నా కథ-14 — డా.బోంద్యాలు బానోత్(భరత్)

అది 1994 ఏప్రిల్ నెల. పదవతరగతి పరీక్షలు బాగానే రాశాను. మా ‘ఏపిఆర్ ఎస్’ (బాలుర) ఆకులవారి ఘనపురం గురుకుల పాఠశాలలో, ఫేర్ వెల్ పార్టీ కూడా అయి పోయింది. ఈ సారి బస్ చార్జీలు ఇంటికి పోవడాని మాత్రమే ఇచ్చారు. దానికి అర్థం ‘ పదవ తరగతి వరకూ చదివించాము, ఇంటికి వెళ్ళడానికి బస్ చార్జీలు ఇచ్చి పంపిస్తున్నాము, ఇక మళ్ళీ ఇక్కడికి రాకూడదు. పై చదువులు చదివి పై పైకీ ఎదుగు, అన్నట్లుగా ఉంది’ . ఏదిఏమైనా ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. తెల్లవారి, అన్నీ సదురుకోనీ, చివరి సారిగా డైనింగ్ హాల్ కీ వెళ్ళి టిఫిన్ చేశాను, ఇక వెళ్ళిపోతాం మనంగా, ఒక్క సారిగా ఆ పాఠశాల సిబ్బంది, మెస్ వర్కర్స్, ముఖ్యంగా టీచర్స్.. పాఠశాల ప్రాంగణం..అన్నీ గుర్తుకొచ్చాయి. బరువెక్కిన హృదయంతో, నా బాక్స్ బుజానా వేసుకున్నాను. నా మిత్రుడు ‘రవిందర్’, మరియు నేను బయలు దేరాము. ఒక కిలోమీటర్ నడిచి, పోలీస్ స్టేషన్ పక్కన వరంగల్ కు పోయే రూట్ లో నిలబడినాము. ఇంతలోనే ‘హన్మకొండా’ బస్ వచ్చింది. మేమిద్దరం బస్ ఎక్కినాము.
చిన్నబోయిన పల్లి దాటినము. తర్వాత సమ్మక్కా- సారలమ్మా క్రాస్ రోడ్డూ దాటాము. ఆ తర్వాత ,బస్సు దట్టమైన అడవిలోకి ప్రవేసించింది. రోడ్డు పక్కన అడవిలో రెండు అడవిదున్నలు కనిపించినాయి. రోడ్డుకు ఇరువైపులా పొడవాటి పెద్ద పెద్ద చెట్లు. ఆ అరణ్యం మధ్య నుండీ బస్సు పోతుంటే అదోరకమైన సౌండు వచ్చేది. మధ్యాహ్నం 2గంటలకీ హన్మాకొంట బస్ స్టేషన్ కీ చేరుకున్నాము. నేను మరియు నా స్నేహితుడు, రవిందర్, ఇద్దరం ‘ఏపిఆర్ జేసీ’ అప్లయి చెయాలనుకున్నాము. ముందే ‘తేదీ, సమయం, స్థానం(ప్లేస్) అషోకా టాకీస్ ఎదురుగా’. అని నిర్ణయించుకున్నాము.
అప్పిటికే ‘తొర్రూరు’ బస్ వచ్చింది. బస్ ఎక్కీ కూర్చున్నాము. ‘ఐతే ఇప్పటిదాకా ఉన్న ఆలోచనలు వేరు, ఇప్పుడు మనసులో వస్తున్నా ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ‘ఏపీఆర్ జేసీ’ కోచింగ్ కీ పైసలు లేవు. స్వంతంగా చదివితే సీటు వస్తదో రాదో తెలియదు. ఇప్పటినుండీ కలిసి చదువుతామనే గ్యారెంటీ లేదు. కాని ప్రయత్నం మానుకోకూడదు’. అని నా మనసులో అనుకున్నాను. ఇంతలోనే మా ఊరు, మైలారం, ఊకల్ క్రాస్- స్టేజీ వచ్చింది. “ఓకే బాయ్, రవీందర్, మరచిపోకు, మనము ఆ రోజు , అక్కడే కలుద్దాము, మరచిపోవద్దూ…ఓకే, రైట్.” అంటూ నా సందూకు తిసుకోని బస్ దిగాను.ఇంటికీ వెళ్ళి పోయాను.
పది రోజుల తర్వాత, ప్లాన్ ప్రకారం, మేము అనుకున్నట్టుగానే , సమయానికి హన్మకొండ అశోక టాకిస్ ఎదురుగా, ‘ఏపీఆర్ జే సీ’ అప్లికేషన్ ఫాంమ్లూ అమ్మే డబ్బా వద్దకు చేరుకున్నాము. నేను, నా మిత్రుడు ‘రవిందర్’ ఇద్దరం అప్లికేషన్ ఫాం తీసుకున్నం. ఆయన ఎంపీసీ లో సీటు కోసం అప్లై చేసాడు. నేను బైపీసీ లో సీటు కోసం అప్లై చేసాను. ఆయన ఎంపీసీ లో సీటు కోసం కోచింగ్ తీసుకున్నాడు. నేను బైపీసీ లో సీటు కోసం కోచింగ్ తీసుకుందామంటే, కోచింగ్ కీ ఫీ కట్టలేని పరిస్థితి నాది. అందుకే నేనే సోంతంగా చదువుకుందా మని అనుకున్నాను. చూస్తూండగానే ప్రవేశ పరీక్షలు వచ్చాయి. నాకు హన్మకొండ ప్రభుత్వ కళాశాలలో సెంటర్ పడినది. నేను పరీక్ష రాస్తున్నా సమయంలో, నా పక్కన పరీక్ష రాస్తున్నా ఒక అబ్బాయికీ ఆ ఇన్వీజ్లేషన్ చేసే ఒక సారు అన్సార్లు చెప్పుతుండగా చూసి, ‘ సార్ మీరు చేస్తున్నది చాలా తప్పు. అలా చెప్పడం వల్ల కష్టపడి చదివిన వారికి అన్యాయం జరుగుతుందని వాదించాను. పరీక్ష హాల్లో డిష్ట్రబయ్యాను. పరీక్ష సరీగ్గా రాయకుండానే బయటికి వచ్చాను. ఇక నాకు సీటు రాదని అర్థమైపోయింది. ‘ఏపీ ఆర్ జే సీ’ మీద ఆశ వదిలేశాను.
‘గౌట్ జూనియర్ కళాశాల’ హన్మకొండ లో అప్లై చేశాను. సీటు వచ్చింది. వారంరోజులు కాలేజీకీ వెళ్ళాను. కాని చాలా మంది-‘ ఆ కాలేజీలో క్లాసులు జరగవు, అందులో చదివే వాళ్ళందరూ ట్యూషన్ కూ వెళ్ళుతారు. ట్యూషన్ కూ వెళ్ళ కూండా, ఆ కాలేజీ వాళ్ళేవ్వరు పాస్ కారు, ట్యూషన్ ఫీజు కూడా బాగానే ఉంటుంది..’ అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఐతే, ఈ కాలేజీలో చదువుతూ, ట్యూషన్ కూ పోయి, ట్యూషన్ ఫీజు కొట్టే బదులు, ప్రైవేట్ కాలేజిలోనే, జాయినైతే బాగుంది కదా!? అని అనిపించింది. వెంటనే ప్రైవేట్ ‘ఆర్ డీ’ జూనియర్ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఎంపీసీ లో జాయిన్ అయ్యాను. సెకండ్ లాంగ్వేజ్ ‘సంస్కృతం’ తిసుకున్నాను. క్లాస్ రూంలు చిన్నవిగా ఉండేవి. ఓకే క్లాస్ లో వందలాదిమంది ఉండేవారు. టీచర్లు చెప్పేది లాస్ట్ బెంచ్ వరకు వినిపించేది కాదు. అర్థమయ్యేది కాదు. అంతా గందరగోళంగా ఉంది. అలా మూడు నెలలు గడిచిపోయాయి.
నేనిప్పుడు బుద్దా నగర్, రెడ్డీ కాలనీలో రూం కిరాయి కీ తీసుకుని ఉన్నాను. ఆ రూంలో నా మిత్రుడు ‘రమేష్’ మరియు నేను, కలిసి కిరాయి కీ తీసుకుని ఉన్నాము. మొదట్లో ఏవో కొన్ని డబ్బులు మా నాన్న ఇచ్చినవి తీసుకుని, చదువు ప్రయాణం మొదలు పెట్టాను. కాని ప్రతి నెల అయ్యే ఖర్చు, మా నాన్న ఇవ్వలేడని నాకు తెలుసు. అందుకే మార్నింగ్ మార్నింగ్ న్యూస్ పేపర్ వేయడానికి పోవాలని నిర్ణయించుకున్నాను. దానికి సంబంధించిన వారితో మాట్లాడి ఒప్పించాను. రాత్రి 3:30- 4:00 గం.లకు లేచి అతని వెంట పోయాను. అతను సైకిల్ పై వెళ్ళుతూ.. పేపర్ ను ఇంట్లోకి విసిరేవాడు. ఆ పేపర్ కచ్చితంగా వాళ్ళ గుమ్మంలో పడేది. అది మామూలు విషయం కాదు. ఏంతో ప్రాక్టీస్ ఉంటే తప్పా సాధ్యపడదు. ఐతే, ఆ పని చెయ్యడానికి, నా వద్దా సైకిల్ తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే పేపరేసే పని ఇవ్వరు. ఐతే, కనీసం సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనాలన్నా 6-7 వందలు ఉండవలసిందే. ఆ 6-7 వందలు ఎలా సంపాదించాలి, ఎవరినడగాలి!? అని ఆలోచిస్తున్నా క్రమంలో, ‘గోపి’ అని మా దూరపు బంధువు కొడుకు బీకాం చదువుతున్నాడు. వాళ్ళు అంతో-ఇంతో ఉన్నవాళ్ళే అని తెలుసు. అందుకే విషయం వివరించి,అతని వద్ద 600 రూపాయలు అప్పు తీసుకున్న. కాని అతను మరునాడే వచ్చి , నాకు డబ్బులు చాలా అవసరం ఉన్నాయి. ఆ 6వందలు తిరిగి నాయి నాకు కావాలన్నాడు. వెంటనే అతని పైసలు అతనికి ఇచ్చాను. ఆప్పుడు ఏంచెయ్యాలో అర్థం కావాడంలేదు. అంతలోనే వారం రోజుల తర్వాత ‘ఆర్ ఐటీఐ’ ఏటూరు నాగారం లో సీటు వచ్చింది. కాల్ లేటర్ వచ్చింది. ‘ఆర్ ఐటీఐ’ లో జాయిన్ అయ్యి చదువుతే ,వాళ్ళు ప్రతి నెల 750 రూపాయలు ఇస్తారు. డబ్బులు లేకుండా, హన్మకొండ లాంటి నగరంలో, కిరాయికీ రూమ్ తీసుకుని ఉంటూ చదువుకోవడం సాధ్యమయ్యే పనికాదు. కాబట్టి ‘ఆర్ఐటీఐ’ లో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నాను.
‘ఆర్ఐటీఐ’ ఏటూరు నాగారం లో ఉంది. దానికి సంబంధించిన జాయినింగ్ ప్రాసెస్ వరంగల్ ములుగు రోడ్ ఐటీఐలో జరిగింది. వాళ్ళకూ కావలసిన సెర్టీఫికేట్లూ సమర్పించి జాయిన్ అయ్యాను. కాని నా పదవతరగతి, ఒరిజినల్ సర్టీఫికేట్లూ ‘ఆర్ డీ’ జూనియర్ కాలేజీలో ఉన్నాయి. ఆ కాలేజీకీ ప్రిన్సిపాల్ ‘కొండల్ రెడ్డి’ ఉండేవాడు. ఆ కాలేజీ వరదారెడ్డిదటా!. అక్కడా ఒక్క సారి జాయిన్ అయితే, అక్కడే చదువుకోవాలి. వేరేచోట ఎక్కడా సీటొచ్చినా పోనివ్వడూ, అని విద్యార్థులు, తల్లిదండ్రులు మాట్లాడుకొనే వాళ్ళు. కాని నేను నా సమస్యా చెప్పిన వెంటనే, నా ఒరిజినల్ సర్టీఫికేట్లూ నాకు ఇచ్చేసాడు. ఆ తర్వాత నా మిత్రుడు ‘రమేష్’ తో విషయం వివరించి రూమ్ ఖాళీ చేసి, ఏటూరు నాగారం ‘ఆర్ఐటీఐ’ కీ వెళ్ళి పోయాను. ఇకా ఏటూరునాగారం అంటే నాకు కొట్టిన పిండి. ఎందుకంటే!? నేను పదవతరగతి వరకు అక్కడే చదివాను కాబట్టి. కాకా పోతే మా ‘ఏపీ ఆర్ ఎస్’ టీచర్లను చూసినప్పుడు, ఏదో కొంత తెలియని, ‘ ఇంటర్ మిడియట్ లో జాయిన్ కాకుండా ఐటీఐ లో జాయిన్ అయ్యాడు’ అని అనుకుంటారేమో! అనే భావన నాలో కలిగేది.
ఐతే, ఐటీఐ ‘క్లాస్ మేట్ ‘ మిత్రులతో కలిసి తాల్లగడ్డాలో రూమ్ తీసుకుని ఉంటూ, రోజు క్లాస్ కూ వెళ్ళే వాడిని. కాకపొతే నాతో పాటుగా ఐటీఐ చదివే వాళ్ళందరూ, పదవతరగతి ఫేలై, 1-2 సంవత్సరాలు గ్యాప్ తర్వాత సప్లిమెంటరీ పరీక్షలు రాసి, పాసై, ఐటీఐ లో జాయిన్ అయిన వాళ్ళే. నేను ఒక్కడినే పదవ తరగతి అయిన వెంటనే ఐటీఐ లో జాయిన్ అయ్యాను. అందుకే కావచ్చు, వాళ్ళతో కలిసి ఒకే రూమ్ లో కలిసి అడ్జెస్ట్ కాలేక పోయాను. నేను తాల్లగడ్డాలోని రూమ్ ఖాళీ చేసి, ఐటీడీఏ వెనకాల కాలనీ లో, ఓ చిన్న రూమ్ తీసుకున్నాను. ఒక్కడినే ఉండటం మొదలు పెట్టాను.
అది, ఒక చిన్నపాటి పెంకుటిల్లు. ఆ ఇంటికి ఆనుకోని, వెనకసైడున ఒక చిన్న వసార ఉంది. అంటే ఓ చిన్న రూమ్ అన్నమాట. దానికి తడక గోడలు, ఆ తడకకూ పచ్చి మట్టీ పూస్తే, అది గోడ మాదిరిగా కనబడుతోంది. లోపల జాగా/అడుగు ఏటవాలుగా ఉన్నది. దానికి తలుపు కూడా తడక తలుపే ఉన్నది. అటువంటి దానికి నెలకు 150 కిరాయి ఇచ్చే వాడిని. ఒక సంవత్సరం తర్వాత ఆ రూమ్ నూ ఖాళీ చేసి, చాకలి మల్లయ్య ఇంట్లో రూమ్ తీసుకుని ఉన్నాను. ఇందులో నాకు తోడుగా, ‘శ్యాం’ అనే డిజిల్ మెకానిక్ విద్యార్థి ఉండేవాడు. ఈ రూమ్ కి 300 కిరాయి ఇచ్చేవాళ్ళం. ఇంతకు ముందు ఇంటితో పోలిస్తే, ఈ ఇల్లు చాలా బాగుంది.
ఐటీఐ లో నాది ‘ఎలక్ట్రీషియన్’ కోర్స్. అది రెండు సంవత్సరాల కోర్సు. మేము రోజు క్లాస్ కూ వెళ్ళేవాళ్ళం, కూర్చోని కూర్చొని చివరికి అటెన్డెన్స్ తీసుకుని పంపించే వాళ్ళు. ఎప్పుడో ఒకసారి క్లాస్ తీసుకునే వారు. ఆ పద్దతి నాకు ఏమాత్రం నచ్చక పోయేది. ‘ఐటీఐ లో అనవసరంగా జాయిన్ అయ్యాను’ అని అనిపించేది. నా ఆలోచనా విధానానికి, ఐటీఐ చదువుకీ పొంతన లేకుండా పోయింది. కాని పేదరికం వల్ల, ఐటీఐ చేస్తే, ఏదో చిన్నపాటి ఉద్యోగం వస్తుందని భావించి ఐటీఐలో చేరాను. చేరిన పాపానికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోని వెళ్ళి పోవాలని, నిర్ణయించుకున్నాను.
చూస్తూండగానే రెండు సంవత్సరాలు అయి పోయినాయి. అటో-ఇటో చేసి పరీక్షలు రాసిన. ‘ఏటూరు నాగారం’ వదిలి ఇంటికి వెళ్ళి పోయాను.

Comments
నా కథ-14 — డా.బోంద్యాలు బానోత్(భరత్) — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>