భారత దేశంలో లింగ వివక్షత – ఆహార అభద్రత – మహిళ ఆరోగ్యం (వ్యాసం)- డా. మెట్టా ఉషా రాణి
భారత దేశంలో హైందవ ధర్మం ప్రకారం పున్నామ నరకం నుండి తల్లి తండ్రులను రక్షించేవాడు పుత్రుడు. 32 నరకాలలో ‘పుం’ అనే నరకం ఒకటి. తల్లి లేదా తండ్రి చనిపోతే తలకొరివి పెట్టి, శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించే అర్హత కొడుకుకు మాత్రమే ఉంది. ‘శ్రాద్ధం లేదా పితృకార్యం వలన గతించిన తల్లి లేదా తండ్రికి స్వర్గప్రాప్తి కలిగి పునర్జన్మ లేకుండా ఉండటమే కాకుండా వెనకటి మూడు తరాల పితరులు కూడా సంతృప్తి చెందుతారు. ఇలా చేయడం వలన వారసులకు ఎటువంటి పితృ దోషాలు ఉండవు. పెళ్లి కాగానే కూతురికి భర్త ఇంటిపేరు, వారి గోత్రం వస్తుంది కనుక కర్మ కాండ చేయడానికి కూతురికి అర్హత లేదు’ అనే స్త్రీ వ్యతిరేక నమ్మకం [కూడా] భారతదేశంలో లింగ వివక్షతకు దారితీసిందిసింది. (నిజానికి నేడు బ్రతికి ఉన్న తల్లితండ్రులకు ఇక్కడే నరకాన్ని చూపుతున్న సుపుత్రులు ఎందరో). దీనితో పాటు వారసత్వ చట్టాలు, కుటుంబ వారసత్వం కొనసాగాలన్నా, కుటుంబాన్ని కాపాడేవాడు, భవిష్యత్తులో తమకు అండగా ఉండేవాడు కొడుకు తప్ప పరాయి ఇంటికి వెళ్ళే కుమార్తె కాదు. వారు ఆర్థిక భారం. చదువు చెప్పించడం, వరుడిని వెతకడం, కట్నం ఇచ్చి పెళ్లి చేయడం, ఒక దశ వరకు వారిని సమాజం నుండి కాపాడుకోవడం వంటి కారణాలు కూతురును గుదిబండగా మార్చేశాయి. కొడుకు ‘ఆస్తి’, కుమార్తె ‘బాధ్యత’ అయ్యింది. అందుకే ఆహారం, విద్య, ఉనికి, గౌరవం, ప్రేమ అన్నింటిలో కొడుకులకే ప్రాధాన్యత ఉంటుంది. 2009-2019 మధ్య కాలంలో భారత దేశంలో శిశు హత్యల కారణముగా కనీసం 90 లక్షల మంది ఆడశిశువులు తనువు చాలించారని వాషింగ్టన్ కేంద్రముగా పనిచేస్తున్న ‘ప్యూ పరిశోధన కేంద్రం’ తెలిపింది. ఐక్యరాజ్యసమితి జనాభా నిధి సంస్థ 2020లో విడుదల చేసిన నివేదికలో గత 50 ఏళ్లలో ఇండియాలో తల్లి కడుపులో ఉన్నపుడు, లేదా పుట్టిన తరువాత దాదాపు 4.58 కోట్ల మంది బాలికలు తప్పిపోయినట్టు లేదా హత్యకు గురైనట్లు వెల్లడించింది (The Economic Times). భారత శిశు హత్యలను నిషేధిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం ఆడశిశు హత్య నిరోధక చట్టం-1870 లోనే ప్రవేశపెట్టినప్పటికీ సరైన అమలుకు నోచుకోలేదు. లింగ వివక్షత లింగ అంతరానికి దారి తీస్తుంది.
విద్య, వైద్య, సాంఘీక, ఆర్థిక, రాజకీయ విషయాలలో ఈ లింగ వివక్షత ప్రస్ఫుటం. నేడు కొంతవరకు ఆ భేదం తగ్గినా ఏదో రూపంలో ప్రకటితం అవుతూనే వుంది. ఈ పరిశీలనకు గాను దేశ జనాభా, ఆహారధాన్యాల ఉత్పత్తి, భారతీయ మహిళకు ఎన్ని కాలరీల ఆహారం అవసరం, ఆహారం పొందడంలో వివక్షత, ఆరోగ్య సర్వే, లింగ అసమానత రకాలు, ఆహార అభద్రతను ప్రభావితంచేసే అంశాలు, పరిష్కారాలు మొదలగునవి కొన్నిగణాంక వివరాల ఆధారముగా విశ్లేషణ:
భారత దేశ జనాభా 2024-’25 ప్రకారం 1,467,914,355 కోట్లు. ఇందులో పురుష జనాభా: 757,922,938 (51.6%), స్త్రీ జనాభా: 709,991,417 (48.4%). అనగా జనాభాలో సగం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం 2024 లో 100 మంది స్త్రీ లకు 106.5 పురుషులు, పట్టణ: 1000 మంది పురుషులకు 985 స్త్రీలు, గ్రామీణ: 1000 మంది పురుషులకు 1037 స్త్రీలు.
ఆహార వ్యవసాయ సంస్థ (Food and Agricultural Organisation) 2022 నివేదిక ప్రకారం పురుషులకంటే ఎక్కువగా మహిళలు ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు. పురుషులు 25.4%, మహిళలు 27.8%. ఆహార ధాన్యాల ఉత్పత్తి మిలియన్ టన్నులలో: 2020-21: 308.65, 2021-22: 315.7, 2022-23:329.68, 2023-24: 332.3. ఆహార ధాన్యాల ఉత్పతిలో భారత్ ప్రపంచములో రెండవ స్థానం (కేంద్రం వార్షిక నివేదిక)లో ఉన్నప్పటికి పురుషునితో సమానముగా మహిళలు ఆహారాన్ని పొందలేకపోతున్నారు అనడానికి పై గణాంకాలు నిదర్శనం. భారతీయ శరీరాలకు అవసరమైన పోషకాలు లభించే 17 రకాల ఆహార పదార్థాలతో కూడిన సమతౌల్య ఆరోగ్యకర ఆహారాన్ని ‘మై ప్లేట్ ఫర్ ద డే’ అనే మార్గదర్శకాన్ని హైదరాబాద్ కు చెందిన జాతీయ పోషకాహార సంస్థ (National Institute of Nutrition: NIT) రూపొందించింది. అదే విధముగా ఒక మహిళకు ఎన్ని కాలరీల శక్తిగల ఆహారం అవసరం అనేది జాతీయ వైద్య పరిశోధనా మండలి (Indian Council of Medical Research: ICMR) తెలిపింది. ఒక మహిళ పనిచేయక పొతే 1600-1900, మధ్యస్థ పని అయితే 2130-2230, గర్భవతి అయితే 2250, పాలిచ్చే తల్లులకు 2500 కాలరీలు అవసరం అవుతాయి.
UNICEF (2025) విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత దేశంలోని మహిళల, పిల్లల ఆరోగ్యం 2006-2021 ప్రకారం 5 సంవత్సరాల లోపు పిల్లల Stunting (5సంవత్సరాల లోపు పిల్లలలో వయసుకు తగ్గ పొడవు పెరగక పోవడం) ను గమనిస్తే 2006: 48%, 2016 : 38%, 2021: 36% కి తగ్గింది. అలాగే Wasting (5 సంవత్సరాల లోపు పిల్లలు ఎత్తుకు తగిన బరువు ఉండక పోవడం) 2006: 20%, 2016: 21%, 2021:19% కి తగ్గింది. 67% రక్తహీనత, 3% అధిక బరువుతో ఉన్నారు.15 నుండి 19 సంవత్సరాల వయసున్న కౌమారదశ గల బాలికలలో 30% Stunting, 4% సన్నగా వుండడం, 59% రక్తహీనతతో ఉన్నారు. 15 నుండి 49 వయసున్న మహిళలలో 19% పోషకాహార లోపం (పోషకాహారం అంటే శరీర నిర్మాణానికి, పెరుగుదలకు కావలసిన శక్తిని అందించే పదార్థాలు), 57% రక్తహీనత, 24% అధిక బరువుతో ఉన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో దాదాపు 50% మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. పోషకాహారలోపం వలన భారత దేశంలో 68% మరణాలు ఉన్నాయి. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతునే ఉన్నా బాలికగా, మహిళగా, గర్భవతిగా, స్తన్యాన్ని ఇచ్చే తల్లిగా లింగ వివక్షత వలన కావసినంత పోషకాహారం దొరకడం లేదు. భారత దేశంలో 189 మిలియన్ల మంది పోషకాహార లోపముతో బాధపడుతున్నారని FAO తెలిపింది. ప్రపంచం మొత్తములో 1 బిలియన్ కంటే ఎక్కువ మహిళలు మరియు కౌమార దశలో ఉన్న బాలికలు పోషకాహార లోపముతో బాధపడుతున్నారని, పూర్తి లింగ సమానత్వం సాధించడానికి ౩౦౦ ఏళ్ళు పడుతుందని ‘ప్రపంచ ఆహార కార్యక్రమం’ తెలిపింది.
మహిళల ఆహార అభద్రతను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు:
భారత దేశంలోని పితృస్వామిక సమాజంలో మహిళల పోషకాహారాన్ని పేదరికం, ఆదాయ అసమానతలు, ఇళ్ళల్లో ఆహార పంపిణీలో అసమానం, లింగ వివక్షత, కులం, మతం, జాతి, తరగతి, ఆర్థిక స్థానం వంటి వ్యవస్థాగత అసమానతలు, వాతావరణంలోని మార్పులు మధ్య తరగతి, బడుగు వర్గాల మరియు మారుమూల మన్య ప్రాంతాలలో ఉండే పేద గిరిజన మహిళల ఆహారాన్ని నిర్ణయిస్తాయి. ఈ అంశాలన్నింటిని సామాజిక, ఆర్థిక, పర్యావరణ కారణాలుగా వివరించడం జరిగింది.
సామాజిక కారణాలు:
సామజిక కారణాలలో లింగ వివక్షత ప్రధానమైనది. భారత దేశంలో సాధారణముగా లింగ వివక్షతను ప్రతి ఇంట్లో గమనించవచ్చును. కొడుకు అధికారం చూపిస్తూ తనకు ఇష్టమైనవి తిని వెళ్తే, కుమార్తెకు నిన్నటి లేదా మిగిలిన లేదా ఆహరం పెట్టకుండా ఉండే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఆడపిల్లలు బాల్యం నుండే పోషకాహార లోపంతో ఉంటారు. ఆసియన్ డెవలప్మెంట్ బాంక్ (2013) ప్రకారం భారత దేశంలో ఎక్కువ శాతం గ్రామీణ లేదా మధ్య తరగతి మహిళలు 5 దశల లింగ వివక్షతను ఎదుర్కొంటారు. మొదటి దశలో మహిళకు ఎటువంటి ఆర్థిక ఆధారం లేకపోయినట్లయితే ఆ కుటుంబములో ఆమె అన్ని రకాలుగా అధమ స్థాయిలోనే ఉండిపోతుంది. మాటల్లో, చేతల్లో, తిండి, బట్ట, మర్యాద, గౌరవం అన్నింటిలో ఒక రకమైన హేళనకు గురవుతూ మాట్లాడే బొమ్మలా ఉంటుంది. రెండవ దశలో మొదటి దశ ప్రభావం వలన ఇంటి, వంట పనులు, పిల్లల బాధ్యత అధికం అవుతుంది. క్రమముగా సమయాభావ పేదరికం (Time Poverty: అంటే చేయాలనుకుంటున్న పనులన్నింటిని చేయడానికి తగినంత సమయం లేదని భావించే పరిస్థితి) లోకి వెళతారు. మూడవ దశలో ఇంటి, వంట, పిల్లల పనికే సమయం కేటాయించడం వలన చదువు కోవడానికి సమయం ఉండదు. నాల్గవ దశలో చదువు ఉండదు. చదవాలని ఉత్సాహం ఉన్నా ఎవరూ ప్రోత్సహించరు, ముందుకు పోనివ్వరు. ఐదవ దశలో విద్య లేకపోవడం, అవగాహన లోపం, భాషా సమస్య, గమనశీలత లేకపోవడం, విశాల దృక్పథం అలవాటు కాకపోవడం, మూఢముగా అన్నింటిని నమ్మడం, ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం, ఆహార విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం ఫలితముగా మళ్ళీ మొదటి దశకు చేరుకుంటారు. వివక్షతా విషవలయ చక్రం (Discrimination Vicious Circle) పునరావృతం అవుతూనే ఉంటుంది.
1998 లో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన భారతీయ ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్య కుమార్ సేన్ 7 రకాల లింగ అసమానతలు మహిళా జీవితాన్ని, ఆరోగ్యాన్ని బహుముఖముగా ప్రభావితం చేస్తాయని తన వ్యాసమైన “ Many faces of Gender Inequality“ లో వివరించాడు. మరణ అసమానత (Mortality Inequality): పోషకాహార లోపం, సరైన వైద్య సదుపాయాలూ సకాలములో అందక, అసమానత వలన ఇంట్లో వాళ్ళు స్పందించక, సామాజిక ఒత్తిళ్ళ వలన మగవారికంటే ఆడవారు ఎక్కువగా మరణంలో అసమానతను ఎదుర్కొంటున్నారు. జన్మతః అసమానత (Natality Inequality): కొడుకుకే ప్రాధాన్యo, కూతురు వద్దు. ఆడపిల్ల అనగానే కడుపులోనే కడతేర్చడం, గర్భస్రావాలు. జన్మించక ముందే అసమానత. ఉద్యోగ అసమానత (Employment Inequality): పురుషులతో సమానముగా పని చేసినా తక్కువ జీతం, పనిచేసే చోట వివక్షత, వేధింపులు, ప్రమోషన్లలో అసమానత. యాజమాన్య అసమానత (Ownership Inequality): భూమిపై సమాన హక్కులు లేకపోవడం, ఆర్థిక వనరులు చాలా పరిమితముగా వుండడం, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేకుండా ఉండడం. ప్రత్యేక అవకాశ అసమానత (Special Opportunity Inequality): ఉన్నత విద్య, నాయకత్వ పదవుల మరియు ప్రత్యేక శిక్షణ వంటి పురోగతి అవకాశాలలో అసమానతలు. ప్రాధమిక సౌకర్యాల అసమానత (Basic Facility Inequality): విద్య, ఆరోగ్య సంరక్షణ, పారిశుధ్యం వంటి ప్రాథమిక అవసరాలను పొందడంలో అసమానత. గృహ అసమానత (Household Inequality): లింగ అసమానత వలన ఇంట్లోనే పని భారం, నిర్ణయం తీసుకోవడంలో అశక్తి. ఇలాంటి అసమానతల వలన మహిళల, బాలికల ఆరోగ్యం, జీవనోపాధి కుంటుపడుతుంది.
అసమానతల నేపధ్యంలో ఆరోగ్య రంగములో పురుషులతో పోలిస్తే మహిళలు 34% తక్కువగా సంపాదిస్తున్నారు, 18% మాత్రమే నాయకత్వ స్థానాల్లో ఉన్నారు (ఈనాడు జూలై 1, 2025). కదన రంగములో ఆర్మీ, నావి, తీర రక్షక దళాల్లో మహిళల వాటా కనీసం పది శాతం కూడా లేదు. 2020 లో సైన్యంలో 3.84% ఉంటే నాలుగేళ్ళలో అరశాతం కూడా పెరగలేదు. వాయు సేనలో కూడా ఇదే పరిస్థితి. 2020-’24 మధ్య నావికా దళంలో మహిళల వాటా 1.28% పెరిగింది. తీర రక్షక దళం, DRDO లో వారి ప్రాతినిధ్యం తగ్గింది. 2024 లో రక్షక విభాగంలో మహిళల వాటా: ఇండియన్ ఆర్మీ 4.12%, వాయుసేన 13.40%, నౌకా దళం 6.81%, తీర రక్షక దళం 4.84%, DRDO 15.53 బీఎస్ఎఫ్ (భారత దేశంలో స్త్రీ పురుష నివేదిక 2024) పహల్గాం దాడికి ప్రతీకారముగా భారత్ చేపట్టిన “ఆపరేషన్ సింధూర్” లో అసిస్టెంట్ కమాండెంట్ నేహా బండారి నేతృత్వంలో ఆరుగురు మహిళా బీఎస్ఎఫ్ జవాన్లు మంజీర్ కౌర్, మల్కిత్ కౌర్, స్వప్న రాథ్, శంపా బసాక్, సుమీ జెక్స్, జ్యోతి బనియన్ లు జమ్మూ కాశ్మీర్ లోని అంతర్జాతీయ సరిహద్దు అఖ్నూర్ సెక్టార్ వద్ద పాకిస్తాన్ దళాలపై నేరుగా కాల్పుల్లో పాల్గొన్నారు (The Economic Times, May 30, 2025). వీరి ధైర్య సాహసాలు రాబోయే తరాల మహిళలను తక్కువ అంచనా వేయకుండా యుద్ధభూమిలో పాల్గోనేలా ప్రభుత్వం అవకాశాలు కల్పించాలి. రాజకీయ రంగములో కూడా లింగ అసమానత స్పష్టం. భారత దేశంలో లోక్ సభలో ప్రస్తుతం మహిళల 13.6%. రాజ్యసభ లో 13%. శాసన సభ రాష్ట్రాలలో 9%. ప్రపంచ పార్లమెంట్ మహిళా భాగస్వామ్యo లో 185 దేశాలలో 143 వ స్థానంలో భారత దేశం ఉంది. వియత్నాం, ఫిలిప్పీన్స్, పాకిస్తాన్, చైనా కంటే భారత్ వెనుకబడి ఉన్నది. రాజకీయ సాధికారతలో భారతదేశం 65వ స్థానం. మంత్రి పదవులలో 6.9%, పార్లమెంట్ లో 17.2% కంటే తక్కువ ప్రాధాన్యం. దేశంలో మహిళలు రాజకీయాలలో పాల్గొనకపోవడానికి ఎన్నో సామాజిక అడ్డంకులు ఉన్నాయి. పితృస్వామిక వ్యవస్థలోని మగవారి ఆధిక్యత, ఆర్థిక సాధికారత కొరత, ఇంటిభాద్యత, కుటుంబ ప్రోత్సాహం లేకపోవడం, విద్యలో వెనుకబాటు, అందరిని ఎదిరించి ముందుకు వెళ్ళే ధైర్యం కొరత, ఒడదుడుకులను భరించే శక్తి లేమి, మహిళా ప్రాతినిధ్యాన్ని స్వాగతించక పోవడం, తెగించి ముందుకు వెళ్ళినా నైతికముగా మాటలతో, చేతలతో హింసించి క్యారెక్టర్ ని దిగజార్చడం, గెలవని సీట్లను కేటాయించడం, ఆర్థికముగా బలమైన, నేరచరితగల ప్రత్యర్థులను ఎదుర్కొనే శక్తి లేకపోవడం.
సంస్థాపరoగా 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం 1/3 వంతు సీట్లు మహిళలకు కేటాయించే విధానం అమలులో వుంది. కాని గ్రామస్థాయిలో మహిళల ప్రతినిధుల స్థానంలో వారి భర్తలు అధికారం చలాయించడం, భర్తలను ఎదిరించే శక్తి లేక మహిళా ప్రతినిధులు తిరిగి ఇంట్లో కూరుకుపోవడం జరుగుతున్నది. లోక్ సభ, రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు “నారి శక్తి వందన్ అధినియం-2023” లోక్ సభ, రాజ్యసభల్లో ఏకగ్రీవ ఆమోదం లభించినా జనాభా లెక్కలు, డిలిమిటేషన్ పూర్తి అయి 2029 లోక్ సభ ఎన్నికల వరకుగాని ఇది సాధ్యంకాదు.
లింగ అంతరం: లింగ వివక్షత వలన లింగ అంతరం పెరుగుతుంది. ప్రపంచ ఆర్థిక నివేదిక ప్రకారం, ప్రపంచ లింగ అంతరం సూచికలో 2024 లో 146 దేశాలలో భారత దేశం 129 వ స్థానం లో ఉండగా 2025 లో 131 వ స్థానానికి దిగజారింది. అంటే లింగ అంతరం ఇంకా పెరిగింది [ఆసియాలోని కొన్ని దేశాల స్థానాలు: బంగ్లాదేశ్ 24, భూటాన్ 119, నేపాల్ 125, శ్రీలంక 130, ఇండియా 131, మాల్దీవులు 138, పాకిస్తాన్ 148].
లింగ ఆధారిత హింస: గ్రామీణ, మధ్య తరగతి కుటుంబాలలో గృహహింస, ఇతర రూపాల హింసలు మహిళల ఆహార అవసరాలను తీర్చుకోవడానికి ఆటంకం కలిగిస్తాయి. కొందరు మహిళలు భర్త, అత్త, మామ, ఆడబిడ్డల నుండి హింస ఎదుర్కొంటే మరికొందరు కొడుకులు, కోడళ్ళు కొంత వరకు కూతుళ్ళు తమ తల్లి తండ్రులను ఆస్తి, డబ్బు కోసం హింసించడం, తిట్టడం, కొట్టడం, హత్య చేయడం, ఇంట్లో నుండి వెళ్ళగొట్టడం వంటి అమానవీయ చర్యల వలన ఏంతో మంది మహిళలు ముఖ్యముగా భర్తలు చని పోయిన మహిళలు తిండికి నోచుకోవడం లేదు. అందులో ఆర్థికముగా వెనుకబడినవారిది ఇంకా దయనీయ పరిస్థితి.
ఆర్థిక కారణాలు:
ఆడపిల్లని చదివిస్తే తల్లి తండ్రులకు ఖర్చు తప్ప ప్రయోజనం ఉండదు అనే అభిప్రాయం వలన చాలా మంది గ్రామీణ, మధ్య తరగతి ఆడపిల్లలు చదువు దూరమై ఇంటికి పరిమితం కావలసి వస్తుంది. చదువు ఎక్కువ అవుతే అబ్బాయి చదువుకున్నవాడు దొరకడం కష్టం. ఒకవేళ పెళ్లి తరువాత చదువుదామంటే అందుకు అత్త, మామ, భర్త ఒప్పుకోవాలి. విద్యకు దూరం కనుక ఉద్యోగం, ఆదాయాలు ఉండవు. భారత దేశంలో మహిళలు ఇంకా పరిమిత హక్కులే కలిగి ఉన్నారు. ప్రపంచ వ్యాప్తముగా మహిళలు వ్యవసాయ భూమిలో 20% కంటే తక్కువ కలిగి వున్నారు. తాత్కాలిక సాగు హక్కులకే పరిమితం. మహిళల ఆస్తి హక్కులపై కృషి చేసిన ఆర్థిక శాస్త్రవేత్త బీనా అగర్వాల్ ప్రకారం “మహిళల పరిస్థితిని ప్రభావితం చేసే ఏకైక ముఖ్యమైన అంశం ఆస్తిపై లింగ అంతరం”. భారత దేశంలో 73.2% మహిళలు వ్యవసాయ రంగములో ఉండగా, 12.8% మాత్రం వ్యవసాయ కమతాలను కలిగి ఉన్నారు.
లింగ వేతన అంతరం: పురుషులకంటే మహిళలకు వేతనాలు తక్కువగా ఉండడం వలన ఆర్థికముగా నిలువలేకున్నారు. భారత దేశంలో కనీస వేతన చట్టం 1948, కనీస వేతనాలను నిర్ణయించడంలో లింగ ఆధారిత వివక్షతను నిషేధిస్తుంది. అదే విధముగా సమాన వేతన చట్టం, 1976 ద్వారా పురుష మరియు స్త్రీ కార్మికులు ఇద్దరు ఒకే లేదా సారూప్య పనికి సమాన వేతనం ఇవ్వాలని నిర్దేశిస్తుంది. కాని వాస్తవముగా స్త్రీ, పురుష వేతనాలలో వ్యత్యాసం స్పష్టం. లింగ అంతరం 68.5%. పురుషుడు సంపాదించే ప్రతి రూ// 100 కు, మహిళలు 39.8 రూ// సంపాదిస్తున్నారు (The World Economic Forum’s Global Gender Gap Index 2024). దీని అర్థం కార్మిక ఆదాయంలో గణనీయమైన అసమానత వున్నది. గ్రామీణ ప్రాంతములో పురుషుల వేతనం రూ// 393 కాగా, మహిళలు రూ// 265. పట్టణ పురుషులు: రూ// 483 కాగా, మహిళలు రూ// 333. దీనికి కారణం మహిళల పనిని తక్కువగా అంచనా వేయడం. 2024-’25 ఆర్థిక సర్వే ప్రకారం భారత దేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం రేటు (Women Labour Force Participation Rate) పెరిగింది. 2017-18 లో 23.3% నుండి 2023-24 లో 41.7% కి పెరిగింది. దీనికి ప్రథాన కారణం గ్రామీణ మహిళలు శ్రామిక శక్తిలో ప్రవేశించడం. ఉపాథి మరియు సంబంధిత కార్యకలాపాలలో మహిళల భాగస్వామ్యం 2019 లో 21.8% ఉంటే 2024 లో 25% కి, పురుషులు 70.9% నుండి 75% కి పెరిగింది. మహిళలు చెల్లించని గృహ సేవలపై ఎక్కువ సమయం గడుపుతున్నారు. 2024 లో పురుషులు రోజుకు సగటున 86 నిమిషాలు ఉండగా మహిళలు 305 నిమిషాలు గడుపుతున్నారు. భారత దేశంలోఎక్కువగా ఆడవారు ఉదయాన్నే లేచి ఇంటి, వంట పనులుచేసి మగవారు, పిల్లలు తిన్నతరువాత తింటారు. గృహంలో ఎంత పని చేసినా వారి పనికి విలువ, గుర్తింపు, వేతనం ఉండవు.
ధరల పెరుగుదల : మహిళలు, బాలికలకు లింగ అసమానత వలన ముందే తక్కువ ఆహారం లభిస్తే అందులో అధిక ధరల వలన నాణ్యత లేని అల్ప పోషకాహారo వివిధ వ్యాధులైన రక్తహీనత, ఎముకలు గుల్ల బారడం, థైరాయిడ్, కాన్సర్లకు గురిచేస్తుంది. బాలికలు చిన్నతనములోనే వయసుకు తగ్గ ఎత్తు, బరువు ఉండక అనివార్యముగా అనారోగ్య తరాన్ని అందించడం జరుగుతున్నది.
పర్యావరణ కారణాలు:
అతివృష్టి, అనావృష్టి, ఉష్ణోగ్రతలు పెరగటం, వరదలు, భూకంపాలు మొదలగు వాతావరణ మార్పులు మహిళల ఆహారభద్రతకు కారకం అవుతాయి. ఉష్ణోగ్రతలు అధికం అవుతే నీటి కొరత ఏర్పడి పంట దిగుబడి, వ్యవసాయ భూమి లభ్యతలు తగ్గుతాయి. నీటి సేకరణ మహిళలే చేయాలి కనుక బలహీనముగా వున్న మహిళల, బాలికల ఆరోగ్యాన్ని, గర్భవతులైతే పుట్టబోయే పిల్లల మీద ప్రభావం చూపుతుంది. మారుతున్న వాతావరణ మార్పులు గర్భిణిలపై తీవ్ర దుష్ప్రభావాలు చూపుతాయని మాతా శిశు ఆరోగ్యానికి సమస్యలు ఎదురవుతాయని ‘క్లైమేట్ సెంట్రల్ ‘ తాజా అధ్యయనంలో (జూన్ 16, 2025) వెల్లడించింది. 247 దేశాలను తీసుకోని విశ్లేషణ జరపగా 222 దేశాల్లో వాతావరణ మార్పులు తీవ్రంగా ఉన్నాయని అందులో భారత దేశం ఉందని, వాతావరణంలో ప్రమాదకర మార్పులు గర్భిణులను ఇబ్బందిపెట్టే హెచ్చు ఉష్ణోగ్రతలు రెట్టింపు అయ్యాయని ఫలితముగా అధిక రక్తపోటు, మధుమేహం, గర్భస్రావం, తల్లి మరణం, మృత శిశువు జననం, తక్కువ బరువుతో, అవకరాలతో పుట్టడం వంటి సమస్యలు ఎదురవుతాయని తెలిపింది.
పోషకాహార లోపం:
సామాజిక, ఆర్థిక, పర్యావరణ కారణాల వలన భారతదేశంలోమహిళలు పోషకాహారాన్ని తీసుకోలేకపోతున్నారనేది గణాంకాల వలన స్పష్టం. గర్భిణి స్త్రీలు సరైన ఆహారాన్ని తీసుకోకుంటే పుట్టబోయే పిల్లల పెరుగుదలపై ప్రతికూల ప్రభావం చూపి పిల్లల మరణాలకు దారితీస్తుంది. వ్యాధుల బారిన పడటంతో పోషకాహారలోప చక్రం (Vicious Circle of Malnutrition) ప్రారంభమౌతుంది. ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ 1982 లో ప్రారంబించిన నేషనల్ కాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రాం (NCRP) ప్రకారం 2023 లో 14 లక్షలకు పైగా కాన్సర్ కేసులను అంచనా వేసింది. ప్రొఫెసర్ సాధన కళ, అమెరికు చెందిన లాప్రోస్కోపిక్ సర్జన్ ప్రకారం భారత దేశంలో 80% పోషకాహార లోపం పెద్దపేగు, ప్రోస్టేట్, రొమ్ము, పాంక్రియాటిక్, ఉపిరితిత్తుల మరియు అన్నవాహిక క్యాన్సర్ల కు కారణం అని తెలిపారు. సంవత్సరాలవారిగా రొమ్ము కాన్సర్ తో మరణించిన మహిళలు- 2019: 74,481, 2022: 98,337, 2023: 82,429.,
పరిష్కారాలు:
దేశ స్థూలదేశీయోత్పత్తి (GDP 4.187 లక్షల కోట్ల డాలర్లు) 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడంతో అమెరికా, చైనా, జర్మనీ తర్వాత జపాన్ ను అధిగమించి ప్రపంచములో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించినదని నితి అయోగ్ (National Institution for Transforming India: NITI) సి.ఈ.ఓ. బి.వి.ఆర్. సుబ్రహ్మణ్యం వెల్లడించారు. దేశ ఆర్థిక పటిష్టత ఎంత బలముగా ఉన్నా ఆర్థిక వ్యవస్థకు మూలమైన అంశాలలో మహిళా ఆరోగ్యం ప్రధానమైనది. సుస్థిర అభివృద్ధి (Sustainable Development), సమ్మిలిత వృద్ధి (Inclusive Growth) అనే లక్ష్యాలను సాధించాలంటే లింగ వివక్షతను రూపుమాపి ఉపాధి అవకాశాలను లింగ భేదం లేకుండా కల్పించాలి. అక్టోబర్ 16 ఆహారదినోత్సవం. ఆహార హక్కు ఒక ప్రాథమిక హక్కుగా భారత రాజ్యంగం గుర్తించనప్పటికి రాజ్యాంగములోని ఆర్టికల్ 21 లో పొందుపరచిన జీవించే ప్రాథమిక హక్కును గౌరవముతో జీవించే హక్కుగా అర్థం చేసుకోవచ్చు. ఆర్టికల్ 47 రాష్ట్ర ఆదేశిక సూత్రం. ఇది రాష్ట్రం తన ప్రజల పోషకాహార స్థాయిని మరియు జీవన ప్రమాణాలను పెంచడానికి ప్రాధాన్యతనివ్వాలని నిర్దేశిస్తుంది. ఇందులో భాగముగా సరసమైన ధరలకు తగినంత పరిమాణములో నాణ్యమైన ఆహార ధాన్యాలు లభిస్తాయని నిర్థారించడం ద్వారా పౌరులకు ఆహారం మరియు పోషక భద్రతను అందించడానికి 2013 జూలై 5 నుండి దేశంలో జాతీయ ఆహార భద్రత చట్టం (National Food Security Act) అమల్లోకి వచ్చింది. ఇది ఫిబ్రవరి 2014 నుండి రాష్ట్రంలో అమలు చేయబడింది. ఇందులో మధ్యాహ్న భోజన పథకం, సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకం, ప్రజాపంపిణీ వ్యవస్థ ఉన్నాయి. ప్రసూతి హక్కులను కూడా ఈ చట్టం గుర్తిస్తుంది. సుస్థిర ఆర్థిక వ్యవస్థ కోసo భారత ప్రభుత్వం బేటీ బచావో బేటి పడావో, మహిళా శక్తి కేంద్రాలు, సుకన్య సమృద్ధి యోజన, కస్తుర్భా గాంధీ బాలిక విద్యాలయాలు, పంచాయతీరాజ్ సంస్థలలో 33% సీట్లు రిజర్వ్ చేయడంవంటి పథకాలు చేపట్టినప్పటికీ పురుషులతో సమానముగా మహిళలు ఆహారాన్ని పొందడం లేదు. ఈ కార్యక్రమాలు అనుకున్నంత సఫలం కాకపోవడం వలన మహిళా ఆహార భద్రతకు ప్రభుత్వం తీసుకోవసిన చర్యలు:
- మహిళలు ఆర్థికముగా బలముగా ఉన్నప్పుడే ధైర్యముగా ముందుకు వెళ్ళగలరు. అందుకు ప్రభుత్వం భూమిపై సమాన ప్రతిపత్తి ఉండే విధముగా చట్టం తేవాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని UNO, FAO, IFAD, WFP కలిసి నిర్వహించిన ఒక కార్యక్రమంలో FAO డైరెక్టర్ అంజలి కాజకోం “మహిళలు తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవాలంటే వ్యవసాయ ఆహార వ్యవస్థలలోని సవాళ్ళను పరిష్కరించాలి” అంటారు. FAO డైరెక్టర్ జనరల్ Q.U. డోoగ్యు “వ్యవసాయ ఆహారవ్యవస్థలలో ఉన్నలింగ అసమానతలను పరిష్కరించి, మహిళలకు సాధికారత కల్పిస్తే పేదరికాన్ని అంతం చేయడం మరియు ఆకలి లేని ప్రపంచాన్ని సృష్టించడం సాధ్యం’’ అంటాడు. మహిళా సాధికారత పెరగాలంటే ఉపాథి, ఆస్తులను, వనరులను మహిళలకు సముచిత రీతిలో చట్టబద్దత కల్పించాలి. మహిళలకు ఆధునిక వ్యవసాయ పద్ధతులలో శిక్షణ, స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, పోషకాహార ప్రాథాన్యత గురించి అవగాహన కల్పించడం, ఆర్థిక అక్షరాస్యతలో శిక్షణ మొదలగువాటి గురించి వివరిస్తే ఆహార ఉత్పత్తుల గురించిన సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు.
- మహిళా సహకార సంఘాలను ప్రోత్సహిస్తే మార్కెట్ల గురించి అవగాహన వస్తుంది.
- గృహ నిర్ణయాల నుండి విధాన రూపకల్పన వరకు అన్ని స్థాయిలలో మహిళలు పాల్గొనేలా చేయాలి..
- సమాన పనికి సమాన వేతనం అన్నింట్లో కల్పించాలి.
- ఉచితముగా సాంకేతిక విద్యను గ్రామీణ, మధ్య తరగతి బాలికలకు అందించాలి.
- మహిళలకు, పిల్లలకు, సీనియర్ సిటిజన్లకు ఆహార భద్రత కార్యక్రమాలు మెరుగు పరచాలి.
- లింగ ఆధారిత వివక్షత, హింసను తొలగించే చట్టాల అమలును పటిష్ట పరచాలి.
- మహిళలు తమ హక్కులను తెలుసుకునే విధమైన న్యాయ విద్యను, చట్టాల గురించి అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలి.
- భారత ప్రభుత్వం ఆహార భద్రతా చట్టాన్ని 2013లో ప్రవేశపెట్టినప్పటికి ఇంకా వివక్షత వలన మహిళలు ఆహార అభద్రతకు లోనవుతున్నారంటే పటిష్ట చర్యలు అవసరం. గర్భధారణ, ప్రసవ సమయంలో తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు తెలియాలి. 2015-16 భారత దేశంలో 15 నుండి 49 సంవత్సరాల వయసున్న గర్భిణేతర మహిళలలో 22.9% మంది తక్కువ బరువుతో ఉన్నారు.
- ఆహార మరియు పోషకాహార అక్షరాస్యతలను పెంపొందించే విధముగా గ్రామాలలో కార్యక్రమాలను నిర్వహించాలి. ఆహార అక్షరాస్యత అంటే ఒక వ్యక్తికి ఆహారం గురించిన అవగాహన ఉండడము. ఆహారాన్ని ఎలా పండించి, ప్రాసెస్ చేసి, వినియోగిస్తారు అనే అవగాహనతో పాటు ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే నైపుణ్యం. పోషకాహార అక్షరాస్యత అంటే పోషకాహార సమాచారాన్ని తెలుసుకొని అర్థంచేసుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉండడం.
మహిళల కర్తవ్యం:
మనవంతు భాద్యతగా ఏ విధమైన ఆహారం మనకు, మన కుటుంబానికి, పిల్లలకు, వృద్ధులకు, వ్యాధిగ్రస్తులకు అవసరమో అవగాహనతో తెలుసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఆరోగ్యమైన ఆహారాన్ని తయారు చేసుకోవాలి. నగర లేదా పట్టణ, మధ్య తరగతి మహిళలు షుగర్, రక్తపోటు, మోకాళ్ళ నొప్పులు, అధిక బరువు, థైరాయిడ్, కాన్సర్, మెడ నొప్పులు, హైపెర్ టెన్షన్ మొదలగు వ్యాధులతో బాధపడుతున్నారు. ఉద్యోగస్తులైన మహిళలు సాధారణముగా ఇంటికి, ఉద్యోగానికి న్యాయం చేసే ప్రక్రియలో రెండు రకాల దోపిడీకి గురవుతూ ఉంటారు. ఇంట్లోవాళ్ళకి అన్ని సమకుర్చాలి, ఉద్యోగo సరిగ్గా చేయాలి. ఆర్థికముగా బలముగా ఉన్నా మానసికముగా, శారీరకముగా అలసిపోతారు. ఇంట్లో పనిచేసి అందరికి అన్ని సమకూర్చి తిన్నట్టు చేసి బాక్స్ ను తీసుకోని సమయముతో పరుగెత్తుతూ ఆటో, బస్సు, ట్రైన్లలో వెళుతుంటారు. అందుకే వీరు ఆరోగ్య, ఆహార విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. నేడు చాలా మంది బయటి తిండికి విపరీతముగా ఖర్చు పెట్టడమే కాకుండా అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. దానిని సాధ్యమైనంతవరకు తగ్గించాలి. సెల్ ఫోన్ లేదా నెట్ సహాయముతో ఆహార పోషకాహార అక్షరాస్యను పెంచుకోవాలి. వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, కారణాలు ఏమిటి అనే కనీస అవగాహన కల్పించుకుంటూ మాంసకృత్తులు, కార్బోహైడ్రేట్ లు, పిండిపదార్థాలు అంటే ఏమిటి, శరీరానికి ఎన్ని కాలరీల ఆహారం అవసరo, ఎంత ఎత్తుకు ఎంత బరువు ఉండాలి (BMI) తెలుసుకోవాలి. BP చూసుకున్నపుడు సిస్టాలిక్, డయాస్టాలిక్ గురించి, ఆక్సిజన్, పల్స్ రేట్ ఎంత ఉండాలో తెలియాలి.
ఇంట్లో ఎవరైనా అనుకోని వ్యాధి బారిన పడితే ( కాన్సర్, బ్రెయిన్ ట్యూమర్ etc.,) దాని గురించి ఇంట్లోవారు, పిల్లలు మెల్లగా వివరించాలి తప్ప దానిని దాచిపెట్టి ఒక సున్నిత వాతావరణాన్ని ఏర్పడనీయవద్దు. అలాంటివి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు జీర్ణించుకోవడం మహాకష్టం. అటువంటప్పుడు ధైర్యముతో, పరస్పరం ఒకరికొకరు చేయుతనిచ్చుకుంటూ రోగికి సహాయముగా ఉండాలి. కాన్సర్ అనగానే భయపడి పెడబొబ్బలు వద్దు. నివారణ ఏమిటో కనుక్కోవాలి. ఇంట్లో చదువుకుంటున్న అమ్మాయిలు లేదా అబ్బాయిలు కొంత వారి తల్లులకు, అమ్మమ్మలకు, నానమ్మలకు ఆహార ప్రాధాన్యతను నేర్పించాలి. ఉదాహరణకి: రొమ్ము కాన్సర్. రొమ్ములో ఎక్కడ నొప్పిలేని కణతి ఉన్నవెంటనే డాక్టర్ ను సంప్రదించాలి అనే అవగాహన రావాలి. రొమ్ము కాన్సర్ ఇతర కారణాలతో పాటు పోషకాహార లోపంతో కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే గర్భాశయ కాన్సర్. నెలసరి సమయాలలో, ఇతరత్రా పరిశుభ్రతను ఏ విధముగా పాటించాలి అనేది ముఖ్యం. మనం తెలుసుకొని, అర్థం చేసుకోలేని వాళ్లకు అర్థం చేయించాలి. వ్యాధులను అనుసరించి మందులు, ఆహారం తీసుకోవాలి. ఇంట్లో ఆడపిల్లలు అందం, జీరో సైజు పేరిట అనారోగ్య పాలవుతున్నారు. మహిళలను, కౌమారదశగల ఆడపిల్లలను ఎక్కువగా అనారోగ్యం పాలు చేసే అలవాట్లు: OCD (Obsessive Compulsive Disorder) మానసిక వ్యాధి, చేసిన పనినే చేయడం అతి శుభ్రత. ఈ ప్రక్రియలో ఎక్కువగా రసాయనాలు వాడడం – హెయిర్ డై లోని PPD (పారాఫెనిలెండియమిన్) – అల్యూమినియం పాత్రలలో వంటలు – ప్లాస్టిక్, నాన్ స్టిక్ ల వాడకం – ఫ్రీజ్ లో రోజుల తరబడి ఉంచిన పదార్థాలు వాడడం వలన ఉబ్బసం, శ్వాసకోశ, కిడ్నీ, కాన్సర్, పునరుత్పత్తి, ఎముకలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
గ్రామీణ మహిళలు:
గ్రామీణ మహిళలకు లేదా బాలికలకు, రక్తహీనత, పోషకాహార లోపం, క్షయ, HIV/AIDS, మలేరియా వంటి అంటూ రోగాలతో పాటు రొమ్ము, గర్భాశయ కాన్సర్ కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. మన దేశంలో గిరిజనులను తీవ్రముగా ప్రభావితం చేస్తున్న ఆరోగ్య సమస్యలలో ‘సికిల్ ఎనీమియా’ ఒకటి. ఇది ఎర్ర రక్త కణాలపై ప్రభావం చూపే జన్యుపరమైన రక్త సంబంధిత రుగ్మత. గ్రామీణ మహిళా అక్షరాస్యత పెరిగినప్పటికీ ఆహార అవగాహన లోపం ఉంటుంది. అందుకే వ్యాధులన్నింటిపైన విస్తృత రీతిలో నిరంతరం మహిళా అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలి. పాటశాలలలో ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చి విద్యార్ధులకు ఆహార ప్రాధ్యన్యతను చెప్పాలి. కళాశాల, విశ్వవిద్యాలయ అధ్యాపక, విద్యార్థిని విద్యార్థులకు శిక్షణ ఇచ్చి చదువులో భాగముగా గ్రామాలలో పర్యటించి ఆరోగ్యం గురించి అవగాహన కల్పించే విధానాన్ని ప్రోత్సహించి యువతను భాగస్వామ్యం చేయాలి. ఈ ప్రక్రియలో నెలసరి, గర్భధారణ, ప్రసవ సమయములో, బాలింతగా ఉన్నప్పుడు పరిశుభ్రత, మందులు, పోషకాహారం గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు, అల్యూమినియం, ప్లాస్టిక్ వాడకం కిడ్నీ, కాన్సర్ కు మూలం అని మహిళలకు ముఖ్యముగా గ్రామీణ మహిళలకు వివరించాలి. సర్వేలో మహిళా గ్రామీణ శ్రామిక శక్తి భాగస్వామ్యం రేటు పెరిగింది కనుక వీరికి పోషకాహారం తప్పకుండా అందాలి. సాంకేతికత, అవగాహన, ఆరోగ్య సంరక్షణ విధానాల ద్వారా వ్యాధులను పూర్తిగా నివారించడం ప్రభుత్వ ధ్యేయముతో పాటు, మహిళా సంఘాలు, డాక్టర్స్ మరియు ANM ల సలహాలతో ఆర్థిక, పోషకాహార, ఆరోగ్య అక్షరాస్యతలను ఒక ఉద్యమంలా చేపట్టి పల్లె పల్లెకు విస్తరింపచేయాలి. పౌరులలో స్వీయ ఆరోగ్య చైతన్యం రావాలి, తోటివారిని ఆరోగ్య మార్గంలోకి నడిపించాలి.
నోట్:
ఆడవారు వంట చేస్తున్నపుడు సహాయం చేయడం, వంటను వంకలు పెట్టకుండా తినడం, వంట గదిని శుభ్రముగా ఉంచడం, పనిమనిషి రాకపోతే ఆడ మగ విచక్షణ లేకుండా సహాయం చేయడం ఇంట్లో వారి కర్తవ్యం,. ఎందుకంటే వంట అందరికి. ‘తిన్నావా, ఆరోగ్యం బాగుందా’ అనే ఆత్మీయ మాట ఆడవారిని శారీరకముగా, మానసికముగా ప్రశాంతముగా ఉంచుతుంది. ఇల్లు క్షేమంగా ఉంటుంది.
REFERENCES:
- https://tradingeconomics.com
- https://timesofindia.indiatimes.com
- https://m.economictims.com
- Sen, Amartya. Many Faces of gender inequality. Frontline volume 18, issue 22, oct. 27 – Nov. 09, 2001.
- World Health Organisation. Gender Inequality Index, Nutrition and nutrition related health and development data.
- National Family Health Survey– 5 (2019-2021)
- Gender equality and Food Security – Women’s Empowerment as a tool against Hunger-
- Food and Agriculture Organisation Report – 2022
- https://www.pib.gov.in
- https://www.unicef.org
- Food and Agriculture organization Report – 2024-25
- Department of Agriculture & Farmers Welfare, Ministry of Agriculture & Farmers Welfare Government of India 2024-25
Dr. Metta Usha Rani,
Assistant Professor in Economics (Rtd),
Satavahana University,
Karimnagar,
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
భారత దేశంలో లింగ వివక్షత – ఆహార అభద్రత – మహిళ ఆరోగ్యం (వ్యాసం)- డా. మెట్టా ఉషా రాణి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>