జ్ఞాపకం – 106 – అంగులూరి అంజనీదేవి
సంలేఖ మొబైల్ రింగయింది. స్క్రీన్ మీద జయంత్ నెంబర్ వుంది. ఆ నెంబర్ చూడగానే సంలేఖ గుండెలో చిన్న తొట్రుపాటు. ఆనందం, ఆత్మీయత కలబోసుకున్న మరింత చిన్న ఉలికిపాటు. చాలారోజుల తరువాత వస్తున్న ఫోన్ అది. ఇప్పుడు ఎంత ప్రేమతో, ఎంత లాలింపుతో పలుకుతుందో అతని గొంతు. వెంటనే వినాలని ఆశగా వుంది. ఏ స్త్రీకైనా కొన్నాళ్లు ఎడబాటు తరువాత భర్తతో కలయిక ఊహాతీతంగా అన్పిస్తుంది. మధురంగా అన్పిస్తుంది. అందుకే గండు తుమ్మెదలా జుమ్మనే ఆ గొంతు విని ఎన్నో యుగాలైనట్లు ఆత్రంగా మొబైల్ అందుకొని లిఫ్ట్ చేసింది. ఆమె నోరువిప్పి “హలో” అనే లోపలే అవతలవైపు నుండి జయంత్ “నిన్న భరద్వాజ మాష్టారు కలిశాడు. హైదరాబాదులో ఏదో పనివుండి వచ్చాడట. ఆయన చెప్పేంత వరకు తెలియదు నాకు. మీ నాన్నకు సమాధి కట్టిస్తున్నావట” అన్నాడు.
“అవును! కట్టిస్తున్నాను. పని మొత్తం దగ్గరుండి మొద్దు పోలయ్యనే చూసుకుంటున్నాడు. ఇంకెంతలెండి! ఆ పనికూడా అయిపోవచ్చింది. ఇది ముందుగా మీతో చెబితే మీరు ఒప్పుకోకపోవచ్చు. నా మనసు బాధ పడుతుంది. అలా అని మిమ్మల్ని నేను ఏమీ అనలేను. అంటే మీరు బాధపడతారు. అందుకే చెప్పలేదు” అంది.
“ఈ బాధలన్నీ పక్కన పెట్టు. మార్బుల్స్ కూడా వేయిస్తున్నావట”
“అవును. వేయిస్తున్నాను” అంది.
“నీకేమైనా డబ్బులెక్కువయ్యాయా?” అన్నాడు.
చుర్రున కాలింది సంలేఖకు. ఇతనెవరు తననలా అనడానికి? భర్త అయితే కావొచ్చు. అసలు భర్త అనేవాడు ఎలా వుండాలి? ప్రేమించాల్సినప్పుడు ప్రేమించాలి. లాలించాల్సినప్పుడు లాలించాలి. ఓదార్చాల్సినప్పుడు ఓదార్చాలి. ప్రేమ లేదు, బాధ్యత లేదు. ఓదార్పు లేదు. ఎప్పుడు చూసినా దండింపు, కోపం, అసూయ, ద్వేషం. ఇలాగేనా భర్త వుండేది? ఆమె అంతవరకు ఎంతో ప్రియంగా వూహించుకున్న అతని స్వరం కాకి అరుపులా కర్ణకఠోరంగా అన్పించింది.
“మాట్లాడవేం?”
“ఏం మాట్లాడమంటారు? మీరు కాకుండా ఈ మాట ఇంకే వెధవ అడిగివున్నా నా సమాధానం తిట్లతోనే మొదలయ్యేది. డబ్బు వాసనతో జీవితాలను పీల్చుకునే వెదవలకి మనుషుల వాసన, మనుషులతో వుండాల్సిన అనుబంధాలు, వాటి తాలూకు ఆనందం ఎలా తెలుస్తుంది? చూడండి! మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. నేను మా నాన్నకి సమాధి కట్టించేది డబ్బులు ఎక్కువై కాదు. మమకారంతో కట్టిస్తున్నాను. మా నాన్నను మరచిపోకుండా వుండటం కోసం కట్టిస్తున్నాను. దాన్ని చూసినప్పుడు మా నాన్నను చూసినట్లే వుంటుందని కట్టిస్తున్నాను. ఏ స్వార్థం లేకుండా ఎవరూ ఏ పనీ చెయ్యరు. నేనుకూడా అంతే!” అంది.
“ఇంతకన్నా చెండాలపు ఆలోచన ఇంకొకటి వుంటుందా? ఇక్కడ మన కారుకి తీసుకున్న లోన్ అలాగే వుంది. ఇక్కడ దీన్ని వదిలేసి అక్కడకెళ్లి నువ్వు చేస్తున్న పని అదా? అసలు నీకా డబ్బులు ఎక్కడివి? నేను అడిగితే లక్షే ఇచ్చావ్!” అంటూ అరిచాడు జయంత్, అతనికి సంలేఖ చేస్తున్న పని బొత్తిగా నచ్చలేదు.
సంలేఖ నిట్టూర్చి ఇతనికి లక్షలు తప్ప లక్ష్యం లేదు. అప్పుడేదో పట్టుదలగా చదివాడు. చదివితే అన్ని విలువలు తెలుస్తాయి అని అనుకుందే కాని అది వట్టిమాట. అతని మాటలు వినాలనిపించక కాల్ కట్ చేయకుండానే మొబైల్ ని టీపాయ్ మీద పెట్టింది. మొబైల్ అదిరేలా అతను అవతల వైపున అరుస్తూనే వున్నాడు.
శ్రీలతమ్మ అక్కడే వున్నట్లుంది “నువ్వాగు జయంత్! దాంతో నేను మాట్లాడతాను” అంటూ జయంత్ దగ్గర నుండి మొబైల్ లాక్కుని “హలో.. హలో.. హలో” అంది.
ఇవతల వైపున వున్న సంలేఖకు అత్తగారు ”హలో ” అనడం వినిపిస్తోంది. జయంత్ మాటలకి అప్పటికే పట్టుసడలి తూలిపడబోతున్న శరీరాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ, టీపాయ్ మీద వున్న సెల్ ఫోన్ ని అందుకొని “చెప్పండి అత్తయ్యా!” అంది. ఆమె ఇప్పటికీ వాళ్లతో ఇంత సహనంగా మాట్లాడుతుందీ అంటే జీవితంలో ఎదురైన సంఘటనలు ఆమెను పరిపూర్ణురాలిని చెయ్యటం వల్లనే కావచ్చు.
-– అంగులూరి అంజనీదేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
జ్ఞాపకం – 106 – అంగులూరి అంజనీదేవి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>