దేవుడు ఎప్పుడో చచ్చిపోయాడు!”(కవిత) -బాలాజీ పోతుల

జీవితం భారమయ్యాక,
బతుకు పోరాటంలో
రోజూ యాతనే!
నిత్యం పనుల్లో నిమగ్నమయ్యాక,
కంటి ముందు జరిగేవన్నీ,
కళ్ళు లేని కబోదిలా లోకం చూసీ
చూడనట్టు సాగిపోతుంటే
నే గొంతెత్తి అరిచినప్పుడు,
అన్నీ పట్టించుకుంటున్నాడని
నాపై నిందలేస్తారా?
ఓ కళ్ళున్న కబోదులారా!
కాస్తంత దృష్టిని ఇటువైపు మరల్చండి!
మీ కల్లబొల్లి మాటలొద్దు!
మీ కర్మ సిద్ధాంతం పాఠాలొద్దు!
వినీ వినీ
మా చెవులు సీసం పోయబడ్డ,
మా తాతల తండ్రుల
చెవిటి చెవులయ్యాయి!
ఇంకాపండి!
దేవుడెప్పుడో చచ్చిపోయాడు!
కారంచేడు ఊచకోతలో
ఉరేసుకొని చచ్చాడు!
చుండూరు దహనకాండలో
దహించుకుపోయాడు!
ఇప్పటికీ దేశం నలుమూలల్లో
నేలరాలుతున్న నక్షత్రాలతో పాటు
తానూ నేలరాలుతున్నాడు!
అందుకే కిమ్మనకుండా
రాతి విగ్రహాల్లో ఉన్నానంటూ
డంబాలు పలుకుతున్నాడు!
నమ్మకండి!
అస్సలు నమ్మకండి!
ఎందుకంటే,
ఆ దేవుడు ఎప్పుడో చచ్చిపోయాడు!
మీరు ఒట్టి రాతిని పూజించి,
పిచ్చి పిచ్చిగా
రాత్రుళ్ళు మేల్కొనుండి
పాటలు పాడుతూ,
రమ్మని ఎంత పిలిచినా
రాడు గాక రాడు,
ఎందుకంటే,
దేవుడు ఎప్పుడో చచ్చిపోయాడు!
ఇప్పుడు మీరు చేసేదంతా,
అగ్నిలో ఆజ్యం పోసే
పనికిమాలిన హోమమే!
– బాలాజీ పోతుల
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
దేవుడు ఎప్పుడో చచ్చిపోయాడు!”(కవిత) -బాలాజీ పోతుల — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>