రజిత అక్కకు నివాళి (స్మృతి వ్యాసం )- కావూరి శారద
కొందరుంటారు ! వాళ్ళ మార్గం ఎలా వున్నా , వాళ్ళు వాళ్ళ కోసం గాక సమాజంలోని సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ బాటలో ముందు వరుసలో వుండి ఉద్యమిస్తూ , మరి కొంత మంది వారితో అడుగులు కలిపేలా స్ఫూర్తిదాయకంగా కొనసాగుతుంటారు . అలాంటి స్ఫూర్తిమంతమైన ధీమంతురాలు రజిత అక్కా . .
రజిత అక్కని గమనిస్తూ ఉన్న మిత్రులందరూ చెప్పేది , తన రచనల ద్వారా తెలుసుకొని అర్థం చేసుకున్నదీ మొత్తంగా చూస్తే , సార్థక జీవితాన్ని జీవించి చూపెట్టింది . అందుకే మనందరం ఆమెనిప్పుడు ఇంతలా స్మరించుకుంటున్నాం .
అక్క పేరు లో ఉన్న అర్థం వెండి అయినా రజిత అక్క జీవితం వన్నె తరగని బంగారం . రజిత అక్క స్వార్ధాన్ని వదిలేసి చాలా సంవత్సరాలే అయ్యుంటుంది . బహుశా అందుకనే తను సమాజం కోసం , సమాజంలో కనీస అవసరాలలేమితో జీవితాన్ని జీవించే వారి కోసం తనకు తోచిన సాయమందించటం చివరి వరకూ నిస్వార్ధంగా కొనసాగించగలిగింది .
మనుషులే కాదు మూగజీవాలు కూడా అక్క ప్రేమకు పాత్రులయ్యాయి . బజారులో తిరుగాడే కుక్కలకు అన్నం వండి స్వయంగా తీసుకెళ్లి వాటికి పెట్టేది .
తనకు నచ్చనిదేదైనా సరే దాన్ని రాజీలేని మార్గంలో బలంగా తన తిరస్కారాన్ని తెలియజేసేది . ఆ సందర్భంలో అవతలి వాళ్ళ గురించి ఆలోచించటం గాని , సర్దుబాటు ధోరణి గాని అవసరం లేదని మాట్లాడటం నేను విన్నాను .
కొన్ని నచ్చని సందర్భాలలో వాళ్లతో విభేదించడం కూడా అనవసరం అనుకుని తను తన పంధాలో పయనించింది .
ఏంటమ్మా మన ఆడవాళ్ళు ? ఎప్పుడూ పూజలు , వ్రతాలు , నోములు , ఫంక్షన్లు అంటూ తిరుగుతూ ఉంటారు . అరవైయ్యేళ్ళు ఇలాగే కదా జీవించారు . కనీసం ఇప్పుడన్నా సమాజం కోసం జీవించాలని ఎందుకు అనుకోరమ్మా వీళ్లంతా అంటూ ఉండేది నాతో .
భారత దేశంలో వితంతువ్యవస్థ గురించి వ్యాసాల సంకలనాన్ని ప్రచురింప చేయడం మాత్రం ఎంతో శ్రమకోర్చి నేటి సమాజానికి అత్యవసరమైనటువంటి పుస్తకాన్ని తీసుకు రావటాన్ని కేవలం అభినందనలతో సరిపెట్టకూడదు మనం . దానిలో ఉన్న ఆచరణాత్మకమైన అంశాలను సమాజానికి కనీసం కొంతమందికి తెలిసేలా ప్రయత్నం చేయాలి .
తన కవిత్వం ద్వారా బలహీనమౌతున్న మానవ సంబంధాలను , శ్రమజీవుల చెమట శక్తిని , మట్టితో మనుషులకుండే అనుబంధాన్ని ఎంతో మంచి మనసుతో కవిత్వీకరించిన మన రజిత అక్కకు హృదయపూర్వక నమస్సుమాంజలులతో నివాళులు సమర్పిస్తున్నాను .
-కావూరి శారద
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
రజిత అక్కకు నివాళి (స్మృతి వ్యాసం )- కావూరి శారద — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>