నా కథ-5 – రాత్రి బడి (2) — డా.బోంద్యాలు బానోత్(భరత్)
…ఆ విధంగా పొద్దున్నే లేచి ఇంట్లో పనులు చేసుకోని, పశువుల పేడ తీసి పెంటలో వేసి, వాటికి వరిగడ్డి మేత వేసి, ఇంటికి పోయి ఇంత భోజనం చేసి, మధ్యాహ్నం భోజనం కోసం డబ్బా గిన్నె కట్టీస్తే, పట్టుకోని, పశువులను తోలుకోని చెరువెనుకకూ పోయి, పొద్దంతా మేపుకోని, సాయంత్రానికి , మళ్ళీ పశువులను తోలుకొని ఇంటికి వచ్చే వాడిని.
మొదటి సంవత్సరం, పొద్దున భోజనంలో కొంచం చలన్నం, మారన్నం వేడన్నం పెట్టేది, మా పటేలమ్మ. మధ్యాహ్నం భోజనం; అన్నమో-గడకో పెట్టేది. మొత్తానికి ‘ఈటబుల్’ గా ఉండేది. కాని రెండవ సంవత్సరంలో సీన్ రివర్స్ అయ్యింది. పొద్దున భోజనంలో కేవలం చలన్నం, మధ్యాహ్నం భోజనంలో జొన్న గడకా-మజ్జిగ కలిపి కట్టుకో పోయే వాడిని. ‘జొన్న గడకా-మజ్జిగ’ పైన చెప్పుకోవడానికి చాలా బాగుంది, కాని మధ్యాహ్నం వరకు దానిలో, తెల్ల పురుగులు, లక్క పురుగులు పైన తేలుతూ కనిపించేవి. వాటిని చూసి తినడం కాదు కదా, తిన్న ఆహారం కూడా బయటికి వచ్చేది. ఆ జొన్న గడకాను ఎండ్రికాయ, రంధ్రంలో పారపోసేవాడిని. కాని ఆ పశువుల వెంట తిరిగి తిరిగి బాగా ఆకలి అయ్యేది. అప్పుడు ఆ అడవిలో, తినే వస్తువులు ఏమైనా ఉంటే వాటిని తెచ్చుకోని తినేవాళ్ళం. కాని చాలా సార్లు, మధ్యాహ్నం ఆకలితోనే ఉండే వాడిని. అప్పుడప్పుడు చెరువులో గాలమెసీ చేపలు పట్టీ, అమ్మీ , వచ్చిన పైసలతో తొర్రూరు సినిమాకి పోయేవాళ్ళం.
ఐతే, ఎక్కువ సమయం పశువుల మేపడంకోసమే అయి పోయేది. స్నానం చేయడం, బట్టలు పిండడం, చెరువులోనే చేసేవాణ్ణి. ఐతే, మా ఊరి చెరువు చాలా పెద్దది. చుట్టుపక్కల ఊళ్ళల్లో పేరు పోయింది. మా ఊరి చెరువు కట్టా ఏంతక్కువ రెండు కీలోమీటర్ల దూరం ఉండేది. అది అనేక వంకలు తిరిగి ఉండేది. ఆ కట్టమీద ఓ కట్టమైసమ్మ ఉండేది. దాన్ని ఒక సీతాఫలం చెట్టు కింద స్థాపించారు. ఆ కట్టపైన నడిచేవాళూ , ఆ మైసమ్మ రాయి మీద చిల్లర పైసలు భక్తితో వేసే వాళ్ళు. ఎవరన్నా మైసమ్మను మొక్కీ కోడిని కోసుకుంటే, ఒక కోడి ‘కాలు’ను ఆ చెట్టు కొమ్మకు కట్టీ వేలాడదీసే వాళ్ళు. అదే విధంగా యాటపోతును కోస్తే, దాని కాలు వేలాడదీసి వుండేది. ఆ మైసమ్మ బండరాయి మీద ఎండిన రక్తపు మరకలు వుండేవి. ఐతే పశువులను తోలుకోని పోయే టప్పూడూ, వచ్చే టప్పూడూ ఈ మైసమ్మ బండరాయి -చెట్టు వద్దా పై విధంగా చూసే వాణ్ణి. మొదట్లో భయమయింది, తర్వాత -తర్వాత భయం పోయింది. ఆ మైసమ్మ నా జీవితంలో భాగమైపోయింది. పోతూ-వస్తూ, దానిపైన చిల్లర పైసలు కనిపిస్తే ఏరుకునే వాణ్ణి. ఆ పైసలతో పిప్పరమెంట్లూ, ఐస్ క్రీం లు కొనుక్కునే వాణ్ణి.
దాని పక్కనే ఒక పేద్ద మర్రి చెట్టు ఉండేది. ఈ మర్రి చెట్టుకూ మరియు మైసమ్మకూ మధ్యలో ఒక దట్టమైన గుబురు మొగిలి పువ్వుల పొద ఉండేది. ఆ కట్టమీదినుండి పోతుంటే దాని వాసన గుబాళించేది. మాకంటే పెద్దవాళ్ళు కూడా తమ తమ పశువులను మేపుకునేందుకు మాతో చెరువోరకు వచ్చే వాళ్ళు. వాళ్ళు ఈ ‘మొగిలి పువ్వుల పొద’ గురించి కథలు కథలుగా చెప్పుకొనే వారు. “ఆ పువ్వుల పొదలో భయంకరమైన పెద్ద పెద్ద నాగు
పాములుంటాయనీ, అందులో కట్టమైసమ్మ పాము కూడా వుంటుందని, గతంలో ‘పువ్వు’ తెంప పోయినవాళ్ళు, మళ్ళీ తిరిగి రాలేదని, అందుకే మనము పువ్వు తెంపే సహాసం చేయకూడదు” అని చెప్పేవాళ్ళు.
ఈ మైసమ్మ మహిమల గురించి కూడా అనేక మంది, అనేక మంది అనేక విధాలుగా చెప్పేవారు.
ఈ మైసమ్మ చాలా మహిమ గలదని, ఇంత పెద్ద చెరువు నిండుగా నిండినా, వారంరోజులు మత్తడి పోసిన, చెరువు కట్టను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. చెరువు కట్టా తెగకుండా, తన జెడలు విప్పీ, చెరువు కట్టకు సపోర్టుగా ఉంచుతుంది… అని మైసమ్మ మహిమలను గురించి కథలు కథలుగా చెప్పుకొనే వారు.
చెరువు నిండీ, మత్తడి పోస్తూంటే, మా ఊరి దొర ‘సందీ నారాయణ రెడ్డి’ కట్టమైసమ్మను శాంతి చేయ్యడం కోసం, ఊరి పెద్ద మాదిగను పిలిచి, ఒక దున్నపోతును బహుమతి వచ్చీ, మన చెరువు (మైలారం చెరువు) కట్ట మైసమ్మకూ శాంతి చెయ్యండని చెప్పేవాడని’, మా నాన్న నాతో చెప్పేవారు.
ఈ పెద్ద చెరువు కట్టకూ 4-5 తూంమ్లుండేటివి. ఒకటి పెద్ద మత్తడి, దాన్ని పలకపాటి రాళ్ళతో చాలా దృఢంగా నిర్మించారు. చెరువు నిండీ మత్తడి పడితే దానికదే అందం. మత్తడి పోసే సమయంలో మా ఊరు, తండా అందే విధంగా చుట్టూ పక్కల ఊళ్ళోల్లు కూడా వచ్చీ చూసి తరించే వాళ్ళు. దాని కింద కొద్ది దూరంలో చిన్న మత్తడి ఉండేది. దాని మీదినుండే అందరూ నడిచేవారు. ఊరి ప్రజలు ఆ చిన్నమత్తడి దాటే, చెరువెనుకకూ పోయే వారు. అంటే ఈ చిన్న మత్తడి ప్రజలకూ వారిదిగా ఉండేది .దాని పైననే మత్తడి గడ్డలుండేటివి. ఆ మత్తడి గడ్డలమీద కూడా పశువులను మేపేవాణ్ణీ.
ఆ పెద్ద మత్తడికీ మద్యలో ఉండే తూమ్ నూ మత్తడి తూమ్ అని, దాని తర్వాత ఉండే తూమ్ నీ చింతల తూమ్ అని పేరు. ఆ తర్వాత చెరువెనుకకూ పోతుంటే, చెరువు కట్ట మైసమ్మ మర్రి దాటి పోతుంటే మూలమలుపుకాడా ఒక తూమ్ ఉండేది, దాని పేరు మర్రి తూమ్. దాని తర్వాత బీరమొల్ల చింతలకు /చెలకకూ ఎదురూగా ఒక తూమ్ ఉండేది కానీ దాని పేరు గుర్తుకు లేదు. ఆ తర్వాత చిట్ట చివరకు ఒక తూమ్ ఉండేది దాని పేరు ‘నక్కల తూమ్’ ..ఆ విధంగా మా మైలారం పెద్ద చెరువు కట్టకూ తూమ్లు వుండేటివీ. ఈ తూమ్ల నుండి నీళ్ళు ఇడిస్తే మైలారం శివారులో పొలాలు పారీ, రాయపర్తి, రాగన్నా గూడేం, గట్టి కల్లు, ఊకల్లు, ఇటు సన్నూరుకూ భూగర్భ జలాలు, మొరిపిర్యాల, బురహాన్ పిల్లి, కొండూరు, కొలన్పల్లి.. మొదలగు ఊర్లకూ చెరువు పారకం, భూగర్భ జలాలు ఈ చెరువు వల్లనే పుష్కలంగా ఉండేది.
ఐతే, నేను ప్రతి రోజు పశువులను తోలుకోని చెరువోరకూ పోయే వాడిని. పశువులను మత్తడి గడ్డలెక్కీంచీ, చెరువు కట్ట మీదికి ఎక్కించి, వదిలి, చింతల తూమ్ పై బట్టలు ఉతికీ, పిండిన బట్టలు చేతపట్టుకొని పరుగెత్తి మర్రి తూమ్ కు ముందుగా, పశువులను అందుకునే వాడిని. ఆలా చెయ్యగా, కొన్ని సార్లు పశువులను అందుకోలేక, చేన్లోపడి మేసేటివి. ఆలా అవి దొంగ పశువులుగా మారినవి. అప్పటినుండి విచ్చలవిడిగా, రెప్పపాటులో తప్పించుకొని చేనుల్లో, వరిచేనుల్లో పడిమేసేటివి. ముఖ్యంగా బోడబర్రె రెప్పపాటులో తప్పించుకొని కొండూరు ‘గుంట్కోల్ల’ పొలంలో పడి మేసేది. ఒక సారి పశువులన్నీ , కొండూరోల్ల చేన్లో పడి మేసినయి. అప్పుడు కొండూరోల్లు, మా పశువులను బందెర దొడ్డిలో బంధించారు. నేను ఎక్కడెక్కడో వెతికి వెతికి, అలసి-సొలసి పోయనూ. తెల్లారి మా ‘పటేలు’, బీరం మల్లారెడ్డి కొండూరుకు పోయి..దండగ కట్టీ, పశువులనూ తోలుకొని వచ్చాడు.
నేను రాత్రి పూట బడికి పోయే వాడిని. రాత్రి బడిలో చెప్పింది చెప్పినట్టు తిరిగి
అప్పజెప్పేవాడిని. నేను చిన్నప్పుడు మూడవ తరగతి వరకు చదివి మానేసిన. కాబట్టీ,ఆ బేసిక్ తో పాఠాలు త్వరగా అర్థం అయ్యేటివి. చదువు పై ఉన్న ఇష్టంతో, రోజు ఒక పుస్తకం నాతో తీసుకుని పోయే వాడిని . సమయం దొరికినప్పుడల్లా, ఆ పుస్తకాన్ని చదివే వాడినీ.. నేను ప్రతి రోజు పశువులకాడకీ పోయేటప్పుడు నాతో పుస్తకం పెట్టుకో పోయే వాడిని. అది చూసి మా దంటగాళ్ళు ఆశ్చర్యంగా చూసేవాళ్ళు. మేము కూడా రాత్రి పూట బడికి వస్తామని అనే వాళ్ళు. వాళ్ళకూ చదువు పట్ల ఉన్న ఆసక్తిని చూసి వాళ్ళను రాత్రి పూట బడిలో చేర్పించాను.
ఐతే ఒక రోజు పశువులను మా ఊరి సర్వల కుంట కిందా మడికట్లల్లో మేపుతున్నా. నేను ఆ రోజు మూడవ తరగతి సాంఘిక శాస్త్రం భూగోళం పాఠం చదవడంలో నిమగ్నమైనాను. పశువుల సంగతే మరిచి పోయాను. కొన్ని నా పక్కనే మేస్తూన్నాయి. కాని రెండు-మూడు పశువులు, చాకలి రామయ్యా నారుమడి మేసినయి. అది గమనించిన రామయ్యా అనేక సార్లు కేకలు వేస్తూ.. నారుమడి వద్దకు విచ్చి, ఆ పశువులను, అన్నీటిని తరుముకోని, రాయపర్తి ‘బందర’ దొడ్డిలో తోలేందుకు పోతున్నాడు. అది చూసి నేను భయపడ్డాను. ఆయన చేతికి దొరికితే ‘నా పనైపోయింది’ అనుకున్నాను. అందుకే ఏమెరగనట్టు, ఆ పశువులతో నాకు ఎలాంటి సంబంధం లేనట్టు, భావించి, నేను చేతిలో పుస్తకం పట్టుకోని, జేబులో పెన్ను పెట్టుకోని, ఒక సాధా-సీధా విద్యార్థి వలే, కొంత దూరంగా రోడ్డెమ్మటే వెళ్ళుతున్నాను.
చాకలి రామయ్యా పశువులను, పశువుల యజమానులను, తిట్టుకుంటూ, పశువులను తురుముకొంటూ… రాయపర్తి వాగు దాటించి, ‘కోడలు దేవి’ గుడిని దాటించి, తిరిగి మైలారం వైపుకూ వస్తూన్నాడు. ఆయన వాగుదాటి వస్తూండగా, నేను రాయపర్తి వైపుకూ వెళ్ళుతున్న..నా చేతిలో పుస్తకం ఉంది. జేబులో పెన్ను ఉంది. నన్ను చూసి ” అరే! ఓ పిలగా ! నువ్వు బీరమొల్ల పశువుల కాడా జీతం వుంటివి కదా!?” అని సందేహం వ్యక్తం చేస్తూ అడిగాడు ‘రామయ్య’. అప్పుడు నన్ను నేను రక్షించు కొనుటకు ఒక చిన్న అబద్దం ఆడవలసి వచ్చి ఇలా అన్నాను. ” అవును, కాని అది పోయిన సంవత్సరం, ఆ తర్వాత నేను బడికి పోతున్నాను, నమ్మకం లేకపోతే నా చేతిలో పుస్తకం, చూడు, నా జేబులో పెన్ను చూడు. నేను పశువుల కాడా జీతం మానేసి సంవత్సరం దాటింది.” అనగా “అవునా! వాడెవడో కాని దొరికితే ఒల్లు చింతపండు చేద్దును, మల్ల వాడు జీవితంలో ‘బతికినా పీనిగా’ మాదిరిగా చేద్దును. కాని వానికి ఇయ్యాల లేసిన గడియ బాగుంది…” అని తన మనసులో ఉన్న కోపంను బయట పెట్టాడు.ఐతే నేను, పై విధంగా నమ్మించి, తప్పించుకోని బయట పడ్డాను. ఆయన కొంత దూరం పోయాక, నేను పరుగెత్తి, పశువులను మర్రేసుకోన వాగేమ్మడి, వాగేమ్మడి సాలపుల్లయ్య బాయి నుండి, ‘సందీ నారాయణ రెడ్డి’ ఇంటి ముందు నుండి ఊళ్ళోకి తోలుకొని పోయాను.
ఆ సంవత్సరంలోనే ‘బీరం మల్లారెడ్డి’ చిన్న కుమారుడి పెళ్లి, ‘రావుల నర్సింహ్మారెడ్డి’ కూతురితో అయ్యిందీ. ఆ సంవత్సరం ఉగాది వరుకు నేను రాత్రి పూట బడికి పోయాను. ఆ సంవత్సరం ఉగాది నుండి నా జీతం అయి పోయింది…
– — డా.బోంద్యాలు బానోత్(భరత్)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
నా కథ-5 – రాత్రి బడి (2) — డా.బోంద్యాలు బానోత్(భరత్) — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>