దశావతారం (కవిత) -జోసెఫ్.K.
నేనసలే అల్లసాని వారి లాంటి వాణ్ణి
“అల్లిక జిగి బిగి” లో కాదండోయ్
“నిరుపహతి స్థలంబు రమణీయ ప్రియదూతిక
తెచ్చి యిచ్చు కప్పురపు వీడెము” లాంటి
రాజ భోగాలు కాకపోయినా
కవికి కనీస అవసరాలు తీర్చక పోతే
కలం కదల్చక, విదల్చక, నాన్చడంలో
ఆయనకు వారసుణ్ణి !!!
నేనసలే ధూర్జటి లాంటి వాణ్ణి!
“అతులిత మాధురీ మహిమలో కాదండోయ్ !
రాజుల్మత్తులు వారి సేవ నరక ప్రాయమంటూ
వ్యవస్థ లోని అవస్థల్ని
సునిశితంగా,సుకుమారంగా
సవివరంగా,సామరస్యంగా
అన్యాపదేశంగా, అనామకంగా
అక్షర బద్ధం చేయడం లో
ఆయనకు వారసుడ్ని!!!
నేనసలే గిడుగు రామమూర్తి లాంటి వాణ్ణి!
సవర భాష నైఘంటికా నైపుణ్యంలో కాదండోయ్!
వ్రాయడం నుండి రాయడం వరకు
నన్ను నేను చిత్రికబట్టుకున్న
వ్యావహారిక భాషోద్యమ శ్రామిక వారసుడ్ని !!!
నేనసలే దేవులపల్లి కృష్ణశాస్త్రి లాంటి వాణ్ణి!
భావ కవిత్వ సార్వభౌమత్వంలో కాదండోయ్!
రాసేది ఏదైనా ఆకులో ఆకునై
పువ్వులో పువ్వునై
కొమ్మలో కొమ్మనై
నునులేత రెమ్మనై
కవితా ఊర్వశి ఒడిలో ఒదిగి పోవడంలో
ఆయనకు అనుంగు వారసుడ్నీ !!!
నేనసలే శ్రీ శ్రీ లాంటి వాణ్ణి!
అభ్యుదయ మద్యం తాగి
విప్లవ పద్యం రాయడంలో కాదండోయ్!
1930 వరకు తెలుగు కవిత్వం తనను నడిపిందనీ
ఇక నుండి తాను తెలుగు కవిత్వాన్ని నడిపిస్తానని
చాటిన
ధిషణహంకార శ్రామిక పక్షపాతికి వారసుడ్ని!!!
నేనసలే ఆరుద్ర లాంటి వాణ్ణి!
అంత్య ప్రాసలను ఆనంద తాండవం
చేయించడంలో కాదండోయ్!
తనను ఎవరైనా సూది మందు గొట్టంలోకెక్కించి
ఇంజక్షన్ ఇస్తే,నరాల్లో పడి ఈదుకుంటూ
“త్వమేవాహం”అంటూ
తెలుగు తల్లి గుండెల్లో చేరే
తెలుగు సాహితీ పరిశోధకునికి వారాలబ్బాయిని !!!
నేనసలే ఆత్రేయ లాంటి వాణ్ణి!
“నాటకాంతం హి సాహిత్యం ” అని చాటడంలో కాదండోయ్!
రాయకుండా నిర్మాతల్నీ
రాస్తూ తానూ
రాసిన తర్వాత ప్రేక్షకుల్ని ఏడిపించి
మెప్పులు పొందిన “కప్పలు” రాసిన
కిళాంబి నరసింహాచార్యుల దృశ్య కావ్య వీక్షకుడ్ని!!!
నేనసలే గుఱ్ఱం జాషువాని !
నను వరించిన శారద లేచిపోవునే అని చాటిన
ధిషణహంకారం లో కాదండోయ్!
సాహిత్య క్షేత్రంలో పద్యాన్ని హృద్యంగా సేద్యం చేసి
దళిత కవితా ఖాద్యాన్ని
కైలాసగిరి నాథునకు
వీనుల విందుగా రుచి చూపిన
కవిత్వపు టెకిమీడు కు వీరాభిమానిని!!!
నేనసలే సి నా రె ని!
విశ్వంభర విశ్వరూపావిష్కరణలో కాదండోయ్!
ఉఫ్ ఊపిరాడటం లేదు, ఉక్క పోస్తుంది !
ఆ… తెలిసిందిలే
ఈ రోజు కవిత్వం రాయలేదంటూ
జ్ఞానపీఠం పై, ధ్యానముద్ర వేసిన
చెకుముకి “లకుమకు” ఆరాధ్య ప్రేమికుడ్ని!!!
నేనసలు ఎవ్వరనుకున్నారో !
నేను నేనే!
కవిత్వాన్ని ప్రేమించి,ధ్యానించి
శ్వాసించి, భాషించి
భాసించాలని ఆశించే
అతి సామాన్య సాహితీ పిపాసిని!
మాములుగా వామనుడ్ని
కవిత్వంలో దశావతారుడ్ని!!!
-జోసెఫ్.K.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
దశావతారం (కవిత) -జోసెఫ్.K. — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>