నా కథ- 9 – ఆబ్కారి పోలీసులు — డా.బోంద్యాలు బానోత్(భరత్)
మా నాన్న, మా చెల్లి పెళ్ళి పెట్టుకోవడం వలన, బడిలో చేరాలనే ఆలోచనను, వచ్చే సంవత్సరానికీ వాయిదా వేసీ, చెల్లి పెళ్ళికి కావలసిన డబ్బులు సమకూర్చడంకోసం, ‘జగనా’ వద్ద గొర్ల కాపరిగా జీతానికి ఒప్పుకున్నాను. ఇష్టం లేకున్నా, అతి కష్టంగా ఆ సంవత్సరం పూర్తి చేశాను. ఈ ఉగాది నుండి, జీతమనే కట్టు బానిసత్వం నుండి విముక్తుడిని అయ్యాను.
ఇప్పుడు నాముందు ఒకే ఒక టార్గెట్, అది బడిలో చేరాలనేది. మా చిన్నాన్న కూతురు ‘ఈరమ్మా’, నా కంటే ఆరు నెలలో/సంవత్సరమో చిన్నది. తమ్ముడు ‘ఈరు’ ఇంకా చిన్నవాడు. వాళ్ళిద్దరూ వర్ధన్నపేట హాస్టల్లో ఉంటూ బడికి పోతున్నారు. వాళ్ళను చూసి నాకు కూడా వాళ్ళ లాగా బడికి పోవాలనే కోరిక బలంగా ఉండేది. కాని చదువు, బడి.. గురించి మా అమ్మా -నాన్న ఆలోచన వేరుగా ఉండేవి. అంటే, ఒకటి చదువు పట్ల అవగాహన లేదు. చదివి ఏంచేస్తారు!? అనే అలోచన. పనిలో పెడితే ఆర్థికంగా ఆసరౌతాడని, బడికి పోతే మనల వదిలి వెళ్ళిపోతాడనీ.. ఇలా రకరకాల ఆలోచనల కారణంగా, నన్ను బడికి పంపలేదు.
మా చెల్లి ‘ఈరమ్మ’ కూ, చిన్ననాటి నుండి నా మీద ప్రేమా, దయా,గౌరవం, సానుభూతి.. ఉండేది. అప్పుడప్పుడు సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు, వాళ్ళ ఫ్రెండ్ ‘యాకమ్మా’ ను తన వెంట తీసుకుని వచ్చేది. నాకు పరిచయం చేసేది. వాళ్ళు అప్పుడు 8-9 వ తరగతి చదువుతున్నారు, అనుకుంటా. ‘యాకమ్మా’ అమ్మాయి చాలా అందమైన అమ్మాయి. ఆమే కళ్ళు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఆమే హైటూ-పర్సనాల్టీ అద్భుతం. ఆ తర్వాత నేను ఆమెను చూడలేదు. ఐతే, వాళ్ళను కలిసినప్పుడు నేనుకూడా బడికి పోయి, చదువుకుంటే, నాకు కూడా చాలా మంది చదువుతున్న ఫ్రెండ్స్ ఉండేవారు, అని మనసులో మదన పడే వాడిని.
1990 వ సంవత్సరంలో జీతం మానేసి బడికి పోవాలని నిర్ణయించుకున్నాను. మా నాన్నకు నా పై నమ్మకం లేదు, ఎందుకంటే ‘8-9 సంవత్సరాలు జీతముండీ, పశువుల కాపరిగా పనిచేసి, ఇన్ని సంవత్సరాల తరువాత చదువుకోవడానికి పోతే, అది ఎట్లసాద్యమైతదీ!?, ఎక్కడాగమైతడో!? ‘ అని అనుకునేవారు మా నాన్న. ‘చెప్పితే విననప్పుడు చెడేదాక చూడాలట’ అని అనుకోని, ‘ఎటన్నా పోనీ’ అని నన్ను వదిలేశాడు.
అప్పుడు నేను లింగ్యాతో కలిసి హన్మకొండాకు పోయాను. ‘లింగ్యా’ హన్మకొండాలోని, గుండ్ల సింగారంలో వాళ్ళ మేనత్త ‘కమలా- గోపీచంద్’ ఇంట్లో ఉంటూ, ఎల్బీహెచ్ఎస్ లోని ‘కొత్తూర్’ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. మేము హన్మాకొండా బస్టాండ్ లో బస్సుదిగి, గుండ్ల సింగారంకూ పోవడానికి 2-3 కిలోమీటర్లు నడిచాము. అంతపెద్ద నగరంలో, ఆ రోడ్ల, పెద్ద పెద్ద బంగ్లాల మద్య నుండీ, నడుచుకుంటూ వెళ్ళడం, నా జీవితంలో అది మొదటిసారి.
దూరం-దూరం దాక నడవడం నాకూ అలవాటే, కాని తొందరగా ఇంటికి చేరుకోవాలనే ఆతౄత, ఆ ఇంటినీ చూడాలనే ఉబులాట, నన్నూ ఇంతింత దూరం, ఇంకెంత దూరం.. అనుకుంటూ, ఆకరికి ఇంటికి చేరుకొన్నాము. ఇల్లు చాల చిన్నది. చిన్న- చిన్నయి రెండు రూమ్ లు, వాటి మీద పలచగ స్లాబ్ వేసీ ఉన్నది. ఇనుప తలుపు, ఇంటి ముందు నుండీ కచ్చారోడ్డూ వేసీ ఉన్నది. సాయంత్రం 5-6 గంటలకూ, ఆడావాళ్ళూ- మగవాళ్ళూ, పిల్లలు-పెద్దలు, పేలిన జుట్టుతో, వాలిన ముఖంతో, ఢీలా పడిన మనసుతో పాటూ ఇంటికి చేరుకున్నామనే ఇంతంత ఆనందంతో, ఒక్కొక్కరుగా ఆ కాలని కీ చేరుకుంటున్నారు. వాళ్ళను చూడగానే, ఇదేదో దారీద్ర రేఖకు దిగువన ఉన్న వాళ్ళ కాలనీ లా అనిపించింది. అయిన మా తండా గుర్సేతో పోల్చినప్పుడూ, ఇదే ఎక్సలెంట్‌గా ఉన్నది.
మొదటి రోజు హన్మకొండలోని ముఖ్యమైన చోట్లు తిరిగినం. తర్వాత ఇంటికి పోయి, ఓ రెండు జతల బట్టలు కొనాలనుకున్నాను, కాని నా వద్ద కాణి పైసకూడా లేదు. నా మితృడు ‘లింగ్యా’ ఒ మంచ్చీ ఉపాయం చెప్పాడూ. ” ఈ కాలని పక్కేమ్మటీ కాలువా(శ్రీ రాంసాగర్ కెనాలి) ఉన్నది, దానిమీద బిడ్జీ కడుతున్నారు, అందులో పనికిపోయి, వచ్చిన కూలీ డబ్బూలతో బట్టలు కొనుక్కోవచు” అని. ” ఎస్ మంచి ఉపాయం” కాని ఏంపని చెయ్యలో!?. ” ఏదో ఒక పని, మనము రేపు అక్కడికి పోయి, అడుగుదాం ” అని అనుకున్నాము. అనుకున్నట్లుగా, కూలి పని కుదిరిందీ, రోజుకూ 10 రూ. కూలి అనుకుంటా. 15-20 రోజులు కూలి పనకి పోయి, వచ్చిన పైసలతో, నేను బట్టలు కొన్నాను. ఒకటి ఆర్మీ వాళ్ళు వేసుకునే జిన్పాయింట్ కొన్నాను, కాని అంత క్వాలిటీ ఉండదు. నాతోపాటూ, నా మితృడూ ‘లింగ్యా’ కోసం కూడా ఒక పాయింట్ కొన్నాను. 20 రోజుల తర్వాత ఇంటికీ వచ్చేశాను.
ఆ జిన్పాయింట్ వేసుకుంటే, ఆలావాటూలేక, అదోవింతగా వుందీ, చూసేవాళ్ళూ ఆశ్చర్యంగా చూస్తూన్నారు. ఇదట్లూండగా, బడిలో చేరాలంటే , భరత్ భూషణ్( వయేజన విద్యా సూపర్వైజర్) చేరిపిస్తారని భావించీ, అతని వద్దాకూ వెళ్ళగా, “బడిలో చేరాలంటే జూన్-జూలై నెలలో అవుతుంది. అప్పటి వరకూ, మా ఇంటివద్ద ఉండీ చదువుకో, అప్పుడప్పుడూ ఈ ‘టెంట్ హౌస్’ చూసుకోమన్నాడు. సరేనన్నాను, మే నెల మెల్లిగా వెళ్ళి పోయింది. ‘జూన్’ నొచ్చిందీ. కాని బడిలో చేర్పించే పరీస్థితీ కనిపించలేదు. ఆశా అడియాశయింది. పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది.
‘భరత్ భూషణ్ ‘ దగ్గిరనుండీ మా ఇంటికొచ్చేశాను. మా ఊరు ‘మైలారం’ బండిలో సార్ల సలహా తీసుకుందామని, బడిలోకీ పోయి ” సార్ నేను బడిలో చేరాలనుకొంటున్నాను”, అని అడుగగా, అతను” రూల్స్ ఒప్పుకోవు, ‘ ఇలా లుంగీ కట్టుకుని స్కూల్లోనికీ రాకూడదు’ ” అన్నాడు, మా ఊరి బడి పంతులు. మా ఊరినుండి ఒక ‘సారు’ మా ఊరి బడిలోనే టీచర్ ఉద్యోగం చేసేవాడు. అతని పేరు గుర్తుకు లేదు, కానీ రెడ్డి సామాజికవర్గం, వాళ్ళ ఇంటి పేరు ‘లేతాకు’. అతన్ని కూడా అడిగాను, కాని లాభం లేదు.
ఇక నా లాంటి వాళ్ళు చెప్పితేనో/అడిగీతేనో బడిలో చేర్చుకోరని భావించి, మా ఊరి దొర ‘సంది క్రిష్ణా రెడ్డి’ ఇంటికి పోయి ” పటేల.. నేను బడిలో చేరాలనుకుంటున్నాను, మీరొక మాట చెప్పితే బడిలో చేర్చుకుంటారట, దయచేసి నన్ను బడిలో చేర్పించండీ” అని బ్రతిమిలాడగా,” మళ్ళీ మంగళవారం వచ్చి కలువు, వర్ధన్నపేటలో ఒక ‘సార్’ నూ అడిగీ చెపుతా, ఏమంటాడో చూదం” అని అన్నాడు. ‘ నాకూ, మా ‘దొర’ బడిలో జాయిన్ చేస్తాడనే నమ్మకం వచ్చింది. అన్నట్లుగా, మళ్ళీ మంగళవారం రోజున పోయి కలిశాను, కాని మళ్ళీ ఆశ అడియాసయింది. ” ‘ఈ సంవత్సరం సీట్లూ లేవట్రా’, కావాలంటే వచ్చే సంవత్సరం ‘జయిన్’ చేసుకుంటాం’ అని అన్నాడు ఆ సార్” అని నాతో అన్నాడు మా దొర.
అప్పుడూ, నాకు ఏంచెయ్యలో అర్థం కావడం లేదు. ఇక నా జీవితం ఇంతేనా..!? అని ఆలోచనలో పడ్డాను!. అటు జీతం మానేసి, ఇటు ఇంట్లో వాళ్ళును ఎదిరించి, బడిలో చేరి చదువుకోవాలని అనుకుంటే, బడిలో చేర్పించే నాథుడే లేడే!, చేర్చుకునే వాడు లేడు. కాని ప్రయత్నం చేయడం మానుకోలేదు. మాది రాయపర్తి మండలం, అక్కడా పెద్ద బడున్నది. పదవ తరగతి వరకూ చదువుకోవచ్చు. ఇంకోప్రయత్నంగా ఆ స్కూల్ కూ పోయి, హెడ్మాస్టర్ తో ” సార్ నాకు బడికి పోయి చదువుకోవాలని ఉన్నది. నన్ను మీ స్కూల్లో చేర్చుకోండి, అని అడుగగా, అతను ఓ 5నిమిశాలు ఆలోచించీ” అలా కుదరదు , కాని 6వ తరగతి ప్రైవేట్ పరీక్ష రాసీ, పాసైతే, ఆ సర్టిఫికెట్ తో 7వ తరగతిలో ఎక్కడైనా చేరవచ్చు, మేము కూడా చేర్చుకుంటాము. ఇదిగో ఈ ఫామ్ నింప్పీ, ఒక పాస్ ఫోటో అతికించీ, 65 రూపాయలు ఫీజ్ కట్టీ, హాల్ టికెట్ తిసుకొని, పరీక్షలు వచ్చినప్పుడు రాయి. సెంటర్ వర్ధన్నపేట స్కూల్లో పడవచ్చు” అని అన్నాడు. నేను ఇదొక ఆశాజనకమైన అవకాశం అనుకున్నాను. ఆ సార్ చెప్పినట్టు చేశాను. ఐతే, ఆ అప్లీకేషన్ ఫామ్ మీ ద ఫొటో అతికించడానకీ రాయపర్తిలోనే ఫొటో ష్యాఫ్లో, పాస్ ఫొటో దిగాను. అది నా జీవితంలో మొదటి ఫొటో. నేను ఆ ఫొటోను, అనేకసార్లు చూసుకోని మళ్ళీ జేబులో పెట్టుకునే వాడిని.
6వ తరగతి ప్రైవేట్ పరీక్ష సెంటర్ వర్ధన్నపేట హైస్కూల్లో పడవచ్చని, రాయపర్తి స్కూల్లో సార్ చెప్పడంతో, నా మనుసు, నా ఆలోచన..అంతా వర్ధన్నపేట హైస్కూల్ వైపు మళ్ళింది. ఎగ్జామ్ సెంటర్ అంటే ఏమిటో!, ఎట్లూంటదో!?, ఏదో చదువుకోవాలనే కోరికతో, బేసిక్స్ మరిచీపోకుండా చదుతుండేవాడిని. కాని 6వ తరగతి ప్రైవేటు పరీక్షా రాయడం, అనుకున్నంత ఈజీ కాదేమో..!, అని, అనిపించేది. రాసే అలవాటూ అంతగా లేనందున, రాయడానికీ ప్రయత్నిస్తే లైన్ చక్కగా కాకూండా పదహారు వంకలు తిరిగేదనుకో! .
అటువంటీ పరీస్థితిలో పరీక్షాకూ 15 రోజుల ముందునుండే ఎంతో కొంత చదివీ అభ్యాసం చెయ్యలని అనుకున్నాను. కాని ఇంటి వద్దా పరీస్థితి అందుకు అనుకూలంగా లేదు. ఏం చెయ్యలని ఆలోచిస్తూ.. వర్దన్నపేట హైస్కూల్ చూద్దామనీ, వర్దన్నపేటకు వెళ్ళాను. మా చిన్నాన్న కూతురు ‘ఈరమ్మా’, కొడుకూ ‘ఈరు’ , అదే హైస్కూల్లో చదువుతూ, వర్దన్నపేట హాస్టల్లోనే ఉంటున్నారు. నేను ఆ స్కూల్ వద్దకు అప్పుడే చేరుకున్నాను, అంతలోనే ‘టన్ టన్ టన్…’ అని బెల్లైందీ. విద్యార్థులందరు ఒకేసారి హుల్లాసభరితంగా కేకలువేస్తూ బయటికీ వస్తూన్నారు. సార్లూ కూడా సంకలో సంచులేసుకోని, ఇంటి బాట పట్టారు. వాళ్ళను చూస్తూ నిలబడిపోయాను నేను.
అంతలోనే మా తమ్మడు ‘ఈరు’ ” ఏ.. భీయ .. ” అనుకుంటూ నా వద్దకొచ్చాడూ. ఆ తర్వాత మా చెల్లీ ‘ఈరమ్మా’, ఆమె సఖీ ‘యాకమ్మా’ , మా అన్న కూతురు ‘భూలీ’ .. అందరూ కలిషారు. రాకకు కారణం అడుగగా, ప్రైవేటు పరీక్షా సెంటర్.. గురించీ..చెప్పాను. అప్పుడూ, నన్నూ మా తమ్మడు, తను ఉంటున్న హాస్టల్ కు తిసుకోని పోయాడూ.
నన్నూ తన గదిలో కూర్చోమనీ, పక్కరూం కూ పోయి, హాస్టల్ లీడర్ ‘బీ.బాలు’ తో, “మా అన్నా , గెష్టూ, వచ్చాడు, ‘ ప్రైవేటు పరీక్షా’ రాస్తూన్నాడు” అని చెప్పీ, అతనకి పరిచయం చేశాడు. అతనూ “ఏం పర్వాలేదు, ఇక్కడే వుండీ పరీక్షా కోసం చదువుకో, వార్డన్ తో నేను మాట్లాడుతా, నీకేమి భయంలేదు, నువ్వు నా రూంలోనే ఉండవచ్చూ” అని ధైర్యమిచ్చాడు. నేను చాలా సంతోష పడ్డాను. ఇది నాకు అనుకోకుండా వచ్చిన అవకాశం. ఐతే,హాస్టల్లో కూర్చోని, ఆ మాట-ఈమాట..
మాట్లాడుకుంటూ.. గడియారం చూసేసరికీ సమయం 5:30 గం: లయిందీ.
ఇంకో అరగంటైతే భోజనం పెడతారనగా, ఒక్కొక్కరుగా అందరూ ఫ్రెష్ఫ్ అవుతున్నారు. ‘బాలు’ తన షట్టూ(అంగ్గీ) విడిచీ, కట్టేతో చేసిన హ్యాంగర్ కూ తలిగించీ, పాయంటు మొకాళ్ళవరకు మళిచీ, ఎడమచేతిలో సబ్బు-పెట్టే పట్టుకొని, కుడిచేతితో తువ్వాల బుజాన వేసుకోని, హాస్టల్లో ఉన్న చేదబావి వద్దకు వేళ్ళీ , 8వ తరగతి విద్యార్దీ చేది పోసిన నీళ్ళతో, రెండు సార్లు సబ్బూపెట్టీ, కాళ్ళూ-చేతులు శబ్బరంగా కడుక్కోని , తువ్వాలతో మొఖం తూడ్చుకుంటూ, తిరిగి తన రూమ్ కు వచ్చాడు బాలు.
ఈ లోగా ఆయన బట్టలు చూసి, నేను ఆశ్చర్యపోయాను. ఆయన వేసుకున్నవీ కాకా, ఐదారు జతల బట్టలు హ్యాంగర్ కూ వేలాడదీసి ఉన్నాయి. నాకు ఒక జత బట్టలు, మహా ఐతే పాత జతతో కలిపీ అతికష్ఠంగా రెండు జతల బట్టలు ఉంటే అదే గగనం.
సబ్బూపెట్టీ నా చేతికిచ్చీ, ” ఫ్రెష్ఫ్ కా, భోజనం చేద్దాం” అన్నాడు బాలు. అలాగే నేను కూడా ఫ్రెష్ఫ్ అయి, వచ్చాను. అంతలోనే, భోజనం బెల్లైందీ. పిల్లలందరు ఆకలిమీదున్నరు. ప్లేట్లు పట్టుకొని ఆతూర్తగా అందరూ ఒకేసారి ఎగబడ్డారు. అది చూసి హాస్టల్ లీడర్ ‘బాలు’ చేతిలో ఒక కర్ర పట్టుకోని, హాస్టల్ విద్యార్థులను వరసక్రమంలో నిల్చోపెట్టాడు. అందరూ ప్రశాంతంగా భోజనాలు చేశారు. తర్వాత నేను మరియ బాలు భోజనం చేశాము. ఆ తర్వాత ‘బాలు’ తనతో బయటికీ తీసుకెల్లాడూ.
నాకు వర్దన్నపేట, హాస్టల్..ఈవన్ని కొత్తే. నా పరీక్షా తేదీ రావడానికీ 15-20 రోజులు పట్టిందీ. అప్పటి వరకూ అతని వద్దనే ఉన్నాను. అతనూ డ్యాన్స్ చేసేవాడు. ఆ హాస్టల్ ఏరియ నుండీ పెళ్ళి బారాత్ పోతూ వినపడితే చాలు, నిద్రలోనుండీ లేచిమరీ, పోయి, బారాత్ ఆపీ తనకు నచ్చినంతసేపు లేదా తను ఆలసి పోయెంతవరకూ, చెమటలు కారుతుంటేకూడా డ్యాన్స్ చేసేవాడు. అప్పుడూ హిందీలో ‘మైనే ప్యార్ కీయ’, అదే సినిమా తెలుగులో ‘ ప్రేమ పావురం’ ఆనుకుంటా, చాలా ప్రసిద్ది గాంచినవి.
అతడు రోజుకో జత బట్టలు మార్చేవాడు. అతడు హాస్టల్ లీడర్ కాబట్టీ, జేబు కర్చులు, బట్టలు…వగైర వగైర అన్నీ, హాస్టల్ వార్డేన్ సమకూర్చేవాడు.
నాకు, రెండు జతల బట్టలు మాత్రమే ఉండేవీ. నేను అతనితో, అక్కడున్నన్ని రోజులు అతని డ్రేస్ లు వేసుకునేవాడిని. ఒక రోజు మా చెల్లీ ‘ఈరమ్మా’, మా అన్న కూతురు భూలి, ఉండే అమ్మాయిల హాస్టల్ కు పోయాను. వాళ్ళ హాస్టల్ గదులు, వాళ్ళ సామాను పెట్టుకునే బాక్స్ లు…, అన్నీ చూశాను. ఒక రోజు వాళ్ళు, మేము అందరం కలిసి, ‘సిందూర పువ్వు’ సినిమాకు వెళ్ళాము. మేమంతా అప్పుడప్పుడే బాల్యావస్థ దాటి, కౌమారవస్థలో అడుగుపెడుతునం. ఆ సినిమా చూసి, జీవితం అలా ఉంటే, బావుండూ అని అనిపించేది.
ఐతే, ‘బాలు’ కీ పదవతరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. అతనికీ పరీక్షల పరేషాన్ కన్నా, ప్రియురాలికి దూరమవుతున్నాననే, బెంగ పట్టుకుంది. అతని ప్రేమ విషయాల గురించి నాతో పంచుకుని, కంట తడి పెట్టేవాడు. అమ్మాయి చాలా అందమైనది. ఒక మాట్లో చెప్పాలంటే ‘అప్పి ల్’ పండు లా ఉండేది. కాని, నిజానికి ‘బాలు’ వాళ్ళ కుటుంబం, చాలా పేదరికంలో ఉండేది. ‘బాలు’ వాళ్ళ నాన్న పాలేరు(జీతగాడు) పని చేస్తూ, ఇతన్నీ బడికి పంపుతున్నాడూ.కాని ‘బాలు’ తన బ్యాగ్రవుండ్నూ మరిచిపోయాడా..!? అంటే ! ప్రేమకును, ఇంటి పరేషాన్ కూ, ఎలాంటి సంబందం, ఉండదనే చెప్పాలి.
ఐతే, హాస్టల్ పిల్లలకీ, సంవత్సరానికి ఒకటీ లేదా రెండు సార్లు పిక్నిక్ కూ తీసుకొపోయే పద్ధతి/సంప్రదాయం ఉంది. ఐతే, అది నేను వాళ్ళతో ఉన్నా సమయంలోనే రావడం సంతోషకరం. కోళ్ళ ఫామ్ వద్దకు పోయి, తమకు కావలసి చికెన్ రెండు రోజుల ముందే ఆర్డర్ ఇవ్వడానికి, ‘బాలు’ ను పంపాడు వార్డెన్ సార్. ఐతే’బాలు’ తనకు తోడుగా నన్ను కూడా తీసుకెళ్లాడు. మేమిద్దరం, నడియెండలో , ఒక పాత సైకిల్ పై పీరంగడ్డా నుండీ వర్ధన్నపేట ‘బ్లాక్ ఆఫీస్’ దాటీ, ఆ టేకు చెట్లలో ఉన్న ఓ చిన్న కోళ్ళ ఫామ్ వద్దకు పోయి, చికెన్ ఆర్డర్ ఇచ్చీ వచ్చాము. ఆ తర్వాత మూడు రోజులకు, వర్ధన్నపేట వాగు గట్టున, ఆ మర్రి, తాటి చెట్ల కిందా, పిక్నిక్ కూ పోయారు. భౌషా అమ్మాయిల హాస్టల్ పిల్లలు కూడా పిక్నిక్ కు పోయి నట్టూ గుర్తు. ఐతే, ‘బాలు’ వార్డెన్ తో మాట్లాడి, నన్ను కూడా తమతో పాటు, విద్యార్థిగానే పరిగణించారు. కాని, అవ్వన్నీ చూస్తుంటే, ‘నేను చదువుకోక పోవడం వలన, ఇలాంటి ఎన్నో సందర్భాలను మిస్సైయ్యాను’ అని నాలో నేను అనుకునేవాడిని.
చూస్తూండగానే రోజులు గడిచాయి. ‘ప్రైవేట్ పరీక్ష’ రాసే తేదీ సమీపించింది. ఇంకో ఐదు రోజుల్లో, పరీక్షలు జరగనున్నాయి, అని తెలిసింది.
అప్పుడు నాలో, భయం మొదలైంది. ఎలా ఉంటుందో -ఏంటో!?, పాసౌతానో లేదో !?… ఏదోవిధంగా పరీక్ష రాసి, ఇంటికెళ్ళి పోయాను. రాసింది నేనే కాబట్టీ, పాసైతాననే నమ్మకం, అంతగా లేదు… చివరికి ఫలితాలొచ్చినయి. నా నెంబర్ లేదా పేరు ఆ ఫలితాల్లో లేదు. తెలిసిన వాళ్ళను, అడగ్గా “ఫలితాల్లో పేరు లేదంటే, ఫేలైనట్టే. ఐతే,కావాలంటే మళ్ళీ వచ్చే సంవత్సరం రాసుకోవాలి.” అన్నారు.
ఏ ఆశయం కోసమైతే జీతం/పాలేరు పని మానేసి, మా నాన్న మాట వినకుండా, బడిలో చేరి చదువుకోవాలని అనుకున్నానో, అది నేరవేరే పరీస్థితి కనుచూపుమేరలో కనిపించడం లేదు. ఐనా, నాలో ఆశ/ కోరికా చావలేదు. ‘ఎలాగైనా బడిలో చేరుతా’ అనే నమ్మకం నాలో ఉంది.
ఐతే, మా అన్నా గోపీచంద్, చదువుకోని, పెళ్ళై, ఇద్దరు పిల్లల కనీ, అప్పటిదాకా జాబు లేకా, చతనై-చేతకాకా, వ్యవసాయ పని అంతగా పరిచయం లేకపోయినా, వ్యవసాయం చేసి, అలసి పోయి, చివరి ప్రయత్నంగా ప్రయత్నీంచీ, ‘పోలీస్ కానిస్టేబుల్ ‘ జాబ్ సంపాదించాడు. అది తన జీవితంలో మరుపురాని మలుపు.
ఐతే, 6వ తరగతి ‘ప్రైవేట్ పరీక్ష’ రాసి, పాస్ కాకా, బడిలో చేరే మార్గం ఏంటీ? అని నాలో నేను ఆలోచించుకుంటూ, తండా నుండి ఊళ్ళోకి వెళ్ళుతున్న సమయంలో, మా అన్నా ‘గోపీచంద్’ ఊళ్ళో నుండి ఇంటికి, తండాకు వస్తూన్నాడు. మేమిద్దరం సర్వలకుంట కట్టా, అలుగు వద్దా ఎదురేదురు కలుసుకున్నాం. ఒకరినొకరు పలకరించుకున్నాము.” ఏం చేస్తున్నావు?” అని అడుగగా; బడిలో చేరేందుకు నేను చేసిన.., చేసే ప్రయత్నాలు చెప్పీ, ” అన్నా , నాకు బడిలో చేరి చదువుకోవాలని ఉంది. బడిలో చేరే ఉపాయం/మార్గం, ఏదైన ఉంటే చెప్పవా!?” అని అడుగగా, “సన్నూరుకూ పోయి, ‘జగన్‌ను’ కలువు, ‘నేను పింపినా’ అని చెప్పీ, నీ సమస్య కూడా చెప్పూ. సన్నూరు బడి పంతులు ‘సంపత్ కుమార్’, ఆయన ‘బ్రాహ్మణుడు’ , పురోహితం- పెళ్ళీలు కూడా చేస్తూంటాడు, ఆయనకు మరియు మా బావమరిది ‘జగన్’ కూ మంచి పరిచియం ఉందీ. ఆ పంతూలుతో మాట్లాడీ, టీసీ- గీసీ, ఇప్పీస్తే, ఏదో స్కూల్లో చేరుదువు కాని ” అని సలహా ఇచ్చాడు మా అన్నా ‘గోపీచంద్’.
అయనా సలహాలో సగానకీ పైగా, సత్యం – సుందరం, ఉన్నట్లు అనిపించింది. ఇది ఈ సంవత్సరానకీ బడిలో చేరేందుకు చివరి ప్రయత్న . ఎందుకంటే అప్పటికే జూలై చివరి వారం మొదలయింది. ఆయన చెప్పిన విధంగానే, 5-6 కి.మీ. దూరంలో ఉన్నా ,’జయరాం నాయక్ ‘ తండా, సన్నూర్ ‘గ్రామా’నికీ నడిచి వెళ్ళీ, జగన్ ను, కలిసి , విషయం వివరించి, మా అన్నా ‘గోపీచంద్’ పంపించాడు, అని చెప్పగా, ఆయన ఓ రెండు నిమిషాలు ఆగి, ” నువ్వు రేపు రా..!, నేను ఈ రోజు మధ్యాహ్నం ఊళ్ళోకి, పోయి ఆ సార్ తో ఈ విషయం మాట్లాడీ, ఏ మంటాడో !? తెలుసుకో , ఏ విషయమైనా నీకు చెప్పుత..” అని అన్నాడు. “సరే అని, నేనిక బయలుదేరుత..” అని, చెప్పగా, ‘భోజనం చేసి పోవాలని, పట్టు బట్టీ, భోజనం చేశాకే, పంపించాడు’ .
తెల్లారి మళ్ళీ వేళ్ళను, కాని ఇంటి వద్ద ఎవ్వరూ లేరు. పక్కింటి వాళ్ళను అడుగగా.. ” మద్యానం వరకు వస్తారు, అప్పటి వరకు, వరండాలో, మంచమేసుకోని కూర్చోమన్నారు. అలాగే వరండాలో మంచంపై కూర్చుంటూ..నిద్రపోయాను. ఇంతలోనే ‘ఆబ్కారి పోలీస్’ జీపు తండా కొచ్చింది. తండా వాసులు భయంభయంగా, అటూ-ఇటూ పరుగులు తీస్తూ న్నారు. నేను పడుకోనే, అర్ద నిద్రలో అన్నీ గమనిస్తూన్నాను. పోలీసులు ‘నాటు సారా/గుడంబా’, బెల్లం నాన పెట్టీ, దాచి పెట్టే చోట్లు, వెతుక్కుంటూ, నేను పడుకున్న వరండాలోకి వచ్చారు. నన్ను చూసి, భయపెట్టీ, జీపెక్కించుకోనీ, పోయి తొర్రూరు ‘గెస్ట్ హౌస్’ లో, కూర్చో బెట్టారు.. “నన్ను వదిలి పెటండి సార్! మాది ఈ తండా కాదు, నేను చుట్టమోచ్చాను, నాకేమి తెలియదు” అని చెప్పి, ఏడ్చినా కూడా వదల్లేదు. ఐతే, నాతో పాటు జయరాం తండా మరియు పొక్కకుండా వాళ్ళు కూడా ఉండటంవల్ల, నాకు, కొద్దిగా ధైర్యం వచ్చింది. కాని రోజంతా తినడానికి తిండిలేక, తాగడానికి నీళ్ళు లేక, ఆకలికి తల తిరుగుతుందీ. ఆ తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళుతారో.., అనే భయ్యం వెంటాడు తుంది. కాని, సాయంత్రం, 5 గం.లకు, ‘జగన్’ రక్షకుడిలా వచ్చాడు. అతన్ని చూసి ‘పోయిన ప్రాణం తిరిగి వచ్చినంత ‘పనయింది. ఆయన, ఆ పోలీసులతో మాట్లాడి, నన్ను విడిపించుకోని, ఇంటికి తీసుకొచ్చాడు. ఆ రోజు, ఆ పరేషాన్ లో, అతన్ని, ఈ టీసీ, స్కూల్లో చేరికా… గురించి ఏమి అడగలేదు.
తెల్లారి, మూడోసారి మళ్ళీ వెళ్ళాను. ఆయన, తమ ఇంటి వెనకాల పొలంలో, కొత్త అంచు కడుతున్నాడు/ చెలకను పొలంగా మార్చుతున్నారు. నన్ను చూసి, ఆ పనిని వాళ్ళ తమ్ముడికి అప్పచెప్పీ, నన్ను వెంటపెట్టుకుని, ‘సంపత్ కుమార్’ సార్ వద్దకు, సన్నూర్ కు తీసుకొనిపోయి, ఆయనతో కలిపించీ, మాట్లాడి,’ టీసీ’ ఇచ్చినందుకు 7వందల రూపాయలు అవుతాయనగా, 5 వందలకు మాట్లాడీ, అందులో, 3వందలు ‘ప్రైవేట్ స్కూల్ ‘ వాళ్ళకీ, 2 వందలు, సారుకని, మాట్లాడి, అంతా ఓకే చేసిన తర్వాత..సార్ నన్ను దగ్గరికి పిలిచి, “బాబు ‘టీసీ’ తీసుకోని, మంచిగా చదివీ, పేరు నిలబెట్టాలి..” అర్థమయిందా? అని చెప్పి, “నేను, రేపు శనివారం, పన్నెండు గంటలకు రాయపర్తికి వస్తాను, 7 వ తరగతిలో చేరే విధంగా ‘టీసీ’ ఇస్తాను,” అని,చెప్పీ, పంపించాడు సార్.
ఐతే, ‘బడికి పోయి చదువుకోవాలనే’ కల నెరవేర బోతున్నందుకూ, పట్టలేనంత సంతోషంగా ఉంది. కాని, అదే సమయంలో, పైసలు లేకా పదింతల పరేషాన్ అయింది. 5 వందల రూపాయలు, సమకూర్చడం, తలకుమించిన భారమైంది. మా నాన్నను అడిగే ధైర్యం లేదు. మా అమ్మకు పై విషయాలు వివరంగా చెప్పీ, 7వందలు అడిగాను, ఆమే ఇల్లంతా గాలించగా, 3 వందల రూపాయలు దొరికినవి. మిగతా 4వందలకు-కొన్ని కూలి పైసలు అడ్వాన్స్ తీసుకుంది, మిగతా 250/- రూ. అప్పు తెచ్చి, ఇచ్చింది. గండం కాస్తా గట్టెకిందీ. తెల్లారి, ఆ పైసలు(ఆ డబ్బులు) తీసుకోని, మంచిగా, తయ్యరై, ఆనందంగా, ఏ బడిలో నైనా చేరవచ్చని, భావించి.. పగలే, భవిష్యత్, కలలు కంటూ..నడుచుకొంటూ, మైలారం మీదుగా, రోడ్డెమ్మటీ, పోతుండగా…రాయపర్తి వాగు, సమీపంగా,పోతుండగా, ‘సంపత్ కుమార్’ సార్, సైకిల్ పై వచ్చీ, ‘టీసీ’ ఇచ్చీ, ఒప్పుకున్న డబ్బులు, తీసుకొని, పైజేబులో పెట్టుకొని, సైకిల్ పై రాయపర్తికి పోయాడు ‘సంపత్ కుమార్’ సార్…
-— డా.బోంద్యాలు బానోత్(భరత్)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
నా కథ- 9 – ఆబ్కారి పోలీసులు — డా.బోంద్యాలు బానోత్(భరత్) — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>