ఏ బడి నేర్పెనమ్మా..!!(కవిత (పాట))-ముక్కమల్ల ధరిత్రీ దేవి
జనని లేని జగతి..జనం ఊహకందునా…
అతివ లేక అవనికంటు అర్థమొకటి ఉండునా…
ఇలకు దిగిన ఆ దైవం మరో రూపు మగువ కదా..
తాను కరిగి కాంతులొసగు కర్పూరమె కాంత కదా
ఇంతులార ఇల వెలిసిన వేల్పులారా
వందనం..ఇదె మీకు అభివందనం గైకొనుమా //జనని//
గృహమే ఒక స్వర్గసీమ..
ఇల్లాలే సృష్టికర్త జగమెరిగిన నిజమేగా/ మగనికి తను
కుడి భుజమై నడిపించే నాయికగా..
బ్రతుకున సహభాగినియై పయనించే సహచరిగా..
తనయుల తగురీతిని తీర్చిదిద్దు మాతగా…
తన బాగు తను కోరని..నిరతం
తన వారల తలచు తరుణీమణి తానె కదా..
పలు పాత్రల పోషణతో అలరించే ప్రమదలార..
ఇంతులార..ఇల వెలిసిన వేల్పులారా
వందనం ఇదె మీకు అభివందనం గైకొనుమా…
//జనని//
అలనాటి ఝాన్సిరాణి..రుద్రమల ధీరత్వం…
ఇందిరమ్మ నాయకత్వ పటిమ సకలలోక విదితం
భారత కోకిల సరోజినీ కవితావల్లరి..
కమనీయమే! ఆది నుండి నేటిదాక తరచిచూడ
నెలతల కెదురేమున్నది ఈ భువి పైని..!
సబలలం మేమంటూ మాతో సరిమేమంటూ
మహిని చాటుతున్న మహిమాన్విత మహిళలార.
ఇంతులార ఇల వెలిసిన వేల్పులారా
వందనం ఇదె మీకు అభివందనం గైకొనుమా…
//జనని//
ఆ నింగికి ఉండునేమో హద్దులన్నవి…
‘అమ్మాయి’ని దాగిన ఓ ‘అమ్మా,’..
నీకంటూ ఏవమ్మా సరిహద్దులు !
అమ్మ చాటు పసికూన..
ఒకనాటి ఆ అల్లరిపిల్ల కుందనాలబొమ్మగా అయిపోయెనే…!
మూడుముళ్ళు పడగానే మగని మాయలో
పడిపోయెనది ఏమి వింతోయమ్మా !!
ఇంటి పేరు మారి..పుట్టింటిని మరిచి
ఆ ఇంట కూరుకుపోయెనే మైమరిచి..!
ఆ ఇంటిదీపమై ఆ కోవెల దేవతై
అంకితమై అలరారే భామినీ..ఓ భాగ్యశాలినీ…
//జనని//
ఇంతలో అంతలా ఎలావచ్చెనో..
అంతోటి పనితనం !! ఎలా వచ్చి చేరెనో..
మునుపెరుగని ఆ పెద్దరికం !
ఏ బడి నేర్పెనమ్మా ఆ లౌక్యమాలోకజ్ఞానం !!
ఏ గురువు నూరిపోసి తీర్చిదిద్దె నిన్నిట్లా కడుమేటిగ..!
ఆరిందావై..ఇల్లంతా నీవై…
ఇంటి బయట నీవై..అంతటా నీవై..సర్వమూ నీవై…
ధరణికి సరితూగు సులక్షణాల ధన్యజీవీ…
వందనం నీకిదే అభివందనం..గైకొనుమా…
ఇంతులార ఇల వెలిసిన వేల్పులారా
వందనం ఇదె మీకు అభివందనం గైకొనుమా…
//జనని//
-ముక్కమల్ల ధరిత్రీ దేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
ఏ బడి నేర్పెనమ్మా..!!(కవిత (పాట))-ముక్కమల్ల ధరిత్రీ దేవి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>