపు అడుగులు వేస్తుంది.
క్షణాల్లో జీవితాలు మారిపోతున్న ఈరోజుల్లో , ఏడాదికి ఒక కొత్త ఆవిష్కరణలు జరుగుతున్న తరుణంలో అంతర్జాలం అంటే అంతగా తెలియని రోజుల్లోనే మహిళల కోసం అది తెలుగులో ఒక పత్రికను ప్రారంభించడం అంటే సాహసమనే చెప్పాలి.
ఈ పదిహేనేళ్ల ప్రయాణాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఎన్నో ఎన్నెన్నో సంగతులు. గంటలు, గంటలు సిస్టం ముందు ఉండిపోయిన రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఉదయం మొదలు పెడితే రాత్రి అయిన సంగతి కూడా తెలిసేది కాదు నాకు , హేమలత మాం కి.
ఈ పదిహేనేళ్లలో సాంకేతికతలో వచ్చిన మార్పులు పనిని మరింత సులభతరం చేసాయనే చెప్పాలి. కాని సాంఘిక మాధ్యమాలలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు రచనల మీద కూడా స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రస్తుత కాలంలో పత్రిక నిర్వహించాలి అంటే సాంకేతికతలో అవగాహనతో పాటు రచనలను జల్లెడ పట్టాల్సిన పరిస్థితి. ప్రస్తుత తరం చదవడం పై కన్నా దృశ్య మధ్యమాలపైనే మక్కువ చూపిస్తుంది.
అంతర్జాలంలో వెలువడుతున్న తొలి మహిళా పత్రికగా , ISSN గుర్తింపు పొందిన తొలి తెలుగు పత్రికగా విహంగ కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పదిహేనేళ్ల పయనంలో కథలు , కవితలు , ధారావాహికలు , ఆత్మకథలు , ఆరోగ్య సలహాలు, సాహిత్య సమావేశాలు , ముఖా ముఖీలు వంటి ఎన్నో విభాగాల్లో రచనలను చదువరులకి అందించింది విహంగ.
తొలి రచన అది కథ కాని , కవిత కాని తొలి ప్రాధాన్యం ఇవ్వడమే విహంగ మొదటి నుంచి పాటిస్తున్న నియమం. దాని వలన ఎందరో రచయిత్రులు , రచయితలు తమ తొలి రచనను విహంగలోనే చూసుకోవడం గమనార్హం.
దశాబ్ద కాలంగా విహంగలో ప్రచురితమైన కథల పై విశ్వవిద్యాలయంలో పరిశోధన జరుగుతున్నాయి అంటే విహంగలో ప్రచురితమైన రచనలు ఏ స్థాయిలో ఉంటాయో తెలుసుకోవడానికి ఒక నిదర్శనం.
మానస ఎండ్లూరి , వెంకట్ కట్టూరి పోత్సాహంతోనే పత్రికను ప్రతి నెల మీ ముందుకు తీసుకురాగలుగుతున్నాను .
విహంగకి సకాలంలో రచనలు పంపుతూ పత్రిక పురోగమనానికి సహకరిస్తున్న రచయిత్రులు, రచయితలందరికి పేరు పేరునా మరొక సారి ధన్యవాదాలు.
ఎప్పటి వలే మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ ………….
అందరికీ మరొకసారి విహంగ 15 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు ….
-అరసి శ్రీ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
సంపాదకీయం – అరసి శ్రీ — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>