” జానపదసాహిత్యం – పునర్మూల్యాంకనం జాతీయ అంతర్జాల సదస్సు”
బిరుదురాజు రామరాజు గారి శతజయంతి సందర్భంగా ‘జానపద సాహిత్యం పునర్మూల్యాంకనం’ పేరుతో ప్రభుత్వ డిగ్రీ & పిజి కళాశాల(స్వ.),సిద్దిపేట, ఉమ్మడి మెదక్ జిల్లా, తెలంగాణ, జాతీయ అంతర్జాల సదస్సును 15&16 ఏప్రిల్ 2025న నిర్వహించారు.
తెలుగు జానపద సాహిత్యంలో విశేష పరిశోధనకు ఆద్యులు, మార్గదర్శకులు, తరతరాల పర్యంతపు ప్రేరకులు కీ.శే. ఆచార్య బిరుదురాజు రామరాజు గారికి శతజయంతి నమస్కృతిగా ఈ సదస్సును ఏర్పాటుచేశారు. సాహిత్యకారులు, జానపద పరిశోధకులు మాట్లాడుతూ జానపదసాహిత్యం ఎంత పాతదో అంత కొత్తది. సువిస్తారమైనది. సుసంపన్నమైనది. క్రియాశీలమైన గమనం కలది. సహజమైన తాత్త్వికత కలిగినది. రాశిలో వాసిలో తెలుగు సాహిత్యప్రపంచంలో విశిష్టమైనది. చాలామంది దీన్ని కేవల గతకాలపు సాహిత్యమని భావిస్తారు. కానీ ఇది అపారమైన మానవీయ విజ్ఞానంతో కూడిన పాతబడని ప్రజల సృజన అని పేర్కొన్నారు.
జానపద సాహిత్యాన్ని ఆధునిక దృక్పథంతో తిరిగి పరిశీలించడం విశ్లేషించడం తద్వారా దాని ప్రాముఖ్యతను గుర్తించడం ద్వారా జానపద సాహిత్యంలో దాగి ఉన్న సాంస్కృతిక, సామాజిక మరియు చారిత్రక అంశాలను వెలికితీసి, వాటిని నేటి సమాజ అవసరాలకు అన్వయించాలని, జానపద సాహిత్యంలోని వివిధ ప్రక్రియలను (పాటలు, కథలు, సామెతలు, పొడుపుకథలు మొదలైనవి) లోతుగా అధ్యయనం చేయాలన్నారు.ఇంకా జానపద సాహిత్యాన్ని పరిరక్షించడం, ప్రోత్సహించడం మరియు భావితరాలకు అందించాలానే ఆశాభావాన్ని వెలిబుచ్చారు. జానపద సాహిత్యాన్ని పాఠ్యాంశాలలో చేర్చాలనే డిమాండ్ చేస్తూ, ప్రభుత్వాలు జానపద కళాకారులకు గుర్తింపు మరియు ప్రోత్సాహం అందించాలని కోరారు. ఈ సదస్సుకు సభా నిర్వహకులుగా తెలుగు విభాగం అధ్యక్షులు డా. మట్టా సంపత్‌కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఈ సదస్సుకు బిరుదురాజు రామరాజు కూతురు బిరుదురాజు పద్మావతిగారు ప్రత్యేక అతిధిగా ప్రసంగించారు. సదస్సులో సమర్పించిన వ్యాసాలను ప్రత్యేక సంచికగా ముద్రించటం జరిగింది.
-విహంగ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
” జానపదసాహిత్యం – పునర్మూల్యాంకనం జాతీయ అంతర్జాల సదస్సు” — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>