మూసధోరణిని ఛేదించిన తిరుగుబాటు బావుటా అనిశెట్టి రజిత! (స్మృతి వ్యాసం) -సింగరాజు రమాదేవి

singaraju ramadevi
1984 లో ‘గులాబీలు జ్వలిస్తున్నాయి’ అన్న కవిత్వ సంపుటితో మొదలైన అనిశెట్టి రజిత సాహితీ ప్రయాణం ఏడు కవితా సంపుటాలు, అనేక దీర్ఘ కవితలు, హైకులు,నానీలు, వందలకొలదీ సాహిత్య సామాజిక వ్యాసాల రచనతో పాటు, అనేక గ్రంధాలకు సంపాదకత్వం తో చివరి నిమిషం వరకూ కొనసాగుతూనే ఉంది. పలు పత్రికలకు సంపాదక వర్గంలో సభ్యులుగా, రుద్రమ ప్రచురణల ప్రచురణ కర్తగా, ప్రజస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ అధ్యక్షులుగా, ఇలా అనేక పాత్రలలో ఆమె విస్తారమైన సాహితీ కృషి ఒక పక్కన ఉంటే , తొలి దశ మలి దశ రెండు ప్రత్యేక తెలంగాణా ఉద్యమాలలో పాల్గొన్న ఉద్యమకారిణి గా, అనేక ప్రజా సంఘాలతో వివిధ దశలలో చురుకుగా పని చేసిన సామాజిక కార్యకర్తగా ఆమె కృషి అందరికీ పరిచయమే!
ఇక ఆమె పొందిన ప్రముఖ పురస్కారాల జాబితా కూడా పెద్దదే! సుభద్రాకుమారీ చౌహాన్ అవార్డ్, వీరాంగన సావిత్రీబాయి ఫులే ఫెలోషిప్ అవార్డ్, శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి పురస్కారం, డాక్టర్ బోయి భీమన్న పురస్కారం ,రొట్టమాకు రేవు కవిత్వ పురస్కారం, ఫ్రీవర్స్ ఫ్రంట్ -కుందుర్తి ఆంజనేయులు అవార్డ్ ఇలా అనేకం !
అయితే ఆమె ఎప్పుడూ అవార్డులు కోసం రాయలేదు. తెలంగాణ ధిక్కార స్వరం,ప్రజా కవి కాళోజీ వారసురాలిగా తనను తాను అభివర్ణించుకున్న అనిశెట్టి రజితది కూడా ఎప్పుడూ ధిక్కార స్వరమే! తొలుత విప్లవవాదం, ఆపై స్త్రీవాదం, ఆ తరువాత అస్తిత్వ వాద భావాలను, సిద్ధాంతాలను బలంగా అందిపుచ్చుకుని పీడిత ప్రజల పక్షాన నిలబడి అధికార వర్గాలను నిక్కచ్చిగా నిలదీయగలిగిన పదునైన గొంతుక అనిశెట్టి రజిత.
కవిగా ఆమె వైవిధ్యమైన వస్తువులతో, విభిన్నమైన తన శైలిలో కవితలు సృజించింది. తన అనుభవాలను, అనుభూతులను, ఆవేదనలను వ్యక్తపరుస్తూనే… బహుళ అస్తిత్వ గళాలను, అణచివేతకు, అసమానతలకు గురైన అట్టడుగు వర్గాల వెతలను కూడ తన కవితల్లో శక్తివంతంగా కవిత్వీకరించింది. తనకు పరిచయమైన వ్యక్తులతో తన అనుబంధాన్ని కూడా తన కవితల్లో పదిల పరిచింది.
ఇక వ్యక్తిగత జీవితంలో కూడా ఆమె సమాజ నిర్దేశిత సంప్రదాయిక మూస పాత్రలో ఎన్నడూ ఒదిగిపోలేదు. ఆమెది ఎప్పుడూ తిరుగుబాటు పంథానే! ఆమె ఆహర్యమే విలక్షణంగా ఉండేది. పొట్టిగా క్రాఫ్ చేసిన జుట్టుతో , సల్వార్ కమీజ్ పై వేసుకున్న ఓవర్ కోటుతో యే గుంపులోనైనా భిన్నంగా, తనదైన ప్రత్యేకతతో కనపడేవారు. సమాజంలో ఇంత ఆధునికత కూడా లేని తన కాలేజీ రోజుల్లోనే ఆమె బెల్ బాటం పేంట్లు ధరించి ధైర్యంగా తిరిగే వారు అని చెప్తారు.
అలాగే సగటు ఆడపిల్లలాగా పెళ్లి పిల్లల జోలికి పోకుండా తన జీవితం అంతా సాహిత్యం, సమాజం రెండు కళ్ళుగా గడిపిన తీరు కూడా ఎన్నో మూస ధోరణులను బద్దలకొట్టిన జీవన విధానం గా చెప్పచ్చు! ఇక మరణానంతరం తన కళ్ళను, శరీరాన్ని మెడికల్ కాలేజీకి దానం ఇచ్చేట్టు ఆమె చేసిన ఏర్పాటు మరణంలో కూడా మూస ధోరణికి భిన్నమైన ఆమె ఆదర్శవంతమైన ఆలోచనా ధోరణిని తేటతెల్లం చేస్తుంది.
అనిశెట్టి రజితక్క మన అందరినీ హఠాత్తుగా విడిచి వెళ్ళిపోయిన సందర్భంలో, ఆమె కవితలోని ఈ పంక్తులు పదే పదే జ్ఞాపకం వస్తున్నాయి.
“నేనిప్పుడు ఒక నైమిశారణ్యంలో సేదతీరాలని
విశ్వ యాత్రతో విస్మృతినై తప్పిపోవాలని
కాలం కాన్వాస్ మీద తుమ్మెదలా వాలి ఒక చుంబన మకరందాన్ని ఆస్వాదించాలని
ఒక సృష్టిని అధ్యయన మధనం చేస్తూ
కాలానికి ఊయలగట్టి రుతురాగమై ఊగాలని
పిల్లనగ్రోవి నుండి వీచే గాలిపాటనై
నిర్మోహంగా ఆత్మదీపాన్ని ఆలింగనం చేసుకోవాలని( ఉంది)”
ఆమె ఆఖరి కవితా సంపుటి ’కాలం కేన్వాస్ మీద’ లోని కవితా పాదాలు ఇవి. ఈ సంపుటిలోని కవితలను పరిశీలిస్తే ఆమె తన శారీరిక అనారోగ్యంతో చేసిన పోరాటం, దానిని అధిగమించటానికి ప్రయత్నిస్తూనే తన సాహిత్య సామాజిక కృషిని నిరంతరం కొనసాగిస్తూ ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ క్రమంలో ఆమె కవిత్వంలో ప్రతిఘటనతో పాటు గాఢమైన తాత్వికత చోటు చేసుకుంది.
కవితలోని ఈ ఆకాంక్షలో అంతులేని భావుకతతో పాటు లోతైన తాత్వికత కనిపిస్తుంది. ఈ సంపుటిలో ఇలాంటి కవితలు ఎన్నో!
’ఎచటకి పోతానీ కాలం’ కవిత ఒక వేదనాభరిత స్వరం !
“కాలనియమాలు లేని కర్కశత్వాలకి దేహగాయాల సలపరింతలు…
మనిషితనం తోడుండే మందేది” అని ప్రశ్నిస్తారు.
“జీవితం కోల్పోయిన తనం
నా ఉసురుల పొగమంచు సెగల్లో
ఊపిరాడక కొల్లగొట్టుకుపోతూ
గాలానికి చిక్కిన చేపను
ఎచటికి పోతానీ కాలం” అని దీనంగా అడుగుతారు.
’నదిలా సాగాల్సిన జీవితం’ కవితలో కూడా
“ఊపిరాడక బండబారిన చెరసాలలో
ఉరికొయ్యకు వేళ్లాడే స్వప్న శిలను
శిల్పంగా నన్ను చెక్కుకోలేని ఉలిని”
అంటారు నిస్పృహ నిండిన స్వరంతో…
అనిశెట్టి రజిత రాసిన ఈ కవితల నిండా, నిరాశతో, నిర్వేదంతో కూడిన క్షణాలు కనపడతాయి. అయితే వాటిని ఎదిరించి ఆమె మనసుతో ,శరీరంతో,పరిస్థితులతో అంతర్యుద్ధం చేసి మళ్ళీ ఆశని, శక్తిని, పోరాట పటిమని కూడగట్టుకుని సానుకూల దృక్పథంతో, కొత్త ఉత్సాహంతో చురుకుగా అడుగులు వేసే సందర్భాన్ని కూడా చూస్తాం.
ఈ సంపుటిలోని రెండు కవితలు… మొదటిది ’ఏదో ఒక రోజు’ అన్నవి పైన చెప్పిన దానికి సరిగా సరిపోతాయి.
“గుప్పెడంత గుండె నుండి శిశిరాన్ని తరిమేస్తాను
తవుటం బెట్టిన తోటలా నిరీక్షిస్తూ
ఉగాది అడుగుల చప్పుడు కలను కంటాను
శుభసూచకం , జయహో అంటూ మేల్కొని
ఏదో ఒక రోజు అన్న ఆలపనతో ఆనంద గీతమౌతాను”.
అని గొప్ప ఆశావహ దృక్పథంతో నిరాశని తరిమికొడతారు. ఇక ఈ కవితా సంపుటి వెనుక కవర్ పేజీ మీద ఉన్న ’అంతర్గానం’ కవితా పంక్తులలో మనకు ఇంకా స్పష్టమైన సమాధానం దొరుకుతుంది.
“నేనిప్పుడు నా మనో దేహాల బూజుల్ని దులపరించుకుని మనిషిని కావాలి
కవినై గాయకినై, శిల్పినై కొత్తగా నవజాత శిశువులా ఆవిష్కృతం కావాలి!
ఆ స్వప్నాలు స్వప్న శిలలై మాసిపోకుండా
వసంత కాల మేఘ గర్జనలతో కలిసి
కాకలీ కాంతి స్వనాల వానగా కురుస్తూ
కోకిలల కోసం చిగురుటుయ్యాలలు కట్టాలి”
అని అంటూ సమాజం పై గొప్ప ప్రేమతో కొత్త ఉత్సాహంతో, భవిష్యత్తు పట్ల ఆశాభావంతో రేపుని ఆహ్వానిస్తారు! పడకుండా ఉండటం కాదు గొప్ప, పడ్డాక అలాగే ఉండిపోకుండా ప్రయత్నంతో తిరిగి లేచి పరుగు తియ్యటమే గొప్ప అని పెద్దలు అంటారు. ఆ పోరాట స్ఫూర్తికి, ఆశావహ దృక్పథానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ సంపుటిలోని చాలా కవితలు!
బహుశా ఆ పోరాట స్ఫూర్తితోనే అనుకుంటా ఆమె తన కార్యకలాపాలు కొనసాగించింది. గత సంవత్సరం కాలంలో అమె నిర్వహించిన నాలుగైదు సాహితీ సభలలో నేను పాల్గొనే అవకాశం కలిగింది. ఒకటి రుద్రమ ప్రచురణల ద్వారా ప్రచురించబడ్డ అయిదు పుస్తకాల ఆవిష్కరణ సభ. తమ్మెర రాధిక రాసిన ’హవేలీ దొరసాని కథలు’, భారత దేశంలోవితంతు వ్యవస్థ, అనిశెట్టి రజిత కవితా సంపుటి ’కాలం కేన్వాస్ మీద’, చిమమండా అడిచే ’ఫెమినిస్ట్ మేనిఫెస్టో’ ప్రసంగాలకు పి.సత్యవతి అనువాదం మొదలగు పుస్తకాలు. పెద్దగా అంగ బలం ఆర్ధ బలం లేని ఒక ప్రచురణ సంస్థ ద్వారా ఇన్ని పుస్తకాల సంపాదకత్వం , ప్రచురణ సామాన్యమైన విషయాలు కావు. అవి ఆమె పట్టుదలకి, సామాజిక ప్రయోజనం కల సాహిత్యం పట్ల నిబద్ధతకి నిదర్శనం.
రెండవ సభ వరంగల్ కు చెందిన ప్రముఖ న్యాయవాది సాహితీవేత్త కె.యెస్.ఆర్.జీ ప్రసాద్ జీవితం పై వేసిన పుస్తక పరిచయ సభ. ఇది మిత్ర మండలి వారి సహకారం తో నిర్వహించిన సభ. ఇందులో కూడా అనిశెట్టి రజిత ముఖ్య పాత్ర వహించారు. అదే సభలో ఆయన సతీమణి రచయత్రి సూర్యముఖి గారి రచనల మీద కూడా ఒక సభ పెట్టుకుందాం అని ప్రతిపాదన చేసారు.
మూడవ సభ ఉద్యమకారుడు నల్లెల రాజయ్య గారి సంస్మరణలో వేసిన పుస్తకం ’ప్రజల మనిషి నల్లెల రాజయ్య’ పుస్తకావిష్కరణ సభ. రాజయ్య గారి మిత్రులు,కుటుంబ సభ్యులు, అభిమానులు సమక్షంలో జరిగిన ఆ సభలో రజితక్క ముఖ్యంగా ముందుండి నిర్వహించారు.
నాలుగవ సభ విజయవాడలో బాలాంత్రపు ప్రసూన గారి ఇల్లు నాగాలాండ్స్ లో జరిగిన సత్యవతి గారి అనువాద పుస్తక పరిచయ సభ. ఆ సభ కోసం వరంగల్ నుండి రాను అయిదు పోను అయిదు గంటల చొప్పున కారు లో ప్రయాణం చేసి వెళ్ళాము. ఆ సభ నిర్వహించటమే కాక పట్టుపట్టి విజయవాడలోని అంబేడ్కర్ భారీ విగ్రహం మరియు మ్యుజియం చూసుకుని రావటం రజితక్క పట్టుదలకి, తాను అనుకున్నది చేసే క్రమంలో తన శారీరిక శ్రమని, ఇబ్బందులను పక్కన పెట్టి మరీ పని చెయ్యటం ఆశ్చర్యంతో పాటు చాలా స్ఫూర్తిదాయకంగా అనిపించింది.
ఇక అంతకు ముందు దాదాపు పదేళ్ళగా ప్రరవే లో భాద్యురాలిగా ఆమె చేసిన ప్రయాణాలు, క్షేత్ర పర్యటనలు, సభా నిర్వహణలో పడ్డ శ్రమ, చేసిన కృషి అందరికీ తెలిసినవే!
ఇవే కాక ఆమె అనేక పుస్తకాలు, కార్యక్రమాలకు ప్రణాలిక సిద్ధం చేస్తూ ఉండింది. ప్రముఖ తెలంగాణ రచయత్రి ఆమె పాకాల యశోదా రెడ్డి పై ఆమె రాసిన వ్యాస సంపుటి ప్రచురణకి సిద్ధం చేస్తూ ఉంది. ఆమె రాసిన ఇంకా అనేక సాహిత్య వ్యాసాలు కూడా పుస్తకంగా వేసే ఆలోచన కూడా ఉండింది.
ఇక ఆమె హఠాత్ మరణానికి ఒక రోజు ముందు నా కథా సంపుటి ’ఔను నాకు నచ్చలేదు’ ఆవిష్కరణ సభకి ఎంతో చురుకుగా ఆత్మీయంగా అధ్యక్షత వహించారు. ఆ తర్వాత మా ఇంట్లో అందరితో కలిసి భోజనం చేసారు. ఆ సభలో అక్కను సన్మానించుకోవటం నాకు సంతోషం కలిగించిన విషయం. అయితే మర్నాడే ఇలా జరగటం అత్యంత దురదృష్టకరం!
సామాజిక కార్య క్షేత్రంలో తన పంథాలోనే నిత్య చైతన్య శీలిగా పోరు బాటలోనే ఉన్నా, వ్యక్తిగత స్థాయిలో మాత్రం అనిశెట్టి రజిత ఆత్మాన్వేషణ చేస్తూ,తాత్విక ధోరణి వైపు అడుగులు వేయటం చూస్తాము. పేద జనాలకు ఆహార పంపణీ, దుప్పట్ల పంపకం, మూగ జీవాలకు అన్నం వండి పెట్టటం ఇవి ఆమె తరచుగా చేసే కార్యక్రమాలు.
ఇప్పుడు ఆమె ఇక శెలవంటూ పయనం అయిపోయిన ఈ సందర్భంలో ఆమె తన అనారోగ్యంతో చేసిన అంతర్యుద్ధం, పడిన వేదన దానిని అధిగమించి పనిలోనే విశ్రాంతిని వెతుక్కున్న తీరు దుఖఃం కలిగిస్తూనే ఆమె ధైర్యానికి, వ్యక్తిత్వానికి జోహారు అనిపించక మానవు. కవితల్లో వ్యక్తమైన తాత్వికత లోతు అర్ధమై మనసు ఆర్ద్రమౌతుంది.
కానీ ఆమె మరణం ఒక విషయం స్పష్టం చేసింది. ఆమె నిజమైన యోధ. మూస ధోరణికి భిన్నంగా జీవించింది. తాను నమ్మిన సిద్ధాంతాలకై తన సాహిత్యం ద్వారా, సమాజ సేవ ద్వారా, అనేక సంఘాలతో కలిసి పని చెయ్యటం ద్వారా పోరాటం చేస్తూనే ఉంది. చివరి శ్వాస దాకా చేపట్టిన ఆయుధాలను విడువలేదు! అస్త్ర సన్యాసం చేయలేదు! కార్య క్షేత్రం లోనే అసువులు బాసిన ధీర అనిశెట్టి రజిత!
-సింగరాజు రమాదేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
మూసధోరణిని ఛేదించిన తిరుగుబాటు బావుటా అనిశెట్టి రజిత! (స్మృతి వ్యాసం) -సింగరాజు రమాదేవి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>