రైతు బజార్ (కథ )- ముక్కమల్ల ధరిత్రీ దేవి
ఉదయం టిఫిన్ చేద్దామనుకుంటూ ఫ్రిడ్జ్ తెరిచింది సమీర. దాదాపు అంతా ఖాళీగా దర్శనమిచ్చింది. అరె! కూరగాయలు తెచ్చుకుని పది రోజులు దాటినట్టుంది.. ఈరోజుకు ఓకే, రేపు ఉదయం రైతు బజారుకు వెళ్లాల్సిందే,తప్పదు… అనుకుంటూ కాసిన్ని పచ్చిమిర్చి, సగం మిగిలిన క్యాబేజీ పట్టుకుని డైనింగ్ టేబుల్ వద్దకొచ్చి కూర్చుంది.
” సమీరా, “
పిలుపు విని వెనక్కి తిరిగి చూసింది సమీర. వరండాలో ఓ చేతిలో రెండు టమోటాలు, రెండు ఉల్లిగడ్డలు పట్టుకొని కనిపించింది మీనాక్షి.
” నాలుగు పచ్చిమిరపకాయలుంటే ఇవ్వవా, అన్నీ అయిపోయాయి. సరోజిని దగ్గరా లేవట, ఇవిగో ఇవి మాత్రం ఇచ్చింది..” అంటూ చేయి ముందుకు చాపి చూపించింది.
” అయ్యో, అక్కా, నా పరిస్థితీ అదే.. రా లోపలికి”
అంటూ పిలిచి ఉన్న వాటిలో నాలుగైదు పచ్చిమిరపకాయలు ఫ్రిడ్జ్ లో నుంచి తీసి మీనాక్షి చేతిలో పెట్టింది.
” ఔనౌను.. రేపు ముగ్గురం రైతు బజారుకెళ్దాం, పదింటికంతా రెడీగా ఉండు.. “
అనేసి గబగబా వెళ్ళిపోయింది. సమీరకు పెళ్లయి మూడు నెలలయ్యింది. పట్నవాసం అమ్మాయి. పల్లెటూరి మొహం ఎరగదు. ఇక పంటలు, పొలాల గురించి ఎలా తెలుస్తుంది! భర్తకేమో తీరిక ఉండదు. ఉదయం వెళ్తే రాత్రి ఏడింటికే తిరిగి ఇల్లు చేరడం! ఇక తప్పనిసరై, సమీరే అన్నీ తెచ్చుకోవాల్సి వస్తోంది. బొత్తిగా అలవాటు లేని పనులు.. పుట్టింట్లో అయితే అన్నీ తన ప్రమేయం లేకుండా సమకూరిపోతూ ఉండేవి. ఇప్పుడిప్పుడే అన్నింటికీ అలవాటుపడుతూ ఉంది . కానీ మొదట్లో ఏది ఎలా కొనాలో అస్సలు తెలిసేది కాదు ఆ అమ్మాయికి. ఇరుగుపొరుగు వాళ్ళు కాస్త పరిచయమయ్యాక నెమ్మదిగా వాళ్లతో కలిసి రెండు మూడు సార్లు రైతు బజారుకు వెళ్లడం, అక్కడ ధరలు, బేరసారాలు చేయడం.. వాళ్లను చూసి గ్రహించుకోవడం నేర్చుకుంది.
కొత్తలో అయితే ఆ ఘాటుకు అక్కడ చాలా ఇబ్బంది పడేది. క్రమంగా కాస్త ఆ వాతావరణం అలవడుతూ ఉంది సమీరకు తప్పదన్నట్లు…
** ** **
” ఏంటన్నా, మరీ అంత చెప్తున్నావు.. తినాలా వద్దా..!”
మరుసటి రోజు రైతు బజారులో వంకాయలు బేరమాడుతూ,అమ్మే అతన్ని దబాయించింది మీనాక్షి .
“ఆ.. మరీ చెప్తున్నావ్ లేవయ్యా.. కిలో ఇరవైకి ఇవ్వు..”
పక్కనే ఉన్న సరోజిని వంత పాడింది. వాళ్లను అనుసరిస్తూ వెనక నిలబడ్డ సమీర నోరెళ్లబెట్టింది వాళ్ల వాగ్ధాటికి ..! సగానికి సగం తగ్గించి వాళ్ళు అలా అడుగుతుంటే.. అయ్యో,పాపం గదా.. అనిపించి కాస్త పక్కకి వెళ్ళాక అదే అడిగింది వాళ్లని.
” పది అంటే ముప్పై చేసి చెప్తారు సమీరా వాళ్ళు.. ఎలాగూ మనం సగానికి సగం తగ్గిస్తామని వాళ్లకూ తెలుసు.. “
నవ్వుతూ అన్నారు ఇద్దరూ సమీరతో. నిజమే సుమీ అనిపించింది సమీరకు, కారణం.. అతను వాళ్ళు అడిగినట్లు కిలో నలభై చెప్పి ఇరవైకి ఇచ్చేశాడు. ఔరా అనుకుంది సమీర. ఇలా జరగడం… సమీర ఔరా అనుకోవడం.. మొదటిసారేమీ కాదు.. ఇక్కడికొచ్చిన ప్రతిసారీ ఇదే తంతు !! మొదట్లో ఉండబట్టలేక ఓసారి అడిగేసింది కూడా..
” అక్కా, ఏంటక్కా పాపం.. ఎంత కష్టపడి పండిస్తారో కదా..! వీళ్ళు పల్లెటూర్ల నుండి తీసుకొచ్చి, ఎండనక, వాననక.. రోజంతా ఇలా ఇక్కడ పడిగాపులు పడుతూ కూర్చుంటూ ఉంటారు.. పొట్టకూటి కోసం.. వాళ్లకూ గిట్టుబాటు కావాలి కదా..! మనం అర్థం చేసుకోకుండా మరీ ఇలా… “
“.. చాల్లేవమ్మా..భలే చెప్పొచ్చావు.. వాళ్లు ఏ లాభాలు లేకుండా అమ్ముతారనుకున్నావా..! నిన్న మిగిలిపోయినవీ, పాడైపోయినవీ.. అన్నీ కలిపేస్తూ మనల్ని ఎంత మోసం చేస్తుంటారో! నీకు కొత్త కాబట్టి.. అలా అయ్యో పాపం అనిపిస్తుంది..”
ఠక్కున సమీర నోరు మూయించేశారు ఇద్దరూ. అంతటితో, ఇక ఎప్పుడూ వాళ్లతో వాదించే సాహసం చేయలేదు సమీర. కానీ తెలివైన అమ్మాయి కాబట్టి, కొద్ది రోజుల్లోనే పల్లె జనాల గురించి, వాళ్ల కష్టం గురించి ఆమెకు అవగాహన కలిగింది.
తర్వాత కదిలి, బెండకాయలు,బీరకాయలు, చిక్కుళ్ళు.. అలా ఐదారు రకాలు రాశులుగా పోసుకుని అమ్ముతున్న అతని దగ్గర నిలబడ్డారు. మళ్లీ మొదలు..! అతనేమో కొనే బేరమేనా.. అన్నట్టు ఇద్దరినీ ఎగాదిగా చూడ్డం! ఆఖరికి బేరం ఆడి ఆడి..ఏవో కొన్నాం అనేసి..అతనికి పిచ్చెక్కించి ముందుకు సాగారు, ఆకుకూరల కోసం.
” ఏమిటీ, కట్ట అయిదు రూపాయలా! పదక్కా, నాలుగు తొట్లు కొనుక్కొని నాలుగు రకాలు వేసుకుందాం..ఇంట్లోనే ఫ్రెష్ గా కోసుకోవచ్చు.. “
విసురుగా కదిలింది మీనాక్షి.
” సరే సరేమ్మా, వేసుకోండి.. తెలుస్తుంది..!”
అందామె మూతి తిప్పుతూ అంతకంటే విసురుగా..
అలా అలా మొత్తం అటూ ఇటూ మరో ముప్పావు గంట తిరిగేసి రెండు సంచుల నిండా నింపేసుకుని, రెండు చేతుల్తో పట్టుకుని భారంగా కదులుతూ బయటకు వచ్చారు ముగ్గురూ. బయట ఓ పక్కగా మల్లెపూలు, గులాబీలు, బంతిపూలు అమ్ముతున్నారు కొందరు ఆడవాళ్లు. మీనాక్షి, సరోజినీల కాళ్లు అసంకల్పితంగా ఆగిపోయాయి.
” మూర ఎంతమ్మా? “
సరోజిని అడిగింది.
” నలభై “
మరొకరికి కొలిచిస్తూ ఇటువైపు చూడకుండానే బదులిచ్చింది ఆవిడ.
” ఏమిటి,నలభైయ్యే!! ఇరవైకి ఇస్తావా.. “
మీనాక్షి అలవాటు ప్రకారం అడిగింది. ఎన్నడైనా కొన్నావా తల్లీ.. అన్నట్టు ఎగాదిగా చూసిందామె. ఆ చూపుకు తల పక్కకు తిప్పేసి, సరోజినీ వైపు చూసింది మీనాక్షి ఏం చేద్దాం అన్నట్టు…
” సరే సర్లే.. మూర పాతిక చేసుకుని చెరో రెండు మూరలివ్వు.. “
కాస్త తగ్గుతూ, సర్దుబాటు ధోరణిలో అడిగింది సరోజిని.
” ముప్పై అయిదుకు పైసా తగ్గేది లేదు. అసలు పూలు రావడమే లేదమ్మా, ఈ నెల దాటితే పూత ఆగిపోతుంది.. “
కరాఖండిగా చెప్పేసిందావిడ, ముత్తయిదువ పూలకోసం ఇంత బేరాలేంటి అన్నట్లు వాళ్ళవైపు అదోలా చూస్తూ…
ఆడవాళ్లు కదా, పూల మీద మోజు చంపుకోలేక చెరోమూర కొనుక్కున్నారు చేసేదేమీలేక. సమీర కొన్ని బంతిపూలు, గులాబీలు విడిపూలు కొనుక్కుంది ఏ బేరసారాల జోలికి పోకుండా..
ఎందుకో ఈమధ్య సమీరకు ఈ రైతుబజారుకు వచ్చినప్పుడంతా అక్కడ కూరగాయలు, ఆకు కూరలు..ఇదిగో..ఇలా పూలు.. అమ్ముకునే వాళ్ళని చూస్తే బాధగా అనిపిస్తూ ఉంటోంది. అసలివన్నీ ఇక్కడిదాకా ఎలా వస్తున్నాయి? ఎలా పండిస్తుంటారు!? పొలం బాగుచేయడం.. విత్తనాలు నాటడం.. వాటిని పెంచి పోషించడం.. కోయడం..ఆకుకూరలైతే కట్టలు కట్టడం..ఆపై ఇక్కడిదాకా తీసుకురావడం!! అవి పాడైపోకుండా కాపాడుకోవడం.. పైగా..ఇవన్నీ నిలువ ఉండేవి కావాయే!! ఇంత కష్టం, శ్రమ..కొనేవాళ్లు ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రవర్తించడం!! సున్నితమనస్కురాలేమో.. సమీరకు మీనాక్షి, సరోజినీల మీద కోపం కూడా వస్తోందీమధ్య.. కానీ ఏం చేయగలదు !?
పూలుకొన్నాక, ఆటో ఎక్కబోతూ మీనాక్షి చిన్నగా కేకేసింది.
“అక్కా, కాస్త ఆగు..”
అంటూ నాలుగడుగుల దూరంలో ఉన్న ఫాన్సీ షాప్ లోకి దూరింది. తన వెంటే సరోజిని! చేసేదేమీ లేక సమీర కూడా వెనకే నడిచింది,సంచుల బరువు మోయలేక మోస్తూ..అక్కడ పౌడర్లు, స్నోలు, క్లిప్పులు,స్టిక్కర్లు, లిప్స్టిక్కులు.. అలా నానా రకాలూ ధర గురించి ఆలోచించక టప టపా కొనేసి వందల్లో అయిన బిల్లు చెల్లించి బయట పడ్డా రిద్దరూ. అంతసేపూ చెమట్లు తుడుచుకుంటూ షాపు బయట నిరీక్షిస్తూ ఉండిపోయింది సమీర.
మొదట్లో రైతు బజారుకు బయలుదేరినప్పుడల్లా తననూ ఆప్యాయంగా పిలుస్తోంటే.. ఆహా ! నేనంటే వీళ్ళకెంత ఇష్టం…ఎంత ప్రేమ!అనుకునేది. తర్వాత్తర్వాత తెలిసొచ్చింది..ముగ్గురయితే ఆటో ఖర్చు షేర్ చేసుకోవచ్చన్న ఆలోచనతో అలా పిలుస్తున్నారని !! తెలుసుకుంది కానీ, కచ్చితంగా రాను అని చెప్పలేకపోతోందిప్పుడు..కారణం.. తనకూ ఓ విధంగా అవసరమే అనిపించడమే! కానీ ఈ మధ్య వీళ్ళ ధోరణి తనకి ఇబ్బందిగానూ అనిపిస్తోంది. ముఖ్యంగా కూరగాయలమ్మే వారిని చూస్తుంటే.. అసలు వాళ్లే లేకుంటే మనకు ఎలా?అన్న ఆలోచన వచ్చి సమీర ఓ క్షణం స్తంభించిపోయింది. ఏమైతేనేం.. మరో అరగంటకు ఎవరిళ్లలో వాళ్ళు వచ్చి పడ్డారు ముగ్గురూ.
** ** **
ఊహించని ఉత్పాతం వచ్చి పడింది. ఊరు వాడ, టౌన్, సిటీ..ఎక్కడా..ఎక్కడా.. కూరగాయలన్నమాట లేదు!! ఆకుకూరల ఊసు అసలే లేదు! ఎంత డబ్బు పోసి కొందామన్నా.. అసలు ఉంటే కదా!! ఏ ఇంట్లో చూసినా, కనీసం కరివేపాకు జాడ కూడా కనిపించడం లేదు. కారణం!! సమ్మె..! రైతుల సమ్మె!! మేము కూరగాయలు, ఆకుకూరలు పండించం. ఆ మాటకొస్తే అసలు వ్యవసాయమే వదిలేస్తున్నాం అంటూ ధర్నాలు! నిరసనలు!!
వారం దాటింది. రెండు వారాలు.. నెల కూడా గడిచిపోయింది. పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదు. ఇళ్ళల్లో చూస్తే బియ్యం కూడా నిండుకోబోతున్నాయి. రోజూ అన్నమైనా వండుకుని, అందులోకి కాస్త ఏ ఆవకాయో, కారప్పొడో కలుపుకొని తినేవారంతా. ఇక ఆ కాస్త బియ్యం కూడా అయిపోతే!! ఏం తినాలిరా దేవుడా! తలలు పట్టుకుంటున్నారు జనాలంతా..
” సమీరా, నాలుగు పచ్చిమిరపకాయలు, రెండు టమాటాలు ఉంటే ఇవ్వవా, సమ్మె అయిపోగానే కొని ఇచ్చేస్తా… “
వంట ఏమి చేయాలో తోచక మునగదీసుకుని పడుకున్న సమీర మీనాక్షి గొంతు వినపడి దిగ్గున లేచి, బయటికి వచ్చింది.
” ఏమిటక్కా, తెలీనట్టడుగుతున్నావ్.. నా దగ్గర మాత్రం ఎక్కడివి?.. “
వరండాలో నిలుచున్న మీనాక్షి దీనంగా దిక్కులు చూసింది. ఎదురింటిలో గేటు దగ్గర నిలబడి ఉన్న సరోజినీ కంటబడింది.
ఓరి దేవుడా! చేతినిండా డబ్బులున్నాయి. కొందామంటే.. ఏవీ! ఎక్కడ, కూరగాయలు! సరుకులు! తలలు బాదుకున్నారు ముగ్గురూ. తామే కాదు..వీధి వీధంతా ఇదే గోల! అందరి నోట ఇదే మాట!! ఎక్కడ? ఎక్కడ? కూరగాయలు అమ్మే వాళ్ళు, ఏరీ, ఎక్కడ? రైతు బజార్ పూర్తిగా మూతబడిపోయింది. వీధుల్లో ఎవరూ అమ్మడం లేదు. అసలు రైతులు పండిస్తే కద, ఎవరైనా రావడానికి!!
మీనాక్షికి, సరోజినికీ ఏదో ఫ్లాష్ వెలిగింది.. కూరగాయలమ్మే వాళ్ళతో తాము, తమలాంటి మరెందరో గీసి గీసి బేరాలాడడాలూ, వాళ్ళ కష్టాన్ని, శ్రమనూ గుర్తించకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించడాలూ..అన్నీ సినిమా రీళ్ళలాగా కళ్ల ముందు కదలాడాయి. బాబోయ్!!మేం చేసిన పాపమా, ఇది!అనుకుంటూ లెంపలు వేసుకుంటూ గోడ వైపు చూస్తే..అక్కడ..అన్నదాత క్యాలెండర్ !అందులోంచి రైతన్న నవ్వుతూ, వరి కంకులు పట్టుకుని, చూశారా, నా తడాఖా !! నేను లేకుంటే మీకు బువ్వ అన్నదే ఉండదు, తెలిసొచ్చిందా ఇప్పటికైనా!ఎంత లోకువగా చూస్తారు మమ్మల్ని!ఉదయం లేచిందగ్గర్నుండీ రాత్రి భోజనం దాకా మేం పండించినవే కదా మీరు తిని బతుకు తున్నది..మేం లేకుంటే అవన్నీ మీ కంచాల్లోకి రాగలవా!? మీరు తిండి అన్నది తినగలరా!!
క్యాలెండర్లోంచి రైతన్న నిలదీస్తూన్నట్లనిపించింది
వాళ్ళకి.
మీనాక్షి,సరోజిని మళ్లీ మళ్లీ చెంపలు వాయించుకున్నారు బుద్ధొచ్చింది అన్నట్లుగా.
అంతటితో ఆగక, ఇద్దరూ రెండు చేతులు ఎత్తి “రైతన్న జిందాబాద్, రైతన్న జిందాబాద్.. జై కిసాన్” అంటూ గట్టిగా అరుస్తూ జై కొట్టారు. ఆ అరుపులకు ఉలిక్కిపడి, దిగ్గున లేచింది సమీర. గోడ గడియారం తెల్లారు జాము ఐదు గంటలు చూపిస్తోంది. కళ్ళు నులుముకుని, చుట్టూ చూసింది.. తన ఇంట్లో బెడ్ మీద తను!
“‘మై గాడ్’ ఇదంతా కలా! బాపు రే! ఎంత భయమేసింది!!”
ఒక క్షణం పాటు అంతా నెమరేసుకుంది కలలోని విషయమంతా సమీర. అప్రయత్నంగా చేతులు గుండెల మీదకెళ్లాయి.
ఓహ్ !! నిన్న రైతు బజార్ నుంచి వచ్చాక, అక్కడ జరిగిందంతా పదే పదే రోజంతా నెమరు వేసుకుంటూ..అవే ఆలోచనలతో నిద్రపోయింది. దాని ఫలితం అన్నమాట ఈ కల !!
నిజమే ! రైతు లేకపోతే, అతనే పంటలు పండించకపోతే మెతుకు అన్నదే జనాలకు ఉండదు కదా ! మీనాక్షి, సరోజినీ లాంటివాళ్ళకి గట్టిగా తెలియచెప్పాలి.. అనవసరమైన వాటికి వందలు వేలు తగలెడతాము.. నిత్యావసరాల వద్ద గీసి గీసి బేరాలాడతాము. రైతన్నల్ని ప్రోత్సహించాలి. వాళ్ల కష్టాన్ని గుర్తించాలి. రైతు బజార్ కు రెగ్యులర్ గా వెళ్తాము కానీ, అక్కడికి అవన్నీ ఎలా వస్తున్నాయి.. ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఆ వెనుక ఎంత కష్టం, ఎంత శ్రమ దాగున్నాయి.. దీనికంతా మూల కారకులు ఎవరు .. రైతన్నలే కదా అన్న సత్యం వివరించాలి. అలాగే తన కలను కూడా చెప్పాలి… అనుకుంటూ మంచం దిగింది. కానీ సమీరకు తెలియని విషయం, ఆమె ఊహకు అందనిదీ ఒకటుంది. అదేమంటే.. మీనాక్షి, సరోజినీలాంటి వాళ్లకు ఎంత చెప్పినా చెవికి ఎక్కదనీ, చెవిటి వాళ్ళ ముందు శంఖం ఊదినట్టే అనీ..వాళ్ల ధోరణి మారదనీ…!
ఇంకా లోకం పోకడ ఎరగని సమీర మరేమీ పట్టించుకోకుండా కలలో వినిపించిన
” రైతన్న జిందాబాద్ ” అన్న నినాదం మననం చేసుకుంటూ వంటింట్లోకి నడిచింది.
— ముక్కమల్ల ధరిత్రీ దేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
రైతు బజార్ (కథ )- ముక్కమల్ల ధరిత్రీ దేవి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>