“గులకరాళ్ళ మీదుగా”(కవిత)-బాలాజీ పోతుల

చేయకూడని పనులన్నీ
నా జీవితమంతా చేశాను!
ఇప్పుడు చేయాల్సినవి చేయటానికి
జీవితమే లేకుండా పోయింది!
జీవితమంటే
అంత ఆషామాషీ వ్యవహారం కాదిక్కడ.
కొన్నేళ్లు పోతే
మన అన్ని వేళ్లూ పోయినట్టు విలపించాలి
తప్పదు!
ఇక్కడ జీవితమేమీ
గొడ్డు మాంసాన్ని
నీ విస్తార్లలో వడ్డించదు
నీకు నువ్వే వండుకుని
వడ్డించుకు తినాలి తప్ప
వడ్డెన కోసం చూస్తే
మిగిలేది ఒట్టి ఖాళీ కాలిన కడుపు తప్ప
ఇంకేం మిగలదు!
ఇక మిగిలించుకోవటానికి
జీవితం కూడా ఏమీ మిగిలిపోదు!
అంతా అయిపోయి
సంసిద్ధం కావాల్సిన సమయం
దగ్గర పడుతుంది.
నువ్వు రానని
ఎంత మొండికేసినా,
తేలిన సువ్వని
గులకరాళ్ళ మీదుగా
నిన్ను నగ్నంగానే ఈడ్చుకునిపోతుంది.
అప్పుడు నువ్వు
ఎంతలా రోదించినా
నిన్ను వెంటకు తిప్పుకు వచ్చేవాళ్లు
ఒక్కరూ కానరారు.
చేసేదేమీ లేక
కుక్కలా వెంటే వెళ్ళిపోతుంటావు
తర్వాత ఏమవుతావో
ఎక్కడుంటావో
నీకూ నాకూ మధ్యన
ఈ గీత తొలగిపోయి
ఎక్కడ పాతేయబడుతుందో
ఎవ్వరూ చెప్పలేరు
ఏమీ చేయలేరు
‘ఇక్కడ జీవితమంటే
నువ్వు రాకపోయినా
నిన్ను లాగేసుకొనే వరద’
అని మాత్రం మరువకు.
-బాలాజీ పోతుల
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
“గులకరాళ్ళ మీదుగా”(కవిత)-బాలాజీ పోతుల — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>