ఒక క్షణం ఆలోచించ లేకపోయాను (కథ)-శశికళ, అజ్జమూరు

“నాకీ పెళ్లి వద్దు క్యాన్సిల్ చేయండి. నాకు ఒక రెండు నెలల సమయం ఇవ్వండి చాలు. మీరు ఎవర్ని చూపిస్తే వాళ్ళనే చేసుకుంటాను”.
“అదేంటిరా? ఆ అమ్మాయిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని గొడవ చేస్తేనే కదా, నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక మన కులం కాకపోయినా, మన బంధువులంతా విమర్శిస్తారని తెలిసిన, ఒప్పుకున్నాము.
ఎవరెన్ని మాటలు అన్నా తట్టుకుని ,సమాధానం చెప్పుకుని ,ఎంగేజ్మెంట్ ఘనంగా చేసి ,చుట్టాలకి తెలిసిన వాళ్ళకి అందరికీ, మా కోడలు అని, పరిచయం చేశాక ,ఇప్పుడు వద్దంటే ఎలా? అందరికీ ఏం చెప్పుకోవాలి? నలుగురిలో తలెత్తుకోనివ్వకుండా చేస్తున్నావ్” అంటూ కింద కూలబడి ఏడవ సాగింది మీనాక్షి
“అమ్మా!నువ్వు ఏడవద్దు. నేను ఇప్పుడే ఏమి మాట్లాడలేను. నేను మిమ్మల్ని బాధ పెట్టాను. నన్ను క్షమించండి.” అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా బయటికి వెళ్లిపోయాడు వర్ధన్.
అక్కడే ఉండి మౌనంగా ఇదంతా చూస్తున్న ప్రకాష్, నెమ్మదిగా భార్య దగ్గరికి వచ్చి, భార్య తల మీద చేయి వేసి,”మీనాక్షి ఏడవకు వాడు మన కొడుకు వాడిని మనం అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? వాడి సంతోషమే ,మన సంతోషం అనుకునే కదా వాడు ఇష్టపడిన అమ్మాయిని కోడలు గా అంగీకరించాం. ఇప్పుడు వీడు ఇంతగా చెబుతున్నాడు అంటే, ఏదో జరుగుంటుంది.అదేంటో తెలుసుకోవాలి. తెలుసుకొని వర్ధన్ కి నచ్చ చెప్పగలిగితే, చెబుదాం. లేదా ఏం చేయాలో తీరిగ్గా ఆలోచిద్దాం. నువ్వు కంగారు పడకు.”అని చెప్పి, జేబులో ఫోన్ తీసి వర్ధన్ క్లోజ్ ఫ్రెండ్ హరి కి ఫోన్ చేసి, విషయం చెప్పి,’ వర్ధన్ తో మంచిగా మాట్లాడి, అసలు విషయం కనుక్కో’మని చెప్పాడు.
ఆరోజు సాయంత్రం హరి ఫోన్ చేసి”అంకుల్ మీరిప్పుడు ఫ్రీగా ఉన్నారంటే నేను వచ్చి,మిమ్మల్ని కలుస్తాను.”
“ఇంట్లోనే ఉన్నా, రా హరి”
“వర్ధన్ ఆఫీసులోనే ఉన్నాడుగా?”
“అవును ఈరోజు మీటింగ్ ఉంది ,వచ్చేసరికి ఏడు దాటుతుందని చెప్పాడు”
“సరే అంకుల్ నేను వస్తున్నాను”
****
హరి చెప్పిన విషయం విని, మీనాక్షి ప్రకాష్ లు ఆశ్చర్యపోయి, మొహాలు చూసుకున్నారు. ఏం మాట్లాడాలో తెలియక, ముగ్గురు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నారు.
కాసేపటికి ప్రకాష్”హరి చాలా చాలా థాంక్స్. నా మాటకి గౌరవం ఇచ్చి, వర్ధన్ తో మాట్లాడి అసలేం జరిగిందో తెలుసుకోవడమే కాకుండా, స్నేహితుడి మీద అభిమానంతో సాహిత్యతో కూడా మాట్లాడి, అసలు విషయం కనుక్కున్నావు. రేపు ఉదయం నేను మీ ఆంటీ వెళ్లి ,సాహిత్యను చూసి వస్తాము .ఎల్లుండి ఆదివారం కదా! వర్ధన్ ఇంట్లోనే ఉంటాడు. ఆ రోజు సాహిత్య ఇక్కడికి వచ్చేలా ఒప్పిస్తాము” అంటూ హరి ను కౌగిలించుకున్నాడు.
మర్నాడు ప్రకాష్ మీనాక్షి సాహిత్య ఇంటికి వెళ్లారు. ఆదివారం సాహిత్య 10:00కు వారి ఇంటికి వచ్చేలా ఒప్పించారు.
ఆదివారం పొద్దుటే, సాహిత్యకి వర్ధన్ కి ఏకాంతం ఇవ్వాలని, ప్రకాష్ మీనాక్షి గుడికి బయలుదేరి వెళ్లారు.
వాళ్లు వెళ్లిన పావుగంటకు కాలింగ్ బెల్ మోగింది.
తలుపు తీసిన వర్ధన్ ఎదురుగా ఉన్న సాహిత్యాన్ని చూసి, ఆశ్చర్యపోయి”ఎందుకొచ్చావ్?”అని అడిగాడు.
“అసలేమైంది వర్ధన్ నీకు? నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. మెసేజ్లకు రిప్లై ఇవ్వడం లేదు.”
“ఎందుకు మాట్లాడాలి అసలు నీతో”
“అదేంటి? అలా మాట్లాడతావు? మనిద్దరం మూడేళ్ల నుంచి ప్రేమలో ఉన్నాం. ఒకరంటే ఒకరికి ప్రాణం అన్నట్లుగా ఉండే వాళ్ళం. ఒక్క పూట నేను మాట్లాడకపోతే గిలగిలలాడే వాడివి. ఇరువైపు పెద్దల్ని కష్టపడి పెళ్లికొప్పించాము. ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టబోతున్నారు. అంతా సంతోషమే అనుకునే లోపు, నీకు యాక్సిడెంట్. భగవంతుడి దయవలన కోలుకున్నావు అనుకుంటే ఎందుకిలా మారిపోయావు?”
“నాకు యాక్సిడెంట్ అయిన వెంటనే ఆ కండిషన్ లో కూడా మా అమ్మ నాన్న కంటే ముందు నీకే ఫోన్ చేయించా. నాకోసం పరుగు పరుగున వస్తావని ,ఎదురు చూసా.కానీ నువ్వు రాలేదు. నాకు యాక్సిడెంట్ అయిన మూడో రోజు మీ నాన్న ఒక్కరే వచ్చి పొడిపొడిగా మాట్లాడి వెళ్లారు. నీ నుంచి పది రోజులు వరకు మెసేజ్ గాని కాల్ గాని రాలేదు. నేను చేస్తే స్విచ్ ఆఫ్.
నిన్ను తలుచుకుని ఎంత ఏడ్చానో తెలుసా? పది రోజుల తర్వాత ఫోన్ చేసి కూడా” ఎలా ఉంది ?జాగ్రత్త” అని చెప్పి ఫోన్ పెట్టేసావ్.
బహుశా ‘ఆక్సిడెంట్ లో నేను అవిటి వాడిని అయ్యాను అని అనుకొని ,నన్ను వదిలించుకుందామనుకుంటున్నావేమో?’ అని అనుకున్నా ను.
నెల తర్వాత నేను కాస్త కోలుకున్నాక ,అప్పుడు మెసేజ్లు ,కాల్స్ మొదలుపెట్టావ్ .నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే ,నేనా స్థితిలో ఉంటే నా దగ్గరికి రావద్దా?
బాధలో ఉన్నప్పుడు నా మానాన నన్ను వదిలేసి,
తర్వాత తీరిగ్గా మాట్లాడదామనుకున్నావా?
నువ్వు నిజంగా ఇష్టపడ్డావని నమ్మి మోసపోయాను. అది అర్థమైంది కనుకే, నీ కాల్స్ కి మెసేజ్లకి రిప్లై ఇవ్వలేదు. ఇప్పుడు కూడా నీతో మాట్లాడే తీరిక ఓపిక నాకు లేవు. వెళ్ళిపో. మన పెళ్లి కూడా జరగదు అమ్మా ,నాన్న రాకముందే వెళ్ళిపో.”అన్నాడు వర్ధన్.
సాహిత్య_”అసలు ఎందుకు రాలేదో కూడా వినవా?”
“వద్దు నాకు కారణాలు చెప్పొద్దు”
“అది కాదు”అంటూ, ముందుకు అడుగు వేయబోయి, ఎదరకు పడిపోయింది సాహిత్య.
ఆ శబ్దానికి తలతిప్పి చూసిన వర్ధన్ కి,సాహిత్య కింద పడినప్పుడు సాహిత్య వేసుకున్న ప్లాజా ప్యాంటు, కొద్దిగా పైకి వెళ్ళగా కాలికి కట్టిన కట్టు కనపడింది.
అప్రయత్నంగా”ఏమైంది?”అంటూ సాహిత్య దగ్గరికి వచ్చి సాహిత్యని పైకి లేపాడు.
ఆ క్రమంలోనే సాహిత్య రెండు చేతులపై మానిన గాయాల మచ్చలు కనిపించాయి. ఆశ్చర్యంతో ప్రశ్నార్ధకంగా సాహిత్య ను చూసాడు.
“నువ్వు ఫోన్ చేయగానే, అమ్మ ‘నాన్నగారు వచ్చేవరకు ఆగు లేదా క్యాబ్ బుక్ చెయ్ నేను కూడా వస్తా’అంటున్నా, వినకుండా స్కూటీ మీద బయలుదేరాను. ఆ సమయంలో నా కళ్ళ ముందు నువ్వు తప్ప ఏమి కనిపించలేదు. ఎంత తుడుచుకున్నా కన్నీళ్లు ఆగలేదు. ఆ కంగారులో ఎదురుగా వస్తున్న కారును గుద్దేశాను.
కాలు ఫ్యాక్చర్ ,రెండు చేతులకి బాగా దెబ్బలు తగిలాయి. ఫోన్ పగిలిపోయింది. హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. కాలికి సిమెంట్ కట్టు వేశారు. మూడు రోజులు హాస్పిటల్ లోనే ఉన్నా.
అందుకే నాన్నగారు ఒక్కరే నిన్ను చూడటానికి వచ్చారు. మీ బాధను చూసి, నా బాధను కూడా చెప్పి ,ఇంకా బాధ పెట్టలేక నా గురించి చెప్పలేదట. తమ్ముడిని పోరి ఫోన్ బాగు చేయించుకుని చేతులు స్వాధీనంలో లేకపోవటంతో తమ్ముడు సాయంతో ఫోన్ చేశాను. నీ గొంతు వినగానే ఏడుపొచ్చేసింది. నేను ఏడుస్తుంటే తమ్ముడు కంగారుపడి ఫోన్ కట్ చేసి, అమ్మని పిలుచుకొచ్చాడు. కాస్త నొప్పులు తగ్గిన దగ్గర నుండి ,నీతో మాట్లాడాలని నువ్వు ప్రేమగా మాట్లాడితే, నా పరిస్థితి చెప్పాలని, చాలాసార్లు కాల్స్ మెసేజ్లు చేశాను. కానీ నువ్వు చాలా ముభావంగా మాట్లాడి కట్ చేసే వాడివి”అంది సాహిత్య
“అయ్యో !నన్ను క్షమించు సాహిత్య !.అర్థం చేసుకోలేక, అపార్థం చేసుకున్నాను. ‘అంతగా ప్రేమించిన నువ్వు ఎందుకు దూరంగా ఉన్నావు?’ అని ఒక్క క్షణం ఆలోచించలేకపోయాను”.
అంటూ సాహిత్యను కన్నీళ్ళతో,కౌగిలించుకున్నాడు వర్ధన్.
అప్పుడే ఇంట్లోకి అడుగు పెట్టిన మీనాక్షి ప్రకాష్ ను కొడుకు కోడలు చూసి సంతోషంతో ముఖాలు చూసుకున్నారు.
ప్రకాష్ “అందుకే ఎదుటి మనిషిని త్వరగా అపార్థం చేసుకోకూడదు”అన్నాడు.
ఆ మాటలు విన్న,వర్ధన్,సాహిత్యలు కౌగిలి నుండి విడిపడి, సిగ్గుపడుతూ చూశారు.
-శశికళ,
అజ్జమూరు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
ఒక క్షణం ఆలోచించ లేకపోయాను (కథ)-శశికళ, అజ్జమూరు — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>