“రేపు నాది”(కథ) – డా.మజ్జి భారతి
వంటగదిలో పనిచేసుకుంటున్న పెద్దకూతురు సుహాసినిని చూసి శాంతమ్మ మనసు భారమైపోయింది. కళ్ళు కన్నీళ్ళతో నిండిపోయాయి. సుహాసిని చూడకుండా, పక్కకు తిరిగి చీరచెంగుతో కళ్ళను ఒత్తుకుంది శాంతమ్మ. కానీ సుహాసిని చూడనే చూసింది. అమ్మ దగ్గరగా వెళ్లి “అమ్మా! నా చేతులు చూడు ఎలా అయిపోయాయో?” చేతులు రెండూ అమ్మ ముందుకు చాపింది. వాటిని చూసి దుఃఖంతో కన్నీళ్లు జలజలా కారిపోయాయి శాంతమ్మకు.
“అమ్మా! నిన్ను బాధ పెట్టాలని కాదు. కాని ఈ చేతులు చూస్తే అక్కడ నా పరిస్థితి నీకు అర్థం అవుతుందని చూపించాను. కార్తీక్ నన్ను అక్కడకు తీసుకువెళ్లలేదని నేను బాధపడటం లేదు. నాకిక్కడ చాలా హాయిగా ఉంది. రేపు నాది అన్న ఆశతో ఈరోజు సంతోషంగా ఉండగలుగుతున్నాను. నిజానికి అక్కడకు వెళ్లాలంటేనే బెంగ వస్తుంది. అందుకని నువ్వేమీ బాధపడవద్దని చెప్పడానికి మాత్రమే చూపించాను.” అని అమ్మను స్వాంతన పరచడానికి చూసింది సుహాసిని.
“లేత తమలపాకుల్లా ఉంటాయి నీ చేతులు” అని ఆ చేతులను చూసి మురిసిపోయేది శాంతమ్మ, ఒకప్పుడు. తమలపాకుల్లా సున్నితంగా ఉండే ఆ చేతులు రఫ్ గా అక్కడక్కడా కాయలు కట్టి ఉన్నాయి. వాటిని చూసి కళ్ళనీళ్లు కుక్కుకుంది శాంతమ్మ.
“కట్నం కింద ఆ మిగిలిన పది లక్షలు ఇచ్చి మీ అమ్మాయిని తీసుకురండి” అని పెద్దల్లుడు, కార్తీక్ అన్న మాట శాంతమ్మ చెవులలో గింగురుమంటుంది. దుఃఖం ఆపుకోలేక భర్త మన్మధరావు ఉన్న గదిలోకి వెళ్లిపోయింది శాంతమ్మ.
రెండో కూతురికి పెళ్లి చేసి ఇంకా నెల కాలేదు. మంచి సంబంధమని, తన తలకు మించిన పనైనా జిపిఎఫ్ లోన్లు అవీ పెట్టి, యిరవైలక్షల కట్నంతో రెండో కూతుర్ని ఇంజనీర్ కి ఇచ్చి పెళ్లి చేశాడు సుహాసిని తండ్రి, మన్మధరావు. పెళ్లికొచ్చిన పెద్దల్లుడు వెళ్ళిపోతూ “నాకు పదిలక్షల కట్నమే ఇచ్చారు. అప్పుడు నాకు పాతికలక్షలదాకా కట్నం ఇస్తామని ఎందరో వచ్చినా, మీరంతకు తూగలేరని మీకోసం పదిలక్షలకి ఒప్పుకున్నాము. కానీ ఇప్పుడు రెండో అల్లుడికి యిరవైలక్షల కట్నమిచ్చి పెళ్లిచేశారు. మీ దగ్గర యింత డబ్బు ఉందని తెలిస్తే అప్పుడే అడిగేవాడిని. ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఆ బ్యాలెన్స్ పదిలక్షలు ఇచ్చి మీ అమ్మాయిని తీసుకురండి” అని భార్యను, యింకా సంవత్సరం నిండని కూతురు దీప్తిని కన్నవారింట్లో వదిలి వెళ్ళిపోయాడు.
చెల్లెలి పెళ్లయి నెల దాటిపోయినా ఇంకా అత్తవారింటికి బయలుదేరని సుహాసినిని చూసి “ఇంకా పెళ్లిసందడి తీరలేదా?” అని ఇరుగుపొరుగులు, పరోక్షంగా “ఇంకా మీ ఇంటికి వెళ్లలేదేమి?” అని అడుగుతున్న మాటలు మన్మధరావు చెవులలో పడుతూనే ఉన్నాయి.
“ఇద్దరు పిల్లలూ ఒక్కసారే వెళ్ళిపోతే నాకేమిటి తోస్తుంది. అందుకే దీనిని కొద్దికాలం ఇక్కడ ఉంచమని అల్లుడిని అడిగాను. పాపం అల్లుడు… తనకిష్టం లేకపోయినా నాకోసమని ఒప్పుకున్నాడు” అని శాంతమ్మ సర్దిచెప్పడం కూడా వింటూనే ఉన్నాడు.
ఈ మనోవేదన భరించలేక అల్లుడు దగ్గరికి వెళ్లి “ఎలాగైనా ఆ పదిలక్షలు ఇస్తాను. కొద్దిగా ఓపిక పట్టు. ఇప్పటికి అమ్మాయిని, మనమరాలిని తీసుకువెళ్ళమని” యెంత ప్రాధేయపడినా అల్లుడి మనసు కరగలేదు.
“మా బాగా అడిగావురా” పక్కనుండి వియ్యపురాలి మాటలు. “అంతగా కావాలనుకుంటే, ఆ ఇల్లమ్మి కూతురిని పంపించవచ్చు కదా! ఉత్తి మాటలు కాకపోతే!” అని వియ్యపురాలు పక్కనుండి నొక్కుతూనే ఉంది. దుఃఖం దిగమింగుకోక తప్పలేదు మన్మధరావుకి. ఏదో తాతలనాటి ఇల్లు ఉంది కాబట్టే, ఆ వచ్చిన జీతం లోన్ కటింగ్ లు పోను, ఏదో అలా బతకడం జరుగుతోంది. ఇల్లమ్మి, అద్దె ఇంటికి అద్దెకడితే, తినడానికి యింకా ఏమి మిగులుతుంది?” ఎటూ పాలుపోవడంలేదు మన్మధరావుకి. అలాగని కూతురిని, అత్తవారింటికి పంపించకుండా ఇంట్లో ఎంతకాలమని ఉంచుకోగలడు?” కూతురి ముఖంలోకి సూటిగా చూడలేకపోతున్నాడు. సంతోషమన్నది ఆ ఇంటి నుండి దూరంగా పోయింది. ఎంత కాలమని ఇలా?
ఒక కూతురికి పెళ్లి అయ్యిందన్న సంతోషంపోయి, పెద్దకూతురు ఇంట్లో ఉంటుందన్న బాధ ఎక్కువవుతుంది. గదిలోకి వచ్చిన భార్యముఖం చూసి చలించిపోయాడు మన్మధరావు. ఇల్లు అమ్మిఅయినా ఆ పదిలక్షల కట్నం ఇచ్చి సుహాసినిని అత్తవారింటికి పంపించాలన్న నిర్ణయానికి వచ్చాడు. భార్యతో అదే విషయం చెప్పాడు.ఈ విషయం కూతురు బాధపడకుండా ఎలా చెప్పాలో, ఆలోచిస్తూ కూర్చున్నారు భార్యాభర్తలు గదిలో.
ఇంతలో దడాలున తలుపులు తెరుచుకొని సుహాసిని గదిలోనికి వచ్చింది. కంగారుపడుతూ ఇద్దరూ లేచి నిల్చున్నారు “ఏమైందని?”.
“కంగారు పడకండి. మీరంతగా బాధపడడానికి ఏమీలేదు. నాకు అక్కడకు వెళ్లాలని కూడా లేదు. నిజం చెప్తున్నాను, నేనక్కడ సంతోషంగా ఏనాడూ లేను. మీకెందుకు చెప్పలేదు అంటారేమో? ఏ రోజుకారోజు, ఈరోజు సంతోషంగా లేకపోయినా, రేపు సంతోషంగా ఉంటానేమోనన్న ఆశతోనే నేనక్కడ ఉన్నాను. అందుకే ఉన్న ఇల్లు అమ్మి నన్ను అక్కడకు పంపించాలన్న ఆలోచన కలలో కూడా పెట్టుకోవద్దు. నిజానికి నేనిక్కడ చాలా హాయిగా ఉన్నాను. దేవుడు ఈ రకంగా నాకు మేలు చేశాడేమో! దీపూ కూడా… చూడండి… ఇక్కడకు వచ్చాక ఎంత బాగా ఒళ్ళు చేసిందో! మీరింకేమీ బాధపడకండి. డిగ్రీ పాసయ్యాను. ఏవో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కట్టుకుంటాను. జాబ్ తెచ్చుకుంటాను. నా కాళ్ళమీద నేను నిలబడతాను. ఉద్యోగం చేయాలన్న నా కోరికను దేవుడు ఈరకంగా నెరవేరుస్తున్నాడేమో?” అన్న సుహాసిని మాటలకు “నాన్నా! నేనింకా చదువుకుంటాను. అప్పుడే నాకు పెళ్లివద్దు” అని కూతురు కాళ్ళావేళ్ళా పడ్డా, మంచి సంబంధమని కూతురి మెడలువంచి పెళ్లి చేయడం గుర్తుకొచ్చింది మన్మధరావుకి. పెళ్లి అయిననుండీ, అది చాలలేదు, ఇది చాలలేదు అని కూతురు అత్తవారింట సాధింపులు ఎదుర్కోవడమూ తెలుసు.
మనవరాలు పుట్టిందన్న సంతోషం కూడా లేకుండా “కన్నాదిలే కూతుర్ని? వంశాంకురం పుడతాడనుకున్నాను?” అని ఈసడింపుగా ఇద్దరు కూతుర్లను కన్న వియ్యపురాలన్న మాటలూ గుర్తుకొచ్చాయి మన్మధరావుకి. దాంతో ఇల్లు అమ్మాలన్న ఆలోచనను పక్కన పెట్టక తప్పలేదు మన్మధరావుకి.
“ఇంకా అత్తవారింటికి ఏమి వెళ్లలేదు” అన్న ఇరుగుపొరుగుల మాటలకు “ఇంకా పదిలక్షల కట్నం ఇస్తేగాని మా ఆయన నన్ను తీసుకెళ్లనన్నారు. పోనీ మీ దగ్గర ఏమైనా ఉంటే నాన్నకు అప్పు ఇవ్వండి. నేను మా అత్తవారింటికి వెళ్ళిపోతాను” నవ్వుతూనే అన్నా సూటిగా ముఖం మీద కొట్టినట్లు చెప్పేది సుహాసిని.
“మాకెందుకులే అమ్మా! నువ్వెక్కడ ఉంటే! ఏదో తెలిసిన పిల్లవుకదా అని అడిగామంతే” అని నెమ్మదిగా జారుకునేవారు అడిగినవాళ్ళు. లోకమంతా తెలిసిపోయింది ఇంకా ఎక్కువ కట్నం కోసం పెద్దల్లుడు సుహాసినిని కన్నవారింట్లో వదిలేసాడని. అయినా సుహాసిని అవేవీ పట్టించుకోకుండా ఏవేవో పరీక్షలకు చదువుకుంటూనే ఉంది. అమ్మమ్మ, తాతయ్యల పోషణలో అర్బకంగా ఉండే, దీప్తి బంతిలా తయారయింది.
****
గిర్రున రెండేళ్లు తిరిగాయి. ఈ రెండేళ్లలోనూ ఒక్కసారి కూడా పెద్దల్లుడు అత్తగారి గడప తొక్కలేదు. ప్రతిపండగకి మన్మధరావు అల్లుడు ఇంటికి వెళ్లి పిలవడం, అల్లుడు, వియ్యపురాలు ఏవో మాటలని మన్మధరావుని వెనక్కి పంపించడం జరుగుతూనే ఉంది.
రెండేళ్ల కృషి ఫలితం. ఇప్పుడు సుహాసిని చేతుల్లో గ్రూప్ టూ ఆఫీసర్ ఉద్యోగపు నియామకపు కాగితం రెపరెపలాడుతుంది. అందరూ అభినందనలు చెప్పేవారే!
ఆ సాయంకాలమే పళ్ళు, స్వీట్లు, పిల్లకి బట్టలు, బొమ్మలు అన్నీ పట్టుకొని మరీ అత్తవారింటికి వచ్చాడు, కట్నం యిస్తే గాని మీ ఇంటి గడప తొక్కనన్న పెద్దల్లుడు.
“అత్తయ్యా! మామయ్యా! బాగున్నారా!” అంటూ ఆప్యాయంగా పలకరించాడు. దీప్తిని ముద్దులలో ముంచేసాడు. ఎన్నడూ చూడని ఈ కొత్తవ్యక్తిని చూసి దీప్తి అమ్మ వెనుక దాగుండిపోయింది. పెద్దల్లుడు ఇంటికి వచ్చాడన్న సంతోషంలో మన్మధరావు, శాంతమ్మలు ఈ రెండేళ్ల కాలంలో జరిగిన విషయాలన్నీ మర్చిపోయారు.
“మీ నాన్నరా దీపూ! నాన్న దగ్గరికి వెళ్ళు. చూడు నాన్న నీకు ఎన్ని బొమ్మలు తెచ్చారో” అంటూ పెద్దల్లుడి ముందుకు తోసారు దీప్తిని.
****
ఆ రాత్రి పడకగదిలో “సుహా! రేపు ఉదయం ఇంటికి వెళ్లిపోదాం. టికెట్లు బుక్ చేసేసాను బట్టలు సర్దుకో” సుహాసిని భుజంమీద ప్రేమగా చేతులు వేసి చెప్పాడు కార్తీక్.
“అదేమిటండి! నాన్న ఇంకా పదిలక్షలు ఇవ్వకుండానే నన్ను మీ ఇంటికి తీసుకెళ్తానంటారేమిటి?” ఆశ్చర్యంగా అడిగింది సుహాసిని.
“వెధవ డబ్బుదేముంది? నీకు దూరంగా ఉండి నేనెంత బాధపడ్డానో తెలుసా నీకు? చిన్నల్లుడికి అంత కట్నం ఇచ్చి నాకు ఇవ్వకపోతే బాధ అనిపించి అడిగాను. అంతేగాని నువ్వంటే ప్రేమలేక కాదు, మీ నాన్నంటే కోపం వచ్చి కూడా కాదు. అయినా నువ్వే అడిగిఉంటే మీ నాన్న అప్పుడే ఇచ్చి నిన్ను తీసుకువచ్చేవాడు. అసలు తప్పంతా నీదే” నెపాన్ని సుహాసిని మీద పెట్టాడు కార్తీక్.
“తప్పు నాదా?” సాలోచనగా అంది సుహాసిని.
“సరేలే! ఇప్పుడా విషయాలెందుకు? ఏదో అలా జరిగిపోయింది. ఇకనుండి మనం ఒక్క నిమిషమైనా దూరంగా ఉండొద్దు” సుహాసినిని దగ్గరగా తీసుకుంటూ అన్నాడు కార్తీక్.
“మీరన్నట్టే చేద్దాం. నేను జాబ్ చేసే దగ్గరికి మీరు ట్రాన్స్ఫర్ చేయించుకుంటే, ఒక్క నిమిషం కూడా దూరంగా ఉండాల్సిన అవసరం రాదు మనకు” చెప్పింది సుహాసిని.
“నేనక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటే, అమ్మావాళ్లు మన ఊరిలో ఎలా ఉండగలరు?”
“మనమెక్కడ ఉంటే, అక్కడే అంతా ఉంటారు”
“సొంత ఇల్లు సొంత ఊరు వదిలి అమ్మ ఎక్కడికీ రాదు. నీకు తెలుసు కదా!”
“పోనీ అక్కడే ఉండనివ్వండి”
“నేనొక దగ్గర అమ్మా వాళ్లొక దగ్గర… ఎలా కుదురుతుంది?”
“అదేమిటండి అలా అంటారు? రెండు సంవత్సరాలుగా మీభార్య, పిల్లని వేరేదగ్గర పెట్టి ఉంచలేదా? అలాగే వాళ్ళూ ఉంటారు కొన్నాళ్లు”
కళ్ళు ఎరుపెక్కాయి కార్తీక్ కు. అయినా తమాయించుకున్నాడు. “అమ్మ దీపూని, నిన్ను చూడాలని ఎంత తాపత్రయ పడుతుందో తెలుసా? ఎన్నోసార్లు చెప్పింది, వెళ్లి తీసుకురారా. నీ పంతాలు, పట్టింపులకు ఏముందిలే! అని”
“అయితే మీరే ఆమె మాట వినలేదన్నమాట? పోనీ అంతగా చూడాలనిపిస్తే ఇక్కడికి రావచ్చు కదా! మరెందుకు రాలేదో!”
“అయిపోయిన వాటిగురించి ఇప్పుడెందుకులే! అయినా అమ్మవాళ్ళను వదిలి ఎలా ఉండమంటావు?”
“మరి కన్నకూతుర్ని ఎలా వదిలేశారు మీరు?”
“నేనెక్కడ వదిలేసాను? తాతగారింటిలోనే కదా! అలా బెదిరిస్తే మీ నాన్న డబ్బు ఇచ్చి మీ ఇద్దరిని తీసుకొస్తాడనుకున్నాను. నాకేమి తెలుసు, డబ్బు కోసం మీ నాన్న భార్యాభర్తలను విడదీసేంత కర్కశమనస్కుడని”
“అయితే తప్పంతా మా నాన్నదే అంటారు?”
“అలాగని కాదు. కానీ కూతురు బాగోగులు చూడక్కరలేదా? ముష్టి పదిలక్షల కోసమని మన ఇద్దరినీ విడదీస్తాడా, కన్నకూతురనైనా లేకుండా?”
“మరి కన్నకూతురని కూడా లేకుండా, దీపూని యిన్నాళ్ళూ ఎలా వదిలేశారు? కనీసం ఒక్కసారైనా చూడడానికైనా వచ్చారా మీరు? పోనీ మీరు కాదు, మీ ఇంట్లో వాళ్ళు ఒక్కరైనా వచ్చారా? రెండు సంవత్సరాలు మీరెవరు లేకుండానే పెరిగింది దీప్తి. ఆఖరికి మీరెవరో కూడా దానికి తెలియలేదు. మీరే చూశారు కదా!”
“ఏదో జరిగిపోయిందిలే. ఇప్పుడవన్నీ ఎందుకు? ఇప్పుడైనా కలిసి హాయిగా ఉందాము”
“అదే మాట నేనూ చెప్తున్నాను. మన ముగ్గురం కలిసి హాయిగా ఉందామని”
“సుహా! నెమ్మదిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నావేమో! మాటకు మాట చెప్తున్నావు. అదివరకు నువ్విలా లేవు.”
“కాలమే ఇవన్నీ నేర్పించింది. అప్పుడు నేర్చుకోవడానికి టైం ఏది? ఉదయం లేచిన నుండి మీ అందరికీ టిఫిన్లు…. ఆ తర్వాత భోజనాలు…. ఆ తర్వాత స్నాక్స్…. మరలా రాత్రి భోజనాలు…. నాకు మీతో మాట్లాడడానికి కనీసం ఒక్క నిమిషమైనా ఖాళీ ఉండేదా? మీరే చూసేవారు కదా! నేనెలా పని చేసేదాననో?”
“మరి కోడలన్నాక అవన్నీ చెయ్యాలి కదా?”
“కోడలే చెయ్యాలా? మీ ఇద్దరి చెల్లెల్లదీ నా వయసే కదా! వాళ్ళకెప్పుడైనా పని చెప్పారా మీ ఇంటిలో?”
“ఆడపిల్లలు కన్నవారింట్లో కాక ఇంకెక్కడ సుఖపడతారు నువ్వే చెప్పు?”
“పోనీ వాళ్లు ఆడపిల్లలు. మరి మన తర్వాత పెళ్లైన మీ తమ్ముడి భార్య ఎప్పుడైనా పని చెయ్యడం చూశారా మీరు?”
“ఏదో చిన్నపిల్ల. తనతో నీకు పోటీ ఏమిటి?”
“నా పెళ్లినాటికి ఆ అమ్మాయికన్నా నేను చిన్నదాన్నే”
“నువ్విలా మాట్లాడతావని నేనెప్పుడూ అనుకోలేదు. పెద్ద కోడలిగా నీ బాధ్యత నెరవేర్చావు. దానికేమిటి?”
“అంటే పెద్దకోడలిని కాబట్టి ఇంట్లో పనులన్నీ నేనే చేయాలన్నమాట. ఆఖరికి పనిమనిషిని కూడా మాన్పించేసారు. ఒక్కరోజు కూడా మీకెవరికీ అనిపించలేదా ఒక్క పిల్ల యింతమందికి ఎలా చేస్తుందని? ఆఖరికి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా పనులన్నీ నాచేతే చేయించేవారు. సుహా లేకపోతే ఎలాగా అని ఆఖరి నెలలోనే పుట్టింటికి పంపించారు. పిల్ల పుట్టిన ఒక్క నెలలోనే తీసుకొచ్చారు. ఎందుకు? మీ అందరికీ పనులు చేసి పెట్టడానికి. కాదంటారా మీరు?”
“అవును. అయితే ఏంటట? మర్యాదగా మాట్లాడుతుంటుంటే భర్తననే గౌరవం లేకుండా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. ఇవేనా ఈ రెండేళ్లు నువ్విక్కడ నేర్చుకున్నది? మీ అమ్మానాన్న నీకు చెప్పలేదా భర్తను ఎలా గౌరవించాలో? ఇప్పుడు రానంటావా? నిన్ను ఎలాగా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు” హూంకరించాడు కార్తీక్.
“భార్యను ఎలా చూసుకోవాలో మీ ఇంట్లో మీకు చెప్పలేదా ఎప్పుడూ?”
“చెప్పారు కాబట్టే ఇప్పుడొచ్చాను నిన్ను తీసుకెళ్లడానికి. రెండేళ్లు పోయాకైనా వచ్చాను కదా! ఇప్పుడు రానంటే ఈడ్చుకొని లాక్కెళ్తాను” నిప్పులు కురిసాయి కార్తీక్ కళ్ళు.
“సరే! అలాగే కానీయండి. కట్నం కోసం భార్యాపిల్లలను పుట్టింట్లో మీరెలా వదిలేశారో చూశారందరూ. ఇప్పుడు మీరు నన్ను ఈడ్చుకుని లాక్కెళ్ళడం చూస్తారంతా. అంతే కదా!” తన సంయమనాన్ని కోల్పోకుండా చెప్పింది.
“మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే ఉస్కో అందట. అయినా నీలాంటి దానితో మాట్లాడడం ఏమిటి? విడాకులిచ్చేస్తాను. ఏమనుకుంటున్నావో?” బెదిరించాడు కార్తీక్. విడాకుల మాట విని కాళ్ళబేరానికి వస్తుందని అనుకున్నాడు.
అనూహ్యంగా “రాజాలాగ ఇవ్వొచ్చు. మిమ్మల్ని అడ్డేవారెవరు?” సమాధానం ఇచ్చింది సుహాసిని
“అంటే విడాకులిస్తానన్నా నీకు భయంలేదా? ఏమి చూసుకుని నీకా గర్వం? ఆఫ్ట్రాల్ ఆ ఉద్యోగం వచ్చిందనే కదా ఈ పొగరు?” ఇంతవరకూ వేసుకున్న ముసుగు తొలగిపోయి అసలైన కార్తీక్ బయటకు వచ్చాడు.
“ఆ ఉద్యోగం వచ్చిందనే కదా మీరు ఇప్పుడు నన్ను పిలవడానికి వచ్చారు. ఆ ఉద్యోగమే లేకపోతే మీరు ఇప్పుడు ఇలా వచ్చిఉండేవారా?” ప్రశ్నించింది సుహాసిని.
ఏం మాట్లాడాలో తెలియలేదు కార్తీక్ కి కాస్సేపు ఆలోచించి “దీప్తిని తీసుకెళ్లిపోతాను. అప్పుడేమి చేస్తావు?” బెదిరించాడు.
“రెండేళ్లు మీరు లేకుండా నేను పెంచాను. నేను లేకుండా మీరు పెంచలేరా ఏమిటి? తీసుకెళ్లండి” “తల్లివనైనా లేదా! కూతురిని తీసుకెళ్ళిపోతానంటే తీసుకెళ్లిపోమంటున్నావా” ఉక్రోషంగా అడిగాడు.
“కన్నతండ్రి రెండేళ్ల తర్వాత, తీసుకెళ్తానంటే వద్దని ఎందుకంటానండి? మీకు మాత్రం ప్రేమ లేదా ఏమిటి దీప్తి అంటే?”
“విడాకులు తీసుకొని హాయిగా ఉందామనుకుంటున్నావేమో? నీకు విడాకులివ్వను. అప్పుడేమీ చేస్తావు?” ఈ మాటలని గెలిచాననుకున్నాడు కార్తీక్.
“ఇప్పుడు మీరన్న ప్రతీ మాట రికార్డ్ అయింది. కోర్టులో అది మీకు వ్యతిరేకంగా పనిచేస్తుందేమో? డౌరీ కేసు, రెండేళ్లుగా నన్ను కన్నవారింట్లో విడిచి వెళ్లిన విషయం, పాపను పట్టించుకోని విషయం… ఇవన్నీ నాకు అనుకూలంగా పనిచేస్తాయేమో?”
“దుర్మార్గురాలా! ఇంత విషం మనసులో పెట్టుకొని నాతో మాట్లాడుతున్నావా? అయినా విడాకులిచ్చి, దీప్తిని నేను తీసుకువెళతాననుకుంటున్నావేమో? నేను తీసుకెళ్లను. కొన్నాళ్లు కాపురం చేశావు. పిల్ల తల్లివి. నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడు? ఎవడు పెళ్లి చేసుకున్నా నీ ఉద్యోగం చూసే చేసుకుంటాడు. నిన్ను, నీ కూతురిని కాళ్ళకింద తొక్కిపట్టి ఉంచుతాడు. ఏమనుకుంటున్నావో? అప్పుడు తెలుస్తుంది నా విలువేమిటో. ఆరోజు కుళ్ళి కుళ్ళి ఏడుస్తావు నన్ను కాదన్నందుకు” శాపనార్ధాలు పెట్టాడు కోపంతో.
“థాంక్స్. నాకు లేని ఆలోచనను నాలో కలిగించినందుకు. ఈ జన్మకి ఒక్క పెళ్లే ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఎప్పటికైనా మీరు మారకపోతారా? రేపు అనేది ఉంటే హాయిగా ఉండకపోతామా అన్న ఆశతోనే అన్నాళ్లూ మీ ఇంట్లో ఉన్నాను. కానీ మీరేమీ చేశారు? ఇంకా ఎక్కువ కట్నం కోసం కన్నబిడ్డతో సహా, నన్ను పుట్టింట్లో వదిలేశారు. అయినా నేను ఆశ కోల్పోలేదు. రేపు నాది అన్న ఆశతోనే కష్టపడి చదువుకున్నాను. ఇప్పటినుండి రేపు కాదు ఈరోజు కూడా నాదే. అందుకు నిదర్శనం నాకు వచ్చిన ఉద్యోగమే. మీరు నిజంగా మారి ఉంటే ఈ నిమిషంలో నేను మీ వెనుక వచ్చేదానను. కానీ మీరు మారలేదు. పెళ్లయిన నుండీ నన్నొక మనిషిగా మీరేనాడూ చూడలేదు. మీ అవసరాలు తీర్చే వ్యక్తిగా మాత్రమే చూశారు. నా కుటుంబమని ఇన్నాళ్లూ భరించాను. మీరేమిటో, నేను మీకేమిటో మీ ప్రతీ మాటలో చెప్పకనే చెప్పారు. మీరు మారనప్పుడు మిమ్మల్ని భరించవలసిన అవసరం నాకు లేదు.”
“మరొక్క మాట. ఇంకో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు. కానీ ఇప్పుడు మీ మాట నాలో కొత్త ఆలోచనని కలిగిస్తుంది. నేనెందుకు రెండోపెళ్లి చేసుకోకూడదు? నా పిల్లతో సహా నన్ను యాక్సెప్ట్ చేసినవాడినే పెళ్లి చేసుకుంటాను. నాకు తొందర ఏమీ లేదు” అని సమాధానమిచ్చిన సుహాసిని మదిలో సందీప్ మెదిలాడు.
సందీప్ కి తనంటే చాలా ఇష్టమని తన క్లాస్ మేట్స్ అందరికీ తెలుసు. కానీ కులాలు వేరని, పెద్దలు ఒప్పుకోరని తాను ధైర్యం చేయలేకపోయింది. గాని కార్తీక్ తనను, తన కూతురిని ఎక్కువ కట్నంకోసం కన్నవారింట్లో వదిలేసాడని తెలిసినప్పుడు, యింకా ఒంటరిగానే ఉన్న సందీప్ కళ్ళల్లో ఎరుపు జీర స్పష్టంగా కనిపించింది ఫ్రెండ్స్ అందరికీ.
“ఇప్పటికి కూడా సందీప్ కి తనంటే ఇష్టమని తెలుస్తూనే ఉంది. సందీప్ దీప్తిని యాక్సెప్ట్ చేస్తే తాను ఒక్కఅడుగు ముందుకు వెయ్యలేదా?” తనను తానే ప్రశ్నించుకుంది సుహాసిని. అవుననే సమాధానమే వచ్చింది. “అవును. నిజంగా రేపు నాదే” ఆనందంలో తేలిపోయింది సుహాసిని మనసు. సుహాసిని ఆనందాన్ని భరించలేని కార్తీక్ పెద్దపెద్ద అంగలు వేసుకుంటూ కోపంతో సుహాసిని జీవితం నుండి బయటకు వెళ్లిపోయాడు.
– డా.మజ్జి భారతి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
“రేపు నాది”(కథ) – డా.మజ్జి భారతి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>