నా కథ-10– గురుకుల పాఠశాల’ — డా.బోంద్యాలు బానోత్(భరత్)

…… 5 వందల రూపాయలు సమకూర్చడానికి, అనేక ఇబ్బందులు పడవలసి వచ్చింది. ఎట్టకేలకు ఆ డబ్బులు ఇచ్చి, టీసీ తీసుకోని ఇంటికి పోయి, మరునాడు లింగ్యాతో కలిసి, హన్మకొండాకు పోయి, లష్కర్ బాజార్ లోని కొత్తూరు హైస్కూల్లో, ‘టీసీ ‘ ఇచ్చీ, బడిలో చేరాను. టీసీ తీసుకుంటూ ” ఈ రోజే చివరి రోజు, ఈ సంవత్సరం నీదే చివరి అడ్మీషన్, జెస్ట్, ఒక గంట లేటైతే, అడ్మీషన్ దొరకకపోవు, నీ అదృష్టం బాగుంది, రోజు బడికి రావాలి, 75% అటెన్డెన్స్ తప్పని సరిగా ఉండాలి, లేకపోతే, 7వ తరగతి బోర్డెగ్జాం రాయనివ్వరు.” అని పాజిటివ్ మోటివేషన్ చేశాడు, ఒక సార్. అందుకు నేను, ‘ఓకే’, అన్నట్టుగా తలూపాను.
ఆ తర్వాత ‘లింగ్యా’, నేను కలిసి, మా అన్నా ‘గోపీచంద్’ ఇంటికి ‘గుండ్ల సింగారం’ బయలు దేరి, నడిచి పోతున్నాం. “ఎట్టకేలకు అనుకున్నట్లుగా, బడిలో చేరడం జరిగింది, ఇప్పుడు హాస్టల్లో చేరేదుంది, హాస్టల్లో పేరొచిందంటే, మనమనుకున్న పని పూర్తైనట్టూ. హాయిగా హాస్టల్లో ఉంటూ, బడికి వెళ్ళొచ్చు.” అని లింగ్యాతో, నా మనసులో మాట చెప్పాను. “అవును, ఇప్పుడు మనం ఇంటికి పోయి, ఇంత అన్నం తిని, తర్వాత సాయంత్రం 4గ. లకు, గొల్లపల్లి హాస్టల్ కూ పోయి, హాస్టల్ అప్లికేషన్ ఫామ్ తీసుకుని, అప్లై చేసెద్దాం. హాస్టల్లో, నా పేరు ఎలాగు ఉంది, నీ పేరు సాంక్షనయ్యీ, వచ్చెంతవరకు నిన్ను నా ‘గెస్టని’ చెప్పీ, ‘అన్నం’ పట్టిస్తా, లేకపోతే అందాక మా అత్తమ్మ (కమలా) వాళ్ళ ఇంట్లో తినవచ్చు,” అని ధైర్యం చెప్పాడు.
అలా మాట్లాడుకుంటూ, లష్కర్ బాజార్ నుండి, డబ్బాలు, కేనాలి బ్రిడ్జి, కేనాలి కట్టపై ఒక ఫర్లాంగ్ నడిచిన తర్వాత, ఆ కట్టకిందే, మా అన్నా ‘గోపీచంద్’ ఇల్లు; ‘గుండ్ల సింగారం’, చేరుకున్నాము. మేము పోయే సరికి, మా వదిన ‘కమలా గోపీచంద్’, ఇంటి ముందు చిన్న వరండాలో నవారు మంచంపై కూర్చోని, స్టీల్ ప్లేట్ లో, ఉల్లిపాయలు తరుగుతుంది. మమ్ములను చూసి, తాను ఆనందం వ్యక్తం చేస్తూ, మంచీ-చెడు అడిగి తెలుసుకోని, ” మీరు కూర్చోండి, కాసేపట్లో అన్నం-కూర తయ్యారు చేస్తాను, తర్వాత భోజనం చేద్దాము.” అని అన్నది, ఎంతో ఆప్యాయంగా.
అప్పటికే మేము నడిచి నడిచి అలసి పోయాము. తర్వాత గంటసేపు రెస్టు తీసుకొన్నాము. అనంతరం మధ్యాహ్నం భోజనం చేసి, ఆమాట-ఈమాట… కబుర్లు చెప్పుకుంటూ.. ఇంతలో, నా చూపు గోడ గడియారంపై పడింది. టైం చూస్తే 4 గం. కావస్తోంది. నా మిత్రుడు ‘లింగ్యా’తో, సైగ చేసి టైం చూడమని చెప్పాను. తను ‘టైం’ చూసి, “టైమయింది, మనము నడిచి గొల్లపల్లి హాస్టల్ చేరుకునే సరికి గంట సమయం పడుతుంది. ఆ తర్వాత ,’కుక్కూ’ ‘ఎల్లయ్యా’ వంట గిన్నెలు కిందికి దింప్పీ, పిల్లలందరిని లైన్లో నిల్చోబెట్టీ, అన్నం పెట్టీ, ఆ పట్టిన వేడివేడన్నం, ఊదుకుంటూ తినీ, మళ్ళీ, వెనుకకు మళ్ళీ, బయలుదేరే సరికీ, టైమారు (6) అవుతుంది. అంటే ఇంకా ఆలస్యం చేస్తే, వచ్చేటప్పుడు చీకటౌతుందీ. తొందరగా పోదం, పా..” అని, చమత్కారంగా అన్నాడు, లింగ్యా. అలా వారం రోజులు, పొద్దటి పూట ‘భోజనం’ మా అన్నా గోపీచంద్ ఇంట్లో చేసి, సాయంత్రం పూటా గొల్లపల్లి ‘ఎస్ టీ’ హాస్టల్లో చేశాను. ఆ తర్వాత నాకు హాస్టల్లో సీటొచింది. అన్నీ సదురుకోని హాస్టల్ కూ వెళ్ళి పోయాను.
అనుకున్నట్లుగానే, అటు బడిలో చేరాను,
ఇటు హాస్టల్‌లోను సీటొచింది. ఇప్పుడూ చదువు పై మనుసు పెట్టాలనుకున్నాను.. . మంచిగా చదువు కోవాలనే పుట్టెడాశతో, బడిలో చేరాను, రోజు క్రమం తప్పకుండా బడికి పోతున్నాను, కాని పాటాలు చెప్పేవాడేలేడు. రోజు రెండు పీరియడ్లు మాత్రమే అయ్యేటివి, తెలుగు మరియు ఇంగ్లీష్. కొన్ని రోజుల తర్వాత ఆ ‘ఇంగ్లీష్’ పీరియడ్ కూడా కావడంలేదు. నాకా ‘బేసిక్’ సరిగ్గాలేదు. 1990లో 7వ తరగతి బోర్డెగ్జాం. ఇన్ని ఇబ్బందులు పడి బడిలో చేరి, చివరికి 7 వ తరగతి బోర్డెగ్జాంలో ఫేలైతే, పరువు పోతుందని భావించి, ట్యూషన్ కు పోయి, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ ‘బేసిక్స్’ నేర్చుకోవాలని, అనుకున్నాను.
మా హాస్టల్ కీ కూతవేటు దూరంలో ఇద్దరు బ్యాచిలర్ సార్లు వేరు వేరుగా గదులు కిరాయికి తీసుకొని ఉన్నారు. వారిలో ఒకాయన ‘మ్యాథ్స్’, మరొకాయన ‘ఇంగ్లీష్’ చెప్పేవారు. ఫీజు నెలకు ‘పది రూపాయలు’ మాట్లాడుకున్నాను. నేను ట్యూషన్ కు వెళ్ళుతున్న విషయం, మా రూం మెంట్ ‘రవిందర్’ కీ తెలిసింది. ఐతే ఆయన కూడా నాతో ‘ట్యూషన్’ కు రావడం మొదలు పెట్టాడు. ఇక అప్పటి నుండి మేమిద్దరం మంచి ఫ్రెండ్సైయ్యము.
ఏదీ ఏమైనప్పటికీ, ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకోని, నేను బడిలో చేరి నట్లే, మా చిన్నాన్న కొడుకు ‘దేవేందర్’ ను, మా అన్న కొడుకు ‘రవి’ ని, మా మెనత్త కొడుకు ‘హన్మంతు’ను , మా అన్నా నరసిహ్మ కొడుకు ‘రాములు’ను; ఈ నలుగురిని మా హాస్టల్లో చేర్పించాను. కాని వీళ్ళు మూడు నెలల్లోనే ఒక్కరొక్కరుగా, హాస్టల్ విడిచి వెళ్ళి పోయారు.
ఐతే, పైన చెప్పిన విధంగా నేను మరియు రవిందర్, మంచి స్నేహితులమైనం. ఎక్కడికి పోయినా, ఏంచేసినా మెమిద్దరం కలిసే చేసేవాళ్ళం. ఒక రోజు మెమిద్దరం ‘అశోక’ టాకీస్ కీ ‘సీనిమా’ చూద్దామని వెళ్ళాము, కాని టికేట్లు దొరకలేదు, చాలా వరకు బ్లాక్‌లో అమ్ముతున్నారు. ఐతే, మెము కూడా బ్లాక్‌లో ప్రయత్నించగా, ఒక అబ్బాయి, 5. రూ. టికెట్‌ను, 10.రూ. కూ అమ్మ్యాడు. అతని వద్దనుండీ రెండు టికెట్లూ కొని, సినిమా హాల్లొకి ప్రవేసించే ముందు, మేము బంజారా భాషలో మాట్లాడినం. ఆ బ్లాక్ టికెట్ అమ్మె అబ్బాయి కూడా బంజారా కావడంతో, బంజారా భాషలో మాట్లాడటం, పేర్లు, పరిచయాలు.. మొదలగునవి అయినాయి. ఐతే ‘రోజు, సెంట్రింగ్ చెక్కలు కొట్టీ, సాయంత్రం బ్లాక్ లో టికెట్లమ్మేవాడు’, అతన్నీ , మేమిద్దరం, ఇంత చిన్న వయసులో, ఇలాంటి పనులు చెయ్యకూడదని, నచ్చచెప్పి, బడిలో చేర్పించి, హాస్టల్లో జాయిన్ చేశాము.
ఐతే , ‘రవిందర్’ చిన్న నాటి నుండి రెగ్యులర్ బడికి వెళ్ళడం వలన, నా కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకునే వాడు. కాని ఇద్దరికీ ‘బేసిక్స్’ అంతంత మాత్రమే. అందుకని రెడ్డి కాలనీలో ‘సైన్స్, మ్యాథ్స్ కోసం ట్యూషన్ కూ వెళ్ళే వాళ్ళం. ఒక రోజు ట్యూషన్ కూ లేటయితే, ఆ ట్యూషన్ మాస్టర్ పరువు తీసినట్లుగా తిట్ట్యాడు. ఐతే, ఆ మరునాడు నుండి సరైన సమయానికి వెళ్ళే వాళ్ళం. ఐతే, అది పున్నమి వెన్నెల రాత్రి. సమయం సరిగ్గా అర్థమైతలేదు. ఆ ట్యూషన్ మాస్టర్ భయానికి, రాత్రి మూడు (3) గంటలకే లేచీ, తయ్యారై హాస్టల్ నుండి బయలుదేరి, ట్యూషన్ కు వెళ్ళుతున్నాము.., కొంతదూరం వెళ్ళాక, ఇంతలోనే ‘పోలిస్ జీప్కార్’, పెట్రోలింగ్ చెస్తూ వస్తుంది. మమ్ములను చూసి” గీ రాత్రి వీళ్ళు ఎటుపోతున్నారు? పట్టుకోండి వీళ్ళను.” అని అనగా ” సార్ మేము ట్యూషన్ కు వెళ్ళుతున్నాము, మా మాట అబద్ధమైతే, మా చేతుల్లో పుస్తకాలు చూడండి” అని అనుకుంటూ పరుగెత్తాము. ఐనా, కారును స్పీడు నడిపీ, మా ముందుకు తెచ్చి ఆపీ, జీబెక్కమన్నారు. విషయం వివరించి చెప్పగా, “టైం చూసుకోని వెళ్ళాలి, ఇంకో సారి టైం కాని టైం కూ రోడ్డు మీద కనిపించారో, స్టేషన్ కు పట్టుకో పోతాం, అర్థమైందా? ” అంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి మేము కూడా ట్యూషన్ వెళ్ళడం మానేశాం.
మా హాస్టల్లో ముందు రెండు గదుల్లో ప్రయివేట్ బడికి వెళ్ళే పిల్లలు కూడా ఉండేవారు. వాళ్ళు రోజు క్రమం తప్పకుండా బడికి వెళ్ళే వాళ్ళు. చూచి రాతలు రాసే వారు. హోం వర్క్ చేసే వాళ్ళు. కాని మాకు, అవి ఏవి ఉండేవి కావు. మమ్ములను అడిగే నాథుడే లేడు. అంటే నాణ్యమైన విద్య చెప్పడం లేదని అర్థం. పోని, ప్రయివేట్ బడికి వెళ్దామంటే, ఫీజు కట్టే స్తోమత లేదు. అందుకని, ఒక మంచి ప్రభుత్వ పాఠశాల కోసం, వెతుకుతున్నాము. ఇంతలోనే 7వ తరగతి ‘బోర్డెగ్జాం’ వచ్చినాయి. మనసులో టెన్షన్ మొదలైంది.
మా హాస్టల్లో, నాతో పాటు ఇంకా కొంత మంది 7 వ తరగతి చదువుతున్నారు. వాళ్ళు 7 వ తరగతి ‘బోర్డెగ్జాం’ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ‘పేపర్ లీకైందిని, కోహినూర్ హోటల్లో దొరుకుతుందని…’ ఇలా రకరకాల రూమర్స్.. వచ్చేవి. ఏదో విధంగా 7వ తరగతి ‘బోర్డెగ్జాం’ రాశాను. ఫలితాలు వచ్చాయని తెలిసిన, అనంతరం, బడికి వెళ్ళి, నా రిజల్ట్ చూశాను. 7 వ తరగతి పాస్ అయ్యాను. నాకు చాలా సంతోషం కలిగింది. కాన్ఫీడెన్స్ పెరిగింది. కాని స్కూల్ మారాలనుకున్నాను. ‘గౌట్ స్కూల్లో’ చేరాను. కాని ఈ స్కూల్ , ఆ స్కూల్ కంటే అధ్వానంగా ఉంది. ‘పేనం నుండి పొయ్యిలో పడ్డట్టు’ అయ్యింది పరిస్థితి. ఈ స్కూల్లో చేరిన వెంటనే ‘ఎన్సీసీ’ లో జాయిన్ అయ్యాను. తర్వాత 10 రోజులు ‘ఎన్సీసీ క్యాంప్ మామునూర్’ కూ వేళ్ళాను. ఆ తర్వాత నార్మల్‌గా రోజు బడికి వెళ్తున్నాను. కాని, తృప్తి లేదు. మంచిగా రోజు పాటాలు చెప్పే స్కూల్ కోసం వెతుకుతున్నాను.
ఒక రోజు మా వార్డెన్ సార్, మమ్ములను పిలిచి ‘ అరే పిల్లలు ‘ఏపీఆర్ ఎస్’ (గురుకుల పాఠశాల) ఏటూరునాగారంలో, ఎనిమిదో తరగతి లో నాలుగు సీట్లు ఉన్నాయట, వాటిని పరీక్షలు పెట్టీ, మంచిగా రాసి, మార్కులు సాధించిన వారికి, సీటీస్తారు, అక్కడా చాలా బాగుంటుంది, చదువు, పుస్తకాలు,తిండీ, బట్టలు.. అన్ని ఫ్రీ నే. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు వెళ్ళి పరీక్ష రాయండి రా.. సీటొస్తే చాలా బాగుంటుంది’ అని పాజిటివ్ మొటివేషన్ ఇచ్చాడు.
మా హాస్టల్ పిల్లలు, ఎవ్వరూ కూడా ఆశక్తి చూపలేదు. ‘ ఏటూరు నాగారం’ చాలా దూరం, పైగా అది జంగల్లో ఉంది…’ అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కాని నేను, వెళ్ళి పరిక్ష రాయాలనుకున్నా. కాని నాకు తోడుగా ఎవరైనా ఉంటే బావుండనుకున్నాను. ఈ విషయం నా మిత్రుడు ‘రవిందర్’ తో చర్చించాను. మేమిద్దరం ‘ఏటూరు నాగారం’ వెళ్ళి పరిక్ష రాయాలని నిర్ణయించుకున్నాము.
ఏదేమైనా ‘ఏటూరు నాగారం’ వెళ్ళీ, ‘గురుకుల పాఠశాల’ ప్రవేశ పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నాము. బాగానే ఉంది. కాని, అది ఆగస్టు నెల చివరి వారం. రోజు వర్షం కురుస్తుంది. చేతిలో డబ్బులు లేవు. ఇంటికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుందామంటే, తగిన సమయం లేదు. ఒకే ఒక్క రోజు సమయముంది. ఆ ఒక్క రోజులోనే, పొద్దున 6 గం. బస్సెక్కి నేను మా ఇంటికి ‘ మైలారం- తండా’ కు వెళ్ళాను. అదేవిధంగా ‘రవిందర్’ వాళ్ళ ఇంటికి ‘ సన్నూర్- గుడెనుక తండా’ కు వెళ్ళాడు. ‘ ఐతే, ఇంటికి వెళ్ళి, అవసరమైన డబ్బులు అడుక్కోని, వెంటనే మళ్ళీ వెనక్కి బయలు దేరి మధ్యాహ్నం వరకు, హాస్టల్లో ఉండాలి, హాస్టల్ నుండి బయలుదేరి, హన్మకొండా బస్టేషన్ కి 3-4 గం. సమయంలో, ‘ఏటూరు నాగారం’ బస్సెక్కితే, 6-7గం. సమయానికి ‘ఏటూరు నాగారం’ చేరుకొని, ఆ రాత్రి అక్కడే పడుకోని, తెల్లారి 10గం. కు. పరీక్ష రాసి, తిరిగి అదే రోజు సాయంత్రం వరకు, హన్మకొండా హాస్టల్ చేరుకోవచ్చని, అంచనా వేసి, బయలు దేరాము.’ ఆ రోజుల్లో , ఈ రోజుల మాదిరిగా సెల్ ఫోన్లు లేవు.
నేను, మా ఊళ్ళో బస్సు దిగీ, తండాకు నడిచి ఇంటికి వెళ్ళే సరికి పొద్దున పదైంది (10). అప్పటికే, మా అమ్మ గర్శలకుంట పొలాల్లో వరి నాటేసేందుకు, గుత్తా కూలికి వేళ్ళింది. మా నాన్న , మా పొలంలో బురద నాగలి దున్నుతున్నాడు. విషయం వివరించి చెప్పీ , ‘ఏటూరు నాగారం’ , వెళ్ళి రావడానికి, ఖర్చులకూ..200 రూపాయిలు అవసరమని, వెంటనే కావాలని అడిగాను. ‘ ఇప్పటికి ఇప్పుడే డబ్బులు కావాలంటే, ఎక్కనుండి వస్తాయనుకుంటున్నావు రా..!?, డబ్బులెమన్నా చెట్లక్కాస్తున్నాయా?, తెంపీ ‘ఇదిగో’ అని ఇవ్వడానికి. మీ అమ్మనడుగు పో..! ఎక్కడన్నా అప్పో-సప్పో చేసిస్తది’, అని అన్నాడు మా నాన్న , కాస్తాంతా విసుక్కుంటూ. అక్కడినుండి అరకీలోమీటర్ దూరంలో కూలి నాటేస్తున్నా మా అమ్మ వద్దకెళ్ళీ, ‘ అమ్మా!, నేను ‘ఏటూరు నాగారం’ ‘గురుకుల పాఠశాల’లో సీటుకోసం పరీక్షా రాయడానికి వెళ్ళుతున్నా . పోయి-రావడానికి రెండు వందల రూపాయలు అయితయి, తొందరగా ఇస్తే ! వెంటనే వెళ్ళీ, ఈ రోజే ‘ ఏటూరు నాగారం’ వెళ్ళాలే.., అది, హన్మకొండా నుండి చాలా దూరంలో ఉంది.’ అని విషయం వివరించి చెప్పగా.. ‘ ఇదిగో తాళం చెవి, ఇంటికి వెళ్ళీ, తలుపు తీసి, ఇంట్లో చిన్న గాబుపైన ఉట్టి మీది, కింది అటికెలోని ఎర్ర గుడ్డలో, నూటా యాభై రూపాయలు మూట కట్టీ దాచి పెట్టాను. వాటిని తీసుకోని, ఈ తాళం చెవి చిన్నమ్మా కిచ్చి, పైలంగా వెళ్ళు.. పైలం.. బేటా..’ అని అన్నది మా అమ్మ.
మా అమ్మ చెప్పినట్లే, ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకుని, తాలం చెవి మా చిన్నమ్మకు వచ్చీ, అనుకున్నట్లే ‘ఏటూరు నాగారం’ వెళ్ళడానికి, బయలుదేరి, మా ఊరు ‘మైలారం’ నుండి, బస్సెక్కి, హన్మకొండా బస్టేషన్ లో దిగే సరికి మధ్యాహ్నం మూడయింది. కాని నా స్నేహితుడు ‘రవీందర్’ హన్మకొండా బస్టేషన్ కి ఇంకా చేరుకోలేదు, నేనొచ్చిన తర్వాత పది నిమిషాలకు ‘ఏటూరు నాగారం’ బస్సు వెళ్ళిపోయింది. ‘రవిందర్’ మే మనుకున్నా సమయానికి వచ్చి ఉంటే, ఆ బస్సెక్కీ వెళ్ళే వాళ్ళం. ఎప్పుడొస్తడా అని.. టెన్షన్ తో ఎదురు చూస్తున్నాను. ఆ బస్సు వెళ్ళిన పదిహేను నిమిషాలకు ‘రవిందర్’ వచ్చాడు. ఇక వెళ్దాం అనకొనే సరికి, విపరీతమైన వర్షం, కుండపోత వర్షం, పావుగంట సేపు కొట్టింది. ఆ వర్షానికి భయపడి ప్రయాణం మానెయ్యాలి అనుకున్నాం. కాని వర్షం తగ్గుముఖం పట్టింది, తిరిగి హాస్టల్ కీ వెళ్దామని నిర్ణయం తీసుకున్నామో లేదో, మా పక్కనున్న అమ్మాయి తుమ్మింది. ‘తుమ్మితే ప్రయాణం చెయ్యవద్దంటారు, చెడుకు సంకేతమంటారు, కాని నాకెందుకో, మనకు మంచే జరుగుతుందని, అనిపించింది’ అని ‘ రవీందర్ ‘ తో అన్నాను. ఐతే, మా నిర్ణయాన్ని మార్చుకుని, ‘ఏటూరు నాగారం’ బస్ ఎక్కినం. అప్పటికే సమయం నాల్గయింది. బస్ లో కూర్చోని, టికేట్లు తీసుకొన్నం. బస్ పోతూ వుంది.. . తుప్పురు-తుప్పురు వర్షం కురుస్తోంది. హన్మకొండా బస్టేషన్ నుండి ‘ఏటూరు నాగారం’ 105 కీలోమీటర్ ఉంటుంది.
‘ఏటూరు నాగారం’ చేరుకునే సరికి 4-5 గంటల సమయం పడుతుంది. ‘ఏటూరు నాగారం’ చేరుకునే సరికి రాత్రి తొమ్మిదయిందీ. ‘ఐటీడీఏ’ ఆఫీసు వద్ద దిగాల్సింది పోయి, మాకు తెలియకా ‘ఏటూరు నాగారం’ ఊళ్ళో కేళ్ళీ బస్ దిగినం. ఆ రాత్రి, అక్కడి నుండి ‘ఐటీడీఏ’ ఆఫీసు వరకు మూడు కీలోమీటర్లు. ఆ వర్షంలో తడుస్తూ, అప్పుడే నాకు మొషన్స్ మొదలయినయి. నడుస్తూ, నడుస్తూ మూడు సార్లు మొషన్స్ అయినాయి. వర్షం కురుస్తూండటంతో, నీళ్ళకు కొదువలేదు కాబట్టి సరిపోయింది. ఏదోవిధంగా ‘ఐటీడీఏ’ ఆఫీసుకు చేరుకున్నాము. అక్కడా ఎవ్వరూ లేరు, కాని ఆఫీసు ముందు, రోడ్డు మీద ఒక పోలీసు కనిపించాడు. ఐతే,అతనితో, ‘ఎపీఆర్ఎస్'(గురుకుల పాఠశాల)పరీక్షా రాయడానికి వచ్చామని, విషయం వివరించి చెప్పాను. ఐతే, అతను, వాళ్ళు సెంట్రీ ఉండే చోటా, మమ్ములను ఆ రాత్రికి ఉండనిచ్చాడు, తెల్లారి గురుకుల పాఠశాల కెళ్ళీ పరీక్ష రాశాము. అదే రోజున తిరిగి, హన్మాకొండా హాస్టల్ కు చేరుకొనే సరికి రాత్రి ఏడయింది….
-— డా.బోంద్యాలు బానోత్(భరత్)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
నా కథ-10– గురుకుల పాఠశాల’ — డా.బోంద్యాలు బానోత్(భరత్) — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>