అంతర్వీక్షణం-5 (ఆత్మకథ )-విజయభాను కోటే

నా జీవితంలో నన్ను ఎప్పటికీ, ఇప్పటికీ వదలనివి రెండు ఉన్నాయి. ఒకటి అనారోగ్యం, రెండు పరిశోధనాత్మకత. మొదటిది ఎంత ఎక్కువ పైత్యం చూపిస్తే రెండోది అంత పెక్కుగా నాలోకి విస్తరించేది. ఇదేమిటనిపిస్తోందా? అదంతే!
మా డాడీ నవ్వితే వీధి చివరికి వినిపించేది. అంత గట్టిగా నవ్వేవారు. నేను కూడా అంతే. నవ్వుతూనే ఉండేదాన్ని.
నేను పుట్టిన ఇరవై ఒకటో రోజున అంట. నాకు జ్వరం వచ్చింది. ఆ జ్వరం కాస్తా ఎక్కువయ్యి ఉన్నట్టుండి కళ్ళు తిరగబడ్డాయి. అంటే ఫిట్స్ లా వచ్చింది. అమ్మమ్మ, తాతయ్య, మమ్మీ.. ఖంగారు.. గందరగోళం..
డాక్టర్.. మందులు.. వగైరాలు అన్నీ మామూలే కదా!
ఆయాసం వచ్చిందట. అది ఆపుడపుడూ కొనసాగడం మొదలైంది. ఆ కాలంలో మందులు ఎలా ఇచ్చేవారో తెలీదు. Betnesol మాత్ర ఇచ్చేవారట. ఇంగ్లీషు మందుల గురించి అప్పట్లో ఎవరికి అవగాహన ఉండేది? పిల్లకు తగ్గిపోవాలి అనే ఆలోచన, ఆదుర్దా తప్ప తల్లిదండ్రులకు ఇంకేమి ఉంటుంది? అలా Betnesol నా శరీరంలో చేరుతూనే పోయింది. అదొక steroid. అందుకేనేమో విపరీతమైన చురుకుదనం ఉండేదట నాలో. ఏ పని చేసినా అలుపూ సొలుపూ లేకుండా చేసేదాన్ని. అల్లరి బాగా చేసేదాన్ని. తిండి కూడా అలానే తినేదాన్ని. కానీ చాలా బక్కగా ఉండేదాన్ని. నాకు ఒంట్లో బాగాలేకపోతే చెల్లిని కూడా చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి నన్ను అమ్మమ్మ దగ్గరికి పంపేసేది మమ్మీ.
కొన్నాళ్ళకు వెన్ను ముదిరాక ఆయాసం తగ్గుముఖం పట్టింది. స్కూల్ కి వెళ్ళడం, స్నేహితులు, అల్లరి, చెల్లి, తమ్ముడు.. సందడే సందడి. ఆపుడపుడూ ఆయాసం పలకరిస్తే Betnesol ఆదుకునేది. పదిహేనేళ్ళు దాటాక ఎపుడైనా ఏడిస్తేనో, బాగా భావోద్వేగానికి గురి అయితేనో విపరీతంగా ఆయాసం వచ్చేది. ఊపిరితిత్తులను బయటికి తీసి పారేయాలి అనిపించేది. ఇంట్లో చెప్పాలి అనిపించేది కాదు. నేనే ఎలా అయినా తగ్గించేసుకోవాలి అనిపించేది.
అలాంటపుడు రామకృష్ణ మఠం అక్కున చేర్చుకునేది. స్వామీ వివేకానంద పుస్తకాలు ఆదుకునేవి. ఆ పుస్తకాలు చదివి, నేను చాలా బలమైనదాన్ని, నేను ఏ బాధనైనా తట్టుకోగలను, అధికమించగలను అనుకునేదాన్ని. నా soulmate మధుతో ఉంటే ప్రపంచమే తెలిసేది కాదు. పెద్ద ఆరిందాల్లా ఏమిటేమిటో మాట్లాడుకునేవాళ్ళం.
పదహారేళ్ళ వయసులో అనుకుంటా, ఆయాసంతో పాటు, గుండెల్లో విపరీతమైన నొప్పి వచ్చింది ఒకసారి. Betnesol వేసుకోవడం మామూలే కదా! నొప్పికి ఏదో pain killer ఇచ్చారు డాక్టర్. ఒక వారం రోజులు ఇబ్బంది పడ్డాను. తర్వాత తగ్గిపోయింది.
ఇంటర్ తర్వాత డిగ్రీ భీమవరంలో చేశాను. అక్కడ హాస్టల్ లో ఉండేదాన్ని. ఎంత చురుకుగా ఉన్నా, వారానికి ఒకసారైనా ఆయాసంతో పాటు గుండెల్లో నొప్పి వస్తూనే ఉండేది. అక్కడి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము నేను, నా స్నేహితురాలు. చెక్ చేసి, నొప్పి వచ్చినపుడల్లా వేసుకోమని ఒక pain killer suggest చేశారు. Ibuprofen..
వారానికి ఒకసారి కాస్తా రెండు రోజులకు ఒకసారి నొప్పి వచ్చేది. ఇక ఆ నొప్పిని భరించలేక రోజూ pain killer వేసుకోవడం మొదలైంది. Pain killers అంతగా వాడకూడదని తెలియదు. నొప్పి తగ్గిపోవాలి అంతే!
ఆపుడపుడూ ఆ నొప్పి, ఆయాసం వచ్చినపుడు ఛాతీ భాగం అంతా పచ్చి పుండులా అనిపించేది. వాపు వచ్చేది. అన్నింటికీ మంత్రం pain killer ఒకటే!
ఈ బాధ అప్పటి నుండి ఇప్పటి వరకూ అలా నన్ను వెన్నాడుతూనే ఉంది. అప్పుడు diagnosis లేదు. చాలా కాలానికి Seven Hills hospital లో డాక్టర్ షా diagnose చేసి చెప్పినది ఏమిటంటే, అది ఒక Rare Disease. పేరు Teitze Syndrome. వైద్య పరిభాషలో Costochondritis. అప్పటికే విపరీతంగా pain killers నా శరీరంలోకి చేరిపోయాయి. (ఈ వ్యాధి కనిపెట్టేసరికి నాకు ముప్ఫై ఏళ్లు దాటిపోయాయి)
ప్రతి విద్యార్థీ ప్రత్యేకమైనవారే,,,, ప్రతి ఒక్క విద్యార్థీ unique అంటాం కదా.. నిజానికి ప్రతి శరీరమూ unique అన్నది కూడా మనం తెలుసుకోవాలి. ఒకే పరిస్థితులలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆ పరిస్థితులకు విభిన్నంగా ప్రతిస్పందిస్తారు. అలానే ఆరోగ్యం కూడా అన్నది మనకు అర్థం కాదు.
పదిహేడేళ్ల వయసు నుండి ఇక ప్రతి రోజూ ఏదో ఒక అనారోగ్యపరమైన ఇబ్బందులతోనే నా బ్రతుకు బండి నడిచింది. ఎవరు ఎదురు పడినా, నన్ను మొదట అడిగే ప్రశ్న (ఈనాటికీ) “ఆరోగ్యం ఎలా ఉంది?”
ఇది అని రోగ నిర్ధారణ జరగదు. మూల సమస్య ఏమిటో అర్థం కాదు..
ఏ రోజూ అనారోగ్యం లేని రోజంటూ ఉండదు. నాకేదైనా జబ్బు ఉందా అని ఆలోచన కూడా వచ్చేది కాదు. తలపోటు వచ్చింది, pain killer! గుండెల్లో నొప్పి వచ్చింది, pain killer! Periods pain విపరీతంగా వచ్చింది, pain killer! ఇక దేనికైనా అదే మందు. నాకున్నది Fibromyalgia అని ఈ మధ్యే ఒక డాక్టర్ diagnose చేశారు.
ఇలా నొప్పులూ, మందులతో ప్రయాణం సాగిస్తూనే నా డిగ్రీ పూర్తి అయింది. బీ ఈడీ కూడా భీమవరంలోనే.
ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా, నా అంత అల్లరి ఎవరూ చేసేవారు కాదు. హాస్టల్ రూమ్ లోనే కాదు, నా నవ్వులు హాస్టల్ అంతా మారు మ్రోగుతూనే ఉండేవి. అదేమిటో తెలీదు. నవ్వు నా బలం. అల్లరి నా శ్వాస. పాటలు, కవిత్వం, రాత నా జీవిక అన్నట్లు ఉండేది. నా నేస్తాలు అందరూ నెమ్మదస్తులే. అయినా నా అల్లరి enjoy చేసేవారు. బాధను అధిగమించడానికి నవ్వేదాన్ని అనుకుంటే తప్పులో కాలేసినట్లే! నవ్వుతూనే ఉండడం నాకు మహా ఇష్టం. మా డాడీ నుండి వచ్చిన చాలా లక్షణాల్లో ఇది కూడా ఒకటి కావచ్చు!
డిగ్రీ చదువుతున్నపుడు ఒకసారి నా నేస్తం కుమారి, అదే కాలేజీలో చదువుతున్న ఒక అబ్బాయిని ఒకసారి పరిచయం చేసింది మా కాలేజీ బయట. ఆ అబ్బాయిని ఆమె “అన్నయ్య” అనేది. వాళ్ళ ఊరి అబ్బాయే! ఆ రోజు పలకరింపుగా “హాయ్” అన్నానట. నాకేమీ గుర్తు లేదు. ఆ రాత్రి, ఆ తర్వాతి రాత్రి ఆ అబ్బాయి ఆ “హాయ్” అన్న పదాన్నే పట్టుకుని నిద్రపోలేదని నాకేమీ తెలీదు.
డిగ్రీ పూర్తి అయ్యాక బీ ఈడీ చదువుతున్నపుడు కూడా ఆపుడపుడూ నా నేస్తం వాళ్ళ ఊరు వెళ్ళేదాన్ని. ఈ అబ్బాయి ఇల్లు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి రెండు ఇళ్ల దూరం. రోజూ సాయంత్రం వచ్చి వీళ్ళతో పిచ్చాపాటీ మాట్లాడుతుంటాడని ఆమె చెప్పేది. ఆపుడపుడూ నేను కూడా మాట్లాడేదాన్ని కానీ ఎక్కువగా పట్టించుకోలేదు. ఒక్క ఉపద్రవం అతన్ని నా జీవితభాగస్వామిని చేస్తుందని నాకు అప్పుడు తెలియదు.
ఒక రోజు రాత్రి హాస్టల్ లో ఎప్పటిలానే తెల్లవారుజామునే నిద్ర పట్టింది. రాత్రంతా ఓపికగా మా రాణి నాకు జోల పాడుతూనే ఉంది ఆ రాత్రి కూడా. ఆ రోజు తెల్లవారితే ఆదివారం. తెల్లవారుజామున భయంకరమైన కల వచ్చింది. డాడీ ఒక తెల్లటి దుప్పటి మీద, నేల మీద పడుకుని ఉన్నారు. ముక్కులో దూదులు పెట్టి ఉన్నాయి. రెండు కాళ్ళ బొటని వేళ్ళకు కలిపి ఒక గుడ్డ ముక్క ముడిగా వేసి ఉంది. కలలో ఉలిక్కిపడి లేచి ఏడవడం మొదలు పెట్టాను. రూమ్ లో అందరూ లేచిపోయారు. కల గురించి తెలుసుకుని, “ఇలాంటి కల వస్తే కీడు పోతుంది, ఖంగారు పడకూడదు” అంటూ చాలా సేపు నాకు చెప్తూనే ఉన్నారు. వాళ్ళ మాటలతో కాస్త తేరుకున్నాను. కల మాత్రమే కదా..
ఆ రోజు ఆదివారం. రోజంతా ఏమిటోగా ఉంది. అప్పట్లో (1997) మా ఇంట్లో ఫోన్ లేదు. డాడీ ఆఫీస్ ఫోన్ మాత్రమే తెలుసు. డాడీ సోమవారం ఆఫీస్ కి వెళ్తారు, సోమవారం ఆఫీస్ కి ఫోన్ చెయ్యాలి. ఇదే మాట ఆ రోజంతా అనుకుంటూనే గడిపాను.
మర్నాడు సోమవారం! కాలేజీకి లేటుగా వెళ్దామని ఉండిపోయి, డాడీ ఆఫీస్ తెరిచే సమయానికి ఆఫీస్ కు ఫోన్ చేశాను. ఫోన్ లిఫ్ట్ చేసిన వాళ్ళతో ప్రభాకర్ గారిని పిలవమని చెప్పాను. ఆ వ్యక్తి ఆఫీస్ అటెండర్ అనుకుంటా.
“అమ్మా! నువ్వు అర్జెంట్ గా హాస్టల్ నుండి బయలుదేరి ఇంటికి వెళ్ళు” అని చెప్పి హడావుడిగా చెప్పారు. ఏమయింది అని అడిగినా మళ్ళీ అదే మాట! “ఇంటికి బయలుదేరు”
డాడీ కి ఒంట్లో బాలేదా? అమ్మమ్మ గుర్తుకు వచ్చింది. తాతయ్య గుర్తుకు వచ్చారు. వెంటనే అమ్మమ్మ, తాతయ్యల దగ్గరికి వెళ్లిపోయాను. అప్పటికే అమ్మమ్మ, తాతయ్య బయలుదేరి ఉన్నారు. నాకేమీ చెప్పడం లేదు. నేను నా కల గురించి చెప్పాను. వాళ్ళు ఏడుస్తున్నారు. ఎవరికైనా విషయం అర్థం అవుతుంది. నాకు విషయాన్ని అర్థం చేసుకోవడం ఇష్టం లేదు! మనసు ఒప్పుకోవడం లేదు!
వైజాగ్ చేరేసరికి మా ఫ్లాట్ లో హాల్ లో డాడీ! కలలో చూసినట్లే! ముక్కులో దూది, రెండు బొటన వెళ్ళూ కలిపి కట్టిన తాడు!
అందరూ ఏడుస్తున్నారు. నా కల గురించి అందరూ చెప్పుకుంటున్నారు. నా మెదడులో ఒకటే విషయం తిరుగుతూ ఉంది.
నిన్నే కల నుండి మెలకువ రాగానే నేను ఇంటికి వచ్చి ఉండాల్సింది కదా! వచ్చి ఉంటే, డాడీని కనిపెట్టుకుని ఉండేదాన్ని కదా!
రాత్రి కొమ్ము శనగలు నానబెట్టించుకున్న డాడీ ఈ రోజు సాయంత్రం ఆ కొమ్ము శనగలను కాఫీతో ఆస్వాదిస్తూ తినడం చూసేదాన్ని కదా!
Guilt! నా వల్లనే డాడీ చనిపోయారు! నాకు ముందే తెలిసినా నేను రాలేదు!
ఆ రోజు నా కలను కీడు పోతుందని చెప్పిన నేస్తాలు నా బాధను తగ్గించడానికే చెప్పారు. కల నిజమౌతుందని వాళ్ళకు కానీ, నాకు కానీ తెలియదు. అది coincidence మాత్రమే కావచ్చు. కానీ నేను వాళ్ళ మాటను విన్నాను. వెంటనే ఇంటికి బయలుదేరలేదు. నిజానికి సైన్స్ నిండిన నా బుర్ర కూడా logical గా ఆలోచించి ఉండొచ్చు. కానీ నేను బయలుదేరాల్సింది. నిద్ర ఆపుకుని డాడీని రాత్రంతా కాసుకుని ఉండేదాన్నేమో! ఆ అర్థరాత్రో, తెల్లవారుజామునో డాడీని దొంగలా ఎత్తుకుపోయే అవకాశం cardiac arrest కి ఇచ్చి ఉండేదాన్ని కాదేమో!
అందుకే! అప్పటి నుండి ఇప్పటి వరకూ ఎవరైనా ఏదైనా చెప్తే నేను వినను. నాకు అనిపించింది మాత్రమే చేస్తాను.
-విజయభాను కోటే
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
అంతర్వీక్షణం-5 (ఆత్మకథ )-విజయభాను కోటే — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>