కళావతి ధిక్కార ప్రకటన ` ‘సమాయాత్త సమయం’ (పరిశోధక వ్యాసం)- అలంశెట్టి పర్శరాములు

సంపుటి – 15, సంచిక – 179 , నవంబర్ 2025,
సమర్పణ : 06.10.2025 ఎంపిక : 25.10.2025 ప్రచురణ : 01.11.2025
పరిచయం:
‘‘కవిత్వం రెండు విధాలుగా ఉత్పన్నం అవుతుంది: స్వానుభూతి చేత సహానుభూతి చేత – అనుభూతి మాత్రం అనివార్యం అన్నమాట సిద్ధాంతం. తన అనుభూతి చేత ఉచ్వేజితుడైన వాడు కవిత్వం చెప్పవచ్చు వారికి కవిత్వోత్పాదక ‘‘శక్తి’’ ఉన్నట్లయితే. లేక అన్యులు అనుభూతిచేత ప్రకంపితుడై సహానుభూతి పొంది తత్ ద్వారా కవిత్వం చెప్పవచ్చు. (కవిత్పోత్పాదన వర్ణన వివరంగా కవిసేనవేనిఫెస్టోలో ఉంది. రూ.) తన చెయ్యి తెగి రక్తం మడుగులు కడు తుండగా ఆ బాధానుభూతి వశాన కవిత్వం రాయడం ఒకటి. మరొకటి చెయ్యి తెగి రక్తం మడుగులు కడుకుండగా చూచి సహానుభూతికి గురిఅయి కవిత్వం చెప్పడం మరొకటి. ఒక్కొకసారి సహానుభూతే అనుభూతికంటే తీవ్రతరంగా ఉంటుంగి. చెయ్యి తెగి బాధపడుతున్న కొడుకు స్థితి చూచి తండ్రి మరింత బాధ పడతాడు, మానసికవేదన అనుభవిస్తాడు. ఇది లోకానుభవం.’’1 (అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు ` పేర్వారం జగన్నాధం ` పుట`22)
కీలక పదాలు: హక్కు, కొలబద్ద, ప్రజాస్వామ్యం, హననం, ఉద్దేశం, బలి, చిధ్రం.
ఉద్ధేశం:
విప్లవ రచయితల సంఘం ద్వారా ప్రచురించిన ‘సమయాత్త సమయం’ కవితా సంపుటిని కళావతి 2024 జూలై 4న విడుదల చేశారు. పీడిత ప్రజల విముక్తి కోసం, స్వేచ్ఛకోసం, సమానత్వం కోసం, ప్రజలందరి హక్కుల కోసం పోరాడుతూ అసువులు బాసిన అమరులకు ఈ సంపుటిని అంకితం చేశారు. ఈ కవితా సంపుటిలో మొత్తం 100 కవితలు ఉన్నాయి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పారుతున్న కన్నీరు అని కళావతి రాసింది. కానీ కాశ్మీరలో మొన్నటి ఎన్నికల్లో చాలా స్పష్టంగా మోషా వ్యతిరేక, ఆర్టికల్ 370 రద్దు వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. ఐదేళ్ళుగా జైల్లో ఉన్న రషీద్ మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లాను ఓడిరచాడు. అనంతనాగ్‌లో మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ఓడిపోయారు. అంటే కుహనా స్వయం పాలన వాళ్ళు కూడా ఓడిపోయారు.
‘‘వచన కవితారూపం ఒక ప్రత్యేక పరిస్థితికి ఫలితంగా ఏర్పడినదనీ, ఇది ఛందోబద్ద సాహిత్య రూపాలకన్నా గొప్పదికాదు, తక్కువదీ కాదనీ, అంతకన్నా ఎక్కువ నిబద్ధమూ కాదు, అనిబద్ధమూ కాదనీ, వచన కవిత్వ ఉద్యమకారులు గుర్తించలేదు.’’2 (తెలుగులో కవితా విప్లవాల స్వరూపం ` వేల్చేరు నారాయణ రావు ` పుట`155) ‘‘ఆ ఉద్యమం మా పాలిటి జీవనది. ఆ మంచి నీటికి చేపల్లాగ మేము ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పాం. కవితా సముద్రంలోంచి జీవన ప్రవాహంలోకి, ప్రపంచవాహినిలోంచి సాహిత్యసాగరంలోనికి ఇటూ అటూ మేము ఈదిన ఈత ఇవాళ ఒక తియ్యని తలపోత’’3 అని అరుద్ర అన్నారు. (సారస వ్యాసావళి, ఆగష్టు 1967, అరుద్ర)
ఉత్తర భారతంలో బాబ్రీ మసీదు వివాదం వల్లె దక్షిణాన ఐదున్నర శతాబ్ధాలకు పూర్వం బాబా బుడంగేర్ అనే ఒక సూఫీ తత్త్వవేత్త చిక్‌మంగళూర్‌లో నెలకొల్పిన దర్గాను దత్తాత్రేయ మందిరమని సంఫీుయులు ముస్లిం వ్యతిరేక ప్రచారానికి పూనుకున్నప్పటి నుండి అక్కడ ఏర్పడిన లౌకిక ప్రజాస్వామిక శక్తుల ఐక్య సంఘటనలో ఆమె తలలో నాలుక అయింది. ఆర్ఎస్ఎస్ వంటి సంఘ పరివారాన్ని చెడ్డీస్ అని గౌరీ లంకేశ్ ఛీత్కారమంతా ప్రతిఫలించే రచనలు చేసింది.
‘‘గౌరీ లంకేశ్’’ హత్యను ఖండిస్తూ ‘‘సమయాత్త సమయం’’ అనే కవితను రాశారు కళావతి.
‘‘ఆమె మాట్లాడిరది
ఎట్లా మాట్లాడాలో అట్లే మాట్లాడిరది
దేనిని మాట్లాడాలో దానినే మాట్లాడిరది
ఎందుకు మాట్లాడాలో అందుకే మాట్లాడిరది
ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడిరది
మాట్లాడే హక్కు ఈ దేశంలో ఉందనుకుంది
రాజ్యాంగమే ఆ హక్కు ఇచ్చాక ఇక కాదనేదెవరనుకుంది
ఎవ్వరు తప్పు చేసినా ప్రశ్నించే పరిస్థితే
ప్రజాస్వామ్యానికి కొలబద్ద అని తెలిసే మాట్లాడిరది’’4
(4. సమయాత్త సమయం ` జి.కళావతి ` పుట `31)
అలా మాట్లాడిరది గౌరి లంకేశ్ అనే జన్నలిస్టు తన తండ్రి లంకేశ్ కన్నడ దేశంలో ప్రముఖ సోషలిస్టు మేధావి. రామ్ మనోహర్ లోహియా అనుచరుడిగా ‘‘లంకేశ్’’ పత్రిక ద్వారా ఇతర రచనలు, ప్రసంగాల ద్వారా సోషలిస్టు భావాలను, బ్రాహ్మణీయ ఫాసిస్టు భావజాలానికి వ్యతిరేకంగా చార్వాక, ఏకలవ్య, దళిత భావజాలాన్ని ప్రచారం చేసినవాడు. గౌరీ ఆమె సోదరి కవిత ఆ వాతావరణంలో పెరిగారు. ఒక విధంగా గౌరీ తండ్రి భుజాల మీద పెరిగింది. అన్ని సామ్రాజ్యవాద ప్రపంచీకరణ అభివృద్ధి నమూనాలను ప్రశ్నించింది. ఎవరు తప్పు చేసినా ప్రశ్నించే పరిస్థితి ప్రజాస్వామ్యానికి కొలబద్ద అని తెలిసి మాట్లాడిరది. గౌరీ లంకేశ్ మూఢాచారాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని సాగించారు. సమాజంలోని అసమానతలు దురాచారాల నిర్మూలనకు నడుం కట్టిన పౌరులకు వారు సాగించిన ఆందోళనలకూ లంకేశ్ పత్రికలో ప్రచారం ఇచ్చారు. గౌరీ లంకేశ్ అనే పత్రిక విలేకరిని ఆమె జీవితాన్ని, పరోక్ష హత్యలను ఖండిస్తూ రాసిన కవిత ఇది. కళావతి రాసిన ఈ కవిత అధ్యాపక జ్వాల నవంబర్ 2017 సంచికలో ప్రచురితమయింది.
‘‘స్త్రీవాద కవిత్వం వ్యవస్థను ప్రశ్నించడంలో ప్రారంభమైంది. పితృస్వామ్య వ్యవస్థ కారణంగా సమాజంలో వేళ్ళూనుకున్న ద్వంద్వ ప్రమాణాలను, స్త్రీ పురుషుల అసమానర్థం ‘అతి సహజమని’ పరిగణించే ఆలోచనా విధానాన్ని, దాన్ని మార్చనవసరంలేదని భావించే జడత్వాన్ని ఈ కవిత్వం ప్రశ్నించింది. ప్రస్తుత వ్యవస్థను ప్రశ్నించడం, ధిక్కరించడం, కొత్త దృక్పథాలను ప్రతిపాదించడం. స్త్రీవాద కవిత్వం శక్తివంతంగా చేసిన పని. జీవితాన్ని, సమాజాన్ని, ప్రపంచాన్ని స్త్రీల దృక్పరం. నుంచి చూడవలసిన అవసరాన్ని ఈ కవిత్వం నొక్కి చెప్పింది. చెప్పింది. ’’5 (తెలుగులో కవిత్యోద్యమాలు ` తెలుగు అకాడమీ ` పుట ` 186)
‘‘నేను అసిఫాను మాట్లాడుతున్నాను’’ అనే కవితా ఖండికలో…
‘‘అద్భుతమైన ఈ ప్రపంచంలో
నేను అసిఫాను మాట్లాడుతున్నాను
అత్యద్భుతమైన ప్రజాస్వామిక దేశం నుండి
నా ప్రాణాలు హరించబడ్డాక మాట్లాడుతున్నాను
మొన్నటి దాకా నాకేదీ తెలియదు
గుర్రాలు మేపడం అమ్మా నాన్నల చెంత నవ్వడం అంతే
ఎనిమిదేళ్ళ వయస్సులోనే అత్యాచార కోరలతో చీల్చబడి
అతి క్రూరంగా చంపబడ్డ నేను
మీకందరికీ ప్రపంచ అశాంతి బహుమతిస్తున్నాను.
పువ్వుల్నేకాదు, పసిమొగ్గల్నీ తుంచి, నలిపి
వాటి కన్నీటి చుక్కల్ని పిండి
మీ దేహాలకు పూసుకునే ముందు
భక్తిగా దేవత మీద రెండు చుక్కల్ని చిలకరించండి
యుగ యుగాలుగా నావలె బలైపోయిన
ఆడపిల్లలందరినీ ఆవాహన చేసుకొని
నేను మాట్లాడుతున్నాను
ఎంతోమంది మాట్లాడకుండా మరణిస్తుంటే
నేను మరణించి మాట్లాడుతున్నాను
ఒక్క మా కథువాలోనే కాదు
ఈ దేశంలో ప్రతి ఊరిలోనూ గుడి ఉంది’’6
( 6. సమాయత్త సమయం ` జి.కళావతి ` పుట ` 33,35,37)
జమ్మూకాశ్మీర్‌లోని కథువాలో ముస్లిం మైనారిటీ సంచార జాతికి చెందిన 8 యేండ్ల బాలిక అసిఫాను కిడ్నాప్ చేసి గుడిలో నిర్భందించి, వారం రోజుల పాటు ఆ బాలికపై పలుమార్లు సామూహిక అత్యాచారం చేసి, ఆపై మెడకు చున్నీ బిగించి చంపారు. బండరాయితో తలపై మోది 10 రోజుల తర్వాత అసిఫా శవం ముళ్ళ పొదల్లో కనిపించింది. 10`1`2018 న కిడ్నాపైన బాలిక 18`1`2018న ముళ్ళ పొదల్లో శవమై కనిపిస్తుంది. అయిదు పేజీల ఈ కవిత. కుల మత విద్వేషంతో, ఆధిపత్యంతో చేసిన ఈ దుర్మార్గం మైనారిటీ జాతులపై కొనసాగుతున్న దాడులకు ఒక ఉదాహరణగా మిగిలింది. చిన్నారి అసిఫా దారుణ హత్యకు తల్లడిల్లుతూ రాసిన జలదరింపు అంతా కవిత నిండా పరచుకొని ఉంటుంది.
‘‘విప్లవ సాహిత్యోద్యమంలో మైనారిటీల జీవితచిత్రణ, వారి మనోభావాల వ్యక్తీకరణ కనిపించదు. ఈ ఉద్యమంలో ముస్లింలు ఉన్నప్పటికీ వారు మొత్తం సమాజపు విముక్తి గురించి మాత్రమే రాశారుగానీ, తాము మైనారిటీలుగా ఎదుర్కొంటున్న వివక్ష గురించి స్పందించలేదు. బహుశా అప్పటికి ఉన్న వివక్ష తీవ్రరూపం ధరించకపోవడం ఓ కారణం. అసలు ఆ స్పృహకి తావులేని పరిస్థితి ఉద్యమాలలో ఉండడం మరో కారణం. కానీ అస్తిత్వవాద ఆలోచనలు మైనారిటీలలో కూడా కొత్తస్పృహకు పాదువేశాయి. తమ గురించి తాము రాసుకోవలసిన అవసరాన్ని ముస్లిం కవులు, రచయితలు గుర్తించారు.’’7 (తెలుగులో కవిత్యోద్యమాలు ` తెలుగు అకాడమీ ` పుట`240)
‘‘పవిత్రు లెవరు’’ అనే మరో ఖండికలో
‘‘నీ మీదేపడి ఓ పశువుల మంద
నీ దేహన్నంతా చిద్రం చేస్తుంటే
నీ హాహాకారాలకు ఆనందిస్తూ
మరింతగా నీ అంగాంగాల్లోంచి రక్తం తీసి ఉంటే తెలిసేది
నరక యాతన దేహాన్నే కాదు
మనసును కూడా దహించిన దారుణం ఎంతటిదో
ఆనాటి హననం
ఈ దేశ పవిత్రతకొక సంకేతమా
బిల్కిస్ జీవితం
పవిత్ర చరిత్రలు రాయబడిన ఓ కాగితమా
లేద ఆడ శరీరాలతో ఈ దేశంలో పుట్టిన
మనుషులంతా అపవిత్రులా….’’8
(8.సమయాత్త సమయం, జి.కళావతి ` పుట ` 161,162)
బిల్కిస్ బానొ కేసులో అత్యాచార నిందితులను సత్ప్రవర్తన పేరున విడుదల చేశాక వాళ్ళ శిక్షను కొనసాగించాలని బిల్కిస్ పెట్టిన పిటిషన్‌ను కొట్టివేస్తూ సుప్రీం కోర్టు ఆ అత్యాచార నిందితులంతా పవిత్రులని పేర్కొనడాన్ని వార్తగా చదివాక కవయిత్రికి కలిగిన దుఃఖంతో రాసిన కవిత ఇది. బిల్కిస్పైన 20 యేండ్ల కిందట జరిగిన సామూహిక అత్యాచారాన్ని ప్రస్తావిస్తూ రాసిన కవిత. మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలకు, ఎందరో బలైపోతున్నారు. 2002లో జరిగిన దారుణంలో బిల్కిస్ బానో తల్లిని ఆమె కుటుంబంలోని 12 మందిని చంపిన నేరస్థులను పవిత్రులు అని విడుదల చేయడం ఎవ్వరికీ మింగుడు పడని విషయం. అసలు స్త్రీలంతా ఈ దేశంలో అపవిత్రులేనా? అంటూ కవళాతి తన ఆక్రోశాన్ని వెలుబుచ్చుతుంది.
ముగింపు:
కళావతి రాసిన 100 కవితల్లో మానవ జీవితానుభవాలను, ఆ అనుభావాలలోని విషాదాన్ని ఆ విషాదం దుఃఖమయ్యే వైనాన్ని మాత్రమే కాదు. ఆ దుఃఖం ధిక్కారమయ్యే నిర్మాణంలోని చైతన్యాన్ని, ప్రత్యామ్నాయ రాజకీయాల నిర్మాణాన్ని, ఒక్క మాటలో జీవితాన్ని సమూలంగా, పరిపూర్ణంగా ఆవిష్కరించుకునే విప్లవ నూతన ప్రయోగాన్ని ఆమె ఈ కవితల్లో వివరించింది.
ఈ కవితా సంపుటిలో కళావతి ఎత్తుగడ అద్భుతంగా ఉంటుంది. విచిత్రంగా వస్తు నిర్ణయాలు, సమయ నిర్ణయంలో కవితను ప్రారంభించే శిల్పం అయిన ఎత్తుగడలో ఉంటుంది. శ్రీశ్రీ కొసమెరుపులకు గుర్తుండిపోయినట్లే కళావతి కవితలు ఎత్తుకునే క్రమం గొంతెత్తే గాయక స్వర శైలిలో ఉంటుంది.
ఆధార గ్రంథాలు:
1. అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు – పేర్వారం జగన్నాధం
2. తెలుగులో కవితా విప్లవాల స్వరూపం – వేల్చేరు నారాయణ రావు
3. సారస వ్యాసావళి, ఆగష్టు 1967, అరుద్ర
4. సమయాత్త సమయం – జి.కళావతి
5.తెలుగులో కవిత్యోద్యమాలు – తెలుగు అకాడమీ
6 సమాయత్త సమయం – జి.కళావతి
7. తెలుగులో కవిత్యోద్యమాలు – తెలుగు అకాడమీ
8. సమయాత్త సమయం,- జి.కళావతి
-అలంశెట్టి పర్శరాములు,
పరిశోధక విద్యార్థి,
తెలంగాణ యూనివర్సిటీ, నిజామాబాద్.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
కళావతి ధిక్కార ప్రకటన ` ‘సమాయాత్త సమయం’ (పరిశోధక వ్యాసం)- అలంశెట్టి పర్శరాములు — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>