అంతర్వీక్షణం-8 (ఆత్మకథ ) – విజయభాను కోటే
ఒక్కోసారి జ్ఞాపకాలు ఒక వరుసలో రావు. కొన్ని చినుకులై రాలతాయి. కొన్ని ఎందుకో చూరును పట్టుకున్న వర్షపు బిందువుల్లా మెదడును పట్టి వదలవు. చదువు అంటే ఇష్టం, అయిష్టం లాంటివి ఏవీ ఉండేవి కాదు చిన్నప్పుడు. స్కూల్ అంటే ఫ్రెండ్స్. స్కూల్ అంటే నవ్వులు, కేరింతలు. స్కూల్ అంటే చిరుతిళ్ళు పంచుకుని తినడం, స్కూల్ అంటే కబుర్లు. స్కూల్ అంటే ఆనందం!
ఎపుడైనా ఎవరైనా చదవమని ఒత్తిడి చేస్తే కదా.. చదువంటే భయం ఉండడానికి!
ఎపుడైనా రేపు పరీక్ష అనగా కాసేపు లెసన్స్ తిరగేయాల్సి వస్తే, ఒకసారి లెసన్ చదవడమే అలవాటు. ప్రశ్న జవాబులు చదివిన గుర్తు ఎపుడూ లేదు. ఇక నేను పాఠం చదవడం అనేలా ఏమీ ఉండదు. ఎదురుగా ఎవరితోనో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అదొక వింత అలవాటు. చేతులు ఊపుతూ, ఎవరికో పాఠం చెబుతున్నట్టు, రకరకాల విన్యాసాలు చేస్తూ, బయటికే మాట్లాడుతూ.. వేరే ప్రపంచం! ఇక నాకున్న అమ్ములపొది నా రన్నింగ్ నోట్స్. నాకు నచ్చిన విధంగా, నాకు అర్థమైన విధంగా emoticons తో, బొమ్మలతో, ఏవేవో నాకు మాత్రమే అర్థం అయ్యే symbols తో, టీచర్స్ చెబుతున్నపుడు కరణం గారి వలె నేను రాసుకున్న/గీసుకున్న రాత ప్రతి. అది చూస్తే చాలు, అన్నీ నా మెదడులో పరుగులు తీసేస్తాయి. ఇలాంటి సులువు పద్ధతులు ఇప్పటి పిల్లలకు నేర్పుతున్నారా? అసలు పిల్లలు ఇలాంటి విధానాలు అలవర్చుకుంటున్నారా?
పరీక్షల సమయంలో క్లాస్ లో విన్నది గుర్తు చేసుకుని రాయడమే తెలుసు. పరీక్షలని దొర్లి దొర్లి చదవడం ఎప్పుడూ అలవాటు కాలేదు. ఇప్పటి పిల్లలను, వాళ్ళ తల్లిదండ్రులను, అంతెందుకు,,,,,,ఎదుటివాళ్ళ పిల్లల చదువుల గురించి ఒకటే ఆరా తీసే సమాజ సభ్యులను చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది.
మంచి మార్కులను చూసినపుడు మాత్రం డాడీ, “చదవకుండా ఇలా మార్క్స్ వస్తే, చదివితే ఇంకెలా వస్తాయో ఆలోచించు” అనేవారు. అదొక్కటే గుర్తు.
అసలు పరీక్షల రోజుల్లో, పరీక్ష హాల్లో నా పరిస్థితి ఎప్పుడు గుర్తు చేసుకున్నా ఆహ్లాదంగా మాత్రమే అనిపిస్తుంది. జీవితంలో ఒక్క సారైనా పరీక్ష గురించి నేను ఒత్తిడి అనుభవించిన సందర్భం ఉందా అని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఒక్క అనుభవం కూడా అటువంటిది లేదు మరి!
ఇంట్లో ఒత్తిడి లేకపోవడం, స్కూల్లో ఒత్తిడి లేకపోవడం వల్లనేమో, పరీక్షకి గెంతుతూ, ఎగురుతూ వెళ్ళేదాన్ని. ఈ మధ్య ఒక రోజు నా బిడ్డకి నా పరీక్షల అనుభవం చెప్తుంటే, వాడు కూడా నాలానే తన అనుభవాలను చెప్పాడు. ఎంత హాయిగా అనిపించిందో చెప్పలేను.
పరీక్షలు అంటే ఒక పెద్ద విషయమని ఏడో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరు అయినపుడు తెలిసింది. మొదటి పరీక్ష రోజు అందరూ హడావుడిగా ఉన్నారు. మా స్కూల్ కాకుండా ఇంకో స్కూల్ లో పరీక్ష రాయడం ఒకటే తేడా. మిగతాది అంతా సేమ్ టు సేమ్ అనుకున్నాను. కానీ అక్కడ నేల మీద కూర్చుని పరీక్ష రాయాల్సి వచ్చింది. నాకు బెంచ్ మీద కూర్చుని రాయడమే అలవాటు. మొదటి రోజు మఠం వేసుకుని, pad ఒళ్ళో పెట్టుకుని పరీక్ష రాయడం కష్టం అనిపించింది. సగం పరీక్ష అయ్యాక ఈ మఠం పద్ధతి కాదని నాకు నచ్చినట్టు కూర్చుని రాశాను. రెండో పరీక్ష పూర్తి అయ్యేసరికి ఆ ఇబ్బందిని కూడా అధిగమించేశాను. మరి ఇబ్బంది అనిపించలేదు.
పదవ తరగతి పబ్లిక్ పరీక్ష కూడా వేరే స్కూల్లో. అక్కడ ఒక రోజు బెంచ్ ఉన్న క్లాస్ లో పడితే, ఇంకో రోజు నేల మీద రాయాల్సిన క్లాస్ వచ్చేది. ఒకసారి అలవాటు అయ్యాక ఇబ్బంది అనిపించలేదు.
పరీక్ష ఎలా రాస్తారు ఎవరైనా? పిల్లలు పరీక్ష రాస్తుంటే గమనిస్తూ ఉంటాను నేను. పరీక్ష సమయంలో నా మానసిక, శారీరక స్థితి గురించి నా క్లాస్ పిల్లలకి చెప్తూనే ఉంటాను. కొందరు అచ్చు నాలానే ప్రవర్తిస్తారు. అప్పుడు భలే సంతోషం అనిపిస్తుంది. అలా నాకు చిన్నప్పుడు ఎవరూ చెప్పలేదు. కానీ ఎందుకో నా ప్రవర్తన చిన్నప్పటి నుండి అలానే ఉండేది. ఎలా అంటారా?
పరీక్ష రోజు చాలా సౌకర్యంగా ఉండే డ్రెస్/ యూనిఫాం వేసుకునేదాన్ని. ఎక్కడా బిగుతుగా లేకుండా, సౌకర్యంగా ఉండేలా! పరీక్షకు అవసరం అయినవి అన్నీ ముందు రోజే రెడీ చేసి ఉంచేదాన్ని. పరీక్ష మొదలయ్యే వరకూ చక్కగా నవ్వుతూ, అందరితో కబుర్లు చెప్పేదాన్ని. పరీక్ష రాయడానికి కూర్చున్నపుడు మాత్రం నాకు ప్రపంచంతో సంబంధం తెగిపోయేది. ప్రశాంతంగా నా చేతికి ఉన్న వాచ్ తీసి నా ఎదురుగా పెట్టుకుంటాను. పరీక్ష రాయడానికి అవసరం అయినవి అన్నీ బాక్స్ లోంచి తీసి ఎదురుగా పెట్టుకుంటాను. పేపర్ తీసుకునే ముందే ఎందుకో నా మెదడు ప్రశాంతంగా మారిపోతుంది. ఏ గజిబిజీ ఉండదు. పేపర్ ను కాసేపు చదువుతాను. టైమ్ చూసుకుంటాను. పరీక్ష రాయడం మొదలు పెడతాను. ప్రశ్నకి ఇంత సమయం అని లెక్క వేసుకుంటాను. ఆ సమయానికి పూర్తి చేసేస్తాను. ప్రక్కన ఏమి జరుగుతుందో, వెనుక ఏమి జరుగుతుందో, ఇన్విజిలేటర్ ఏం చేస్తున్నారు, మిగిలిన అభ్యర్థులు ఎలా రాస్తున్నారు, స్క్వాడ్ వచ్చారా, వెళ్లారా.. ఏదీ నాకు పట్టదు. అడిషనల్ కావాల్సి వచ్చినపుడు మాత్రమే తల పైకి ఎత్తడం. పరీక్ష సమయంలో మెదడు అంత ప్రశాంతంగా ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు. సమయానికి ఐదు నిముషాల ముందు పరీక్ష పూర్తి చేస్తాను. అందరూ పేపర్స్ ఇచ్చి బయటికి వెళ్ళేవారకూ మాత్రం నా స్థానం నుండి కదలను. పేపర్ ఇచ్చే వరకూ రీచెక్ చేస్తూనే ఉంటాను. చివరిగా పరీక్ష హాల్ నుండి బయటికి వచ్చాక, ఎట్టి పరిస్థితుల్లోనూ రాసిన పరీక్ష గురించి మాట్లాడను. ఇంటికి వచ్చి ప్రశ్నల జవాబులను సరిగా రాశానా, లేదా అని సరి చూసుకోను. మార్క్స్ ఎన్ని వస్తాయి అనేది నేను అంచనా వేసుకుంటాను. అలానే వస్తాయి. రిజల్ట్ సమయంలో కూడా కాసింత కూడా టెన్షన్ ఉండదు. ఎవరికైనా నా కన్నా ఎక్కువ వచ్చాయా, ఎవరికైనా నా కన్నా తక్కువ వచ్చాయా అనే ఆలోచనలు రానే రావు. ఎవరి సామర్థ్యం వారిది కదా! అలా అని ఎవరి సామర్థ్యాన్ని ఎక్కువ, తక్కువ ఆలోచించే అలవాటూ లేదు. మనం నేర్చుకున్నది తిరిగి చెక్ చేసుకోవడమే పరీక్ష అంటే. మనం సరిగా నేర్చుకోకపోతే తిరిగి నేర్చుకోవడమే! నేర్చుకునే వీలు లేకపోతే, వదిలేసి ఇంకొకటి నేర్చుకోవడమే!
ఇంత సరళమైన విషయాన్ని ఈ కాలంలో ఎందుకు అంత సంక్లిష్టంగా మార్చేశారో కదా!
ఇక చదవడం! అది ఎందుకు అన్నది నా ప్రశ్న!
టీచర్ అయి ఉండి ఇలా మాట్లాడుతావా అంటే, అదే కరెక్ట్ అంటాను నేను.
ఒక పాఠ్యాంశాన్ని తరగతి గదిలో టీచర్ ద్వారానో, బయట ఏదైనా సన్నివేశం లేదా అనుభవం ద్వారానో, లేదా తల్లిదండ్రులు, బంధువులు, తెలిసిన వారి ద్వారానో చూసి, విని, చేసి.. తెలుసుకున్నావు అనుకో.. నేర్చుకున్నావు అనుకో.. ఎలా నేర్చుకున్నావో, ఆ అంశం ఏమిటో అర్థం అయితే చాలు కదా!!!!!!
తిరిగి చెప్పడానికి, రాయడానికి (పరీక్ష అయినా, సాధారణ నోట్స్ అయినా) భాష వస్తే చాలు. ఒకటి రెండు సార్లు మెదడులో నిక్షిప్తం అయ్యేలా గుర్తు చేసుకుంటే చాలు కదా! ఆకళింపు చేసుకుంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్యాంక్ లోంచి/ఏ టీ ఏం లోంచి తీసుకునే కరెన్సీలా చదువు ఎందుకు అక్కరకు రాదు?
భాష, భాషా వ్యక్తీకరణ. ఈ రెండూ ముఖ్యం. అందుకే పిల్లలు భాష మీద పట్టు సాధించాలి. వ్యక్తీకరణ తెలిసి ఉండాలి. అపుడు పరీక్ష అయినా ఆటలా ఆనందాన్ని ఇస్తుంది. ఉత్తేజంలో ఉరకలు వేసేలా చేస్తుంది.
అసలు పరీక్షల మీదే జీవితాలు ఆధారపడినట్లు బడులు, పెద్దలు ఎప్పుడు తీర్మానించేశారు???
చదువు (రాయడం, చదవడం, పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడం) రావడం లేదు అన్న పక్షంలో ఎందుకు రావడం లేదో ఎపుడైనా పరిశీలిస్తున్నామా? Neurodivergence గురించి మనకు తెలుసా? రైట్/లెఫ్ట్ బ్రెయిన్ గురించి తెలుసా? రాయడం, చదవడం రాని పిల్లలు ఇంకే విషయంలో చురుకుగా ఉన్నారో పరిశీలిస్తున్నామా? అసలు అలా వ్యక్తీకరణ చేయలేని పిల్లలు ఆశువుగా ఎన్నో విషయాలు చెప్పగలరని, ఏ ఆటలలోనో, ఏ పనిలోనో విపరీతమైన చురుకుదనం కలిగి ఉన్నారని మనం గుర్తిస్తున్నామా? విద్యావ్యవస్థ ఒకటే వృక్షంగా నిలబడి అన్ని జీవులనూ చెట్టు ఎక్కే పరీక్ష కోసం నిలబెడుతుందని, అది అర్థం లేనిదని మనకు అర్థం అవుతుందా?
నాలా సంతోషంగా చదువుకునేలా పిల్లలను తయారుచేయాలని టీచర్ అయ్యాక నిర్ణయించుకున్నాను నేను.
-విజయభాను కోటే
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
అంతర్వీక్షణం-8 (ఆత్మకథ ) – విజయభాను కోటే — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>