ఒక పుస్తకం – అనేక సందేహాలు – సుధా మురళి

ఇవన్నీ నా సందేహాలు
ఇదంతా నెమ్మినీలం లాంటి మానవత్వం పరిమళించే కథలు రాసిన జయ మోహన్ గారు రాసినదేనా ఈ అధోలోకం అనే నా మనసు దిగులు
నిజంగానే…
సమాజంలో మనిషితనం, మంచితనం అంతరించిపోతున్నాయా!? లేక చూసే కళ్ళు లేక ఇంకెక్కడైనా దాక్కుని ఉన్నాయా!?
ఎవరి లోకంలో వాళ్ళు వాళ్ళ కోసం మాత్రమే బతికేస్తున్నారా !?
లేక ఎవరి బతుకుల్లోంచి ఎవరినో ఎత్తుకువచ్చి వాళ్ళ వాళ్ళ స్వంతానికి వాడుకుంటున్నారా! అన్నవే నాముందు నిలిచిన ప్రశ్నలు
అధోలోకం లోని స్త్రీల పాత్రల చిత్రణను ప్రత్యేకంగా పరికించిన పిదప….!!
ఎందుకీ రచయితలు ఇలా కనికరం లేకుండా పాత్రలను సృష్టిస్తారు!? పాఠకులకు ఎందుకిలా నిద్ర లేని రాత్రులను బహూకరిస్తారు!? అధోలోకపు బతుకులను కళ్లకు కట్టినట్లు చూపెట్టమని వీళ్లను ఎవరు అడిగారు!? చిధ్రమైన జీవితాల వెనుక ఉన్న మనసులేని మనుషుల క్రూరత్వ ముసుగులు తొలగించి మరీ పాత్రల రూపకల్పన చేయమని ఎవరు వీళ్ళ వెంట పడ్డారు అనుకోవడమే ఇన్నాళ్లుగా నా మనసులో రగులుతున్న వేదన
అందునా ఇందులో మరీ మరీ కుళ్ళిన వాసన వేస్తున్న స్త్రీల జీవితాలను ఇంత నగ్నంగా, వారి అవస్థలను ఇంత దిగంబరంగా, వారి ఆలోచనలను ఇంత పారదర్శకంగా, వారి అధోలోకపు యాత్రలను ఇంత పచ్చిగా ఎవరు రాయమని ప్రాధేయ పడ్డారు.
ఇది అదే జయ మోహన్ గారి అధోలోకం, అదే పనిగా చదివి, చదివిన తర్వాత నుంచీ కకావికలమైన మనసును వెంట పెట్టుకు తిరగలేక నేను పడుతున్న నరకం. మనం ఎంతో హుందాగానో, ఎంతో పుణ్యాన్ని ఆర్జిస్తున్నామనుకునే నెపంతోనో వేస్తున్న రూపాయి, అర్ధ రూపాయి ఎన్ని దారుణాలకు దారితీస్తుందో, ఎందరి జీవితాలను వారికి కాకుండా చేస్తోందో తలుచుకునే కొద్దీ వణుకు పుట్టేలా చేసిన పుస్తకం. పండగలూ, పబ్బాలు, జాతర్లు, పీర్లు పేర్లు ఏవైనా నలుగురు కలసి మొక్కే వేళల గుచ్చుకునే చూపుల నిశ్శబ్ద ఆర్తనాదాల వెనుక దాగి ఉన్న పచ్చి నిజం.
అయితే నాకు ఇందులో ఇంకా ఎక్కువ బాధను కలిగించిన విషయం ఇందులోని స్త్రీ పాత్రల చిత్రణ, వారి చుట్టూ అల్లుకున్న అనేకానేక విషయాలు, వారి మనోగతాలు. ఏక్కియమ్మ, ముత్యాలు, మంత్రసాని, సుబ్బమ్మ, వడివమ్మ, వల్లి, మీనాక్షి,, వల్లంకి, చందిరి, అక్కమ్మ, వసమ్మ, ఉన్నమవ్వ
ఇందులో ఒక్కొక్క స్త్రీ ది ఒక్కో రకపు వేదన, ఒక్కో రకపు జీవితం. ఏక్కియమ్మ పండారం భార్య, భర్త చేస్తున్న దుర్మాగాలను అడ్డుకోక అదే గొప్ప జీవితం అని భావించే సాదా సీదా ఇల్లాలు. సాటి మహిళల పట్ల కనీస సానుభూతి కూడా లేని పరమ స్వార్ధ పరురాలు, తాను ఉంటున్న ఇల్లు ఎలా వచ్చిందో, తాను తింటున్న తిండి ఏ రూపంలో తన భర్త సంపాయిస్తున్నాడో తెలిసినా అది ధర్మ కార్యం అన్న విధంగా మామూలు జీవితానికి అలవాటు పడిన ఒక గృహిణి. పైగా తనకూ ముగ్గురు ఆడపిల్లలు, ఏ ఆడపిల్లనూ ఒక విధి విధానంగా పెంచడానికి అలవాటు పడని తల్లి. చివరికి పెళ్లి చేసిన పెద్ద కూతురుకి, తన జీవితాన్ని తనకు నచ్చినట్టుగా మలుచుకున్న చిన్న కూతురికి ఇద్దరికీ కూడా నచ్చని తల్లి.
ఇక ఈ నవలలోని సిసలు కథా నాయిక ముత్యాలు, దేహంనిండా ఉండవలసిన అవయవాలు అసంపూర్ణంగా, అస్తవ్యస్తంగా వున్నా, ఒకే ఒక గర్భ స్థానం పదిలంగా, పాడవ్వనిదిగా ఉన్నందుకు పిల్లల్ని కనే సరుకుగా, ఒక యంత్రంగా మార్చబడ్డ ఆడతనాన్ని మోస్తున్న ఆమె. తన ప్రమేయం ఇసుమంతైనా లేకుండానే అది అత్యాచారం అనాలో, ఏర్పాటు చేయబడిన అసంబద్ధ సంభోగం అని పిలవాలో తెలియని ఆకృత్య కార్యాలకు ఫలితంగా ఏటా కురుపులైన బిడ్డల్ని కంటూ , ఏ ఒక్క బిడ్డా తన చెంతన ఉండక పోయినా, తాను ఎత్తుకుని పెంచలేక పోయినా అవ్యాజమైన మాతృ ప్రేమను నరనరానా నింపుకున్న మనిషి. తన బిడ్డల కోసం ఏం చేయలేనని తెలిసినా, తన శక్తి ఉన్నంత వరకూ వాళ్లకు కాపలాగా, వాళ్ళ బతుకుకు భరోసాగా, వాళ్ళని కష్ట పెట్టాలని చూసే వాళ్ళను ఎదురిస్తూ ఎలాగో కాలాన్ని వెళ్లదీస్తున్న ధీర. చిట్ట చివరికి తాను కన్న కొడుకునే తన మీదకు ఎక్కించిన దుర్మార్గులను అరచి, అరచి ఎదిరించి, ఎదిరించలేక లొంగిపోయిన అబల. ఓ కన్నీటి చరిత.
అక్కమ్మ , వెన్ను విరిగినా , విరగని ఆడతనం కారణంగా పోలీసులకు, కనిపించిన ప్రతీ మగ మగానుభావుళ్లకు వాడుక సరుకైన చరిత. కేవలం తనను తప్పించడానికి, సరుకుగా వాడుకోవడానికి మూడు ముళ్ళు వేసిన ఒక రాక్షసుడికి సైతం నిండారా ప్రేమను పంచాలని చూసి, అతని ఆలాపనతోనే కాలాన్ని వెళ్లదీసిన ప్రేమిక.
సుబ్బమ్మ తండ్రి చేస్తున్న వ్యాపార సామ్రాజ్యానికి తొలి వారసురాలు, అది ఒక భయంకరమైన , అతి దుర్మార్గమైన పని అని తెలిసినా ఏనాడు తండ్రిని ఎదిరించని పితృ ప్రేమికురాలు. కానీ తనకు చేయించిన నగలు తన చెల్లి దొంగిలించి వెళ్ళిపోయినందుకు, తనకు కొత్తరకం నగలు తండ్రి, తల్లి చేయించనందుకు, తన పెళ్లిని కూడా తూతూ మంత్రంగా చేసినందుకు చివరికి తల్లికి , తండ్రికి కూడా నమస్కరించని అత్యున్నత ఆడపిల్ల.
మీనాక్షి తల్లి చెప్పిన మాటలు ఎక్కవు, తండ్రి తీర్చే కోర్కెలు మాత్రం బాగుంటాయి. కోరుకున్న వస్తువైనా, కోరుకున్న జీవితమైనా పొందాలని ఉవ్విళ్లూరే సగటు పిల్ల, అందుకోసం అబద్ధాలు, ఒట్టులు, వెళ్ళిపోవడాలు దేనికైనా వెరవని ధైర్యశాలి. కోరికలు ఎలా తీరుతాయి అనేది తనకు సంబంధం లేని విషయం, ఎలాగోలా తీర్చుకోవడమే తనకు తెలిసిన ఆయుధం.
ఉన్నమవ్వ పక్కింట్లో జరిగే తంతును చూడాలని ఎగబడే పక్కింటి కన్ను, వంత పాడుతూనే వంకలు పెట్టి, సముదాయిస్తున్నట్టే ఎత్తి పొడిచే వ్యసన. అందిన కాడికి జుట్టు, అందక పోతే కాళ్ళు పట్టుకునే మాటకారి.
చెట్టియారమ్మ కొడుకు పెళ్లి కోసం, భర్తను కూడా లెక్క చేయని మాలచ్చిమి. ఉన్నంతలో విలనిజాన్ని పుణికి పుచ్చుకున్న సాధ్వీమణి.
ఇంకా ఇలానే మిగిలిన అన్ని స్త్రీ పాత్రలు, వారి వ్యవహారాలు. ఇక్కడ ఒక్క ముత్యాలు తప్ప ఇంక ఏ స్త్రీ తన స్థితిని ఎదిరించదు, మార్చుకోవాలని చూడదు, కనీసం తాను మారాలని ప్రయత్నించదు. ఇదే ఎందుకు !? అనే ప్రశ్న నన్ను తొలుస్తూనే ఉంది. నిజంగానే లోకంలోని స్త్రీలందరూ వీళ్లకు ప్రతినిధులా!? అన్ని వర్గాలలోనూ, అన్ని వర్ణాలలోనూ స్త్రీలు ఇలానే ఉన్నారా, తోచినంతలో సర్దుకుపోతూ, నచ్చినంతలో కావలసినవి పొందుతూ తమకూ సమాజానికి ఏ మాత్రం సంబంధం లేని విధంగా బతికేస్తున్నారా!? లేదా కేవలం అధోలోకం లోని , అదో లోకం లోని స్త్రీలు మాత్రమే ఇలా జీవిస్తున్నారా!?
రోజు వారీ మన జీవితంలో కూడా మనం దేనిని మార్చగలుగుతున్నాం!? బస్ స్టాండ్ లలో బిడ్డను ఎత్తుకుని దేహీ అని చేతులు చాపే స్త్రీలు మనకు అన్నిచోట్లా కనిపిస్తూనే వున్నారు!? కుదిరితే ఒకింత నిర్లక్ష్యంతో అయినా ఓ రూపాయి చేతిలో పెట్టి చేతులు దులుపుకుంటున్నాం, లేదా ఎందుకమ్మా బిడ్డను ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని ఒక జాలి మాట అనేసి ఆ రూపాయిని మిగుల్చుకుని చల్లగా జారుకుంటున్నాం. మరో చోట ఒక మతి స్థిమితం లేని ఆడబిడ్డను చూసి అయ్యో! అని నోరారా సానుభూతి చూపిస్తున్నాం, అదే ఆడపిల్ల ఎవరి చేతిలోని బలైందనో, ఒక బిడ్డకు తల్లయిందనో వార్త మనదాకా చేరిన రోజున అయ్యయ్యో! అంటూ ఇంకాస్తా పెద్ద రాగాన్ని పాడుకుంటున్నాం.
ఏది మరి అధోలోకం!?
ఎవరు ఈ అధోలోకాన్ని సృష్టిస్తున్నారు!?
రాసిన రచయితలా!?
అదే లోకంలో జీవిస్తున్న మనమా!?
అధోలోకం లోని స్త్రీలా!?
ఈ ప్రశ్నల సమాధానాల అన్వేషణలో పడి మాయమవుతున్న మన మనసులా!?
-సుధా మురళి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
ఒక పుస్తకం – అనేక సందేహాలు – సుధా మురళి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>