“మూలాలు” (కథ )- మజ్జి భారతి
పండగకు పుట్టింటికి వెళ్తానంటే అక్కడేముందని అంటారా? అక్కడేముందో లేదో అన్ని చూసుకునే పెళ్లికొప్పుకున్నారు కదా! మీతో వియ్యమందారని వాళ్లు హఠాత్తుగా భాగ్యవంతులైపోరు కదా! ఐనా మర్యాదలు చెయ్యడంలో లోటు రానివ్వడంలేదు. అటువంటప్పుడు వాళ్లనెత్తి చూపిస్తున్నారంటేనే మీ గుణం అర్థమవుతుంది. ఎంత ధనముంటే ఏమి లాభం, మంచి గుణం లేకపోయినప్పుడు?
‘ఏదో మా వాడిష్టపడ్డాడని గాని… అబ్బే మనతో వియ్యమందే తాహతు వాళ్ళకెక్కడని?’ మీ అమ్మావాళ్లు. అయినా నాకు తెలియకడుగుతున్నాను. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి కోడల్ని తెచ్చుకోవాలని, మీ వాళ్ళు పెళ్లిచూపుల్లో మా వంశవృక్షం మొత్తాన్ని తిరగేసారు కదా! మా ఇంటికొచ్చినప్పుడు భూతద్దంలో చూసినట్టు, మూల మూలనూ పట్టిపట్టి చూశారు కదా! మా వాళ్ళు మీ కళ్ళకు తెరలు కట్టేసి వేరే వాళ్ళింటిని చూపించలేదు కదా! అప్పుడు తెలియలేదా మేము మీకు తగిన సంబంధం కాదని? ఇప్పుడేమో అల్లుడొస్తే వుండడానికి ప్రత్యేకంగా గదికూడా లేదని దెప్పి పొడుస్తారా! మీ సంబంధం చేసుకున్నారని గదులేమైనా పుట్టుకొస్తాయా? అప్పటికి మా అమ్మానాన్న వాళ్ళగదిని మీకిస్తూనే వున్నారు కదా!
పండగకు పుట్టింటికి వెళ్తానంటే అక్కడేముందని అంత ఉబలాట పడుతున్నావన్న మాట సరదాగా అన్నానంటారా? అక్కడ మనిషికొక గది లేకపోవచ్చు. నన్ను తనివితీరా గుండెలకు హత్తుకునే మా అమ్మానాన్నలున్నారు.
నా పుట్టింటిని ఎవరేమన్నా సహించాను. కాని నన్నిష్టపడి చేసుకున్నానన్న మీరే ఆ మాటంటే, ఇంక నేను సహించను. డబ్బులేని వాళ్ళ పిల్లతో మీరు కాపురం చెయ్యవలసిన పనేమీ లేదు. మీ వాళ్ళన్నట్టు, కో అంటే కోటిమంది పలుకుతారు మీకు. ఆ కోటిమందిలో మీ తాహతుకు తగ్గ పిల్లనెంచుకోండి. మనుషుల్ని మనుషుల్లా చూడలేని, డబ్బు మనుషుల మధ్య నేను కూడా వుండలేను.”
హాస్యానికన్నట్టు తన పుట్టింటి వాళ్లను ఎప్పుడూ ఏదో ఒకటి అంటున్నా, ఇన్నాళ్లూ ఆ కోపాన్ని ఆపుకుంది. ఇక తన వల్ల కాదు. మొదటి పండగకేమో కొత్త కోడలివి కదా, నువ్వెళ్ళిపోతే ఎలా అన్నారు. రెండో సంవత్సరం అత్తగారికి సర్జరీ అయిందని పంపించలేదు. ఈ పండగకైనా వెళ్లాలనుకుంటే, “అల్లుడికి మర్యాదలు చెయ్యాలంటే మీ వాళ్ళకి కష్టం కదా, ఇక్కడే ఉండిపోదూ! అక్కడికెళ్తే మీకు ప్రత్యేకంగా గది కూడా లేదు, ఇక్కడున్నట్టని” అత్తగారు. కూతురు, అల్లుడు ఇంటికొస్తే ఏ తల్లిదండ్రులైనా, కష్టమనుకుంటారా? ప్రత్యేకమైన గదులుంటేనే పుట్టింటికి వెళతారా? సరే వాళ్లంటే అన్నారు. ఈయన కూడా అక్కడేముందని అంటారా? ఏముండాలి? మా అమ్మానాన్నలున్నారు. అది చాలదా?
సరదాగా అన్నట్టు తన పుట్టింటి వాళ్లమీద వీళ్లెన్ని జోకులేసినా, ఈయన కోసమే కదా తాను తిరిగి సమాధానం చెప్పలేక పోతుంది. నవ్వుతూ ఉంటే నువ్వు బాగుంటావని ఈయనంటారని, ఎంత కోపమొచ్చినా దిగమింగుకుని నవ్వు ముఖంతోనే ఉంటుంది. ఈయనెంత బాగా చూసుకున్నా పుట్టింటినెలా మర్చిపోగలదు. ఎవరెంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మర్చిపోతారా? పెళ్లితో తన అంతస్తు మారగానే, పుట్టిల్లు పరాయిదైపోతుందా? పుట్టింటి ఆప్యాయతలు కనుమరుగై పోతాయా? వీళ్లు కొనిపెట్టిన నగలూ, చీరలూ పుట్టింటిని మరిపిస్తాయా? కూతురు అల్లుడ్ని ఓ నాలుగురోజులు ఉండేటట్టు పంపించమంటే, అత్తగారు నైస్ గా వాడు ఆఫీసులో లేకుండా ఒక్కరోజు కూడా గడవదన్నయ్యగారూ! ఒక రోజుకి వస్తారులెండి. పోనీ మీరే ఇక్కడికొచ్చి, మీ అమ్మాయితో గడపొచ్చు కదా అంటే వియ్యంకులింటికొచ్చి ఎవరుంటారు చెప్పండి?
వీళ్ళ ఆడపిల్లలు ఎన్నాళ్ళున్నా, వెళ్తామంటే అప్పుడే వెళ్ళిపోతారా? మీరున్నట్టే లేదన్న నోటితోనే, నువ్వెళ్తే వాడికస్సలు తోచదు. ఒక్కరోజుండి వచ్చేసెయ్ అంటారా? డబ్బులేని వాళ్ళకి ప్రేమలుండవా! వాళ్ల ఆడపిల్లలు వాళ్ళింట్లో తిరిగినట్లు, మా అమ్మానాన్నలు ఆడపిల్ల వాళ్ళింట్లో తిరగాలనుకోరా?
ఈయనేమో అక్కడ మనకి ప్రత్యేకంగా గది కూడా ఉండదు. నిన్ను విడిచి ఒక్కరోజు కూడా ఉండలేనని గారాలు పోతే, అదే ప్రేమని తాను మురిసిపోవాలా? ఈయన కోసం, ఈయనకు నచ్చినట్టు నేనున్నప్పుడు నాకోసం ఓ మూడురోజులు నా పుట్టింటికొచ్చి ఉండలేరా? నా ఆనందం కోసం ఒక్క రోజైనా ఈయన సుఖాన్ని త్యాగం చెయ్యలేనంటే… నా మీద ఈయన ప్రేమకు అర్థమేమిటి? తన సహనానికీ ఒక హద్దుంటుంది. ఈయన ప్రేమ కోసం పుట్టింటిని వదులుకోవాలంటే వల్లకాదు. గత మూడేళ్లుగా దాచుకున్న ఉక్రోషం, మనస్విని నోటినుండి మాటల రూపంలో బయటకు తన్నుకొచ్చేస్తుంది.
***
మనస్విని మాటలు పక్క గదిలో వున్న ఆమె అత్తగారు సుభద్రమ్మకు పిడుగుపాటులా తోచాయి. మనస్విని పుట్టింటి గురించి మాట్లాడుతూ, తాను తప్పు చేస్తుందా? గతం పునరావృతం కాబోతుందా? తాను కొత్త కోడలిగా వచ్చిన రోజులు గుర్తుకొచ్చాయి. పేద కుటుంబం నుండి వచ్చానని, సందర్భం దొరికితే చాలు అత్తగారు గుర్తు చేసేది. అందరి ముందూ చులకన చేసేది. ఆవిడ మీద కోపంతో, ఈయనతో గొడవపడి ఏడ్చి, చచ్చిపోతానని బెదిరించి వేరు కాపురం పెట్టించింది. తన అదృష్టం బాగుండి, వ్యాపారం బాగా కలిసొచ్చింది. తన పుట్టింటి వాళ్లనూ పైకి తీసుకొచ్చింది. కాని, గతం చెరిగిపోదు కదా! తన అత్తవారింటి కళ్ళకు, ఇప్పటికీ తన పుట్టింటివాళ్లు పేదవాళ్లే! అవకాశం దొరికినప్పుడంతా ఆ తేడా, చూపిస్తూనే ఉంటారు.
డబ్బులేని వాళ్ళ మధ్య అంతస్తుల తేడా అంతగా కనిపించదు. గాని, డబ్బున్నవాళ్లకు అంతస్తుల తేడా ఎక్కువే! అడుగడుగునా అది ప్రదర్శిస్తూనే ఉంటారు. అందుకే డబ్బున్న కోడల్ని తెచ్చుకుంటే, తానెక్కడ చులకనైపోతుందోనని, కొడుకిష్టపడ్డాడన్న పేరుతో, నెమ్మదస్తురాలైన మనస్వినిని, యేరి కోరి కోడలిగా తెచ్చుకుంది. కోడలు తనలా అవకూడదని, ప్రేమ చూపిస్తూనే, తన సుపీరియారిటీ చూపించుకోవడానికి, మధ్య మధ్యలో అంతస్తుల తేడా గుర్తు చేస్తూ, తన అత్తగారు చేసిన తప్పే తనూ చేస్తుంది.
చీరలు, నగలు పుట్టింటిని మరిపిస్తాయా? కలవారింటి కోడలయిందని పుట్టింటిని తాను మర్చిపోయిందా? తనకున్నట్టే కన్నవారింటి మీద కోడలికీ ప్రేముంటుంది కదా! నిజం మాట్లాడాల్సి వస్తే, మూలాలనే మర్చిపోతే, అదీ ఒక బ్రతుకేనా? మారటువంటప్పుడు, కోడల్ని పుట్టింటికి పంపించకపోతే తాను తప్పు చేస్తున్నట్టే కదా! కోడలు తనలా కాదు కాబట్టే, మూడేళ్లైనా కలిసుంది. అటువంటప్పుడు, కోడలి మనసును బాధ పెట్టడం ఎంతవరకు సమంజసం? ఎంతసేపూ కొడుకు సౌఖ్యమే తప్ప, కోడలి గురించి ఆలోచించలేదేమి? అత్తగారయ్యాక తన ఆలోచనలు మారిపోయాయా? అటువంటప్పుడు కోడలు అప్పటి తనలాగే ఆలోచిస్తే?
మనస్విని మరొక సుభద్రమ్మ కాకూడదంటే, తానేమి చెయ్యాలో అర్థమైంది సుభద్రమ్మకు. కొడుకు గదిలోకి వెళ్లి “ఈసారైనా మనస్వినిని పండగకు వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్ళు. తనకీ పుట్టింటి వాళ్లతో గడపాలని ఉంటుంది కదా!” అనేసింది కొడుకుతో, మనస్విని ఆశ్చర్యంగా చూస్తుంటే.
-మజ్జి భారతి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
“మూలాలు” (కథ )- మజ్జి భారతి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>