లోకం తీరు(కథ) – డా.మజ్జి భారతి

“నాకు తెలుసొదినా! ఎప్పుడో ఒకప్పుడు సుమ పెద్ద ఆఫీసరవుతుందని!”
“దిష్టి తగులుతుందని నేనెప్పుడూ చెప్పలేదు గాని, నాకు ముందునుండీ తెలుసు సుమ అదృష్టవంతురాలని”
“ఆ పాడు సంబంధం చేసుకుంటే, సుమ ఎలా ఉండేదో? ఆ సంబంధం తప్పిపోయింది కాబట్టే, చక్కగా పెద్ద ఆఫీసరయింది.”
“మన సుమ అదృష్టజాతకురాలు. ఆ సంబంధం తప్పిపోయినప్పుడే నేననుకున్నాను, సుమ అదృష్టవంతురాలని. “
“మరేనమ్మా! సుమను చేసుకోవాలంటే పెట్టి పుట్టి ఉండాలి. చిన్నప్పటి నుండీ చూస్తున్నాం కదా! ఆ వినయం, విధేయత ఎంతమంది కుంటుంది? ఇలాంటి వాళ్లను చేసుకోవాలంటే అదృష్టముండొద్దూ!
“నేనెప్పుడూ మా ఇంట్లో సుమ గురించే చెప్తుంటాను, బాగా చదువుకుంటుందని”
ఇలా ఇంటికొచ్చిన బంధువులంతా పొగుడుతుంటే నాకు ఆశ్చర్యంతో పాటు నవ్వు కూడా వస్తుంది. మనుషులింత తొందరగా ఎలా మారిపోగలరని?
ఒకప్పుడు వీళ్లే దురదృష్టవంతురాలినని నా గురించి చెప్పుకున్నారు. ఇప్పుడు నేను గ్రూపు 1 ఆఫీసరుగా సెలెక్టవగానే, ఇప్పటివరకు దురదృష్టవంతురాలిగా ఉన్న నేను, అదృష్టవంతురాలిని అయిపోయాను.
సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం వాళ్లన్న ప్రతీమాటా నా మనసులో రికార్డైపోయింది. గతంలోకి జారుకుంది నా మనసు…
“బాధపడకొదినా! పీటలవరకూ వచ్చిన పెళ్లి ఆగిపోయిందంటే మన దురదృష్టమది. ఏం చేస్తాం? మనకింతే రాసిపెట్టి ఉంది.”
“పీటలవరకు వచ్చిన పెళ్లాగిపోయిందంటే మరలా పెళ్లవుతుందా? దీనదృష్టం ఎలా ఉందో మరి?
“నాకప్పుడు నుండి అనుమానంగానే ఉండేది. ఈ పెళ్లవుతుందా లేదా అని? వాళ్ళెక్కడ? మనమెక్కడ?
“చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుంది. పోనీ మంచి సంబంధం కుదిరింది, మంచి రోజులు వచ్చాయనుకున్నాం. ఎంత దురదృష్టవంతురాలు కాకపోతే, ఇంతవరకూ దుక్కలా ఉన్న పెళ్ళికొడుకు నాన్నమ్మ ఇప్పుడే చనిపోవాలా! వాళ్ళకు మాత్రం భయమెయ్యదా! పెళ్ళికి ముందే ఇలా అయింది. ఇంక పెళ్ళయ్యాక ఇంకెన్ని జరుగుతాయోనని?” అని వచ్చిన చుట్టాలందరూ, వాళ్ళల్లో వాళ్ళే చెవులు కొరుక్కునేవారు.
ఇలా రక రకాల వ్యాఖ్యలు, వారం రోజుల నుండి వినీ, వినీ, నామీద నాకే అనుమానం వచ్చేస్తుంది నేను దురదృష్టవంతురాలినేమోనని.
అలాంటి టైములో, పెళ్ళి ఆగిపోయిన విషయం తెలిసి, వేరే రాష్ట్రంలో ఉన్న, అమ్మ చిన్నప్పటి ఫ్రెండ్ సుజాత ఆంటి మా ఇంటికొచ్చారు.
“దురదృష్టం మమ్మల్నెలా వెంటాడుతుందో చూడు! దీనికే ముద్దుముచ్చట్లు జరగకుండానే ఆయన పోయారు. ఏ ప్రయత్నం చెయ్యకుండానే మంచి సంబంధమొస్తే, పోనీలే దేవుడేదో మేలు చేశాడు, ఆయనను తీసుకుపోయినా, అని మనసు కుదుట పరుచుకుని పెళ్లిఏర్పాట్లు చేస్తూ ఉంటే, ఇలా జరిగింది. అందరూ చెప్పినట్లు మేం దురదృష్టవంతులమే! పీటలవరకు వచ్చిన పెళ్లాగిపోతే దీనినెవరు పెళ్లి చేసుకుంటారని” ఆంటీని పట్టుకొని భోరున ఏడ్చిందమ్మ.
“విజయా! నీకేమన్నా పిచ్చా! వెర్రా! చక్కగా చదువుకుంటున్న పిల్లని వాళ్లెవరో అడిగారని చదువు మాన్పించి పెళ్లి చెయ్యబోయావు. ఇంకా నయం. సుమ అదృష్టవంతురాలు కాబట్టి పెళ్లి తప్పింది. లేకపోతే పెళ్లయ్యాక ఎన్ని ఆరళ్ళు పెట్టేవారో! చూడు ఒక నెలే కాలేజ్ పోయింది. సుమ తెలివైంది కాబట్టి, ఒక నెల కష్టపడి చదివితే, డిగ్రీ మంచి మార్కులతో పాసై, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో మంచి జాబ్ తెచ్చుకుంటుంది. నువ్వలా చూస్తూ ఉండు. నేను చెప్తున్నాను కదా! లేచి ముఖం కడుక్కో. నువ్వే ఇలా ఉంటే సుమ ఏమై పోతుందని?” అమ్మను దెబ్బలాడి స్వాంతన పరిచారు ఆంటి.
“ఇంతవరకూ వచ్చాక పెళ్లాగిపోయిందంటే ఈ పెళ్ళి జరగడం దేవుడికెందుకో ఇష్టం లేనట్లుంది. సుమకు ఇంకా ఏదో మంచిదే రాసిపెట్టి ఉంటుంది. చక్కగా చదువుకునే పిల్లని చదివించకుండా పెళ్లిపేరుతో చదువు ఆపించేసావు. చక్కగా చదివించు. ఏ పెద్ద ఆఫీసరో అవుతుంది దర్జాగా. అప్పుడు సంబంధాలు అవే వెతుక్కుంటూ వస్తాయి, మీ పిల్లను మాకివ్వండంటూ. అర్థమవుతుందా? ఇంకా నయం, ముందే తెలిసింది వాళ్ళ వ్యవహారం. పండుటాకు రాలిపోకుండా ఉంటుందా? ఈ విషయం నీకింకా అర్థం కాకపోతే ఎలా! అబ్బాయి ఇష్టపడ్డాడని బలవంతంగా పెళ్లికొప్పుకున్నారు. ఏ కారణం చేత ఈ పెళ్లి ఆపుదామా అని చూస్తూ ఉండుంటారు. కారణం దొరికింది. అంతే! రేపు పెళ్లైనా అమ్మాయిని సరిగ్గా చూసుకుంటారని నమ్మకం లేదు. దానదృష్టం బాగుండి పెళ్లి జరగకుండానే వాళ్ల బుద్ధి బయటపడింది. ఎంత అదృష్టవంతురాలు సుమ?” అమ్మను కూచోబెట్టి నెమ్మది నెమ్మదిగా చెబుతున్నారు ఆంటి.
పక్క గదిలోనుండి ఈ మాటలు వింటుంటే మొదటిసారి ఒక ఆలంబన దొరికినట్లయింది నాకు. మనసులోనే ఆంటీకి థాంక్స్ చెప్పుకున్నా.
ఈ పెళ్లాగిపోయిన నుండి… కారణం, యెనబై యేళ్ళ వృద్ధురాలు, పెళ్ళికొడుకు నాన్నమ్మ చనిపోతే, నా పాదం మంచిది కాదు, అడుగుపెట్టక ముందే పెళ్ళికొడుకు నాన్నమ్మ చనిపోయింది. ఈ పెళ్లి జరిగితే ఇంకా ఎన్ని అరిష్టాలు జరుగుతాయో అని పెళ్లికొడుకు తరపువారు పెళ్లి కేన్సిల్ చేయించారు. కార్డులు వేసాక పెళ్లాగిపోతే పెళ్లికి రావలసిన బంధువులంతా వచ్చి ఇదిగో… ఇలా. “పీటలమీది పెళ్లాగిపోయాక సుమకింకా పెళ్లవుతుందా! నాకు అనుమానమే” అంటూ మాటలతో మా మనసుల్ని చిత్రవధ చేశారు.
నాకైతే పెళ్ళి కుదిరిందన్న సంతోషమూ లేదు, పెళ్లి ఆగిపోయిందన్న బాధా లేదు.
కాలేజ్ టాపర్ ని. బాగా చదివి, మంచి ఉద్యోగం సంపాదించుకున్నాక, పెళ్ళి చేసుకోవాలని నా కోరిక. ఎవరి పెళ్లిలోనో నన్ను చూసిన అబ్బాయి, నన్నిష్టపడి, పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులను ఒప్పించి పంపించాడు. గాని, వాళ్లకు మొదటి నుండీ ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎప్పుడొచ్చినా “వాళ్ల మనసెంత గొప్పదో! కాబట్టే నాకు తండ్రి లేకపోయినా, మా అంతస్థు తక్కువైనా, పెట్టుపోతలవీ సరిగ్గా జరగవని తెలిసినా, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నారో! ఇలా కనిపించిన అందరితోనూ చెప్పడమే. చెప్పొద్దూ! వాళ్ళ మాటలు విన్నప్పుడల్లా నా ఫ్యూచర్ గురించి నాకు భయమేసేది.
వచ్చినందరూ నేను దురదృష్టవంతురాలిని కాబట్టే, ఈ సంబంధం తప్పిపోయిందన్న వాళ్ళే. ఒక్కరు కూడా నేను అదృష్టవంతురాలిని కాబట్టే, ఈ సంబంధం తప్పిపోయిందనలేదు. ఒక్క సుజాత ఆంటీ తప్పించి. ఆమె వచ్చాక నా మనసులో ముసురుకున్న మబ్బులు విడినట్లయింది.
పోనీలే జరిగిందేదో జరిగిపోయింది. పెళ్లవుతుంది, ఇంకా చదువెందుకని, కాలేజీకి వెళ్లనివ్వలేదు. ఒక నెల కాలేజీ పోయింది. పరీక్షలు రెండు నెలల్లో ఉన్నాయి. కష్టపడి చదివితే మంచి ర్యాంకుతో పాసవ్వొచ్చు. ఆ తరువాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉండనే ఉన్నాయి. చక్కగా ప్రిపేరై మంచి ఉద్యోగం తెచ్చుకోవడం ఇప్పుడు తన ముందున్న లక్ష్యం. నేనేం చెయ్యాలో నాకర్థమైంది! ఈ ఆలోచన రాగానే గబ,గబా రూం నుండి బయటికొచ్చి “అమ్మా! నాకు కాలేజీకి టైమవుతుంది. నేను వెళ్తానని,” అమ్మతో చెప్పాను.
అమ్మ ఆశ్చర్యంగా చూస్తుంటే, సుజాత ఆంటీ మాత్రం నవ్వుకుంటూ “చూసావా! నేను చెప్పానా! సుమకి చదువంటే ప్రాణం. ఇంకా ఎన్ని ఎత్తులకు ఎదగాలో తను! సుమ పెద్ద ఆఫీసర్ కాకపోతే అప్పుడు నన్నడుగు,” అని నన్ను దగ్గరకు తీసుకున్నారు ఆంటీ.
అంతవరకు అందరి మాటలతో బాధపడుతూ, దైన్యమంతా మూర్తిభవించినట్లున్న అమ్మ, కళ్ళు తుడుచుకుని లేచింది. “టిఫిన్ తినేసి కాలేజీకెళ్లిపో” అని చెప్పింది.
గట్టిగా చెప్పాలంటే సుజాత ఆంటీయే ప్రస్తుత నా విజయానికి కారణం. నేనేదో సాధించడానికే కుదిరిన నా పెళ్లి ఆగిపోయిందని ఆమె విశ్వసించారు. అదే విశ్వాసాన్ని నాలో పాదుకొల్పారు. మంచి మనసున్న ఆంటీ చెప్పిన మంచిమాట నాలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనే కోరికను పెంచింది. ఆ పైన మా అమ్మ ప్రోత్సాహం, పైన ఉన్న మా నాన్న దీవెనలు, నేను మంచి ర్యాంకు తెచ్చుకోవడానికి కారణమయ్యాయి.
ఇప్పుడు నన్ను ఇంత పొగుడుతున్న బంధువులెవరూ, ఈ నాలుగేళ్లల్లో ఒక్కరోజు కూడా, మేమెలా ఉన్నామో పట్టించుకున్న దాఖలాలు లేవు. మా దగ్గరకొస్తే మా దురదృష్టం వాళ్లకు అంటుకుంటుందేమోనని ఇటువైపు కన్నెత్తికూడా చూడలేదు. ఇప్పుడు నేను గ్రూపు 1 ఆఫీసరుగా సెలెక్టవ్వగానే, చూస్తున్నారుగా మీరే! నన్ను ఆకాశానికి ఎలా ఎత్తేస్తున్నారో!
ఎప్పుడు సంపద కలిగిన యప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్, దెప్పలుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరా సుమతీ! అని వందల యేళ్ల క్రితం బద్దెన వ్రాసిన ఈ పద్యం మానవ స్వభావాలను ఎలా చిత్రీకరించిందో గుర్తుకొచ్చి, లోకం తీరు ఇదే కదా! అనుకుంటూ తనలో తానే నవ్వుకుంది సుమ.

Comments
లోకం తీరు(కథ) – డా.మజ్జి భారతి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>