మరణం ఏదీ నీ చిరునామా (కవిత)- గిరి ప్రసాద్ చెలమల్లు

ఎన్ని తూటాలు పేలినా
ఎన్ని దేహాలకు తూట్లు పొడిచినా
ఆగదు భావజాలం!
అదో నిరంతర ప్రవాహం
అమృత ధార లా దూకుతుంది
చేపలా ఎదురెక్కుతుంది
అడవి బతికిందే ఆదివాసి చలువ
జంతు మచ్చిక ఆదివాసి కి
వెన్నతో పెట్టిన విద్య
గుట్టలు కొండలు తొలిచిన పెట్టుబడి
కన్ను అడవిపై పడింది
మనిషి బతుకు ను ఛిద్రం చేయగలిగితే
ఖనిజాల కొల్లగొట్టే తంత్రం!
మారేడుమిల్లి సతత హరితం
రుధిర ధారలు ఆకుల నిండా
వంగమూరు వంచించబడినందుకు
కన్నీటి పర్యంతం
గాండ్రించే పులులు మౌనం వహించి
హిడ్మా కి సంతాపం తెలుపుతున్నాయి
ఎన్ని వంకరలు
ఎన్ని మలుపులు
ఎన్ని ఎత్తు పల్లాలు మారేడుమిల్లి దారిలో
మార్క్సిజం గమ్యం చేరే మార్గంలో లాగే
తన నేలలో తానే చంపబడుతుంటే
పెగిలిన గొంతులు వెళ్ళిపోతున్నాయి
కూకూ రాగాల పక్షులు సైతం
విషాదంలో మునిగిపోయాయి
పూర్వతి లో మోగిన అంతిమయాత్ర
డప్పులు మేలుకొలుపు ధ్వనులు
జలజల రాలిన కన్నీరు
రేపటి మహోద్యమపు వెల్లువ
జలగం నుండి షా దాకా
కూలిపోతుందనుకునే భ్రమలో
నిటారుగా నిలబడి తన ఉనికిని
చాటుకునే శక్తి భావజాలానిది!!
– గిరి ప్రసాద్ చెలమల్లు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
మరణం ఏదీ నీ చిరునామా (కవిత)- గిరి ప్రసాద్ చెలమల్లు — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>