*మేము బతికే ఉన్నాo**( కథ) – శశి కళ
పరుగు పరుగున కూతురు చేతన వచ్చి, చెప్పిన విషయం విన్న,పావనికి సంతోషంతో కన్నీళ్లు వచ్చేసాయి .చేతన ను గట్టిగా పట్టుకుని చిన్న పిల్లలా ఏడ్చేసింది.
చేతనకి కూడా కన్నీళ్లు ఆగలేదు. పావని వెంటనే తేరుకుని ,చేతన నుదుటిన ముద్దు పెట్టి”నా బంగారు తల్లి. అనుకున్నది సాధించావు .నువ్వు ఇంకా ఇంకా విజయాలు సాధించాలి. తమ్ముడు, నువ్వు గొప్ప వాళ్ళు అవ్వాలి. నా పరాజయానికి, మనం పడిన అవమానానికి, మీ విజయాలే సమాధానం. నాకు ఆఫీస్‌కి టైం అవుతోంది.సాయంత్రం వచ్చాక నీకు ఇష్టమైన గులాబ్ జామ్ చేస్తా వెళ్లి రానా”అని అడిగింది ప్రేమగా.
సరే అన్నట్లుగా తల ఊపింది చేతన.
“ఉప్మా చల్లారిపోతుంది త్వరగా తిను .వంట చేసేసాను మధ్యాహ్నం భోజనం చెయ్ .తలుపులు వేసుకో. జాగ్రత్త” అంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకు నడిచింది పావని.
బస్టాండ్ వరకు నడిచి వెళ్లి, పది నిమిషాలకు వచ్చిన బస్సు ఎక్కి, కాలీ సీట్ కనపడటంతో గబగబా వెళ్లి కూర్చుంది .కిటికీలో నుండి బయటకి చూస్తూ, ఆలోచనలో పడింది.
“ఇంటర్ చదివే రోజుల్లో రాఘవ ఎంత ప్రేమ కురిపించేవాడు? ఒక్కరోజు కాలేజీకి వెళ్లకపోతే గిలగిలలాడేవాడు. రెండు కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ సీతాపురం వచ్చి, తను కనపడే వరకు ఇంటి చుట్టూ తచ్చాడే వాడు. అదంతా ప్రేమని నమ్మి తను ఎంత మురిసిపోయేది?
రాఘవ డిగ్రీలో చేరకుండా సిమెంట్ పనికి వెళ్తున్నా ,”పాపo ఇంట్లో వాళ్ళు చదివిస్తే, పెద్ద ఉద్యోగం చేసేవాడు. అయినా పనికి చిన్న పెద్ద ఏముందిలే?” అని తనను తాను సమర్ధించుకుంది .ఆ సమయంలో అమ్మానాన్న, చెల్లి ,స్నేహితులు ,ఎవ్వరూ కంటి కి కనిపించలేదు .రాఘవ లేకపోతే బతకలేననిపించింది.
నాన్నంటే చిన్నప్పటినుంచి భయం. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నా ,పెళ్లి చూపులైనా, తాంబూలాలు జరిగిన కూడా ,ఇంట్లో చెప్పటానికి మాత్రం ధైర్యం చాలలేదు.
రాఘవని కలిసి విషయం చెప్తే”మా అన్నయ్యకు ఇంకా పెళ్లి అవలేదు .నాకు ఇంకా 20 ఏళ్లు కూడా రాలేదు .మా ఇంట్లో చెప్తే నన్ను తంతారు. మనం ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. ఇక్కడ చేసే తాపీ పని అక్కడే చేస్తాను”అన్నాడు. రాఘవని వదులుకోవటం కంటే ఆ సమయానికి ఆ నిర్ణయమే సరైనది అనిపించింది తనకి.
ఇంకో వారంలో పెళ్లి అనగా, రాఘవ చెప్పినట్లుగా పెళ్లి ఖర్చులకని, బీరువాలో పెట్టిన డబ్బులు ,బంగారం, తీసుకుని రాఘవ తో ట్రైన్ ఎక్కేసింది.ఇద్దరూ కలిసి హైదరాబాద్ వెళ్లి ,హోటల్లో రూమ్ తీసుకున్నారు. గుళ్లో పెళ్లి చేసుకున్నారు. చిన్న ఇల్లు ఒకటి అద్దెకి తీసుకుని కాపురం మొదలుపెట్టారు.
చేతిలో డబ్బులు ఉన్నంతకాలం రోజులు హాయిగానే గడిచిపోయాయి. రాఘవకి పని దొరికినా, ఒకరోజు వెళ్తే ,నాలుగు రోజులు ఇంట్లోనే కూర్చునేవాడు .తను తెచ్చిన డబ్బులే కాక ,నగలు కూడా నెమ్మదిగా కరిగిపోయాయి. మూడేళ్లు అయ్యే సరికి ఇద్దరు పిల్లలు .కానీ రాఘవ ప్రవర్తనలో మాత్రం ఏ మార్పు లేదు .డబ్బులకు ఇబ్బంది పడుతున్న ,ఎలాగోలా సర్దుకుంటూ చాలా కష్టపడి సంసారాన్ని నెట్టుకొచ్చింది. నెమ్మిది నెమ్మదిగా రాఘవ ఇంటికి రావడం కూడా తగ్గించేసాడు .ఏంటని నిలదీస్తే ,ఏవేవో కుంటి సాకులు చెప్పేవాడు. చివరికి ఒకరోజు ఇద్దరు పిల్లల్ని, దరిద్రాన్ని ,అప్పుల్ని కూడా, తనకే వదిలేసి ,వేరే అమ్మాయికి తనకి చెప్పినట్లే ప్రేమ పాఠాలు చెప్పి వెళ్ళిపోయాడు .అదేంటని ప్రశ్నించడానికి వెళ్లిన తనని, ఓ పురుగును చూసినట్టు చూసాడు.
విపరీతమైన అవమాన భారం. కసి ,కోపం .ఇంటికి తిరిగి వచ్చిన తనకు ఏడుపాగలేదు. ఇద్దరు పిల్లల్ని పట్టుకుని ఎక్కెక్కి ఏడ్చేసింది.ఒక్కసారిగా జీవితమంతా శూన్యంలా అనిపించింది .చచ్చిపోదాం అనిపించింది .కానీ ఏమీ అర్థం కాక ,తనను భయంగా చుట్టుకుని ఏడుస్తున్న పిల్లల్ని చూసి ,ఆలోచన విరమించుకుంది. పిల్లల కోసమైనా బతకాలనిపించింది పిల్లల్ని ప్రయోజకులను చేసి రాఘవ ముందు నిలబెట్టాలనిపించింది.
“ఏమ్మా దిగవా?”అంటూ కండక్టర్ పెద్దగా అరవడంతో ఉలిక్కిపడి లోకంలోకి వచ్చిన పావని ,గబగబా బస్ దిగి అడుగులు వేసింది. కంపెనీ వైపుగా నడుస్తూ ఉంటే, ఒక్కో అడుగు విజయ గర్వంతో వేస్తున్నట్టు అనిపించింది .తెలిసిన వాళ్ళందరికీ సంతోషంతో”మా అమ్మాయి 10వ తరగతి మండలం ఫస్ట్ వచ్చింది “అని చెప్పింది.
అందరూ అభినందనలు తెలుపుతూ ఉంటే సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయినట్లుగా అనిపించింది.
స్నేహితురాలు రాణి ఎవరు లేకుండా చూసి”ఈ సంతోష విషయం మీ ఇంట్లో చెప్పు. చాలాకాలం అయింది గా, వాళ్ళ బాధ కొంచెం తగ్గి ఉంటుంది .నీతో మళ్ళీ మాట్లాడతారేమో? నీకోసం కాకపోయినా మనవడు మనవరాలు కోసమైనా మాట్లాడతారు”అని అంది.
“లేదు రాణి మళ్లీ తిరిగి మాట్లాడటానికి నేను చేసింది చిన్న తప్పు కాదు. ఆ తప్పు వల్ల జరిగిన ఉపద్రవం కూడా అంత చిన్నదేం కాదు.
నేను ఇంట్లో నుంచి వచ్చేయటంతో మగ పెళ్లి వారు అవమానంగా భావించి, ఇంటి మీదకు వచ్చి నానా మాటలు అన్నారట. బంధువులు కూడా ఇదే అవకాశం అన్నట్లుగా మాటలతో చిత్రహింసలు చేయటంతో, అవమాన భారం తట్టుకోలేక, మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు.
రాఘవతో వచ్చేసిన రెండేళ్ల తర్వాత ,మా ఊరికి చెందిన ఒక ఆయన ఒకసారి బస్సులో కనిపించి ,ఈ విషయం అంతా చెప్పాడు.
ఆ తర్వాత ఒక సంవత్సరానికి రాఘవ కూడా నన్ను వదిలి వెళ్ళిపోయాడు.
దారులన్నీ మూసుకుపోయినట్టు అనిపించినా, పిల్లల కోసం ధైర్యం తెచ్చుకుని, ఓ చిన్న స్కూల్లో ప్రైమరీ టీచర్ గా పనిచేసి ,ప్రైవేటుగా డిగ్రీ కట్టాను .ఇన్స్టాల్మెంట్లో మిషన్ కొనుక్కుని బట్టలు కుట్టడం మొదలుపెట్టాను. డిగ్రీ పూర్తయ్యాక ఆక్వా కంపెనీలో ఉద్యోగంలో చేరాను. పిల్లలే ప్రాణంగా ఉన్నంతలో వాళ్ళని బాగా చూసుకుంటూ రోజులు గడిపాను 10 సంవత్సరాలు గిర్రున తిరిగాయి.
నా కష్టం తెలిసిన పిల్లలిద్దరూ కూడా కష్టపడి బాగా చదువుకున్నారు. చేతన అయితే ,నాకు ధైర్యం చెబుతూ ,నేను ఏమాత్రం దిగాలుగా ఉన్నా,నన్ను నవ్విస్తూ ఇంట్లో పని సహాయం చేస్తూ చదువుకుంది.
చేతన స్కూల్ కి ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ టీచర్లు ఎప్పుడూ పొగుడుతూ ఉండేవారు. బాగా చదువుతోంది. మంచి మార్కులు తెచ్చుకుంటుంది. అని చాలా సంబరపడ్డా. అంతకుమించి మండలం ఫస్ట్ తెచ్చుకొని , నన్ను మొదటిసారిగా తలెత్తుకునేలా చేసింది.”అంది ఆనంద భాష్పాలు తుడుచుకుంటూ పావని.
సాయంత్రం కంపెనీ అయ్యాక పరుగు పరుగు న ఇంటికి వెళ్ళింది.
గులాబ్‌జామ్ చేసి చేతనకు తినిపిస్తూ ఉండగా కాలేజీ వాళ్ళు వచ్చారు.
వాళ్లు తమను తాము పరిచయం చేసుకుని”మాది సిటీలో మంచి కాలేజీ. మా కాలేజీలో పీజీ వరకు ఉంది. మీ అమ్మాయి ఎంతవరకు చదివితే ,మేము అంతవరకు చదివిస్తాం. ఒక్క రూపాయి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. పుస్తకాలు, యూనిఫామ్ కూడా మేమే ఇస్తాం.”అని చెప్పి చేతన వైపు తిరిగి”అమ్మ నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు?”అని అడిగారు.
“నేను ఇంజనీరింగ్ చదివి, మంచి ఉద్యోగం సాధించి ,మా అమ్మని బాగా చూసుకుంటా. మా నాన్న ముందుకు వెళ్లి ,నువ్వు వదిలేసినా ,మేం బతికే ఉన్నాం .బాగున్నాం కూడా. అని చెప్తా” అంది చేతన.
” నేను కూడా “అంటూ అక్క చేయి పట్టుకున్నాడు అక్కడే ఉన్న చేతన తమ్ముడు సాత్విక్.
వాళ్ళిద్దరిని అలా చూసిన పావని కళ్ళల్లో ఆనంద భాష్పాలు రాలాయి.
Comments
*మేము బతికే ఉన్నాo**( కథ) – శశి కళ — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>