ఖబడ్డార్ (కవిత) – గిరి ప్రసాద్ చెలమల్లు

ఈ నేలలో పుట్టలేదు
ఈ నేల రాజు పిలవంగా
ఈ నేలలో అడుగుబెట్టినావు
నీవొక పెట్టుబడి విష పుత్రిక వి!
మా ఎర్రజెండోళ్లు ఎగిరి ఎగిరి పంచమనే ధనం నీ చెంత
ఆ ధనమెక్కడిది
మా రక్తమాంసాలు పిండి సంపాదించినావు
వ్యాపారం చేయమంటే దో మాల్ దందా నెరపుతున్నావు
హవాలా మూలాలు నీ బజార్ల నిండా
అయినా రాజ్యం నీకండా దండా
తెలంగాణ సంస్కృతిలో కలిసి
వ్యాపారం చేయమన్నాడు
నువ్వేమో కుదురుగా ఉన్నట్లు నటించి
దివాణంలో తిష్ట వేసి
అప్పనంగా భూములు కొట్టేసావ్
పశ్చిమం నుండి బెంగాల్ దాకా
అటునుండి మద్రాస్ దాకా
మదరాసీ అంటూ హేళన చేస్తూనే దక్షిణాన దోపిడీ కి తెరలు తీసారు
గిన్నె తపేలా
గొలుసు కడియం తాకట్టు పెట్టుకుని
మిత్తి మీద మిత్తి గట్టి
మావోడి ఇల్లూ జాగా కాజేసావు
మా బతుకమ్మలు నీవు ఆడవు
మా కోలాటాలు నీకు నచ్చవు
మీ దాండియా ను మా మీద రుద్దుతావ్
నీ ఇలాకాలో నీ భాషే మాట్లాడతావు
గణేష్ పండగలకు నీ పూజారులే
నీ భాషలోనే పాటలు హోరెత్తు
నీ ఆహార్యం మా వీధుల్లో చిర్రెత్తు
ఇది సాంస్కృతిక విధ్వంసం కాదా వలస జీవి!
నడి రోడ్డు మీద కారెట్టి
తీయమని హారన్ కొడితే
దాడి చేసి పొట్టు పొట్టు కొట్టే ధైర్యం
మమ్మల్ని కొల్లగొట్టి ఆర్జించిన ఆర్థిక బలమేగా!
నీవొచ్చిందే గాక
నీ ఖాన్ దాన్ మొత్తాన్ని వూరూరా దించేస్తున్నావ్
కల్తీ సరుకును అమ్ముతున్నావ్
అమ్యామ్యా వెదజల్లి బతుకుతున్నావ్
నీ కొట్లనిండా మీ వాళ్ళ ఉత్పత్తులే
నాసిరకం సరుకుతో పడగలెత్తుతున్నావ్
నీ దగ్గర పని చేసేటోడిని మనిషిగా కూడా చూడలేవు
శుభ కార్యాల్లో మీ జాతి తిన్నంకనే తినమంటావ్
ఎందుకు పిలుస్తావ్ రా! కించపర్చటానికే గా!
ఏళ్ళ కొద్ది వెట్టి చాకిరి చేసుకుని మీ వాడు రాగానే తరుముతావ్!
చాప కింద నీరులా నీవు పాకుతున్నావ్
పసిగట్టి నిన్ను తరమక పోతే మా నేలలో
మమ్మల్నే తరిమేస్తావ్
ఈ నేలన నీ పాదం కానరాకుండా చేసే మహోద్యమ నిర్మాణం అవశ్యం
– గిరి ప్రసాద్ చెలమల్లు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
ఖబడ్డార్ (కవిత) – గిరి ప్రసాద్ చెలమల్లు — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>