అనిశెట్టి రజితక్క – ఆత్మాభిమాన ప్రతీక (స్మృతి వ్యాసం) – వురిమళ్ల సునంద, ఖమ్మం
అనిశెట్టి రజితక్క మరణం జీర్ణించుకోలేని నిజం. రజితక్కను తలచుకోగానే ఆత్మాభిమాన ప్రతీకగా కళ్ళ ముందు నిలుస్తారు.
అక్కతో పరిచయం నాకు కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లు అనిపించింది. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించి అందులో నన్ను చేర్పించారు.అలా అక్క వాళ్ళు తాము చేస్తున్న కార్యక్రమాల్లో నన్ను కూడా భాగస్వామ్యం చేయడం నేను ఎప్పటికీ మర్చిపోలేను.2018 లో కాశ్మీర్ లోని కథువాలో బాలికపై అత్యాచారం,హత్య ఘటన నన్ను ఎంతగానో కలచి వేసినప్పుడు తమ్ముడు నాగిళ్ళ రమేష్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఆ సంఘటనను ఖండిస్తూ కవితలను ఆహ్వానించడం సంకలనంగా తీసుకుని రావడం జరిగింది.అయితే దానికి ముందు మాట వ్రాయమని ముస్లిం సోదరుడిని, మరికొందరిని కోరగా నిరాకరించారు.
కానీ రజితక్కను అడగడంతోనే ముందు మాట రాస్తూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకూడదని కోరుకుంటూ ఇలాంటి సంకలనాలు తీసే పరిస్థితి రాకుండా ఉండాలని ఆవేదన వ్యక్తంచేశారు. దానితో పాటు నేను రాసిన కథల సంపుటికి ముందు మాట రాశారు. ఖమ్మంలో జరిగిన ఆ రెండు పుస్తకాల ఆవిష్కరణకు వచ్చి ఎంతో సందేశాత్మకంగా మాట్లాడడం ,ఆ తర్వాత మధురమైన గళంతో పాట పాడటం నేను ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి.
అలా అక్క మాటల్తో నేను ఎంతగానో ప్రభావితం అయ్యాను.అప్పటి నుంచి ఎంతో ఆత్మీయంగా దగ్గరయ్యారు రజితక్క. సాహిత్యం కోసం ,సమాజ మార్పు కోసం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం రజితక్క చేసిన కృషి వినడం , కళ్ళారా చూడటం జరిగింది.
నేను గత సంవత్సరం అమెరికాలో ఉన్నప్పుడు అక్క తన పాటలకు స్పందన రాయమని కొన్ని పాటలు పంపించారు.
అప్పుడు నేను రాసుకున్న మాటలు “తెలంగాణ రాష్ట్ర సాధనకై పోరాడిన మహిళల్లో ఎంతో కీలకమైన వ్యక్తి అనిశెట్టి రజితక్క. ఆమె మాటలు అణగారిన వర్గాల మహిళలకు భరోసా హస్తాలు.ఆమె రాతలు స్త్రీల విముక్తి, కోసం, సమానత్వం కోసం పోరాడే అక్షరాయుధాలు. మహిళా చైతన్యమే ధ్యాసగా,మహిళల అభివృద్ధే శ్వాసగా చేసుకున్న మహిళాభ్యుదయ రచయిత్రి, సామాజిక కార్యకర్త. ఎవరికి తలవంచని ఆత్మ గౌరవం. కాళోజీలా తానో ధిక్కార స్వరం.
అలాంటి రజితక్క లేదు అన్న మాట గుండెను మెలి పెడుతున్నంత బాధగా ఉంది. కళ్ళు అశ్రుధారలతో నిండు చెరువులై మత్తడి దూకేందుకు సిద్ధంగా ఉన్నాయి.
తాను పైకి అలల నురగల నవ్వులతో కనిపించే గంభీర సంద్రం.తనలో ఎన్నో సమస్యల బడబాగ్నులను దాగి ఉన్నాయని మరణం తర్వాత తెలిసి తట్టుకోలేక పోయాను.
మానవత్వం లేని కొందరు మనుషుల మధ్య ఇక తాను ఎక్కువ కాలం ఇమడలేనని అనుకున్నారేమో రజితక్క. గుండె పోటుతో హఠాత్తుగా ఈ లోకం నుంచి నిష్క్రమించారు.
అక్కా! నీవు ఎక్కడ ఉన్నా నీ రూపం,నీ మాటలు కళ్ళముందు సజీవంగా కదలాడుతూనే ఉంటాయి.
నూటికో కోటికో ఒక్కరిలో నీవెప్పుడూ ఆత్మ గౌరవ ప్రతీకవే.మాకు మార్గ దర్శక దిక్సూచివే.
అందుకో అక్కా! అశ్రు నయనాలతో నివాళి 🙏
-వురిమళ్ల సునంద, ఖమ్మం
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
అనిశెట్టి రజితక్క – ఆత్మాభిమాన ప్రతీక (స్మృతి వ్యాసం) – వురిమళ్ల సునంద, ఖమ్మం — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>